సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, హైదరాబాద్‌ను పట్టిన ముంపు భూతం వదిలిపెట్టడం లేదు.  రహదారులను విస్తరించాం,  ఫ్లై  ఓవర్లు నిర్మించాం, నిర్మిస్తున్నామని చెప్పుకున్న, చెప్పుకుంటున్న గత, వర్తమాన ప్రభుత్వాలు ఏటా వర్షాకాలంలో ఎదురవుతున్న ముంపు భూతాన్ని మాత్రం పారద్రోలలేకపోయాయి. ప్రభుత్వం ప్రజల కష్టాలను పరిష్కరించలేక పోతోంది. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వర్షాలకు సంతోషించాలో, వరదల ఇబ్బందులకు బాధపడాలో తెలియని స్థితి ఒక్కరోజునే (18న) గరిష్ఠంగా  11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ మాదిరి వర్షం పడిందంటేనే రోడ్లు కాలువలను తలపిస్తాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారిపోతాయి. నాలాలు పొంగి పొర్లుతాయి. ముంపు ప్రాంతాల్లోని ఇళ్లు, వాటిలోని సామగ్రి కూడా నీళ్లలో తేలియా డుతాయి. ఇక, ఇటీవల కురిసిన కుండపోత వర్షం పునారవృతమైతే చెప్పుకోవడానికి కూడా ధైర్యం చాలని పరిస్థితులు ఎదురవుతాయి. గడిచిన వారంలో హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. వాహనాలు నీట మునిగే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి నుంచి ఓ మాదిరి పడినా రోడ్లమీద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోతున్నాయి. అవి ముందుకు కదిలే పరిస్థితి కనిపించదు. పది నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యానికి గంటకు పైగా పడుతోంది. పని ప్రదేశాల నుంచి, ఇతర పనులకు బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి చేరాలంటే నరకం కనిపిస్తుంది. గంటల తరబడి వర్షంలో నానుతూ తడిసి ముద్దవుతున్నారు. వాహనాల్లో వెళ్లేకంటే.. నడిచి వెళ్తే తొందరగా ఇళ్లు చేరతామన్న భావన జనంలో వచ్చే పరిస్థితి నెలకొందంటే హైదరాబాద్‌లో వర్షం కష్టాలు ఏ స్థాయిలో తిష్టవేసుకు కూర్చున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రధానంగా జూలై 18వ తేదీ మిట్ట మధ్యాహ్నం దంచి కొట్టిన వర్షానికి హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌నగరాలు ఒక రకంగా మునిగిపోయాయి. ఇక సైబరాబాద్‌ ‌పరిధిలో ఐటీ ప్రాంతం ట్రాఫిక్‌లో చిక్కుబడి పోయింది. ఆ తర్వాత కూడా దాదాపు రోజూ పలుమార్లు ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ప్రజలకు పరీక్ష పెడుతున్నాయి. ఈసారి అయితే ఏకంగా ఫ్లైఓవర్‌పైనే వాహనాలు సగానికి సగం మునిగేలా వరద నీరు ప్రవహించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

వర్షాలు జన జీవనానికి అత్యవసరమే. కానీ, భారి వర్షాలు కురుస్తాయనీ, లోతట్టు ప్రాంతాలు మునుగుతాయనీ, రోడ్లమీద ట్రాఫిక్‌ ‌సమస్యలు తలెత్తుతాయనీ ముందే తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలు, ప్రభుత్వ పర్యవేక్షణ అంతంతమాత్రమే. జులై 18 నాటి వర్షం ఓ రకంగా హైదరాబాద్‌ను ముంచేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరదనీరు చేరింది. చాలా చోట్ల జనం ట్రాఫిక్‌ ‌జామ్‌తో నరకయాతన యాతన పడ్డారు. కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఓ వైపు ముంచెత్తిన నీళ్లు, మరోవైపు రోడ్లమీద ట్రాఫిక్‌జామ్‌.. ఇం‌కోవైపు చిమ్మ చీకట్లో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నీటిలో వాహనాలు మునిగి పోయాయి. జనం నడిచి కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆయా ప్రాంతాలను పెద్ద మొత్తంలో ముంచెత్తిన వరద నీటితో ఇళ్లలోకి కూడా నీళ్లు చేరి సామగ్రి అంతా నీటిలో తేలియాడింది. చాలా ప్రాంతాల్లో జనం తమ ఇళ్లకు చేరుకోవడానికి స్థానికులు సహకరించాల్సి వచ్చింది. ఒక సాయంత్రం వేళ స్కూళ్లు విడిచిపెట్టే సమయానికి ఈ పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు కూడా ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

 ట్రాఫిక్‌ ‌జామ్‌ అనగానే గుర్తొచ్చేది సైబరాబాద్‌ ‌పరిధిలోని ఐటీ కారిడార్‌ ‌ప్రాంతం. సాధారణంగానే నిత్యం ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ రద్దీ మయమ వుతాయి. అలాంటిది వర్షాలు దంచికొట్టినప్పటి పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చిన్న వాన పడినా ట్రాఫిక్‌ ‌జామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. భారీవర్షానికి ఐటీ కారిడార్‌లో వాటర్‌ ‌లాగింగ్‌ ‌పాయింట్ల వద్ద నీరు చేరి రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి.

ప్రధానంగా మాదాపూర్‌, ‌గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం పడినప్పుడల్లా రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఓల్డ్ ‌ముంబై హైవే మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో, గచ్చిబౌలి-నానక్‌ ‌రామ్‌ ‌గూడ, మియాపూర్‌- ‌గచ్చిబౌలి మార్గాల్లో ఒక మోస్తరు వర్షానికి రోడ్లు కాలువలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా శిల్పారామం ఎదురు బస్టాప్‌, ‌కొత్తగూడ బస్టాప్‌, ‌మాదాపూర్‌బాటా షోరూం, నెక్టార్‌ ‌గార్డెన్‌, ‌రాయదుర్గం మెట్రో స్టేషన్‌ ‌కింద, బయోడైవర్సిటీ జంక్షన్‌, ఐఐఐటీ ఎదురుగా, గచ్చిబౌలి ఏఈ ఆఫీస్‌, ‌రాడిసన్‌ ‌హోటల్‌, ఐకియా వెనకాల రోడ్లపై వరదనీరు నిలిచిపోతోంది. ఈ నీరు తగ్గి, వాహనాలు ముందుకు కదలడానికి సగటున 2 గంటల పడుతోంది.

మూడు, నాలుగు వరుసల రోడ్డులో కార్లు, బస్సులు, బైకులు ఒకటి, రెండు వరుసలలోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. జేఎన్‌టీయూ నుంచి ఐకియా మీదుగా బయోడైవర్సిటీ రూట్‌ ‌రెండు వైపులా, షేక్‌పేట్‌ ‌నుంచి ఖాజాగూడ మీదుగా గచ్చిబౌలి, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి మార్గం అంతా ట్రాఫిక్‌ ‌నిలిచిపోతోంది. లింగంపల్లి రైల్వే అండర్‌ ‌బ్రిడ్జి మునిగిపోతోంది. దీంతో ఐటీ కారిడార్‌కు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు నల్లగండ్ల ఫ్లై ఓవర్‌ ‌మీదుగా హైటెక్‌ ‌సి•టీకి చేరుకుంటున్నారు. ఫలితంగా ఆ రోడ్డు రద్దీగా మారిపోతోంది. ఆల్విన్‌ ఎక్స్ ‌రోడ్డు నుంచి గచ్చి బౌలి రూట్‌లో ప్రధాన రోడ్లలో వెళ్లే వాహనాలతో ఎంత ట్రాఫిక్‌ ‌జామ్‌ అవుతుందో, ప్రత్యామ్నాయ మార్గంలోనూ అంతే ఉంటుంది.

ఫ్లై ఓవర్‌పై వర్షపు నీరు చేరడం కనీవినీ ఎరగం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లై ఓవర్‌, అం‌డర్‌ ‌పాస్‌, ‌జంక్షన్‌ ‌నీట మునగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి హైడ్రా మాన్‌సూన్‌, ‌జీహెచ్‌ఎం‌సీ అధికారులు బాధ్యత వహించాల్సిందేనని వాహన దారులు పేర్కొంటున్నారు.. మ్యాన్‌హోల్స్ ‌కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వరద నీరు వెళ్లేలా ప్రతి ఫ్లై ఓవర్‌•పై ప్రతి 20 అడుగులకు ఓ రంధ్రం ద్వారా, కిందికి ఓ పైపును అమర్చుతారు. కానీ నిర్వహణ లోపం కారణంగా అవి చెత్త, ప్లాస్టిక్‌ ‌కాగితాలతో నిండిపోతున్నాయి. దాదాపుగా అన్ని రంధ్రాల్లో అలా చెత్త పేరుకుపోవడంతో వరద నీరు కిందికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు అంజయ్యనగర్‌ ‌నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ ‌వరకు ఉన్న కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై దాదాపు మూడు అడుగుల లోతు నీరు చేరింది.

వరద నీటిని పరిగణనలోకి తీసుకోకుండా సరైనా ప్లాన్‌ ‌లేకుండా కొత్తగూడ జంక్షన్‌లో అండర్‌ ‌పాస్‌ను ఏర్పాటు చేశారని విమర్షలున్నాయి. భారీ వర్షం వచ్చినప్పుడు వరద నీటితో నిండిపోవడం, వాహనాల రాకపోకలు స్తంభించడం జరుగుతూనే ఉంది. మోటార్లు కాలిపోవడంతో వరదను తొలగించే వీలు లేకపోవడం వల్ల అండర్‌ ‌పాస్‌ ‌పూర్తిగా నిండిపోయింది. డీజిల్‌ ఇం‌జన్లతో రాత్రంతా వరద నీటిని తోడాల్సి వచ్చింది. వరద నీటి తొలగింపు పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా హైదరాబాద్‌లో హైడ్రా అలర్ట్‌లు మొదలయ్యాయి. నగర వాసుల మొబైల్‌ ‌ఫోన్లకు హైడ్రా నుంచి వర్షం అలర్ట్ ‌మెస్సేజ్‌లు వస్తున్నాయి. దీంతో, ఇప్పటికే అప్రమత్తం చేస్తున్న జీహెచ్‌ఎం‌సీ, డీఆర్‌ఎఫ్‌కు తోడుగా హైడ్రా కూడా అలర్ట్‌ల స్పెషలిస్ట్ అయిపోయింది. హైడ్రా పరిధి జీహెచ్‌ఎం‌సీ, ఓఆర్‌ఆర్‌ ‌లోపల వర్షం కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాటర్‌ ‌నిలిచిపోయే ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హైడ్రా నుంచి మొబైల్స్‌కు అలర్ట్ ‌మెస్సేజ్‌లు వస్తున్నాయి. మరోవైపు.. కుండపోత వర్షాలు కురిసిన సమయంలో హుస్సేన్‌ ‌సాగర్‌ ‌నిండిపోతుండటంతో.. దిగువ ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. ముంచెత్తిన వర్షానికి రసూల్‌పురలోని  విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది ఓ కార్ల షోరూంలో సిబ్బంది మొత్తం చిక్కుకుపోయారు. అక్కడ దాదాపు నాలుగు అడుగుల మేర వరద చేరింది. సుమారు 30 మంది ఉద్యోగులు వరదలో చిక్కుకుపోయారు. తమను రక్షించాలని పోలీసులు, డీఆర్‌ఎఫ్‌, ‌హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది వారిని వెనుక వైపు నుంచి రక్షించారు. చిన్న పడవలలో వారిని బయటకు తీసుకువచ్చారు.

 ప్రభుత్వం ఈ పరిస్థితులను నివారించేందుకు విధాన పరమైన నిర్ణయం ఏదీ తీసుకోవడంలో జాప్యం కారణంగా వర్షం కష్టాలు హైదరాబాద్‌లో అనివార్యంగా మారిపోతున్నాయి. అటు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం, ఇటు.. రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోవడం వంటి పరిస్థితుల కారణంగా వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోం పద్ధతిని అమలు చేయాలని పోలీసు శాఖ ఐటీ కంపెనీలకు సూచిస్తోంది. ఈ మేరకు సైబరాబాద్‌ ‌పోలీసులు ఎక్స్ ‌వేదికగా ఈ విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతేకాదు.. రోడ్లమీద ట్రాఫిక్‌ ‌పరిస్థితులు తెలుసు కాబట్టి వాహన దారులు కూడా వర్షాలు వచ్చిన సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, అవసరమయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE