ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల బ్రెజిల్‌ రాజధాని రియో డిజైనోరో జులై 6-7 తేదీల్లో జరిగిన 17వ బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకాకపోవడం గమనార్హం. రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌` ఇరాన్‌ యుద్ధం, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి సహజంగానే ప్రాధాన్యం ఏర్పడిరది. ముఖ్యంగా యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌. పతనం తర్వాత అమెరికా నేతృత్వం వహిస్తున్న ఏకధ్రువ ప్రపంచం ఇక బహుముఖ నాయకత్వం దిశగా పయనించాల్సిన అవసరాన్ని ఈ బ్రిక్స్‌ సమావేశం మరోసారి నొక్కి చెప్పింది.

ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌ వాణిని బలీయంగా వినిపించడానికి యత్నించింది. ఈసారి బ్రిక్స్‌ సమావేశ ఇతివృత్తం ‘సమ్మిళిత, సుస్థిర పాలన కోసం గ్లోబల్‌ సౌత్‌ సహకారం’.2026 బ్రిక్స్‌కు మనదేశం ఛైర్మన్‌గా వ్యవహరించి, 18వ బ్రిక్స్‌ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది బ్రిక్స్‌కు బ్రెజిల్‌ అధ్యక్షత వహిస్తోంది. అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాలని ఈ సమావేశం స్పష్టం చేసింది.

ఐదు అంశాలకు ప్రాధాన్యత

ఈ బ్రిక్స్‌ సదస్సు ప్రధానంగా ఐదు అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది. మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిని (యు.ఎన్‌.) మరింత విస్తరించాలని కోరింది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఆ విధంగా యు.ఎన్‌.లో గ్లోబల్‌ సౌత్‌ భాగస్వామ్యం మరింత పెరగాల్సి అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇదే సమయంలో ఉద్గమిస్తున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల (ఈఎండీసీలు)కు మరింత పాత్రను కల్పించే విధంగా నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లను కోరింది. వాతావరణ పరిరక్షణకు పెట్టుబడుల కోసం ‘‘లీడర్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ డిక్లరేషన్‌’’ను బ్రిక్స్‌ ఆమోదించింది. పర్యావరణ పరిరక్షణకు సృజనాత్మక రీతిలో పెట్టు బడులు పెట్టాల్సిన అవసరాన్ని చెప్పింది. వాణిజ్య సంబంధాలను మరింత వైవిధ్యభరితం చేయడం, ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలను అభివృద్ధి చేయాలని కోరింది.

ముఖ్యంగా సంప్రదాయికంగా అనుసరిస్తున్న ఆర్థిక నిర్మాణాలపై ఎక్కువగా ఆధారపడకుండా, సౌత్‌`సౌత్‌ ఆర్థిక సహకారాన్ని పెంచే రీతిలో కార్యక్రమాల రూపకల్పన జరగాలని కోరింది. బ్రిక్స్‌ సమావేశం మొట్టమొదటిసారి కృత్రిమమేధకు ప్రాధాన్యతనిచ్చింది. గ్లోబల్‌ సౌత్‌ అభివృద్ధి అవసరాలు, దృక్కోణాలకు అనుగుణంగా ఈ కృత్రిమ మేధ వినియోగం జరగాలని కోరింది. అంతర్జాతీయ భద్రతకు సవాలు విసురుతున్న ఉగ్రవాదంపై పోరాటానికి, ప్రాంతీయ సంఘర్షణల నివారణకు బహుముఖ కార్యక్రమాలను అమలు చేయాలని కోరింది.

భారత్‌ వ్యూహాత్మక స్థితి, లక్ష్యాలు

బహుళ అంతర్జాతీయ భాగస్వామ్యాల మధ్య ఆధునిక దౌత్యపరమైన సమతుల్యతను పాటించడంలో మనదేశ పాత్ర కీలకంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ ఈ సమావేశంలో పాల్గొనడం ద్వారా, వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని పాటిస్తూనే ఆర్థికాభివృద్ధికి సహకారం ద్వారా భారత్‌ వ్యూహాత్మక లక్ష్యాలను చక్కగా వివరించారు. గత నాలుగేళ్ల కాలంలో బ్రిక్స్‌ సహచర దేశాలతో మనదేశ ఆర్థిక భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. 2024 సంవత్సరంలో బ్రిక్స్‌ దేశాలతో మనదేశ వాణిజ్యం ఏకంగా 399 బిలియన్‌ యు.ఎస్‌. డాలర్లకు చేరడమే ఇందుకు ఉదాహరణ. ఈ విస్తరణవల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో జరిపే వాణిజ్య సమతుల్యత విషయంలో ఈ ప్రతికూలతలను జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుంది. ఈ వాణిజ్య సంబంధాలు కొన్ని నిర్మాణాత్మక సంక్లిష్టతలను వెల్లడిస్తున్నాయి. బ్రిక్స్‌ భాగస్వాములతో మనం జరిపే వాణిజ్యంలో లోటు 209 బిలియన్‌ డాలర్లు. ముఖ్యంగా ఇంధన, తయారీ రంగ దిగుమతులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం.

ఎన్‌డీబీ వల్ల ప్రయోజనం

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) వల్ల మనదేశానికి సహకార పరమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఎన్‌డీబీ నుంచి మనదేశానికి 6.9 బిలియన్‌ యు.ఎస్‌.డాలర్ల విలువైన 18 ప్రాజెక్టులు లభించాయి. ఇవి ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, హరిత ఇంధనానికి సంబంధించిన ప్రాజెక్టులు కావడం విశేషం. వీటితోపాటు సుస్థిర పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇవి బహు పాక్షిక ఆర్థిక సహకారానికి ఉదాహరణగా నిలుస్తు న్నాయి. బ్రిక్స్‌ దేశాలతో భద్రతాపరమైన సహకారం ప్రధానంగా ఉగ్రవాదానికి వ్యతిరేక పోరు విషయంపై మనదేశం దృష్టి కేంద్రీకరిస్తోంది. 2025 ఏప్రిల్‌లో జరిగిన పెహల్గావ్‌ ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో చేర్చడం, ఈ విషయంలో మనదేశానికి ప్రపంచ దేశాల మద్దతు లభిస్తున్నదనడానికి చిహ్నం.

బ్రిక్స్‌ విస్తరణ-సంక్లిష్టతలు

బ్రిక్స్‌లో ఎక్కువ దేశాలను సభ్యులుగా చేర్చుకోవడంవల్ల అంతర్జాతీయంగా ఈ గ్రూపునకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇదే సమయంలో అంతర్గత సంక్లిష్టతలు కూడా చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ బ్రిక్స్‌ బ్లాక్‌లో సభ్యులుగా ఉన్న దేశాలు, విభిన్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థలతో ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ఆయా దేశాలు అనుసరించే విదేశాంగ విధానాలు కూడా భిన్నం. సభ్యదేశాల మధ్య ప్రస్తుతం అనేక ద్వైపాక్షిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారత్‌` చైనాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. కొత్తగా సభ్యత్వం తీసుకున్న దేశాల మధ్య ప్రాదేశిక సమస్యలున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సమస్యలపై ఒక్కో సభ్య దేశం ఒక్కో విధంగా స్పందించే తీరు కూడా ఇబ్బందులకు కారణమవు తోంది.

డీ`డాలరైజేషన్‌ దిశగా భారత్‌ చేపడుతున్న ఆర్థిక విధానాలు ఈ సంక్లిష్టతలకు ఒక ఉదాహరణ. మనదేశం ఒక పక్కన ఆర్థిక వైవిధ్యతను పాటిస్తూనే మరో పక్క పశ్చిమ దేశాలతో వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఈవిధమైన ఆచరణ శైలి, ఆర్థికంగా మరిన్ని ప్రభావాలను చూపే అవకాశం ఎక్కువ. ఈ సదస్సు ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక యంత్రాంగాల వినియోగాన్ని పరిశీలిస్తే అంతర్జాతీయ వాణిజ్య పోకడల్లో అనుసరిస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాల విభిన్న మార్గాల ద్వారా వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి యత్నిస్తు న్నాయి. ముఖ్యంగా కొత్త సభ్యులకు ఆర్ధికపరమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యత్నాలు కొనసాగుతున్నాయి. మనదేశం విషయానికి వస్తే ఈ రకమైన యత్నాలు మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇవ్వగలవు. బ్రిక్స్‌ భాగస్వాములతో విస్తరించిన వాణిజ్య సంబంధాలు, మార్కెట్‌ అందుబాటు, పరస్పర సహకారం విషయంలో మంచి సన్నిహిత సంబంధాలకు దారితీయగలవు. అయితే నిర్మాణాత్మక వాణిజ్య నమూనాలు, ఇంధనం, తయారీ రంగ వస్తువుల దిగుమతులు అధికంగా ఉండటం వాణిజ్య చెల్లింపుల సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. చమురు ఉత్పత్తి దేశాలను ఈ బ్రిక్స్‌ గ్రూపులోకి చేర్చుకోవడం వల్ల, అంతర్జాతీయంగా ఇంధన ఉత్పత్తి బ్లాక్‌గా బ్రిక్స్‌ రూపొందుతుంది. ఈరకంగా ఇంధన ఉత్పత్తి బ్లాక్‌ బ్రిక్స్‌లో కేంద్రీకృతం కావడంవల్ల అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్‌పై మంచి ప్రభావాన్ని చూపవచ్చు. కానీ ఇది అంతర్గత సమన్వయ సహకార స్థాయి, బాహ్య మార్కెట్‌ కారకాలపై ఆధారపడి ఉంటుంద నేది ఇక్కడ కీలకాంశం.

కృత్రిమమేధకు ప్రాధాన్యం

అంతర్జాతీయ సంబంధాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ముఖ్యంగా కృత్రిమమేధ ప్రాధాన్యానికి ఈ సదస్సు గట్టి మద్దతునిచ్చింది. ప్రపంచ పాలనా వ్యవహారాలకు సంబంధించి ఉద్గమిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను బ్రిక్స్‌ దేశాలు అన్వేషించడం గమనార్హం. మనదేశంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఇటువంటి సమన్వయ సహకారాలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనదేశంలోని డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ, బ్లాక్‌ ఛైన్‌ వేదికలు అంతర్జాతీయ లావాదేవీలకు ఎంతగానో దోహదం చేయగలవు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఇదొక నవకల్పనగా భావించవచ్చు.

బ్రిక్‌ భావన

నిజానికి బ్రిక్‌ భావనను అభివృద్ధి చేసింది గోల్డ్‌మన్‌ సాచ్స్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జిమ్‌ ఓ నీల్‌. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా దేశాలు రాబోయే కాలంలో ప్రపంచంలో ఉద్గమిస్తున్న ఆర్థిక పవర్‌ హౌజ్‌లుగా రూపొందుతాయని ఆయన 2001లో సిద్ధాంతీకరించాడు. ఈ విశ్లేషణ క్రమంగా దౌత్యరూపు దాల్చి 2006 నాటికి బ్రిక్‌ గ్రూపు ఏర్పాటునకు దారితీసింది. అయితే 2010 నాటికి బ్రిక్‌ గ్రూపులోకి దక్షిణాఫ్రికాను కూడా చేర్చుకోవడంతో ఇది ‘బ్రిక్స్‌’గా రూపొందింది. నేడు బ్రిక్స్‌ ప్రపంచం లోని అనేక ఉద్గమిస్తున్న ఆర్థిక వ్యవస్థలను వెనక్కు నెట్టేసిందనే చెప్పాలి. ప్రపంచంలో 49% జనాభా బ్రిక్స్‌ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ జీడీపీలో 40%, అంతర్జాతీయ వాణిజ్యంలో 26% బ్రిక్స్‌ దేశాలు వాటా కలిగివున్నాయి. దీన్ని అమెరికా నేతృత్వంలోని నాటో, యూరప్‌ దేశాలు అంత తేలిగ్గా కొట్టిపారేయ లేవు.

ఇటీవలి కాలంలో బ్రిక్స్‌ గ్రూపులోకి కొత్త దేశాలు చేరడంతో దీని ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, యుఏఈ, ఇండొనేషియాలు (ఈ సమావేశంలో ఇండొనేషియా అధికారికంగా సభ్యురాలైంది) పూర్తిస్థాయి సభ్యులుగా ఈ గ్రూపులో చేరాయి. బ్రిక్స్‌ సభ్యత్వం విషయంలో కొన్ని దశలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా బెలారస్‌, బొలీవియా, కజకిస్థాన్‌, క్యూబా, నైజీరియా, మలేసియా, థాయ్‌లాండ్‌, వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్‌లు బ్రిక్స్‌ భాగస్వామ్య దేశాలుగా సమావేశానికి ఆహ్వానాలను పొందాయి. మరిన్ని దేశాలు బ్రిక్స్‌లో సభ్యత్వం తీసుకోవడంతో ప్రస్తుతం బ్రిక్స్‌ అని వ్యవహరిస్తున్నారు. బ్రిక్స్‌ క్రమంగా విస్తరించడం మరో సత్యాన్ని కూడా వెల్లడిస్తోంది. ముఖ్యంగా సౌత్‌`సౌత్‌ సహకారంతో పాటు, బహుపాక్షిక వేదికల ఏర్పాటును ప్రపంచ దౌత్య గతిశీలతల్లో మార్పునకు దోహదం చేస్తోంది. కాగా కొన్ని పశ్చిమ దేశాలు, బ్రిక్స్‌ అనేది జి7 వంటి పశ్చిమ దేశాల ఆధిపత్యంలోని గ్రూపులకు ముఖ్యంగా అమెరికా, దాని సహచరదేశాలకు వ్యతిరేకంగా పనిచేసే గ్రూపుగా ప్రచారం చేయడం సహజమే. బ్రిక్స్‌ ఇప్పటివరకు న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు, బ్రిక్స్‌ కాంటింజెంట్‌ రిజర్వ్‌ అరేంజ్‌మెంట్‌, బ్రిక్స్‌ పే, ది బ్రిక్స్‌ జాయింట్‌ స్టాటిస్టికల్‌ పబ్లికేషన్‌, బ్రిక్స్‌ బాస్కెట్‌ కరెన్సీ వాటి ప్రాజెక్టులను పశ్చిమ దేశాలకు పోటీగా అమల్లోకి తెచ్చింది. బ్రిక్స్‌లో వ్యవస్థాపక ఐదు సభ్యదేశాలు, ఈ ఏడాది చేరిన ఇండొనేషియాలు జీ20లో భాగస్వాములు కావడం విశేషం.

విమర్శలు-సమస్యలు

2013లో అమెరికాకు చెందిన అమెరికన్‌ థింక్‌ ట్యాంక్‌కు నాయకత్వం వహించిన ఐసోబెల్‌ కోలోమెన్‌ బ్రిక్స్‌ సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రజాస్వామ్య, నిరంకుశ దేశాలతో కలిగిన ఈ గ్రూపులో సమన్వయ సాధన దుస్సాధ్యమన్నారు. అంతేకాదు ఈ గ్రూపునకు 41% నిధుల కేటాయింపు చైనా చేస్తున్నది కనుక దాని ఆధిపత్యమే కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇది నిజమేనని అనిపించే కొన్ని సంఘటనలు జరగడం గమనార్హం. ఉదాహరణకు 2017లో డోక్లాం ప్రతిష్టంభన జరిగినప్పుడు, అదే ఏడాది షియామిన్‌ బ్రిక్స్‌ సదస్సుకు హాజరుకాబోనని భారత్‌ బెదిరించడంతో, చైనా తన సైనిక దళాలను ఉపసంహ రించింది. 2023 బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా సరిహద్దు సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. కానీ వెంటనే చైనా వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేయడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

2023లో టఫ్‌ట్స్‌ యూనివర్సిటీ ప్రచురించిన ఒక అధ్యయన నివేదికలో బ్రిక్స్‌ కేవలం చైనా ఆధిపత్యంలో నడిచే అమెరికా వ్యతిరేక గ్రూపని స్పష్టం చేసింది. 2023లో అట్లాంటిక్‌ కౌన్సిల్‌కు చెందిన థామస్‌ హిల్‌ విడుదల చేసిన ఒక పత్రం ప్రకారం, డీ`డాలరైజేషన్‌ కోసం బ్రిక్స్‌ చేస్తున్న యత్నాలు అమెరికా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఫలితంగా లోటు, వడ్డీ రేట్లు తక్కువగా కొనసాగించడం, యు.ఎస్‌. విధించే ఆంక్షలు మరియు నెఫ్ట్‌ వంటి వాటి ప్రభావం తగ్గుతుందని స్పష్టం చేశారు. అయితే బీబీసీకి రాసిన వ్యాసంలో మైఖేల్‌ కుజెల్‌మన్‌… డాలర్‌ లేకుండా బ్రిక్స్‌ సభ్యదేశాల మనుగడ కష్టమని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బ్రిక్స్‌పై కఠిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యు.ఎస్‌. డాలర్‌కు బదులు బ్రిక్స్‌ కరెన్సీని వాడే దేశాలపై 100% టారిఫ్‌ విధిస్తామని బెదిరించారు. విచిత్రమేమంటే, డీ`డాలరైజేషన్‌ ప్రతిపాదనను ముందుకు తెచ్చి వేగంగా అడుగులు వేస్తున్నది మనదేశం మాత్రమే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు శక్తికాంత్‌ దాస్‌ మాట్లాడుతూ ‘‘డీ`డాలరైజే షన్‌’’ వల్ల కేవలం ఒకే కరెన్సీపై ఆధా రపడాల్సిన అవసరం తగ్గిపోయి, వాణిజ్య కార్య కలాపాలు మరింత సులభతర మవుతాయన్నారు. అయితే భారతీయ దౌత్యవేత్త మీరా శంకర్‌ ప్రకారం, బ్రిక్స్‌లో చర్చించే ఈ సరికొత్త చెల్లింపుల వ్యవస్థలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందువల్ల, యు.ఎస్‌. డాలర్‌కు ఇప్పుడే వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. మాజీ రాయబారి బాల వెంకటేష్‌ వర్మ అభిప్రాయం ప్రకారం, బ్రిక్స్‌లో చైనాను ఆకాశానికెత్తేసే రీతిలో అతిప్రచారం జరుగుతోంది.

గ్లోబల్‌ సంబంధాలపై ప్రభావం

ప్రస్తుత బ్రిక్స్‌ సమావేశ ఫలితాలు రానున్న కాలంలో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలపై ప్రభావాన్ని కలిగించే అవకాశాలే ఎక్కువ. సంస్థాగత మార్పులను, సౌత్‌`సౌత్‌ సహకారం వంటివి ప్రపంచ పాలనా నిర్మాణ వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న భారతీయ గతిశీలక యువత ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా తేలిక కాగలదు. సాంకేతిక సహకారం, సుస్థిరాభివృద్ధి, ప్రత్యామ్నాయ అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌లు ఉద్గమిస్తున్న మార్కెట్లు సృజనశీల రంగాల్లో సంభావ్య అవకాశాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.

అయితే సభ్య దేశాలు విభిన్న ఆసక్తులు కలిగివున్నందువల్ల, కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయ సాధన కష్టసాధ్యమయ్యే అవకాశాలే ఎక్కువ. సభ్య దేశాలకు ఎవరికి వారికే ఇతర ప్రపంచ దేశాలతో తమకు అనువైన రీతిలో సంబంధాలు లేదా వైరుధ్యాలు వున్న నేపథ్యంలో ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత సంక్లిష్టత ఏర్పడక తప్పదు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఏర్పాటు చేయడం బ్రిక్స్‌ సాధించిన గొప్ప విజయం. ఆర్థికరంగంలో ఈ ప్రాజెక్టు సభ్య దేశాలకు ఎంతో ప్రయోజన కారిగా ఉండగలదు. పశ్చిమ దేశాల ఆధిపత్యంలో ఉన్న సంస్థలకు బ్రిక్స్‌ ఒక ప్రత్యామ్నా యంగా రూపొందడంలో విజయం సాధించిందనే చెప్పాలి. ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌లతో ప్రత్యక్ష సంఘర్షణకు దిగకుండా ప్రత్యామ్నాయంగా తన పని తాను చేసుకొనిపోవడం బ్రిక్స్‌ ప్రత్యేకత.

మైలురాయి

వర్తమాన అంతర్జాతీయ సంబంధాల విషయంలో బ్రిక్స్‌ సదస్సు`2025 ఒక మైలురాయి వంటిదనే చెప్పాలి. ముఖ్యంగా భారత్‌ ఇందులో పాల్గొనడం ద్వారా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడమే కాకుండా, గ్లోబల్‌ సౌత్‌ ఆకాంక్షలను వెల్లడిరచ డానికి వీలైంది. అంతర్జాతీయ వ్యవస్థల్లో క్రమంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ఇటువంటి బహుపాక్షిక వేదికలు మనదేశంలోని ఔత్సాహిక యువతకు కొత్తదారులు చూపుతాయనడంలో సందేహం లేదు. వైవిధ్య పూరితమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలు దేశీయ యువతకు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదం చేయగలవు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE