రాజకీయాల్లో అధికారం, స్వలాభం కోసం సిద్ధాంతాలను కట్టుబాట్లను గట్టున పెట్టడం దేశంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. దేశ ప్రయోజనాల కంటే స్వలాభాలకే పెద్దపీట వేయడంలో మన రాజకీయ పార్టీలకు ఎవరూ సాటిరారు. దేశ ఐక్యత, జాతీయత, సంస్కృతి పరిరక్షణ కంటే అధికారానికే అగ్రతాంబూలం ఇస్తారు. పీఠమెక్కడానికి ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలిస్తారు. ఇందుకోసం ప్రాంతం, భాష, మతం, కులం భావోద్వేగాలను రెచ్చగొడతారు. దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించే ఈ జాడ్యం మహారాష్ట్రలోని ప్రాంతీయ పార్టీలు అందిపుచ్చుకుంటున్నాయి.
జాతీయ భాష హిందీని ఒక సాకుగా తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాలనే మహారాష్ట్రలో ఠాక్రేసోదరులు కుట్రలకు తెరలేపారు. దేశ ఐక్యత, హిందూ ధర్మ పరిరక్షణ, జాతీయత కోసం గర్జిస్తూ శివసేన పార్టీని స్థాపించిన బాల్ ఠాక్రే వారసులు, హిందీ బోధనను వ్యతిరేకిస్తూ వీధు లెక్కడం దురదృష్టకరం. బాల్ ఠాక్రే బతికున్నప్పుడే పార్టీ పగ్గాల కోసం సిగపట్లు పట్టి వేరుపడిన ఆయన వారసులు ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇప్పుడు ఒక్కట య్యారు. ఈ సోదరులు హిందీ భాషపై వ్యతిరేకతతో ఒక్కటైనా వీరి ప్రధాన లక్ష్యం, తాపత్రయం మాత్రం రాష్ట్రంలో కోల్పోయిన ఉనికిని తిరిగి కాపాడు కోవడమే.
దేశ సంస్కృతి, చరిత్రలో మహారాష్ట్రకు స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం కూడా ప్రత్యేక స్థానం ఉంది. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి ముంబాయి మహానగరం మహారాష్ట్రకు రాజధానిగా ఉండడం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఆ నగరంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వ్యాపార లావాదేవీలు, పరిశ్రమలు, కంపెనీలు పెద్ద ఎత్తున వెలిసాయి. దీంతో దేశం నలుమూలల నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుండి పలువురు బడా, చిన్న వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, కార్మికులు ఆక్కడ స్థిరపడ్డారు. మరోవైపు హిందీ చిత్ర పరిశ్రమకు ముంబాయే ఆయువు పట్టు. దీంతో పలు రాష్ట్రాల నుండి మహారాష్ట్రకు, ముంబాయికి తరలివెళ్లిన కుటుంబాలు తరతరాలుగా అక్కడ ఉంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విభిన్న భాషల వారికి హిందీ మాధ్యమంగా ఉండడం అందరికీ సౌలభ్యమే. స్థానిక భాష మరాఠీతో పాటు జాతీయ భాష హిందీ కూడా తెలిసుండడం అదనపు ప్రయోజనమే. అయినా స్వార్థ ప్రయోజనాల కోసం హిందీని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేయడం హాస్యాస్పదమే కాకుండా దేశానికి కూడా ప్రమాదకరమైన పరిణామాలే.
రెండు దశాబ్దాల అనంతరం ఠాక్రే సోదరులు ఒకటవడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించవచ్చనే ప్రచారం జోరందుకుంది. శివసేన పార్టీ వ్యవస్థాపకులు బాల సాహెబ్ ఠాక్రే వృద్ధాప్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు పార్టీ పగ్గాల కోసం తలపడి విడిపోయిన అన్న దమ్ములు ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇప్పుడు వారి రాజకీయ అవసరాల కోసం చేతులు కలిపారు. బాల్ ఠాక్రే బతికున్నప్పుడు కూడా తాము కలవలేక పోయామని, ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పుణ్యమా ఒక్కటయ్యామని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు పైకి వ్యంగ్యంగా కనిపిస్తున్నా ఈ మాటలను నిగూఢంగా పరిశీలిస్తే వీటి వెనుక రాష్ట్ర రాజకీయ పరిణామాలు దాగి ఉన్నాయి.
మహారాష్ట్రీయుల ఆత్మగౌరవంతో పాటు, హిందూ మత పరిరక్షణ, జాతీయత లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో బాల్ ఠాక్రే 1966లో ‘శివసేన’ను స్థాపించారు. ఓట్ల కోసం లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను తీవ్రస్థాయిలో ఎండగట్టిన ఆయన మాజీ ప్రధాన మంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విధానాలను వ్యతిరేకించారు. మైనార్టీ ఓట్ల కోసం దేశంలో విభజించు పాలించు అనే కాంగ్రెస్ వ్యూహాలను ఆయన ప్రతిఘటించిన తీరు మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనాలయ్యాయి. 90వ దశకంలో అత్యంత కీలకాంశమైన అయోధ్య రామాలయం ఘట్టంలో ‘శివసేన’ పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వివాదాస్పద బాబ్రీ కట్టడాన్ని శివసైనికులే కూల్చారని బాల్ ఠాక్రే ఎంతో గర్వంగా ప్రకటించు కున్నారు.
హిందువులు, మరాఠీల కోసం అత్యున్నతమైన ఆశయంతో స్థాపితమైన శివసేన, కుటుంబ కలహాలతో బలహీనపడిరది. ఉద్దవ్, రాజ్ ఠాక్రేల మధ్య ఆధిపత్య పోరులో పార్టీ బలహీన పడిరది. బాల్ ఠాక్రే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నంత కాలం బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమే సాగింది. ఆయన వృద్ధాప్య రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఈ సోదరుల మధ్య 2003లో నుంచి విభేదాలు తీవ్రం కావడంతో 2005లో బాల్ ఠాక్రే పార్టీ పగ్గాలను ఉద్దవ్ ఠాక్రేకు అప్పగించారు. ఫలితంగా రాజ్ ఠాక్రే పార్టీని వీడి 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్‌ఎన్‌ఎస్) పార్టీని స్థాపించారు.
బాల్ ఠాక్రేతో గల సాన్నిహిత్యంతో బీజేపీ శివసేనతోనే జతకట్టడంతో ఉద్దవ్ ఠాక్రేది పైచేయి అయ్యింది. 2009, 2014, 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో శివసేన మంచి ఫలితాలే సాధించింది. పార్టీ స్థాపించిన కొత్తలో రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్‌ఎన్‌ఎస్‌కు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలొచ్చినా అనంతరం పూర్తిగా బలహీనపడిరది. ఆ పార్టీకి ప్రస్తుత అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ఒక్క స్థానం కూడా లేదు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన రాజ్ ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడిగా పోటీ చేశారు. శివసేన పార్టీ పగ్గాలు ఉద్దవ్‌కు దక్కినా, రాజ్ రాజకీయాలే దూకుడుగా ఉండేవి. ఆయన ప్రసంగాలు ఉర్రూతలూగించేవి. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామాలయం నిర్మాణం వంటి కీలక అంశాలపై ఉద్దవ్ ఠాక్రే ఊగిసలాట ధోరణి ప్రదర్శించగా, రాజ్ ఠాక్రే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కాగా, అనేక కారణాలతో తమ పార్టీ ఎమ్‌ఎన్‌ఎస్ పూర్తిగా బలహీనపడడంతో ఉనికి కోసం రాజ్ ఠాక్రే హిందీ భాషపై యుద్ధం సాకుతో ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రేతో చేతులు కలుపుతున్నారు.
శివసేన స్థాపనలో బాల్‌ఠాక్రే ఆశయాలకు ఉద్దవ్ తిలోదకాలిచ్చారు. దీర్ఘకాలం బీజేపీతో కలిసి సాగిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఆశతో పార్టీ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. తండ్రి శత్రువుగా భావించిన కాంగ్రెస్‌తో జత కట్టారు. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీ చేసిన ఉద్దవ్ పొత్తు ధర్మానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిశారు. మహా వికాస్ అఘాఢీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు బాల్ ఠాక్రే పూర్తి వ్యతిరేకమైతే అధికారం కోసం ఉద్దవ్ ఠాక్రే ఫక్తు లౌకికవాదిగా మారిపోవడం విశేషం. అయోధ్య రామాలయం ఉద్యమంలో తమదే కీలకపాత్ర అని బాలాసాహెబ్ ఠాక్రే గర్వంగా ప్రకటించుకుంటే, ఉద్దవ్ ఠాక్రే అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క రామాలయంపైనే కాదు బాల్ ఠాక్రే ఆశయాలకు విరుద్దంగా పలు అంశాలపై కాంగ్రెస్‌ను మించి సెక్యులర్‌వాదిగా నిరూపించుకున్న ఘనత రాజ్ ఠాక్రేకి దక్కింది.
శివసేన లక్ష్యాలకు ఉద్ధవ్ ఠాక్రే తిలోదకాలు ఇస్తుండడంతో విసిగిపోయిన ‘శివ’ సైనికులు తిరుగుబాటు చేశారు. రెండున్నర సంవత్సరాల అనంతరం శివసేన పార్టీలో చీలికి ఏర్పడి మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం కుప్పకూలింది. 2022 జూన్‌లో బీజేపీ మద్దతివ్వడంతో ఏకనాథ్ శిండే నేతృత్వంలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడిరది. ఇదే సమయంలో మహారాష్ట్ర రాజకీయ కురవృద్ధుడు శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో కూడా చీలిక ఏర్పడిరది. అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక వర్గం మహాయుతి కూటమికి మద్దతిచ్చింది. శివసేన, ఎన్సీపీలలో చీలికలొచ్చి పార్టీ పగ్గాల కోసం రెండు వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రెండు పార్టీల్లోనూ మెజార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కూడా చీలక వర్గమైన ఏకనాథ్ శిండే, అజిత్ పవార్ వైపే ఉండడంతో న్యాయస్థానం పార్టీపై హక్కులను వీరికే కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఏక్‌నాథ్ శిండే వర్గానికి శివసేనపై, అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీపై పూర్తి హక్కులు లభించాయి. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పగ్గాలు కింద స్థాయి కార్యకర్త నుండి ఎదిగిన ఏకనాథ్ శిండేకు దక్కడంతో పాటు ఆయన ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడంతో వారసత్వ రాజకీయాలు చేయాలనుకున్న ఉద్దవ్ ఠాక్రే భంగపడ్డారు.
మహాయుతి కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించడంతో ఏకనాథ్ శిండే, అజిత్ పవార్ వర్గాలకు భారీ ప్రయోజనం కలిగింది.మహాయుతి కూటమి మహారాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. 288 అసెంబ్లీ స్థానాలకుగాను మహాయతి కూటమి 49 శాతం ఓట్లతో 235 స్థానాల్లో విజయం సాధించగా, మహా వికాస్ అఘాఢీ 35 శాతం ఓట్లతో 50 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 132 స్థానాల్లో గెలవడంతో ఆ పార్టీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రాంతీయ పార్టీలు తమ పట్టు కోసం దేశ ప్రయోజనాల కంటే సెంటిమెంట్‌కు, భావోద్వేగాలకే అధిక ప్రాధాన్యతివ్వడం కొత్తేమీ కాదు. దశాబ్దం కిందటే రాష్ట్రంలో పట్టు కోల్పోయిన రాజ్ ఠాక్రే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన ఉద్దవ్ ఠాక్రేలకు హిందీ భాష ఒక అస్త్రంగా దొరికింది. జాతీయ భాష హిందీ దేశ ప్రజలందరికీ మాధ్యమంగా ఉండాలనే సంకల్పాన్ని వీరు అడ్డుకుంటున్నారు. భాష అనేది మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక. రాష్ట్రాలకు సంబంధించి ఇదే సూత్రం దేశ వ్యాప్తంగా కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలో మాతృభాషకు మొదటి ప్రాధాన్యతిస్తూనే, హిందీకి ద్వితీయ లేదా తృతీయ భాషగా గుర్తింపు ఇస్తే దేశ ఐక్యత, జాతీయత పెరుగుతుందే కానీ తగ్గదు. రాష్ట్రాభిమానంతో పాటు దేశాభిమానం కూడా చూపించుకోవచ్చు. రష్యా, చైనా, జపాన్. ఇజ్రాయిల్, కొరియా వంటి దేశాల్లో ప్రతి అంశం, ప్రభుత్వ కార్యకలాపాలు వారి జాతీయ భాష మాధ్యమంగానే సాగుతాయి.
మనం జాతీయ భాష మీద ఆ అభిమానం చూపించలేమా..? రాష్ట్రంతో పాటు దేశ గౌరవం కూడా కాపాడాల్సిన బాధ్యత దేశ పౌరులమైన మన మీదా లేదా..? ప్రపంచంలోని, దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు, ఉద్యోగాలు రాష్ట్రానికి రావాలి అయితే అందరికీ మధ్యేమార్గంగా ఉండే జాతీయ భాష హిందీ మాత్రం పనికి రాదా..? మహారాష్ట్రలో గుజరాత్, తమిళనాడు, పంజాబ్, బెంగాల్, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉంటారు. వాళ్లందరూ హిందీలో కాకుండా మరాఠీలోనే మాట్లాడాలనడం ఎంత వరకు న్యాయం..? హిందీ సినిమాల నుండి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు కావాలి కానీ, హిందీ భాష పనికి రాదా..? సదరు మహారాష్ట్రీయుల్లో మెదులుతున్న ఇలాంటి న్యాయమైన ప్రశ్నలకు జవాబు లివ్వలేని ఠాక్రే సోదరులు వారి స్వప్రయోజనాల కోసం మహారాష్ట్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ప్రజలను రెచ్చగొడుతున్నారు.
త్రిభాష సూత్రంలో భాగంగా హిందీని తృతీయ భాషగా నేర్చుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే దాన్ని మరాఠీ ఆత్మగౌరవంతో ముడిపెట్టారు. ముంబాయిలో ఒక వ్యాపారి పనివారితో మరాఠీలో మాట్లాడలేదని దాడి చేశారు. ఇదేమిటని అక్కడి వ్యాపారస్తులు ప్రశ్నిస్తే ఉద్యమాలు, బందులతో గలాట చేశారు. ఠాక్రే సోదరుల సైన్యం రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను రద్దు చేసుకున్నా, దాన్ని కూడా విజయోత్సవ సభ అంటూ భయాందోళనలు కలిగించారు. ఈ పరిణామాలు, రాష్ట్రంలోని రాజకీయ నేపథ్యాన్ని గమనిస్తే ఠాక్రే సోదరులు తమ ఉనికి, భవిష్యత్ కోసమే ప్రజల్లో గందరగోళం కలిగిస్తున్నారని సుస్పష్టం.
– శ్రీపాద