చైనాలో పెద్ద రాజకీయ పరిణామం ఏదైనా జరగబోతున్నదా? మహాకుడ్యం వెనుక ఏదో జరుగుతున్నదన్న అనుమానాలు ఇప్పుడు ప్రపంచ మంతటా బలపడుతున్నాయి. చైనా అధ్యక్షుడు లేదా మరొక పెద్ద నేత అడపా దడపా కనిపించకుండాపోవడం, కొన్నివారాలకో, నెలకో తిరిగి దర్శన మీయడం అక్కడ జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హఠాత్తుగా అదృశ్యం కావడం పెద్ద అనుమానాలకు తావిస్తున్నది. ఆయన మే 21 నుంచి జూన్ 5 వరకు ఎక్కడా కనిపించలేదు. చైనా ప్రభుత్వంలో, లేదా చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన లేదా వస్తున్న తుపానులకు ఇదే నిదర్శనమన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఒక కీలక ఉదాహరణను ఇక్కడ గమనించాలి. జూన్ 6న రాజ్యాంగ విధేయత కార్యక్రమం నిర్వహించారు. చైనా స్టేట్ కౌన్సిల్ నిర్వహించిన ఈ ముఖ్య ఉత్సవానికి 50 మంది మంత్రులు హాజరయ్యారు. వివిధ శాఖల అధిపతులు పాల్గొ న్నారు. కానీ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాలలో, మీడియాలో, ఆఖరికి అత్యున్నత దౌత్య సమావేశాలలో జిన్‌పింగ్ కనిపించడం లేదు. మరొకపక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పీఎల్‌ఏ పై స్థాయిలో విభేదాలు తారస్థాయికి చేరాయన్న వార్తలు కూడా ఇప్పటికే ఉన్నాయి. ఇంకొకపక్క చైనా ఆర్థికం సహా కీలక రంగాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అక్కడ అధికార మార్పిడి వంటి పెద్ద పరిణామానికి రంగం సిద్ధమవు తున్నదని అంతా అనుమానిస్తున్నారు. పీపుల్స్ డైలీ, జిన్హువా రెండూ కూడా పార్టీ, ప్రభుత్వాల ప్రచార సాధనాలే. ఇవి అధ్యక్షుడి చిత్రం లేకుండా వెలువడడం 2017లోనే జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే పునరావృతమైంది.
జూన్ 2 నుంచి 5 వరకు ఈ ప్రచార పత్రికలలో అధ్యక్షుడి చిత్రమే లేదు. ఇది అరుదైన సందర్భం. ఈ సమయంలో జరిగిన అత్యున్నత దౌత్య సమావేశా లకు ప్రధాని లీ కియాంగ్, ఉప ప్రధాని హె లీఫెంగ్‌లు మాత్రమే హాజరయ్యారు. ఇది దేశ నాయకత్వ మార్పిడిలో తాత్కాలిక మార్పును సూచిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమావేశాలకు జిన్‌పింగ్ గైర్హాజరు కావడం, ప్రధాని, ఉపప్రధాని, పార్టీ ప్రముఖులు హాజరు కావడం కమ్యూనిస్టు పార్టీలో అసమ్మతిని చల్లార్చేందుకేనని కూడా అంటున్నారు. వర్గపరమైన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం కూడా కావచ్చునని ఇంకొందరు అంచనా వేస్తున్నారు.
పీఎల్‌ఏలో కూడా పెను మార్పులు సంభవిం చాయి. నిజానికి 2023 నుంచి సైన్యంలో పెద్ద ఎత్తున కుదుపులు సంభవిస్తూనే ఉన్నాయి. జనరల్ హె వీడాంగ్ (సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు), జనరల్ మియా హువా (పొలిటికల్ వర్క్ చీఫ్), జనరల్ లిన్ జియాంగ్యాంగ్ (కమాండర్ ఆఫ్ ఈస్ట్రన్ థియేటర్ కమాండ్)లను పదవుల నుంచి తొలగించారు. పీఎల్‌ఏలోనే శక్తిమంతమైన రాకెట్ ఫోర్స్, వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌ల నాయకత్వాలలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ఇవన్నీ చూస్తే చైనా సైనిక వ్యవస్థ అంత సజావుగా ఏమీ లేని సంగతి రుజువు చేస్తున్నాయని భావిస్తున్నవారు కూడా ఉన్నారు.
జిన్‌పింగ్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడు తున్నారని, ఈ ఆగస్టులో జరిగే సీసీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన పదవీ విరమణ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని నిజం చేస్తున్నట్టుగా జిన్‌పింగ్ జూన్ మాసం మొదట్లో బెలారస్ నియంత అలెగ్జాండర్ లుకషెంకోకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా బహిరంగంగా తిరిగి కనిపించారు. ఆ సమావేశం కూడా గతంలో కనీవినీ ఎరుగని రీతిలో బీజింగ్‌లోని ఆయన ఇంటి ఆవరణలో జరిగింది. ఆ సందర్భంగా అధికారులు కూడా ఎక్కువ సంఖ్యలో కనిపించలేదు. కనీసం చైనా అధ్యక్షుడు విదేశీ అతిథులతో సమావేశమైనప్పుడు తప్పనిసరిగా ఉండే దుబాసీలు సైతం ఈ సమా వేశంలో లేకపోవడం గమనార్హం. ఆ సందర్భంగా ఆయన బాగా అలసిపోయినట్టుగా, ఆసక్తి లేనట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా కనిపించారు. గతంలో కూడా ఆయన దిగిపోతారనే విషయంపై వదంతులు వినిపించాయి కానీ ఇప్పుడున్న పరిస్థితి గతంలో మునుపెన్నడూ లేదు. ఎందుకంటే పీఎల్‌ఏలో జిన్‌పింగ్‌కు విధేయులైన డజన్లకొద్దీ అధికారులు అంతుపట్టని రీతిలో మరణించారు. ఆయనకు ఏ మాత్రం విధేయులు కానివారితో మరణించినవారి స్థానాలను భర్తీ చేశారు. వీటికి తోడు జిన్‌పింగ్ తన తండ్రి స్మారకార్థం కట్టించిన మాసోలియంను పట్టించుకునే నాథుడే లేడు. మావో లేదా డెంగ్ కోసం నిర్మించిన మాసోలియంల కన్నా అతి పెద్దదిగా నిర్మించిన దీనికి ఇంతవరకు ఎలాంటి పేరు పెట్టకపోవడం అనూహ్యం. అంతర్జాతీయ ఇంధన వినియోగం, పర్యావరణ పరిరక్షణ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జిన్‌పింగ్ సోదరుడు జి యాన్‌పింగ్ అదృశ్యం కావడం ప్రస్తావనార్హం. జిన్‌పింగ్ మూడవసారి అధ్యక్షపదవిని చేపట్టడంలో సాయపడి ఆ తర్వాత ఆయనతో చెడిన జాంగ్ యుక్సియా ప్రస్తుతం పీఎల్‌ఏకు డిఫేక్టో లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.
– జాగృతి డెస్క్