రాష్ట్రంలో.. ముఖ్యంగా మంత్రివర్గ సహచరుల మధ్య,  హెలికాప్టర్‌ వినియోగం చర్చనీయాంశమైంది. తమలోని కొందరు మంత్రులు చిన్నపాటి పర్యటనలకు కూడా హోలికాప్టర్‌లు వాడుతున్నారని, కొందరు మంత్రులు సుదూర ప్రాంతాల్లోని కార్యక్రమాలకు హాజరుకావలసి వచ్చినా అవి అందుబాటులో ఉండడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా వట్టిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒకవైపు బహిరంగంగా ప్రకటిస్తుంటే… మంత్రుల విచ్చలవిడితనం ఏమిటని  వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఓ రకంగా దివాళా తీసిందన్నట్లుగా మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. మరోవైపు. రాష్ట్ర మంత్రులు కొందరు ఆడంబరాలకు, అతి ఖర్చులకు దారితీసేలా వ్యవహరిస్తూ, ఖజానాపై భారం పెంచుతున్నారు. అంటే.. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరిపై ఎవరికి అజమాయిషీ ఉందో, ఎవరు ఎవరిని అదుపులో పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. మంత్రి వర్గ సహచరులు, ప్రభుత్వ అధికారులకే ఈ విషయం అంతుపట్టడం లేదంటున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి హెలికాప్టర్‌ల వాడకంపై చేస్తున్న ఖర్చుపై వివాదం రగులుతోంది. అయితే, ఈ వివాదం ఇప్పుడే మొదలు కాలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి యేడాదిన్నర గడిచి పోగా… దాదాపు ఏడాది కాలంగా ఈ హెలికాప్టర్ల వాడకంపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఏకంగా మంత్రి వర్గంలోని కొందరు హెలికాప్లర్‌ సర్వీసులను ఎక్కువగా వినియోగించుకుంటున్న మంత్రులపై బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు.

చిన్న చిన్న కార్యక్రమాలకు, రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోని ప్రాంతాలకు, చివరకు శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. ఈ బంపర్‌ ఆఫర్‌ కొంతమంది మంత్రులకే పరిమితమవుతోంది. ముగ్గురు, నలుగురు మంత్రులు మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్‌ను వాడేస్తున్నారు. మిగతా కొందరు మంత్రులు అరిచి గీపెట్టినా, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య కార్యక్రమమైనా హెలికాప్టర్‌ సర్వీసు అందుబాటులో లేదంటున్నారట అధికారులు. అంటే.. కొంతమందికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించడం, కొందరు మాత్రమే ఇష్టారాజ్యంగా వినియోగించడం వెనుక మతలబు ఏమై ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కొందరు మంత్రులు మాత్రమే హెలికాప్టర్‌ సౌకర్యాన్ని వినియోగించుకుంటుండగా.. మిగతావారికి ఆ అవకాశం దక్కకపోవడంపై వారిలో అసహనం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ప్రభుత్వానికి.. ఇంటా, బయటా తలనొప్పిగా పరిణమించింది. కానీ, పరిష్కారం ఎవరి చేతుల్లో ఉందన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అసంతృప్తి, అసహనంగా ఉన్నప్పటికీ దారిలో పెట్టలేక పోతున్నారన్న గుసగుసలు వినిపిసున్నాయి.

ప్రోటోకాల్‌ ప్రకారం ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల కోసం ప్రభుత్వ హెలికాప్టర్‌ను వినియోగించే వెసులుబాటు ఉంటుంది. ఆయన పర్యటనలు లేనప్పుడు, హెలికాప్టర్‌ ఖాళీగా ఉన్న సందర్భాల్లో కేబినెట్‌లోని ఇతర మంత్రులు కూడా దూర ప్రాంతాల పర్యటనల కోసం దానిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక మంత్రి కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు, ఉన్నతాధికారులు కలిసి రాజధానికి దూరంగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడే హెలికాప్టర్లు వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలు అంటూ లేవని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగానే హెలికాప్టర్‌ కొందరికి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండటం, మరికొందరికి అందుబాటు కానీ పరిస్థితి. ఫలితంగా మంత్రివర్గ సహచరుల మధ్యే అసమానతలు చోటు చేసు కుంటున్నాయి.

కొన్ని ముఖ్య శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు తక్కువ దూరాలకు కూడా తరుచుగా హెలికాప్టర్‌ వినియోగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకే కాకుండా చివరకు ప్రైవేట్‌ ఫంక్షన్లు, విందులకు కూడా వినియోగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఒకరిద్దరు మంత్రులైతే హెలికాప్టర్‌ దిగడం లేదని, ఇంట్లో నుంచి కాలు బయట పెడితే హెలికాప్టర్‌లో విహరిస్తున్నారని చెబుతున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే తాము కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులమేనని, తమకూ రేవంత్‌రెడ్డితో సమానంగా హెలికాప్టర్‌ వాడే వెసులుబాటు ఉందని తెగేసి చెబుతున్నట్లు సమాచారం.

నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అసలు హెలికాప్టర్‌ను విడిచిపెట్టడం లేదని, పోటీ పడి మరీ వినియోగిస్తున్నారని, సొంత నియోజకవర్గానికి వెళ్లినా, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా, చివరకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యటనలకు వెళ్లినా దానిని వాడుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా, నలుగురైదుగురు మంత్రులే రెగ్యులర్‌గా హెలికాప్టర్‌ను వాడుతున్నారని అంటున్నారు. ఒక మంత్రి రంగారెడ్డి జిల్లాలో, మరొకరు హైదరాబాద్‌ శివారులో పర్యటన కోసం కూడా హెలికాప్టర్‌ వాడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

 మరికొందరు మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా, హెలికాప్టర్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోతున్నారు. హెలికాప్టర్‌ ఎక్కే భాగ్యం దక్కని ఆ మంత్రులు.. ప్రొటోకాల్‌ విభాగం అధికారులపై మండిపడుతున్నారు. ఇలాంటి పరిణామాలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని కొందరు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాత్రమే హెలికాప్టర్‌ను ఎక్కువగా వాడుతున్నారని ఓ సీనియర్‌ మంత్రి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మంత్రుల మధ్యే హెలికాప్టర్‌ పంచాయతీ నడుస్తోందన్న విషయం తేటతెల్ల మయ్యింది. గత ఏప్రిల్‌ రెండో వారంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత మంటపెట్టాయి. నల్గొండ, ఖమ్మం మంత్రులకే గాలిమోటర్‌ భాగ్యం లభిస్తోందని, రాష్ట్రంలో ఆ రెండు జిల్లాల నేతల రాజ్యం నడుస్తోందన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హెలికాప్టర్‌ ఎక్కాలన్నా వాళ్లే.. వాటిని కొనాలన్నా వాళ్లేనని మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ మంత్రులు సొంత నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌ రావడానికి సెక్రటేరియట్‌పై ఒక హెలిపాడ్‌ నిర్మించాలని కూడా దామోదర ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటి వరకు తాను సొంతంగా ఒక్కసారి కూడా హెలికాప్టర్‌ ఎక్కలేదని తెలిపారు. ఒకరిద్దరు మంత్రులకే హెలికాప్టర్‌ సదుపా యాన్ని తరచూ అందించడం, మిగతా మంత్రులను కనీసం ఖాతరు చేయకపోతుండటంపై కొందరు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు కూడా చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ నెలల తరబడి ఈ హెలికాప్టర్‌ పంచాయతీ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఆ మంత్రులు వెనక్కి తగ్గడం లేదు.

మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వారికి, రాజకీయ పార్టీలపై అవగాహన ఉన్నవారికీ కాంగ్రెస్‌ పార్టీ సహజ స్వభావం ఏంటన్నది స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూప్‌ పాలిటిక్స్‌, హస్తిన నుంచి రిమోట్‌తో నడిపిస్తారన్న ప్రచారం ఉండనే ఉంది. ఏ పార్టీలో లేనంత స్వేచ్ఛ, అంతర్గత ప్రజా స్వామ్యం అందులో ఉంటుందని ఇంటా, బయటా చెప్పుకుంటారు. ఈ అంశాలకు బలం చేకూర్చేలా ప్రస్తుతం మంత్రుల హెలికాప్టర్ల వాడకం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కొందరు మంత్రులు తమ పదవులను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఇలా విచ్చల విడిగా వ్యవహరిస్తున్న మంత్రులను ఎవరు కంట్రోల్‌ చేయాలన్న అంశం అందరినీ వెంటాడుతోంది.

 ఈ పరిస్థితులు గమనిస్తే.. కొందరు మంత్రులకు హెలికాప్టర్‌ షటిల్‌ సర్వీసులా మారందన్న వెటకారపు వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీలోనే, అదికూడా సహచర మంత్రుల్లోనే ఈ హెలికాప్టర్‌ వాడకం అంశం వివాదంగా మారిన నేపథ్యంలో.. సహజంగానే విపక్షాలు కూడా తీవ్రంగా విమర్శిస్తు న్నాయి. కొంతమంది మంత్రులు హెలికాప్టర్‌ను పల్లె వెలుగు బస్సులా మార్చేశారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే హెలికాప్టర్‌ను రిక్షాలా మార్చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ప్రజల పన్నులపై నడుస్తున్న ప్రభుత్వం, కొందరు మంత్రులను సంతృప్తి పరిచేందుకే ఖర్చు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఒక గంట హెలికాప్టర్‌ ప్రయాణానికి లక్షల్లోనే ఖర్చు అవుతుందని, మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అనవసరంగా ఇలా ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఇక, ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ చెప్పిన భాష్యం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు ఒక అధికారిణికి ప్రత్యేకంగాహెలికాప్టర్‌ కేటాయించారని విమర్శించారు.ఇప్పుడు మంత్రులు హెలికాప్టర్లు వినియోగించుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. రోడ్డు మార్గంలో ప్రయాణించడం కంటే హెలికాప్టర్లో ప్రయాణించడం వల్ల ఖర్చు తక్కువ అవుతుందని, బీఆర్‌ఎస్‌ నేతలు ఇది తెలుసుకోవాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ హెలికాప్టర్‌ వివాదానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఫుల్‌స్టాప్‌ ఎలా పెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు.. స్వయంగా తానే రాష్ట్ర ఖజానా గురించి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు మంత్రుల దుబారా ఖర్చును అదుపులో పెట్టగలుగుతారా? లేదంటే వాళ్లను టచ్‌ చేయలేరా? అన్నది చూడాలి.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE