స్వతంత్ర భారతదేశంలో ప్రధానిని ఉత్తర ప్రదేశ్ నిర్దేశించేది. ప్రథమ ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర, ఈమె కుమారుడు రాజీవ్, కోడలు సోనియా, రాజీవ్ కుమారుడు రాహుల్, ఈయన సోదరి ప్రియాంక వాద్రా వీరంతా ఉత్తర ప్రదేశ్ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటికీ వహిస్తున్నారు. నెహ్రూ, లాల్ బహదూర్‌శాస్త్రి, ఇందిర, చౌధురి చరణ్‌సింగ్, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్, చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధాని పదవి చేపట్టినవారే. ఇందులో లాల్ బహదూర్ శాస్త్రిని మినహాయిస్తే, మిగిలిన వారి హయాములలో ముస్లిం బుజ్జగింపు ఒక ప్రధాన అంశంగా కనిపిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా మొత్తం జనాభాలో దాదాపు 19 శాతం. ముస్లింలను అంటకాగితే తప్ప అధికారం అసాధ్యం అన్న దృక్పథాన్ని అక్కడి బీజేపీయేతర నేతలలో పాతుకు పోయేటట్టు చేసినవారు వీరే. ఎక్కడ బుజ్జగింపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయో అక్కడే అయోధ్య ఉద్యమం బలపడింది. సాంస్కృతిక జాతీయవాదం రాజకీయ పరిస్థితులను మలచింది. దేశంలో అతి పెద్ద బుజ్జగింపు రాజకీయాల కోటను రామబాణం తుత్తునియలు చేసింది. ఆ రామబాణమే కాంగ్రెస్‌ను మరణశయ్య మీదకు చేర్చింది. హిందూత్వం, ఉత్తమ పాలన, శాంతిభద్రతల అవసరం ఇప్పుడు ప్రజలు గుర్తించి దానికి ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీ వైపు చూస్తున్నారు. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ చిత్రం మారిపోయిందన్నదే ఏకాభి ప్రాయం. కానీ ఈ మార్పు భారతీయ సమాజం నుంచి ముస్లింలను వేరు చేసే విధంగా ఉందని కొద్దికాలం నుంచి వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఇది కేవలం కుహనా మేధావులు, ఉదారవాదుల వాచాలత. చాలా కీలక అంశాలు వెల్లడించేందుకు ఈ యూపీ పరిణామం ఒక్కటి చాలు. ముస్లింలు భారతీయ సమాజం నుంచి తమకు తాము దూరంగా జరుగుతున్నారన్నదే అసలు వాస్తవం. నేరపూరిత రాజకీయాలను నమ్ముకుంటూ, పరి పాలనను, ప్రజాస్వామ్యాన్ని నిరోధించేందుకు ప్రయ త్నిస్తున్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించడానికి ఇప్పటికి తమకు ఇష్టం లేదన్న ధోరణినే ప్రదర్శిస్తున్నారు. ఈ ధోరణిని నిలబెడుతూ వస్తున్న ముస్లిం నాయకత్వం ఇప్పుడు మరుగున పడింది. కానీ ఇలాంటి దుస్థితి నుంచి బయటపడి కొత్త నాయకత్వం వెంట నడవవలసిన తరుణంలోను వారు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు.
అయోధ్య పరిణామాలు విశ్వహిందూ పరిషత్‌కు అనుకూలంగా మారడానికి కాంగ్రెస్ తప్పిదాలే కారణమని 1990ల నుంచి ముస్లింలు నమ్మడం మొదలయింది. అలాంటి సమయంలో సామాజిక న్యాయం, సెక్యులరిజం పేరుతో ముస్లింలను తనవైపు ఆకర్షించుకున్న నాయకుడు ములాయం సింగ్ యాదవ్. ముస్లిములు-యాదవుల కలయిక పేరుతో ములాయం బుజ్జగింపునకు కొత్త రూపు తెచ్చాడు. ఈ ప్రయోగం తోనే రాష్ట్రంలో చిరకాలం అధికారంలో ఉన్నారు. ఈయన కుమారుడు అఖిలేశ్ కూడా తండ్రి బాటలోనే నడిచి కొంతవరకు విజయం సాధించాడు. నిజానికి 1982 వరకు ఇదే ఉత్తరప్రదేశ్ రాజకీయ చిత్రపటం. కానీ అదే సమయంలో ఆరంభమైన అయోధ్య ఉద్యమం ఈ చిత్ర ప•ం రూపురేఖలు మార్చే పక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. రాష్ట్రం విషయంలో ప్రతి పరిణామాన్ని నిర్దేశిస్తూ వచ్చిన ముస్లింలు రాజకీయ చిత్రపటంలో ప్రాధాన్యం కోల్పోయారు. బీజేపీ, ఆపై ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర రాజకీయాలకే కాదు, దేశ రాజకీయాలకీ ముస్లింలే కీలకం అన్న అభిప్రాయం సంపూర్ణంగా పటాపంచలైంది.
ఇప్పుడంటే ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు ప్రాధాన్యం కోల్పోయి ఉండవచ్చు.అంతకు ముందు కేంద్ర రాష్ట్ర రాజకీయాలను ముస్లింలు విశేషంగా ప్రభావితం చేశారు. ఈ వెనకడుగు స్వయంకృతాపరాధంలో భాగమే. ఇంకా, ఇప్పటికీ వీడని విభజన దృష్టి, జిన్నా ఆలోచనా ధోరణి, మధ్యయుగపు మతోన్మాద దృష్టి, ఆధిపత్య దృక్కోణం, హిందువుల పట్ల ప్రదర్శించే చిన్నచూపు కూడా దానికి దోహదపడినాయి. ఇవన్నీ ఆ వర్గాన్నే సామాజికంగా, రాజకీయంగా కొన్ని అడుగులు వెనక్కి వేసేటట్టు చేశాయి. అయోధ్య విషయంలో వారు వేసిన తప్పటడుగు ఈ తప్పిదాలకు పరాకాష్ట. కుహనా సెక్యులరిస్టులు, కాంగ్రెస్, నకిలీ చరిత్రకారులు అంతా కలసి ముస్లింల ఉనికిని ఈ క్రమంలో పలచన చేశారు. రాష్ట్ర జనాభాలో ఐదు శాతం ఉన్న ముస్లింలు తమ ఉనికి గురించి తామే ప్రశ్నించుకునే స్థితిలో పడిపోయారు. దీనికి నిదర్శనమే శాసనసభలో వారి ప్రాతినిధ్యం. రాష్ట్ర జనాభాలో దాదాపు 19 శాతం ఉన్న ముస్లింలు శాసనసభలో 7.7 శాతమే ఉన్నారని ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. అంటే మొత్తం 403 స్థానాలలో వారివి 31 స్థానాలు. సభలో ముస్లింలు దక్కించుకున్న అత్యధిక స్థానాలు (1947 నుంచి నేటి వరకు) 69. అది 2012లో జరిగింది. అతి తక్కువ స్థానాలు 2017లో వచ్చాయి. అవి 17 స్థానాలు మాత్రమే. యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టిన 2017లో ముస్లింలు గెలిచిన స్థానాలు 24. ఆయన ఒక్క ముస్లిం అభ్యర్థి లేకున్నా అసెంబ్లీలో ఆధిక్యం సాధించి ముస్లింల ప్రాబల్యం అనేది ఒక భ్రమ అని తేల్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2022లో 34 స్థానాలు వచ్చినా అవేవీ ముస్లింలు స్వయంగా గెలుచుకున్నవంటే నమ్మడం కష్టం. వారిలో 31 మంది సమాజ్‌వాదీ పార్టీ నుంచి గెలిచినవారే. వీరిలో మళ్లీ అబ్బాస్ అన్సారీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడం, ఆ స్థానం కోల్పోవడం జరిగాయి. శాసన మండలిలో వారి ప్రాతినిధ్యం కూడా అంతంత మాత్రమే. 2019లో ఆరుగురు, 2024లో ఐదుగురు ప్రవేశించారు. 2014లో ఎవరూ ఎన్నిక కాలేదు. ప్రస్తుత లోక్‌సభలో కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్లిన వారు ఐదుగురు. ఇక్కడ 80 స్థానాలు ఉన్నాయి. ఈ ఐదుగురిలో నలుగురిని సమాజ్‌వాదీ, ఒకరిని కాంగ్రెస్ పంపాయి.
మారిన పరిస్థితులలో ముస్లిం-యాదవ్ కలయిక ఇక ముందు కూడా అధికారం తెచ్చి పెట్టే వ్యూహం కాలేదని అఖిలేశ్ యాదవ్ కాస్త ఆలస్యంగానే మొత్తానికి గుర్తించారు. అందుకే పీడీఏ (పిచాడా, దళిత్, అల్ప సంఖ్యాకులు) సమీకరణను ఆశ్రయించారు. ఇందులో అల్ప సంఖ్యాకులకు ఆఖరి స్థానమే కేటాయించారు. పైగా దళిత ఓట్ల మీద బీఎస్‌పీ ఆధిపత్యం సడలి పోవడం, హిందూ స్పృహతో ఓటు వేయడం అనే పరిణామాలు యూపీ రాజకీయాలలో ప్రవేశించాయి. మాయావతి కూడా ముస్లిం ఓటు కంటే ఓబీసీ, కాంగ్రెస్‌ను ఆశ్రయించుకుని ఉన్న దళిత, ఓబీసీ ఓట్ల వైపు మొగ్గు చూపారు. ఇందులో ఏదీ ఆమెకు ఉపకరించలేదు. ఏ వ్యూహమూ ఫలించలేదు. నామమాత్రపు రాజకీయ పక్షంగా మిగిలి ఉంది. మరొక కారణం, మైనారిటీల ఓట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్లు ఇచ్చే విధానం కనుమరుగై గెలిచే అభ్యర్థి, కుల సమీకరణల మేరకు టికెట్లు కేటాయించే విధానం ప్రవేశించింది. ఇలాంటి విధానం వల్ల లాభం పొందినవారే ఆజమ్‌ఖాన్, ముక్తార్ అన్సారీ, ఆతీక్ అహ్మద్. వీళ్లే చిరకాలంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ముస్లింలకు ప్రతినిధులు. మైనారిటీ గొంతు అంటే వీళ్లే. కానీ ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరూ సభలో లేరు. ఒకరు జైలుకి వెళ్లి అక్కడే చనిపోయాడు. ఇతడి ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆతిక్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ముగ్గురు కూడా ఆ మేరకు అత్యంత వివాదాస్పదులే. కానీ ముస్లింలలో పట్టు ఉన్నందున ఎస్‌పీ టికెట్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు ముస్లింల వైపున కొంచెం క్రియాశీలకంగా ఉన్న నహీద్ హసన్ (కైరానా), ఇర్ఫాన్ సోలంకి (కాన్పూర్) కేసులలో మునిగి పీకల్లోతు కష్టాలలో ఉన్నారు.
యోగి ఆదిత్యనాథ్ 2017లో యూపీ రాజకీయాలలోకి వచ్చారు. అంతకు ముందు బీజేపీ నుంచి కల్యాణ్‌సింగ్, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాలించినా, యోగి కాలానికి గుణాత్మకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వర్గాలు, బుజ్జగింపు రాజకీయాల స్థానంలో పాలనపై దృష్టి, అభివృద్ధి అనే అంశాలకు బలం చేకూరింది. దీనికి హిందూత్వ తాత్త్వికతను ఇచ్చింది. మొత్తం యూపీ రాజకీయమంతా వీటి మీదే ఉందని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఇప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. అది పూర్తి హిందూ వ్యతిరేక పార్టీ. పాలన పేరుతో మైనారిటీల గొంతు నొక్కడమే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశమని విపక్షాలు ప్రచారం చేస్తున్నా ప్రజలు యోగినే అభిమానిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చినా, దాని ఫలితాలు కనిపిస్తున్నా సమాజ్‌వాదీ నాయకులు మైనారిటీలను అణచివేయడంగానే అభివర్ణిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హిందూత్వను, అభివృద్ధిని, సమర్ధ పాలనను సమపాళ్లలో నడుపుతున్న యోగి నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడే విస్మరించడం కష్టమని వారి అభిప్రాయం. ప్రస్తుతం యూపీ రాజకీయాలను హిందుత్వ నిర్దేశిస్తున్నది. ఈ అంశాన్ని దేశంలోని ఏ రాజకీయ పార్టీ విస్మరించినా వాస్తవికతకు దూరంగా ఉన్నట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకాలం ముస్లింలు అంటూ, ముస్లిం యాదవ్ కలయిక అంటూ పలికిన అఖిలేశ్ ఇప్పుడు మైనారిటీ అన్న పదమే పలుకుతున్నారు. అయోధ్య ఉద్యమాన్ని బోనులో నిలపడానికి, ముస్లిం ఓట్లను కాపాడుకోవ డానికి 1992 నుంచి 2010 వరకు బీజేపీయేతర పార్టీలు కాపాడుకుంటూ వచ్చిన సెక్యులరిజం ఇప్పుడు పటాపంచలయింది. కారణం-అది బుజ్జగింపు రాజకీయాలలో భాగమే కానీ, నిర్మాణాత్మకమైన ఉద్యమంగా ఏనాడూ దేశంలో లేదు. ఆఖరికి నెహ్రూ కాలంలోను ఇదొక ఊహాజనితమైన ఆదర్శంగానే ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కూడా భావించాయని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. నిజానికి రాజకీయ పండితులను, విశ్లేషకులను కూడా ఇవాళ్టి యూపీ రాజకీయ పరిస్థితి ఒకింత గందరగోళంలోకి నెట్టినట్టు కనిపిస్తుంది. చట్టసభలలో ముస్లిం ప్రాతినిధ్యం ఉండడం అవసరమనే వారు భావిస్తు న్నారు. కానీ ముస్లింలకు టికెట్లు ఇచ్చి గెలిపించ వలసిందని వీరు రాజకీయ పక్షాలను నేరుగా కోరలేరు. అలా కోరితే పరిణామాలు వేరుగా ఉంటాయి. ముస్లింలు బరిలో ఉంటే ఓటు వేయడానికి అన్ని వర్గాలు ముందుకు రాకపోవడం ఒక వాస్తవం. అలాంటి పరిస్థితిని సృష్టించుకున్నవారూ ముస్లింలే. ఎందుకంటే ముస్లింలు ముస్లింలకే ఓటు వేస్తారు. ఉదాహరణకు సమాజ్‌వాదీ పార్టీ హిందువుకు సీటు ఇచ్చి, బీఎస్‌పీ ముస్లింకు సీటు ఇస్తే ముస్లింలు సమాజ్‌వాదీ బంధాన్ని తుంగలో తొక్కి ముస్లింకు ఓటు వేస్తారు. కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితిని చూస్తున్నది. దీనికి బీజేపీని చాలాకాలం తప్పు పట్టినా ఇప్పుడు వాస్తవాలను గుర్తించక తప్పడం లేదు. ఇవన్నీ ఉన్నా, భిన్నత్వంలో ఏకత్వం సూత్రం బలహీన పడకుండా ఏదో ఒక దారిలో ముస్లింలను చట్టసభల లోకి పంపాలని విశ్లేషకులు అభిప్రాయపడే స్థితికి యూపీ రాజకీయం చేరింది. చిత్రం ఏమిటంటే, ముస్లిం మతోన్మాదాన్ని నివారించే బాధ్యత ముస్లింల మీద కూడా ఉందని ఏనాడూ ఒక్క మేధావి కూడా చెప్పడు. అలాగే మతమే చూడొద్దు, సంస్కృతి, సిద్ధాంతం ఆధారంగానో, అభ్యర్థి గుణగణాలను బట్టో ఓటు వేయండి, మీ చుట్టూ మీరే బరి గీసుకోకండి అని ముస్లింలకు చెప్పే ఏ విశ్లేషకుడు కానరాడు. ఏ మేధావి పట్టించుకోడు. నిజానికి ఎస్‌పీ వంటి పార్టీ వైఖరి ఏనాటికీ ముస్లింలకు మేలు చేసేది కాదు. 2024 ఎన్నికలలో ఈ పార్టీ అత్యంత వివాదా స్పదుడు, జైలులో ఉన్న ఎమ్మెల్యే ఆజంఖాన్‌ను ఎన్నికల ప్రచారంలో స్టార్ కేంపెయినర్‌గా నియమించుకుంది. ఇది బుజ్జగింపు ధోరణిలో వికృతికి పరాకాష్ట. అయినా ముస్లింల ఆధిక్యం ఉన్న అని స్థానాలలోను సమాజ్ వాదీ మట్టి కరిచింది. దేశం, బుజ్జగింపు రాజకీయాలు గుర్తించి తీరవలసిన మరొక పరిణామం కూడా ఉంది. అది కుందార్కి అసెంబ్లీ ఫలితం. ఇది సంభాల్ లోక్‌సభ పరిధి లోనిది. ఇక్కడ ఎంపీ జియా ఉర్ రహమాన్ బార్క్. ఈ అసెంబ్లీ నియోజక వర్గంలో 60 శాతం ముస్లింలు. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామ్‌వీర్ సింగ్ గెలిచారు. 76 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. మూడు దశాబ్దాల తరువాత బీజేపీ గెలిచింది. ఇది బుజ్జగింపు రాజకీయ చరిత్ర నేర్వాల్సిన గుణపాఠం. ఇప్పుడు యూపీలో బీజేపీయేతర రాజకీయ శిబిరంలో నాయకత్వం లేదు. ప్రధానంగా ముస్లింలకు ఈ లోటు ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రధానంగా ఇద్దరు పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది. అందులో ఒకరు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ. రెండోవారు ఆజాద్ సమాజ్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్. కానీ ఎస్‌పీ సాగించిన విచ్ఛిన్నకర ధోరణికి వీరిద్దరు కొనసాగింపును మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి ముస్లిం ప్రాతినిధ్యం పెరగడానికి మెరుగైన, పురోగమన దృక్పథం కలిగిన, మతోన్మాదం ప్రభావంలో లేని వారిని ఎంచుకోవాలి. ఆతిక్‌లను, ఆజమ్ ఖాన్‌లను, తాజాగా వెలుగులోకి వచ్చిన జలాలుద్దీన్ (చాహంగూర్ బాబా)లను ముస్లింలు ఇకనైనా వదిలించుకుంటే మంచిది. యూపీ ముస్లింలలో వచ్చే మార్పు దేశానికి మంచి చేస్తుంది. అది అంతిమంగా ముస్లిం సమాజానికే మేలు అవుతుంది. కాగా రాష్ట్రంలో పరిస్థితులను మెరుగు పరిచే క్రమంలో యోగి, తన పాలనలో ఉద్యోగ స్వామ్యం తెస్తున్న వికృతులను గమనించవలసి ఉంటుందని చాలామందే చెబుతున్నారు.
– జాగృతి డెస్క్