10 జూలై వ్యాస పూర్ణిమ
గురువంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. గురు ఆరాధన దేవతారాధన కంటే గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. ‘గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’ అంటూ గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపునిగా ఆరాధించడం భారతీయ సంప్రదాయం. జన్మనిచ్చిన తల్లిని, హితాన్ని చేకూర్చే తండ్రిని, జ్ఞానాన్ని పంచిన గురువును పూజించమంటోంది మన భారతీయ సంస్కృతి. ఆ ‘మూర్తిత్రయం’కు గురుపూర్ణిమ సందర్భంగా అక్షరాంజలి.
విజ్ఞానం, లౌకిక జ్ఞానాలను సమన్వయ పరచి శిష్యుడికి దిశానిర్దేశం చేసేవాడే గురువని, దృఢమైన మానసిక సంకల్పం, శక్తిమంతమైన వాక్కు, వాత్సల్యంతో కూడిన స్పర్శ ఆయన ప్రధాన లక్షణాలని ఆర్యోక్తి. జ్ఞానంలో నిష్ణాతుడు, అసూయ లేనివాడు, నిరాడంబర జీవనం సాగించేవాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు నిజమైన గురువని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచారవంతుడు, మంచి వేషధారణ కలవాడు, గౌరవ నీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రాలలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు గురువు అనిపించుకుంటాడని (‘శాంతో దాంతః కులీనశ్చ వినీత శుద్ధవేషవాన్/శుద్ధాచార సుప్రతిష్ఠః శుచిర్దక్షః సుబుద్ధిమాన్/ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః/ నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే’) శాస్త్రం చెబుతోంది. అలాంటి వారు పరిమితంగానే కనిపిస్తారు కనుకే గురు శబ్దానికి అంత ప్రత్యేకత. అలాంటి సర్వలక్షణ సమన్వితుడు కనుకే వ్యాస భగవానుడి పేరిట ఆషాఢ పౌర్ణమి ‘గురు పూర్ణిమ’గా ఆవిర్భవించింది. ఆయన గురువులకు గురువని భారతీయల విశ్వాసం.
అపారమైన తన రచనల ద్వారా ధర్మనిరతిని ప్రబోధించిన వ్యాసుడిని భారతీయ ఆధ్యాత్మిక ఆచార్యుల ప్రధాన ప్రతినిధిగా పూజిస్తారు. ‘వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం’ అన్నారు. ప్రాచీన ఆధునిక వాఙ్మయానికంతటికి వ్యాస వాఙ్మయమే మూలంగా చెబుతారు. వేదవిభజన చేసి, అష్టాదశ పురాణాలను, మహా భారతాన్ని రాసిన ఆయన లోకకల్యాణం కో•సం ఆ వాఙ్మయాన్ని శిష్యులు పైల, సమంత, జైమిని, వైశంపాయనుల ద్వారా ప్రచారం చేయించారు. తన కుమారుడు శుకమహర్షి ద్వారా భాగవతాన్ని, సూత ముని ద్వారా పురాణ గాథలను ప్రచారం చేయించి సమాజంలో నైతిక, ధార్మిక విలువలను పెంపొందిం చారు.
‘గు కారో అంధకారశ్చ రు కారో తన్నిరోధకః’-అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమార్గం వైపు మళ్లించేవాడు గురువు అని అర్థం. ఆయన బ్రహ్మనిష్ఠుడు. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కపటుడు అయి ఉండాలి. సూర్యుడు అందరికి సమానంగా వెలుగునిచ్చినట్లు గురువు శిష్యుల పట్ల సమాన వాత్సల్యం, కృప కలిగి ఉండాలి. శిష్యుడూ.. శంకరులు చెప్పినట్లు ‘అవినయ మపనయ విష్ణోః’-‘నా అవినయాన్ని తొలగించి, వినయం నేర్పించు’ అని వినయశీలురై గురువును సేవించాలి. గురువే ప్రత్యక్ష దైవం అనే నమ్మకంతో అనుసరించేవాడే శిష్యుడు. అతనికి గురు, దైవ సన్నిధుల మధ్య వ్యత్యాసం తెలియదు. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుని చదువు విషయం ప్రస్తావించినప్పుడు ‘చదివించిరి నను గురువులు/చదివితి ధర్మార్థ ముఖ్యశాస్త్రములు..’ అని ప్రారంభించడంలో ప్రహ్లాదుడి గురుభక్తి వ్యక్తమవుతోంది. గురువులు బాగా బోధించబట్టే ఇన్ని విద్యలు నేర్చాను తప్ప, తాను బాగా చదివానని, అంతా తన గొప్పదనం, ప్రతిభేనని చెప్పుకోలేదు. అదీ గురుభక్తి. ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన లక్షణంగా చెబుతారు.
యాగ రక్షణకు బయలుదేరిన శ్రీరాముడితో గురువు విశ్వామిత్రుడు, తమకు తారసిల్లిన తాటకను వధించవలసిందిగా ఆదేశించాడు. ‘స్త్రీవధ మహా పాపం’ అన్నది శ్రీరాముడికి చదువు నేర్పిన సంస్కారం. కానీ గుర్వాజ్ఞను శిరసా వహించాడు. అంతకు ముందే ‘మహర్షిని అనుసరిస్తున్న రాముడితో ‘ముని ఆదేశాన్ని శిరసావహించు’ అన్న తండ్రి దశరథుడి హితవును, గురువు వాక్యాన్ని శిరోధార్యంగా భావించి, తాటక స్త్రీ అయినా పరిమార్చాడు. అయినా మౌని వద్ద తన సందేహాన్ని వ్యక్తం చేసి, ధర్మసూక్ష్మాలు తెలుసు కున్నాడు. ‘సత్యాన్న ప్రమదితవ్యం’.. (సత్యం నుంచి తొలగిపోకు. ఎల్లప్పుడూ సర్వలోక హితకరమైన పనులే చేయడానికి ప్రయత్నించు’ అని బోధించాడు విశ్వామిత్రుడు.కానీ కొన్ని సందర్భాల్లో పరస్పర విరుద్ధ పనులూ చేయవలసి ఉంటుంది. తాటక సంహారం అలాంటిదే. రాజులు, రాజకుమారులు, ఉన్నతాధి కారంలోని వారు తప్పక విశేష ధర్మాన్నే ఆచరించాలి’ అని ధర్మసూక్ష్మం బోధించాడు కౌశికుడు.
సద్గురువును ఎలా సేవించాలి? ఆయన నుంచి జ్ఞాన సంపదను ఎలా పొందాలి? అనే దానిని జగద్గురువు గీతాచార్యుడు చెప్పాడు.
‘తద్వద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శినః’
(మహనీయులైన గురువులకు పాదాభివందనం చేసి తన మనస్సులోని సందేహాలను సవినయంగా విన్నవించి, సునిశిత ధర్మసూక్ష్మాలను గ్రహించి, సత్ఫలితాలు పొందే మార్గం తెలుసుకోవాలి.) ఆదిశంకరులు ధర్మదండధారులై ధర్మరక్షణ కోసం తన శిష్యులను పీఠాధిపతులుగా చేసి ఒక పరంపరను ప్రవేశపట్టారు. ఆ పీఠాల మాధ్యమంగా ధర్మప్రబోధం, ధర్మ ప్రచారం నేటికీ కొనసాగుతోంది.
‘గోవిందుడు, గురువు సాక్షాత్కరిస్తే మొదట గురువుకే నమస్కరిస్తాను. గురువు ద్వారానే గోవిందుడిని చూస్తాను’ అన్నాడు కబీరు.
దైవం నుంచి గురువును చూపలేకపోవచ్చేమో కానీ గురువు నుంచి దేవుడిని దర్శించవచ్చన్నది పెద్దల మాట. నూరుగురు సూర్యులు, నూరుగురు చంద్రులు ఉదయించినా తొలగని అజ్ఞానాంధకారం విద్వాంసులు, విజ్ఞులైన గురువుల ఉపదేశంతో పటాపంచలవుతుందంటారు. అయితే ‘కేవలం పాండిత్యం వల్లనే ఉత్తమ గురువు కాలేరు. తగు పాండిత్యం ఉన్నా శిష్యులకు ఎలా నేర్పుగా బోధించాలో తెలిసిన వాడే ఉత్తమ గురువు. ఉత్త మత్వాన్ని నిర్ణయించేది బోధనాశక్తే కానీ పాండిత్యం కాదు’ అన్నది కవికులగురువు మహాకవి కాళిదాసు భావన తరతరాల గురువులక• ఆదర్శనీయం.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్