అతడు ఆమె సమీపంలో నిద్రిస్తున్నట్టే ఉన్నాడు, కానీ నిర్జీవి

అతడి ఆత్మసఖి హృదయం నుంచి నెత్తురు చిమ్ముతోంది

లయనూ, వేగాన్నీ కొలిచే మెట్రోనోమ్‌

బాధను దిగమింగే గొంతులోకి

తిరిగి ఒంపుతోంది.. టిక్‌ టిక్‌

కానీ దుఃఖానిదే అక్కడ రాజ్యం

అది గొంతు మీద భారంగా తిష్ట వేసింది

పదునెక్కిన దుఃఖాన్ని మింగడం అసాధ్యం (మహువా సేన్‌)

ఏప్రిల్‌ 22న పెహల్గామ్‌ దగ్గరి బైసారన్‌ పచ్చిక బయళ్ల మీద ఒలికిన రక్తం భారతీయ హృదయాన్ని కలచివేసింది. వెంటనే కన్నెర్ర చేయించింది కూడా. ఫలితమే ఆపరేషన్‌ సిందూర్‌. దీనితో భారతీయ పౌరుషానికి కాస్త ఉపశమనం లభించింది. ఆ సమయంలో కలాలు స్పందించాయి. పైన ఉదహరించినది అలా వచ్చిన కవితలలో ఒకటి. జాతీయ భావం, జాతి గౌరవం, మానవత్వం నింపుకున్న తెలుగు కవుల హృదయాలు కూడా స్పందించాయి. ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌ రచన ‘సిందూరం’ ఆవిష్కరణోత్సవంలో (జూన్‌ 1,2025) పలువురు కవులు పెహల్గామ్‌  రక్తపాతానికి కలాలతో సమాధానం ఇచ్చారు. ఈ ఘాతుకం వెనుక ఉన్న మతోన్మాద, ఉగ్రవాద పాకిస్తాన్‌ను హెచ్చరించారు. గతంలో చైనా, పాక్‌లతో జరిగిన యుద్ధాల సమయంలో స్పందించిన కలాలను అనుసరించారు. చైనా యుద్ధం ఎందుకు? ‘నేనే తప్పొనరించినాను వెధవన్నే శీర్షమెక్కించుకున్నానే..’ అని వాపోయారు ఒక జాతీయవాద కవి. పాకిస్తాన్‌దీ ఇదే తతంగం. ‘కాశ్మీర కుంకుమ మలదిన నా భారతి/ సిగబట్టి చిచ్చు రగిలించాలని/ పాక్‌ దుస్ససేనుడు పగటి కలలు కంటున్నాడు’ అంటూ భారత్‌ యుద్ధ సమయంలో ఒక కవి గర్జించాడు. అలాగే ‘మనుషులు కాదు మారణాయుధాలు/ ఆడుకుంటున్నాయి మంచు మీద ఈ రోజు’ అని కూడా ప్రకటిం చాడు కవి (ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌ సిద్ధాంత గ్రంథం ‘ఉద్యమ దర్శనము’ నుంచి).భారత్‌ వికాస్‌ పరిషత్‌, జాతీయ సాహిత్య పరిషత్‌ నిర్వహించిన ఈ కవితా పఠన కార్యక్రమంలో పెహల్గామ్‌ ఉదంతం తరువాత వర్తమాన కవి ఇలా స్పందించాడు, ‘పాపాల పాపిస్తానుల మూర్ఖత్వ మెంత/ పోయి మీ మోదీకి చెప్పుకో మనేంత…’ పాద పారాణి కూడా ఆరని నవ వధువు గుండె కోతను పై కవితలో మహువా సేన్‌ వినిపించారు. కశ్మీర్‌ నేల మీద పరుచుకున్న మంచు తివాసీ కింద పండిత్‌ల ఆక్రందనలను కూడా అంతా వినాలి. సూఫీ కవి అమీర్‌ ఖుస్రో ఒక సందర్భంలో ఏం రాశాడు! ‘ఇలాతలం మీద స్వర్గం అంటూ ఉంటే/ ఇది అదే ఇది అదే ఇది అదే…’. మరి ఇప్పుడో… ఆ దుస్థితినే తెలుగు కలాలు ఆవిష్కరించాయి. అవధరించండి! మంచు మీద విరిసిన ముత్యాలే అయినా ఆ కవితలలోని కన్నీళ్ల వెచ్చదనం గమనించండి! ఆపరేషన్‌ సిందూర్‌ అగ్నికణాలను అక్షరాల అద్దంలో చూడండి.


సిందూరపు పరువెంత?

జగములేలే జగన్నాథుని బరువెంత

భక్తితో విడిచిన ఒక్క తులసీదళమంత!

బట్టలూడిన భారతీయుడి పరువెంత

హైందవీ మాత పాపిట సిందూరమంత!

సిగ్గులేక సిందూరాల్ని కడిగేసిన పాపమెంత

సింధునదీ పరీవాహక మంతా ఎండ బెట్టుకునేంత!

పాతిక ప్రాణాలకి బదులు దక్కించు దూరమెంత

అగ్ని ఆకాశ సమ శతఘ్నులు చేరుకునేంత!

పాపాల పాపిస్తానుల మూర్ఖత్వమెంత

పోయి మీ మోదీకి చెప్పుకో మనేంత…!

– దొడ్డిపట్ల కల్యాణ్‌కిషోర్‌


‘పహల్గాం’ ఉగ్రదాడిపై విజయబావుటా

కం॥     పర్యాటకులకు ప్రీతగు

            పర్యాటక కేంద్రమయ్యి పహల్గాముండన్‌

            పర్యటనకు చని సుందర

            పర్యంతభూమి తిరుగుచు ప్రజలుండగాన్‌!

తే.గీ.     విజయ సిందూరమను పేర` వీర భార

            తావనిన్‌ సాగెయుద్ధముÑ తావులేదు

            మూర్ఖ ముష్కర మూకల` కర్కశంబు

            నకునుÑ యనుచుముందుకు `నడిచె సేన!

కం॥     బహవల్‌ పూర్‌ పాకిస్తాన్‌

            బహు బల ముష్కర నివాస ప్రాంతాలన్నీÑ

            ముహురత కాలము లోనన్‌

            బహుముఖ ప్రజ్ఞతో తునిమెను భారత్‌ సేనల్‌!

కం॥     సాంబా సెక్టారు జమ్మూ

            బాంబుల మోతతో భయమున వణుకుచు నుండన్‌!

            బాంబేవాసులు బలమున

            బెంబేలు వలదని జనులు వేడ్కొను చుండెన్‌!

కం॥     జేజేలు పలికె భారత

            మేÑ జే గీయమగునట్టి మేధిని క్షేమం

            బేÑ జీవము మోకనియున్‌

            రాజీలేని సమరమున రాణించంగాన్‌!

కం॥     సైన్యము సాగుచు నుండెను

            మాన్యము మేరలవరకును మానము నొడ్డీ!

            దైన్యము లేకయె ధర సా

            మాన్యముగ మసలు మనుచు మనకు దెలుపఁగాన్‌!

కం॥     ముష్కరులకు చిరునామా

            లష్కరెల సవాయ్‌ నలాల లాగియొ కవిధిన్‌Ñ

            పుష్కలమగు బాణాలను

            ముష్కరు లైనయట్టి పాక్‌ అసూయుల దునిమెన్‌!

కం॥     పర్వత యుద్ధము, తంత్రం

            సర్వము ముష్కర్‌ రహీర్‌ష సాదర శిక్షణ్‌!

            గర్వము పెల్లుబకంగా

            సర్వగతులఁయిచ్చి సయ్యద్స్‌లోద్దిన్‌!

కం॥     జైషే మహ్మద్‌ స్థాణువు

            నేషన్‌ కార్యాలయంబు నిక్కము యిద్దీ!

            బాషా, బహవల్‌ పూరన్‌;

            పాషాలై తిరుగుచుండ్రు భారత భూమిన్‌!

కం॥     లష్కరు క్యాంపూకార్యాల

            లస్కామ్‌ నిలయం మురిద్గె లాడెను స్థానంÑ

            తస్కరు లిక్కడ మరియు తు

            రుష్కులు సహజీవనంతో రూపొందెదరూ!

కం॥     సయ్యద్‌ నాబీలాల్‌ యనె

            తొయిబాల ఆలయమ్ము దుర్భర ముజఫర్‌

            బాద్‌Ñ యందుండెన్‌ పిఓ

            కే, యాక్రమణమున యిద్ది కీలకమవగాన్‌!

కం॥     కోట్లీ జైషే ఆయుధ

            కోట్లకు ఆగారమునుÑ ష కూర్‌కు నిలయమీ

            చోట్లెల్లను వరుస పఠాన్‌

            కోట్లాంటి ఉగ్రదాడిలోన్‌ కొట్టుకుపోయెన్‌!

కం॥     బర్నాలా లస్కారే

            నిర్నీతన్‌ లాంచ్‌ పయిడవ నిశ్చలముగÑ యా

            హర్నీశము దాడికురక

            చర్నాకోల రaళిపెనుగ సైన్యము యౌరా!

కం॥     మోహిమూనా జోయా యనె

            డి హిజుబులడ్డాÑ కలవిచటెన్నియె గృహముల్‌!

            మహితంబయియురణగా

            మొహిదిర్ఫాన్‌ ఖాన్‌ నివాసముండున్‌గాదే!

కం॥     సర్జర్‌ జైషే మహ్మద్‌

            దర్జాగుండే సొరంగ స్థావరమిద్దే!

            దుర్జనులై తిరుగాడను

            బుర్జులపై శిక్షణొందు ముసుగు దొంగలుగాన్‌!

కం॥     యుద్ధము అనివార్యయు, స

            న్నిద్దముఁ జేయగ ప్రభుత్వనేర్పరులెంతో!

            శుద్ధమతిమెరిగె యౌరా!

            యుద్ధరణధీరత ఘనత యేమని పొగడన్‌!

తే.గీ.     దేశరక్షణఁజేయగ ధీరతమున

            సమరమునుఁజేసి ముష్కరు సంహరించి

            మాకు ఆదర్శమూర్తిగా మసలి తీవ్ర!

            వందన మిదిగో సైనిక! భారత వీర!

జై భారత్‌మాతాకీ జై  – జైజై భారత్‌ మాతాకీ జైజై

– కౌండిన్యశ్రీ నండూరి వేంకటేశ్వరరాజు


జాగ్రత!

తిన్న ఇంటివాసాలు లెక్క పెట్టే

దొంగలున్నారు జాగ్రత!

మన ఇంటికే కన్నంపెట్టే ఉగ్రవాద బుసలతో జాగ్రత!

ఆపరేషన్‌ సిందూర్‌ ఆరంభం మాత్రమే,

కాదు అంతం, ఇది అనంతం,

ప్రపంచానికే కళ్లు తెరిపించిన

గుండె దడదడలాడిరచిన ఉదంతం

ఓ పాకిస్తాన్‌! నీవు పీఓకే ఇవ్వాల్సిందే

నీవు కాళ్లబేరానికి రావాల్సిందే

మారుతుంది నీ దేశం అగ్నిగుండం

రావణకాష్ఠంలా, నీవు ఏడ్వాల్సిందే

ధర్మరాజులా మెత్తనిపులి మా మోదీజీ

వేస్తాం మాటు వలుస్తాం నీ తాట

కరాచీ బేకరీల పేరు ఏల?

బకరాలా మారి తలొంచకు ఓ భారతవీరా!

కశ్మీరీ పండిట్ల ఆవేదన ఆక్రోశం

కుతకుత ఉడుకుతున్న లావా

పాక్‌! నీఆగడాలు ముదిరి పాకాన పడుతున్నాయి

నీవు కుక్కిన పేనువై, చెప్పుకింద తేలువై పడుండాల్సిందే

సినీనటులు ఖాన్‌ లు’’ఖాతే యహా గాతే వహాలు’’ నోరు ముయ్యాలి

భారత త్రివిధ దళాలు మూడోకన్ను తెరిచాయి

నిన్ను బూడిద గా మార్చేస్తాయి

నీవు ‘‘దేహి దేహి పాహి పాహి త్రాహి త్రాహి’’ అని భారత్‌కి మొక్కాల్సిందే

        – అచ్యుతుని రాజ్యశ్రీ


ఆపరేషన్‌ సిందూర్‌

కనిపిస్తున్నవి కనిపిస్తున్నవి స్పష్టంగా కనిపిస్తున్నవి

పాక్‌ ఉగ్రమూకల దొంగదెబ్బలు-ఊచకోతలు

 వినిపిస్తున్నవి వినిపిస్తున్నవి  ఉగ్రమూకల కాల్పులు వినిపిస్తున్నవి

అమాయక భారత పౌరుల హాహాకారాలు ఆర్తనాదాలు

మిన్నంటిన వేదనలు రోదనలు

ఎన్నాళ్లీ  మారుణహోమం? యింకెన్నాళ్లీ కకావికలు ?

ఓపికకే ఓపిక నశించి క్షమా ధరిత్రియే అపర కాళిక నిద్ర లేచింది

ఉప్పొంగే భారతపౌరుల  భావోద్వేగంతో కదిలింది కదిలింది

 సైనికులారా ! రారండి అహింసా వ్రతాన్ని వీడండి

చండ ప్రచండ మార్తాండ వీరులై శూరులై కదలండి

మరో కురుక్షేత్ర సమరానికి

మునీర్‌  అఫీజ్‌ హమ్జా మసూద్‌ అజహర్‌

ఎవడైతే నేమి ఒక్కొక్కడు మహాహంతకుడు

ముసుగు ఏదైతే నేమి పాక్‌ సైన్యం, ఐ యస్‌ ఐ,

లష్కర్‌ తోయబ, జైషే మహమ్మద్‌

సంధించండి గాండీవం వజ్రాయుధం పాశుపతాస్త్రం

సుదర్శనం రామబాణం

సమస్త ఉగ్ర రాక్షస గణాలని భస్మీపటలం చేయండి

ప్రపంచ పటంపై బ్రహ్మరాక్షసి పాక్‌ నామరూపమే మిగొలొద్దు

హర హర మహాదేవ అంటూ ఆపరేషన్‌ సిందూర్‌తో శివతాండవం చేయండి

ఆసేతు హిమాచలం జైభారత్‌ జైహింద్‌ నినాదాలతో మీ వెంటే ఉంటుంది

భారత సైనికులారా ! అరివీర భయంకరులై కదలండి

కొదమసింహాలై దూకండి

ఆకాశమే హద్దుగా ఉగ్ర .మూకల సంహారం చేయండి

శత్రుదుర్గాలన్ని భస్మీపటలం చేయండి

 – గులాబీల మల్లారెడ్డి


దేశభక్తి

వందేమాతరం అంటున్నాం మనం

స్వాతంత్య్ర వేడుకలందు,

మనదే భారతం అని కూడా అంటున్నాం

గణతంత్ర వేడుకలందు జెండా వందనం చేస్తూ…

ఇదేనా దేశభక్తి? ఇదేనా ఘనకీర్తి ?

ప్రాణశక్తిలో కలగలిసి ఉండేదే దేశభక్తి

దేశభక్తి లేని దేహంలో

ఆత్మసౌందర్యం శూన్యం

విధిరాతకు సాక్ష్యమైనవాడు దివ్యాంగుడు

దేశభక్తి లేనివాడు నిజమైన వికలాంగుడు

వలస వెళ్తోంది మేధాశక్తి

దేశభక్తిని దాస్యానికొదిలేసి

ఆర్థిక స్వావలంబనకు అగాధం సృష్టించి

ఆత్మసాక్షిని అమ్మకానికి పెట్టేసి

స్వార్థంతో విర్రవీగుతూ

బాహ్య సౌందర్యానికై బారులు దీరితే

విలవిలలాడుతూ వలవల మంటూ

ఉండలేనంటోంది ఆత్మసౌందర్యం

మొలకెత్తలేనంటోంది దేశభక్తి బీజాక్షరం

కోట్ల మంది ప్రాణవాయువుల ప్రతిరూపం

సార్వభౌమాధికార దిక్సూచి స్తూపం.

రెపరెపలాడుతోంది స్వేచ్ఛగా తిరంగా

శత్రుదేశాల గుండెల్లోనూ సగర్వంగా

అదే అదే మువ్వన్నెల జెండా

భారతీయుల అండా దండా…..

చండం చండం ప్రచండం

అఖండం అదొ కళాఖండం

చేతికందిన అమృతభాండం

అనంత భావనా సుఖకుండం

అవని ఆనందోబ్రహ్మలకు

అగ్నిఖండం భగ్నగుండం

అడుగడుగునా భయానక గండం

భగభగమండే మార్తాండం

పహరా కాస్తున్న వీరజవాన్లకు

దేశ సంరక్షణ దురంధురులకు

ఆరు రుతువుల్లో ఇదే ఘోష

అతుకు బతుకుల్లో అదే శోష-

రండి రండి కవన బావుటా కాంతి వెంట

మానవతా మత్తును మొత్తుదాం

రండి రండి భువన ఘోష రహదారి వెంట

భవ్యభారతి బాధ్యత తలకెత్తుదాం

త్యాగవిత్తులమై తిరిగి ఈ మట్టిలో మొలకెత్తుదాం

భారత జాతికి కొత్త ఊపిరి పోద్దాం

దేశమాత నొసట సిందూర తిలకాలద్దుదాం

అదిలిద్దాం విదిలిద్దాం ఇక వదిలేద్దాం

పెను నిద్దుర జోగే మొద్దుతనం

తరిమేద్దాం మందబుద్ధి మగతల మాంద్యం

ఈ జాతి ఉత్తేజం జాగృతం చేస్తూ

నిర్నిద్ర నాదాలు వినిపిస్తూ-

కలం నాగళ్లతో

మెదళ్ల  మొదళ్లను దుక్కి దున్ని

విత్తుతున్నారక్కడక్కడా  సాహితీ కర్షకులు

దేశభక్తి బీజాన్ని నాటాలని

మొలకెత్తనీ…మొలకెత్తనీ…

కొత్త సమాజం మొలకెత్తనీ …

నూతన తేజం ప్రసరించనీ

కవన సుధలు వర్షించనీ

జన బాహుళ్యం హర్షించనీ

భరతమాత గర్వించనీ…

                 – డా. కె. సాంబమూర్తి


ఆపరేషన్‌ సిందూర్‌

ఇనుండోల్ల అందరి నోట ఒకటే మాట ఆపరేషన్‌  సిందూర్‌.

బగ్గున మండిన గుండెల్లో మన జవాన్‌ లైరి బహదూర్‌.

మాటేసి మీదికి వస్తే మొగోల్ని  పోటెస్తిరి

మదమెక్కినోళ్లు మతం మార్చుకుని ఖతం జెస్తిరి

నీ ఉగ్రోది చేష్టలను మా ఉగ్ర నరసింహుడు ఊరుక్కుంటడ?

ఆలుబిడ్డలనాథలైతే ఉగ్రకాళి ఉరికిరాద?

ఆ తల్లి సుభద్రగాదూ ఆ భార్య ఉత్తరగాదు.

ఈ తల్లి ఐతాంబ గాదు ఈ ఆలు మాశల గాదు.

బాలసెంద్రుని వలె కయ్యానికి పంపలేదు.

నీ ఉగ్రదానికి నీకు లంకగతే బట్టు గాక.

సిందూర్‌ పేరంటే చాలు లోకానికి కడలు పట్టుగాక.

– గంగరాజు పద్మజ


ఆపరేషన్‌ సిందూర్‌

భారతీయ సంస్కృతి సిందూరం

వివాహితల నొసట సూర్యోదయం

మాంగల్యబలానికి ఇది ఒక చిహ్నం

ప్రతి హిందువుకు ధైర్యాన్నిచ్చే దీపం

భర్త దీర్ఘాయువుకు కారణం సిందూరం

ఎర్రని ఛాయవర్ణరేఖలకు ఇదొక మూలం

నుదుటిపై ఐదోతనాన్ని సూచించే సిందూరం

పుణ్యస్త్రీ గౌరవ సూచిక సిందూరం

పార్వతి ధరించి శివుని మెప్పించిన సిందూరం

దుష్టశక్తులను దూరంజేసేది సిందూరం

అనంతశక్తులకు రూపప్రతిరూపం సిందూరం

దుష్టఆత్మలు రాకుండా కాపాడే సిందూరం

రక్తవర్ణానికి రమ్యమై రంజిల్లు రాగం

అగ్నికీలలను సూచించే అరుణార్ణవం

ఇదియే ‘‘పహల్గాం ఉగ్రచర్యకు’’ ప్రతీకారం

ఈ చర్యకు మూలమే ‘‘ఆపరేషన్‌ సిందూర్‌’’

మే 7వ తేదీ తెల్లవారుజామున సైనికులు

భారత రక్షణదళాలు పాక్‌ గడ్డ మీది

తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసించిన రోజు

మోదీ తెరిచన మూడో కన్నే ‘ఆపరేషన్‌ సిందూర్‌’

ఏప్రిల్‌ 22న బైసారన్‌ ఉగ్రవాద చర్యకు

26 మంది పర్యాటకుల మృతి సంఘటన

భారతావని పాక్‌పై ప్రతిస్పందనమిది

భారతావనికి విజయసూచికమిది

భారతావని పెహల్గామ్‌ మృతులకు

నివాళిని అర్పించే కార్యమిది

– డా. బి. వెంకట్‌


కశ్మీర సిందూరం

భూతల స్వర్గ కశ్మీరం

భారతదేశ ముఖ సింగారం

కుంకుమ పూల సిందూరం

పెహల్గాం శిఖరాగ్ర మయూరం

యాత్రికుల మదిలో మణిద్వీపం

ఆనందాల సందడిలో విహరించే వేళ

దేవదారు వృక్ష ఛాయలలో  ముంచుకొచ్చిన  మృత్యుహేల

ఉగ్రవాద ముష్కరుల మారణ హోమం… మహిళల సిందూరం

కుంకుమ పువ్వుల మడిలో కలిసిన వేళ

హృదయ విదారకం…. రాక్షస ప్రవృత్తి

అభం శుభం తెలియని అమాయకులను మతం పేరిట

మట్టుపెట్టిన ఘోరకలి…

స్పందించిన భరతజాతి, ఆపరేషన్‌ సిందూర్‌

విలయ తాండవంతో ముష్కరులను

తుది ముట్టించిన మహిళా జ్యోతులు

భరతమాత కన్న భాగ్య విధాతలు…..

భరతజాతి ముక్తకంఠంతో

భూమ్యాకాశాలు దద్దరిల్లేలా

జయహో భారత్‌… జయహో సిందూర్‌…

అంటూ విజయ శంఖాలు పూరించింది….

ప్రపంచమంతా స్పందించి

భారత్‌ను అభినందించిన వేళ శత్రుశేషాన్ని తుడిచిపెట్టు

పుణ్యభూమి వర్ధిల్లు… జయహో వీర సైనికా! వందనం నీకు అభినందనం

– సత్యవీణ మొండ్రేటి


పహల్గామ్‌ దాడి సందర్భం పద్యాలు

1)తే.గీ) ఆడ సింహాలు దూకిన నడ్డుకొనెడి

           సత్తు వెవ్వరికున్నది చిత్తు చిత్తు

           చేసికాని వదలరింక చేవ యున్న

           అడ్డుకోండిరా పాకీల అధములార!

2) తే.గీ) స్త్రీల నుదుటిపై సిందూర చెరిపినారు

          క్రొత్త పెండ్లి కూతుళ్లకు గుండెనిండ

          బాధ నింపిన ముష్కర ప్రాణములను

            తీయు ‘‘సిందూర’’ కెదురొడ్డు తెగువ కలదె

3) తే.గీ) వీర వనితల కన్నట్టి వీరమాత

          లందరికి నేడు జోతల నందజేతు

           మేటి సోఫియా, వ్యోమికా మేధకు, ఘన

           శూరతకు కోటి జోతలు, శుభము గల్గు

4)తే.గీ   ఆపరేషను సిందూరమాడపడుచు

           లందరికి నుపశమనము నందజేసె

           మోది చాతుర్య మెంతయో ముదము గూర్చె

           శత్రుదేశము మోదీని శాంతి కొరకు

5)ఉ      భారతమాత గర్భమున భాగ్యవశంబున పుట్టి వీరులై,

            ధీరులు, శూరులై సమర ధీరత చాటిన భీములై సదా

            భారతదేశ రక్షణకు ప్రాణములర్పణ చేయు సైనికుల్‌

            క్రూరులు, నీచశత్రువుల కుత్తుక లన్నియు కోసినారుగా

– గౌరీమల్లిక్‌


వారికి తెల్పుడీ తగిన పాఠము!!

కం :      మోడీకి చెప్పుకొమ్మని

            కేడీగాడొకడు పేల్చె! కీడే మూడెన్‌

            వాడికి, పాక్‌ దేశమునకు

            మోడీ దెబ్బకు వెలవెల బోయురివెధవల్‌!

తే:        శాంతి కాముక భరత దేశంబు పైన

            కక్ష గట్టిన ‘‘వారలు’’ శిక్ష పొందె!!

            దొంగ చాటుగ నుసిగొల్పి ధూర్తుల నిటు

            పంపి, పర్యాటకుల నెల్ల చంపదగునె?

ఉ:        తీయగ పల్కు వారికిట తీరని ద్రోహము జేసి, భాయి భా

            యీ యని భారతీయుల పయిన్‌ కృతకంబగు నెమ్మి జూపి, పా

            కీయులు భారతావనికి కీడు తలంచిరి నీచకర్ములై!

            మా యెద లందు రోషమె యమాంతము పొంగెను బుద్ధి చెప్పగన్‌!!

            వీరజవానులార! అరివీర భయంకరులై చెలంగుడీ!!

            పోరును సల్పుడీ భరతభూమిని యెవ్వడు చొచ్చుకొచ్చినన్‌!

            వారికి తెల్పుడీ తగిన పాఠము, న్యాయము తప్పి, శాంతికిన్‌

            యారని మంటబెట్టిన దురాత్ముల గుండెల మంట బెట్టుడీ!!

            మాకిది కొత్తగాదు, యసమాన పరాక్రమ ధైర్య శౌర్యముల్‌

            చేకొని శాత్రవాధముల శీర్షములన్‌ దునుమాడుటన్నచో!!

            మాకు లభించె మా చరిత మందు లిఖింప మరొక్కమారు, దు

            ర్భీకర శాత్రవ స్ఫురభేద్యము మా భరత స్థలంబుగన్‌!!

– కవిమిత్ర…


భారత ప్రశస్తి

సీ॥       వేదశాస్త్ర పురాణ విజ్ఞాన మన పాల

                        బిడ్డల పెంచిన ప్రియ పురంధ్రి!

            సర్వసమానతా సద్భావనామృత

                        దానమొనర్చిన ధన్యచరిత!

            బ్రహ్మ విద్యావ్యాప్తి బహు ఖండవాసుల

                        సంస్కరించిన విశ్వసన్నుతాంగి!

            సత్యధర్మత్యాగ శాంతి ప్రేమల భవ్య

                        పాఠాలు నేర్పిన పంతులమ్మ!

తే॥       నీవు పరతంత్రమున్‌ వీడి నేటివరకు

            పెక్కువత్సరాల్‌ గడిచెను, ప్రేమ మీర

            పులకరింపగ నా మేను తలచి తలచి

            వందనము జేతు గొనుమమ్మ భారతాంబ!

సీ॥       ఒక తోటలో బుట్టి యెప్పెడి వేర్వేరు

                        వృక్ష సంతానంబు విధముగాను,

            భిన్న జాతుల పక్షి బృందంపు విహరణ

                        స్థలమై తనర్చెడి సరసివోలె,

            బహువరయుక్తమై భాసిల్లుచున్‌ మింటు

                        కనిపించు నింద్రుని ధనువు వోలె

            భిన్నమతముల, కులముల, భిన్న భాష

            లను వచించెడి జనముల గనిన దివ్య

            భరతదేశంబనైక్యతా భావ రహిత

            మగుచు సమత, భ్రాతృత్వ స్వేచ్ఛాది సుగుణ

            రాజి వెలుగొందుగాక దూతలోన

చం॥    తనవలెనన్ని ప్రాణాలు, సుదారముగా గన, నన్యదారలన్‌

            జననుల వోలెగాంచ, పరసంపద మట్టి విధానగాంచుచున్‌

            మనుడని చెప్పె భారత సనాత ధర్మము, ధర్మమార్గ వ

            ర్తనులయి, జీవితమ్ములు కరంబుగ సార్థకతం గడపగన్‌

చం॥    ఇతరుల సంపదల్‌ బడయ నెన్నడు యుద్ధమా చేయబోదు కు

            త్సితమతి భారతం చొరులు చేటొనరింపగ భీరువట్లు ని

            ర్గతి ధృతి నూరకుండదు పరాక్రమమమొప్ప గజంబు గూల్చను

            ద్ధతి చెలరేగు సింగమయి ధాత్రిని గూల్చును శాత్రవావళిని.

ఉ॥      వీడి మనుష్య ధర్మమును వెక్కసమౌ మతభేద భావనన్‌

            వాడిగ కాల్చివేయుచును భామినులున్‌ బ్రతిమాలు చుండినన్‌

            వీడక రాక్షసత్వమున వీడగ నాత్మలనెంచి చెప్పుడీ

            మోడికటంచు పల్కి ఫలమున్‌ చవిచూచుటయయ్యె చేలలై

కం॥     సిందూరముతో మిమ్ము మ

            దాంధుల దునిమితిమ ప్రథమ యత్నమె, యుక్తిన్‌

            బొందల పెట్టిన మము మరి

            యెందుంగన మీకు బూడిదే మిగులు సుమీ!

– ముద్దురాజయ్య

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE