ఓ మురుగా, ఓ మురుగా, ఓ మురుగా
– నెమలి వాహనా రా రా. నీ పొడుగైన శూలంతో రా. నాకు సౌఖ్యాన్ని, సార్థకతను, కీర్తిని, మోక్షాన్ని, అర్హతను, సంపదను, ప్రాముఖ్యతను ప్రసాదించు.
– నీ భక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. దయచేసి వారందరికీ స్వేచ్ఛను ప్రసాదించు. అవధులెరుగని వేదాలకు అంతానివి నీవు, ఓ అసురాంతకా, కోరుకున్న రూపంలో దర్శనమిచ్చే ఓ శూలపాణి.
– వేదాల సారమై కదలిరా, ఓ శూరుడా, ఓ తేజోమూర్తి నడచిరా, చింతల సాగరాన్ని పరిహరించే శూలపాణి కదలిరా, మా అందరి చింతలను దూరము చేయగా తరలిరా..
– ఇంద్రుడి రాజధానిలో నివసిస్తున్న ఓ నా బంధువా, నాపై నీ కరుణాకటాక్షాలు కురిపించు, నీకు శరణు. శరణు నీకు ఓ సుబ్రహ్మణ్యా, అగ్నిలా అన్ని రుగ్మతలను పారద్రోలే ఓ దేవా శరణు శరణు
– ఓ ఆచార్యా, ఓ పరమేశ్వరపుత్రా, గుహలో జ్వలించే ఓ తేజోరూపమా, దయచేసి నాకు పనిని, దాని ఫలితాన్ని ఇవ్వు, ఓ దేవతల దళపతి నీకు శరణు శరణు..
(మహాకవి సుబ్రమణ్య భారతి తమిళంలో రచించిన ప్రసిద్ధ మురుగా, మురుగా అనే కవిత తెలుగులో.)
జూన్ 22న యావత్ ప్రపంచం ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం గురించిన చర్చల్లో తలమునకలై ఉన్న తరుణాన తమిళనాడులోని మదురైలో పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్యస్వామి భక్తుల సమ్మేళనం జరిగింది. దాని పేరు మురుగన్ భక్తర్‌గల్ ఆన్‌మీగ మానాడు. హిందూ మున్నని నిర్వహించిన ఈ కార్యక్రమానికి తమిళనాడులో వేర్వేరు ప్రాంతాలకు చెందిన లక్షలాదిగా భక్తులు అత్యంత శ్రద్ధాసక్తులతో హాజరయ్యారు. వేదిక మీద ఉన్న సాధువులు, సన్యాసులకు ఆంధప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సాష్టాంగ నమస్కారం చేయడం తమిళనాడులో రాజకీయాలకు అతీతమైన సందేశాన్ని ఇచ్చింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వపు నియంతృత్వ పోకడల కారణంగా స్వచ్ఛమైన సామాజిక-సాంస్కృతిక నిదర్శనంగా నిలవాల్సిన భక్తజనసంగమం మురికిపట్టిన రాజకీయ మలుపును తీసుకొంది. ద్రవిడవాదం వేర్వేరు ధర్మాలను విశ్వసించే సమ్మిళిత హిందూ సంస్కృతిని ద్వేషించడంపైనే మనుగడ సాగిస్తోంది. ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వేర్పాటువాద అజెండాను అమలు చేస్తుంటుంది. హిందూ సంస్కృతికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం ఉందంటే చాలు ఆ కార్యక్రమాన్ని ఆపడానికి యావత్ అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించుతుంది. అత్యవసరమైన పాలసీలను అమల్లోకి తెస్తుంది. డీఎంకే ప్రభుత్వం అదే తీరుగా ఈ కార్యక్రమానికి కూడా అవాంతరాలు సృష్టించడానికి తన అధికార పరిధిలో చేయాల్సింది అంతా చేసింది. పోలీసు యంత్రాంగాన్ని బరిలోకి దించింది. హిందూ మున్నని ఎట్టకేలకు హిందూ సంస్కృతీ మూలాలు తమిళసమాజంలో వేళ్లూనుకొని ఉన్నాయని చెప్పడం ద్వారా కార్యక్రమ నిర్వహణకు కోర్టు నుంచి ఉత్తర్వును ఆశించాల్సి వచ్చింది. మురుగన్ చేతిలోని శూలం శక్తి, సౌభాగ్యాలకు ప్రతీక. ఇదే కార్యక్రమంలో లక్షలాదిగా భక్తులు ఆరుపడై వీడు పేరిట తమిళనాడులో ఆరు మురుగన్ పర్వత క్షేత్రాలను వర్చువల్‌గా దర్శించుకున్నారు. ఈ విశేష దర్శనం సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలనుకునే దుష్ట శక్తులను ధిక్కరించడంలో ఓ సంకేతంగా నిలిచింది. మురుగన్ భక్తజన సంగమం ద్వారా ద్రవిడవాదం పునాదులపై అద్దాల భవనంలో నివసిస్తూ వారసత్వపు అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తూ, కులం, మతం, ప్రాంతం, భాష ప్రాతిపదికగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని శతాబ్ద కాలంగా ఎగదోస్తున్న దుష్టశక్తులకు తమిళనాడు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఆంధప్రదేశ్ ఉపముఖ్యమంత్రి తమిళంలో ఎలుగెత్తి ఇచ్చిన సందేశం తమిళనాడులో లోతైన ప్రకంపనలను సృష్టించింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలకు విముక్తి, తమిళనాడులో భక్తిపరుల ఆత్మగౌరవానికి తిరిగి ఊపిరి పోసే విధంగా హిందువుల ఐక్యతకు అనుకూలంగా భక్తజన సంగమంలో ఆమోదించిన తీర్మానాలు ప్రతిఘటనకు, పునరుత్థానానికి సంకేతంగా నిలిచాయి. హిందువుల ఐక్యత, సనాతన ధర్మం కోసం జరుగుతున్న పోరాటం రాజకీయాలకు, ప్రాంతానికి సంబంధించినది కాదు. అది జాతి మేలుకొలుపునకు సంబంధించిన పోరాటం. మహాకవి భారతి తన కవితల్లో హిమాలయాలను, గంగామాతను కొనియాడారు. తమిళుల వెండితెర వేలుపు, మాజీ సీఎ ఎంజీ రామచంద్రన్ లాంటివారు హిమాలయ ప్రాంతంపై దాడి తమిళనాడుపై దాడితో సమానం అని బలంగా విశ్వసించారు. కైలాసం నుంచి కన్యాకుమారి వరకు ఆధ్యాత్మికత తేజస్సుతో వెలుగొందుతున్న ఈ భూమి సర్వజనుల పవిత్రతకు అంకితమైంది.
– ‘ఆర్గనైజర్’ నుంచి