అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలల్లో జరగబోతున్న బిహార్‌ శాసనసభ ఎన్నికల మీదే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీ కృతమై ఉంది. బిహార్‌ సహా దేశం ఈ ఎన్నికల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది. అంతర్జాతీయ మీడియా కూడా ఇప్పటికే తమ ప్రతినిధులను ఆ రాష్ట్రానికి పంపించి అక్కడి ప్రజల నాడిని పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం దగ్గర నుంచి ఇటీవలి పాకిస్థాన్‌ మీద దాడి వరకూ జరిగిన అనేక పరిణామాల ప్రభావం ఆ ఎన్నికలపై ఉంటుందని జాతీయ పత్రికలు, స్థానిక పత్రికలు, ప్రచార, ప్రసార సాధనాలు అంచనాలు వేస్తున్నాయి.

హిందీ భాషా ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హరియాణ, మహారాష్ట్రలలో విజయ బావుటా ఎగరేస్తున్న బీజేపీ బిహార్‌లో మాత్రం తనకు తానుగా సంఖ్యా బలం పెంచుకోలేక పోవడం ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని కూడా కలిగిస్తోంది. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ నాయకత్వం మీద అందరికి ఆసక్తి కలుగుతోంది.

సుమారు 15 ఏళ్లుగా ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జనతాదళ్‌ (యునైటెడ్‌) అధినేత నితీశ్‌ కుమార్‌ను ప్రభుత్వ వ్యతిరేకత కాస్తంత ఎక్కువగానే సవాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలు తప్ప రాష్ట్ర పథకాలేవీ పటిష్ఠంగా, చిత్త శుద్ధిగా అమలు కావడం లేదని, నితీశ్‌కు అధికారంపై యావ తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదని ఇప్పటికే ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవంక, రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి, ఆరాటం అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. గత రెండు నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో జనతాదళ్‌ (యు) నాయకత్వంపై, ముఖ్యంగా నితీశ్‌కుమార్‌ వ్యవహార శైలిపై ప్రజల నుంచి ఘాటైన వ్యాఖ్యలే వినిపించాయి. నాయకత్వం మారాలన్న డిమాండ్‌ కూడా ఈ సర్వేలు, అధ్యయనాల్లో వెల్లడైంది. నితీశ్‌కుమార్‌ తరచూ కూటమి మారడం, బెదరింపు రాజకీయాలకు పాల్పడుతుండడం గత కొద్ది కాలం నుంచి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

అడుగడుగునా అనుమానాలు, నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండీ కూటమి క్రమంగా ఛిన్నాభిన్నమైపోవడం, ఆ కూటమిలో ఆయన అగ్ర నాయకత్వాన్ని చేపట్టడానికి, ప్రధాని కాగల అవకాశాలను మెరుగు పరచుకోవడానికి అవకాశాలు లేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన కూటమి నుంచి బయటపడి, బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏతో చేతులు కలిపారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు నితీశ్‌ ఆకాంక్షలకు అడ్డుకట్ట వేయడంతో ఆయన ఈ కూటమి నుంచి ముందుగానే బయటపడ్డారు. అది ఇండీ కూటమికి నష్టం కాగా, ఎన్‌డీఏలో చేరిక బీజేపీకి రాజకీయంగా బాగా అనుకూలంగా మారింది. జీవిక పథకం కింద నితీశ్‌ ప్రభుత్వం పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆయనకు మహిళా ఓటు బ్యాంకు ఏర్పడిరది. ఆయన ఇదివరకు ఓబీసీలను, బీసీలను, అల్పసంఖ్యాక వర్గాలను వీలైనంతగా కూడగట్టుకున్నారు.

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఓటింగ్‌ శాతంలో 50 శాతం కంటే తక్కువగా ఉన్న బిహార్‌లో గత రెండు మూడు ఎన్నికల నుంచి ఓటింగ్‌ 10 శాతం చొప్పున పెరగడం ప్రారంభించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్రంలో ఓటింగ్‌ శాతం 68 శాతానికి పైగా ఉంది. ఎన్నికల ముందు కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలు జరిపే సర్వేల్లో ఇండీ కూటమి కంటే ఎన్‌డీఏకు కొద్దిగా అనుకూలత పెరిగింది కానీ నితీశ్‌కుమార్‌ పార్టీకి మాత్రం సుమారు 16 శాతం మంది ఓటర్లు దూరమయ్యే అవకాశాలు కనిపించాయి. రాష్ట్రంలో మద్యం వ్యాపారం విజృంభించడం, సారా అక్రమ వ్యాపారం కూడా వెల్లువెత్తడం, అవినీతి పెరగడం, పేదల అభ్యున్నతికి ఉద్దేశించిన పథకాలేవీ సరిగ్గా అమలు జరగకపోవడం వంటివి ఇప్పుడు నితీశ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. ఎన్నికల సర్వేల ప్రకారం, కేంద్ర పథకాల అమలు జరుగుతుండడం, అయోధ్య రామమందిర నిర్మాణం, ఉగ్రవాదులపై దాడులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బిహారీలకు ప్రాధాన్యం పెరగడం వంటివి బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి.

రాష్ట్రంలో ఇండీ కూటమి పెద్దగా వృద్ధి చెందలేదు కానీ, లాలూప్రసాద్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌, కమ్యూనిస్టు పార్టీలతో కుదిరిన పొత్తుతో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ గట్టి కృషి చేస్తోంది. వాస్తవానికి ఇక్కడ పొత్తుకు 40 లోక్‌సభ, 243 శాసనసభ స్థానాల్లో పెద్దగా ఫలితాలు లభించలేదు.

కాంగ్రెస్‌ పరిస్థితి ఆయేటికాయేడు దిగజారి పోతోందే తప్ప పుంజుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. చిరాగ్‌ పాశ్వాన్‌ నాయకత్వంలోని లోక్‌ జనశక్తి(ఎల్‌జే) పార్టీకి ఉన్నంత బలం కూడా ఆ పార్టీకి లేదని సర్వేల్లో కూడా తేలింది. ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమిలోని ఎల్‌జే ప్రాభవం, ప్రాధాన్యం ఈసారి శాసనసభ ఎన్నికల్లో బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే పోటీ చేయాలని చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. విచిత్రంగా అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌ పార్టీ కూడా బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో అయిదు స్థానాలను గెలుచుకుంది.

మారుతున్న సమీకరణాల మేరకు రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల పొత్తుకు చాలా కాలంగా ఓబీసీలు, బీసీలు, ముస్లిం మద్దతు లభిస్తోంది. అయితే, ఈ పొత్తుకు చాలా ఏళ్లుగా తాము మద్దతునిస్తున్నప్పటికీ తమకు ఒరుగుతున్నదేమీ లేదని ఆ వర్గాల నాయకులు బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు సాగిస్తున్నాయి. ఈ వర్గాల మద్దతును కూడగట్టుకునే ఉద్దేశంతో ఈ మూడు పార్టీలు కలిసి మళ్లీ మండల్‌ తరహా ఉద్యమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నాయి.

నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన వివిధ వర్గాల మధ్య వైరాలు, వైషమ్యాలను సృష్టించడం తప్ప దానివల్ల ఆశించిన ప్రయోజనం కలగలేదు. ఇలా ఉండగా, రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను పునఃపరిశీలించాలని ప్రధాన ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. తమకు అనుకూలమైన ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి, రాజకీయంగా లబ్ధి పొందాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి.

రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓటర్ల జాబితాలను పునఃపరిశీలించడం సర్వ సాధారణ విషయమేనని ఎన్నికల కమిషన్‌ వాదిస్తోంది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడంతో, ఓటర్ల జాబితాలను పునఃపరిశీలించాలన్న ఎన్నికల కమిషన్‌ నిర్ణయానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆధార కార్డును, ఓటర్ల గుర్తింపు కార్డును, బర్త్‌ సర్టిఫికేట్‌ ను, ఇతర గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ల జాబితాలను ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈసారి ఎన్నికల్లో కూడా ఎన్‌డీఏ గెలిచే అవకాశం ఉందని, అందులోనూ బీజేపీ బలం పుంజుకునే అవకాశం ఉందని, ఇండియా టుడే సహా వివిధ సంస్థలు జరిపిన సర్వేల్లో తేలిపోవడంతో ఎన్నికల నాటికి ప్రతిపక్ష కూటమి మరిన్ని సమస్యలు, సవాళ్లు, సంక్షోభాలు సృష్టించే అవకాశం లేకపోలేదు. ఇందుకు నాందిగా కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకులు ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల మీద విమర్శలు సాగించడం, అనుమానాలు వ్యక్తం చేయడం మొదలైపోయింది.

– జి.రాజశుక, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE