అం‌తరిక్షం 1991లో గల్ఫ్ ‌యుద్ధం నాటి నుంచి ఒక యుద్ధక్షేత్రంగా రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఇటీవల ప్రపంచమంతటా చోటు చేసుకున్న ఘర్షణలు రోదసీని ఒక కీలకమైన రణరంగంలా తీర్చిదిద్దాయి. అంతరిక్షం నుంచి గూఢచర్యం చేయవచ్చు. నిఘా పెట్టవచ్చు. కావలసిన దానిని లక్ష్యంగా చేసుకోవచ్చు. కమ్యూనికేషన్లు పెంచుకోవచ్చు. నావిగేషన్‌ ‌ద్వారా వైరిపక్షం ఆనుపానులు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్న తర్వాత గురిపెట్టడానికి అంతరిక్షంలో సరైన చోటు చూసుకోవచ్చు. ఇలా స్వీయ భద్రత, శత్రువు నుంచి ముంచుకువచ్చే ముప్పు తదితర అంశాలకు సంబంధించిన ఎన్నో పనులను రోదసి నుంచి చక్కపెట్టుకోవచ్చు. అందుకనే అంతరిక్షం మీద మంచి పట్టు సంపాదించుకున్న దేశాలు దానిని సైనిక ఘర్షణలకు ఒక వేదికగా చూడటం మొదలుపెట్టాయి.

ఇప్పటిదాకా యుద్ధాలకు అనువుగా ఉన్న నింగి, నేల, నీరు కన్నా కూడా వాటికంటే ఎంత ఎత్తులో ఉన్న రోదసిలో సొంత స్థావరాలను నిర్మించుకునే పనిలో పడ్డాయి. అంతరిక్షాన్ని సైనికీకరణ చేస్తున్నాయి. కౌంటర్‌ ‌స్పేస్‌ ‌టెక్నాలజీ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నాయి. ఆ క్రమంలో అంతరిక్షాన్ని సైనిక కార్యకలాపాలకు వాడుకోవాలనుకునే దేశాలకు కౌంటర్‌స్పేస్‌ ‌వ్యూహాలు ఎంతో అవసరమైపోయాయి. ఇదే విషయాన్ని సెక్యూర్‌ ‌వరల్డ్ ‌ఫౌండేషన్‌ ‌తన 2025 ఎడిషన్‌ ‌నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది. రోదసీలో నానాటికి పెరిగిపోతున్న కౌంటర్‌స్పేస్‌ ‌బెడదలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 దేశాలు కౌంటర్‌స్పేస్‌ ‌సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో తలమునకలై ఉన్నాయి. అంతరిక్షం రోజురోజుకూ ఇరుకైపోతూ వివాదాస్పదమైన ప్రాంతంగా మారిపోతోంది. దీంతో రోదసిపై పట్టుసాధించడానికి దేశాలు నువ్వా? నేనా? అంటూ పోటీపడుతున్నాయి. ఈ పోటీ కాస్త కౌంటర్‌స్పేస్‌ ‌సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి దారి తీస్తోంది. అలా అభివృద్ధి చేసుకున్న సామర్థ్యాలతో అంతరిక్షంలో ప్రత్యర్థుల వ్యవస్థలను మభ్యపెట్టవచ్చు, వాటికి అడ్డుపడవచ్చు. వాటిని తోసిరాజనవచ్చు. మరీ అవసరమనుకుంటే అలాంటి వ్యవస్థలను అక్కడిక్కడే నామరూపాల్లేకుండా చేయవచ్చు.

ఇప్పటివరకు భూమి ఉపరితలానికి మాత్రమే పరిమితమైన కౌంటర్‌స్పేస్‌ ‌సామర్థ్యాలను ప్రచ్ఛన్నంగా వాడుకుంటున్నారు. నాన్‌ ‌కైనెటిక్‌ ఎత్తుగడలైన జామింగ్‌ ‌వంటి వాటిని ప్రస్తుతం సైనిక కార్యకలాపాల్లో చురుకుగా వినియోగిస్తున్నారు. అయితే కాలం గడిచే కొద్దీ, సాంకేతికత కొత్త పుంతలు తొక్కే కొద్దీ కైనెటిక్‌ ఎత్తుగడలతో పాటుగా దెబ్బకు దెబ్బ తీసే కౌంటర్‌ ‌సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రపంచదేశాలు వేగిరపడుతున్నాయి. కౌంటర్‌ ‌స్పేస్‌ ‌సామర్థ్యాలను ఎలక్ట్రానిక్‌ ఆయుధాలు- ఎలక్ట్రానిక్‌ ‌వార్‌ఫేర్‌-ఈడబ్ల్యూ, కైనెటిక్‌ ఆయుధాలు, డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆయుధాలు అని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఇవి భూమి ఆధారంగా లేదా రోదసి ఆధారంగా పనిచేస్తాయి.

కౌంటర్‌స్పేస్‌ ‌సామర్థ్యాలు జామింగ్‌ ఆపరేషన్స్ :

ఇవి ఉపగ్రహాల కమ్యూనికేషన్‌ ‌లింకులను (అప్‌లింక్‌, ‌డౌన్‌లింక్‌) ‌జామ్‌ ‌చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్లను వాడుకుంటాయి. అమెరికా, చైనా, రష్యా దేశాలకు పటిష్టమైన ఈడబ్ల్యూ సామర్థ్యాలు ఉన్నాయనే పేరు ఉంది. ఇటీవల రష్యా ‘కళింక’ అనే సిస్టమ్‌ను ఉపయోగించి ఉక్రెయిన్‌లో స్టార్‌ ‌లింక్‌ ‌సిగ్నళ్లను జామ్‌ ‌చేసింది. అదేసమయంలో స్టార్‌ ‌లింక్‌ ‌సిగ్నళ్లను వాడుకోని సిస్టమ్‌లు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టింది. రష్యాకు ఇప్పటికైతే పటిష్టమైన కౌంటర్‌స్పేస్‌ ‌జామింగ్‌ ‌సామర్థ్యాలు ఉన్నట్టు కనిపిస్తోంది. వాతావరణ వివరాలను సేకరించ డానికి, కమ్యూనికేషన్ల కోసమని వినియోగించే ఉపగ్రహాల్లో అత్యధికం జియోసింక్రోనస్‌ ‌కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. దీంతో చైనా తన జామింగ్‌ ‌సామర్థ్యాలను పరీక్షించుకోవడం కోసమని అదే కక్ష్యలో ఒక ఉపగ్రహాన్ని మోహరించింది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా కౌంటర్‌ ‌కమ్యూనికేషన్ల సిస్టమ్‌-‌సీసీఎస్‌ను ఏర్పాటు చేసింది. సీసీఎస్‌తో కమ్యూనికేషన్ల ఉపగ్రహాల జామింగ్‌ను అప్‌లింక్‌ ‌చేస్తోంది. అయితే అంతరిక్షంపై పట్టు సాధించడానికి పోటీ పడుతున్న దేశాలు తమ ఉపగ్రహాలు ఎలాంటి జామింగ్‌కు గురికాకుండా అందుకు దీటైన సామర్థ్యాన్ని సైతం పెంపొందించుకుంటున్నాయి.

యాంటీ శాటిలైట్‌ ‌సామర్థ్యం-ఏశాట్‌:

ఇం‌దులో వినియోగించే ఆయుధాలు మూడు రకాలుగా ఉంటాయి. ప్రత్యక్ష ఆరోహణ పూర్వక కైనెటిక్‌ ‌కిల్‌ ‌వాహనం వీటిలో మొదటిది. ఇది బాలెస్టిక్‌ ‌క్షిపణిని ప్రయోగించే వాహనాన్ని వాడుకొని తనకు అప్పగించిన పని ని చక్కబెడుతుంది. ఇక రెండవది కో-ఆర్బిటల్‌ ‌కైనెటిక్‌ ‌కిల్‌. ఇది సొంత ఉపగ్రహాన్ని వాడుకుంటుంది. చివరగా మూడవది అంతరిక్ష నౌక. ఇవన్నీ కూడా భూమికి సమీపంలోని కక్ష్య-లియో లేదా భూస్థిర కక్ష్య-జియోలో లక్షిత ఉపగ్రహాన్ని నిర్వీర్యం చేస్తాయి. అమెరికా, రష్యా, చైనా, భారత దేశాలకు ప్రత్యక్ష ఆరోహణ ఏశాట్‌ ‌సామర్థ్యం ఉంది.

సమీప కక్ష్యల్లో కార్యకలాపాలు- కో-ఆర్బిటల్‌ ఆపరేషన్లు:

అమెరికా, రష్యా, చైనా దేశాలు కో-ఆర్బిటల్‌ ఆపరేషన్లను చేయడానికి అవసరమైన కొన్ని సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. చైనా, రష్యా దేశాలు అంతరిక్షంలో తమ నిర్దిష్టమైన, సామీప్యమైన కార్యకలాపాలు-ఆర్‌పీవోలను చురుగ్గా పరీక్షించు కుంటున్నాయి. సాధారణంగా ఆర్‌పీవోలు కైనెటిక్‌ (‌దాడి చేయడం ద్వారా నిర్మూలించడం), నాన్‌-‌కైనెటిక్‌ (‌పరిశీలించడం, దారికాయడం) గానూ ఉంటాయి. అమెరికా అయితే వచ్చే ఏడాదికి అంటే 2026కు పెద్ద పథకమే వేస్తోంది. ఆ దేశం లియోలో ఉన్న పేలోడ్‌లు లేదా ఉపగ్రహాలను ఇతర కక్ష్యలోకి త్వరితగతిన వెళ్లడాన్ని పరీక్షించనుంది. అమెరికన్‌ ‌స్పేస్‌ ‌ఫోర్స్ ఇం‌టెలిజెన్స్ ‌నివేదిక ప్రకారం చైనా ఈ ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్‌ ‌మధ్యకాలంలో మూడు షియాన్‌-24‌సీ ఉపగ్రహాలు, రెండు షిజాన్‌ ‌సిరీస్‌ ఉపగ్రహాలను కలుపుకొని మొత్తం ఐదు ఉపగ్రహాలతో అంతరిక్షంలో ఆర్‌పీవో చేపట్టింది. ఈ ఉపగ్రహాలు అనేక కక్ష్యల్లో ఆర్‌పీవో కార్య కలాపాలను చేపడతాయి. అలా చేపట్టే కార్యక్రమాల్లో నిర్దేశిత కక్ష్యల్లో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలను పక్కకు తప్పించి, దారి మళ్లించే పని కూడా ఉంటుంది. రష్యా ఆర్‌పీవో లక్ష్యాల కోసమని లియోలో అత్యంత వేగంగా పరిభ్రమించే రెండు ఉపగ్రహాలను మోహరించింది. ఆ దేశం ఉపగ్రహాలపై గూటిలోని బొమ్మ విధానాన్ని కూడా పరీక్షించింది. ఈ విధానంలో ఒక చిన్న ఉపగ్రహం ఒక పెద్ద ఉపగ్రహం నుంచి రోదసిలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అది కౌంటర్‌ ఉపగ్రహ కార్యకలాపాలను చేపడుతుంది. మిగిలిన మూడు దేశాలు ఆర్‌పీవో చేపట్టినప్పటికీ అవి ఇప్పటివరకు సమీప కక్ష్యలో కైనెటిక్‌ ఏశాట్‌ను వాడుకున్న దాఖలాలైతే లేవు. ఫ్రాన్సు సైతం ఆర్‌పీవో కోసమని ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ కార్యక్రమం లక్ష్యం బెడదగా పరిణమించిన ఉపగ్రహాల కోసం తీవ్రంగా వెదకడం, ఆ తర్వాత వాటిని దీటుగా ఎదుర్కోవడం. ఇదిలా ఉండగా అమెరికా, చైనా దేశాలు నిర్దేశిత కక్ష్యల్లోకి పేలోడ్‌లను విడుదల చేసే ఎక్స్37‌బీ, షెన్‌లోంగ్‌ అనే అంతరిక్ష విమానాల పనితీరునూ పరీక్షించాయి.

డైరెక్డెడ్‌ ఎనర్జీ ఆయుధాలు-డీయీడబ్ల్యూలు:

డైరెక్డెడ్‌ ఎనర్జీ ఆయుధాలు అధునాతన పోకడలతో కౌంటర్‌స్పేస్‌ ‌కార్యకలాపాలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కౌంటర్‌స్పేస్‌ ‌కార్యకలాపాలకు హై-ఎనర్జీ లేజర్లు, హై-పవర్‌ ‌మైక్రోవేవ్‌లను వినియోగించుకుంటారు.డీయీడబ్ల్యూలు సెన్సర్లను పనిచేయకుండా చేస్తాయి. హై-ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్‌లు ఉపగ్రహ కమ్యూనికేషన్‌ను జామ్‌ ‌చేయగలవు. అత్యంత శక్తిమంతమైన లేజర్లు ఉపగ్రహాలను ఎందుకూ పనికిరాని విధంగా మారుస్తాయి.

రష్యా భూమి కేంద్రంగా, సాగర జలాల్లో నౌక కేంద్రంగా పనిచేసే లేజర్లను అభివృద్ధి చేస్తోంది. ఈ లేజర్లు సెన్సర్లు, ఉపగ్రహాలను జామ్‌ ‌చేయగలవు. అదే సమయంలో వాటిని నిర్వీర్యం కూడా చేయగలవు. అమెరికా అనేక సంవత్సరాలుగా భూమి కేంద్రంగా పనిచేసే లేజర్ల అభివృద్ధిపై కసరత్తు చేస్తోంది. చైనా పోతున్న పోకడలను చూస్తే అది సమీపకాలంలో అంతరిక్షం కేంద్రంగా పనిచేసే డీయీడబ్ల్యూలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. రష్యా సైతం భూమి ఆధారిత లేజర్‌ ‌వ్యవస్థలను కలిగి ఉంది. ఆ దేశం లియోలో ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడానికి పనికి వచ్చే గగనతల లేజర్‌ ‌వ్యవస్థ అభివృద్ధి పైన కూడా గట్టి కసరత్తు చేస్తోంది.

సైబర్‌ ‌దాడులు:

అంతరిక్షంలో కార్యకలాపాలు పూర్తిగా సైబర్‌ ‌పైన ఆధారపడి ఉన్నాయి. స్పేస్‌ ‌భద్రత, సైబర్‌ ‌భద్రత నెమ్మదిగా విలీనమైపోతున్నాయి. రోదసీలో వ్యవస్థలపై గ్రౌండ్‌ ‌స్టేషన్లు, డేటా రిలే సెంటర్లు సైబర్‌ ‌దాడులు చేయవచ్చు. మిగిలిన దాడులతో పోల్చి చూసినప్పుడు ఈ దాడులకు పెద్దగా ఖర్చు ఉండదు. ఈరకమైన దాడులను చాలా వేగంగా చేయవచ్చు. దాడులు ఎవరు చేసిందీ కనిపెట్టడమూ కష్టమే. సర్వసాధారణంగా రోదసిలో సైబర్‌ ‌దాడులు జరిగాయనేందుకు ఎలాంటి ఆధారాలు ఉండవు. అయితే ప్రత్యర్థి దేశాలు, ప్రభుత్వేతర సంస్థలు ఇలాంటి దాడులకు తెగబడుతుంటాయి. సాధారణంగా మిలటరీ ఉపగ్రహాలు, భూమి నుంచి వాటికి మద్దతు ఇచ్చే వ్యవస్థలు ఈ దాడులకు తట్టుకొని నిలబడు తుంటాయి. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసమని వినియోగించే ఉపగ్రహాలపై దాడి జరిపేందుకు లెక్కకు అందనన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. ప్రపంచ దేశాలు ఈ ప్రయత్నాలకు సంబంధించిన ఒక సమాచార నిధిని సమకూరుస్తాయి. ఆ నిధిని మిలటరీ ఉపగ్రహాలు లేదా ఏకకాలంలో అనేక కార్యకలాపాలను చేపట్టే ఉపగ్రహాలను దాడుల నుంచి కాపాడుకోవడానికి వినియోగిస్తుంటారు. ప్రస్తుతం మనం సైబర్‌ ‌సెక్యూరిటీలో అనుసరించే విధానాన్ని క్వాం•మ్‌ ‌కంప్యూటింగ్‌, ‌క్రిప్టోగ్రఫీ అందిపుచ్చుకున్న అధునాతన సాంకేతికత పూర్తిగా మార్చివేస్తుంది.

స్పేస్‌ ‌సిట్యుయేషనల్‌ అవేర్‌నెస్‌-ఎస్‌ఎస్‌ఏ:

అం‌తరిక్షం ఉపగ్రహాలు, తదితర పేలోడ్‌లతో నానాటికి కిటకిటలాడిపోతూ వివాదాస్పదమైపోతున్న తరుణంలో స్పేస్‌ ‌సిట్యుయేషనల్‌ అవేర్‌నెస్‌-ఎస్‌ఎస్‌ఏ ‌మిలటరీ కార్యకలాపాల్లో ప్రాముఖ్యతను పొందింది. ఎస్‌ఎస్‌ఏ అం‌టే రోదసీలో ఉండేవాటిని ఎప్పటి కప్పుడు గమనిస్తూ వాటి స్థితిగతులను అంచనా వేయడం. అయితే ఏకకాలంలో రెండు విధాలుగా కార్యకలాపాలను చేపట్టే ఉపగ్రహాలు ఎస్‌ఎస్‌ఏ ‌పనితీరును సవాల్‌ ‌చేస్తున్నాయి. అదేసమయంలో ఎస్‌ఎస్‌ఏ ‌కౌంటర్‌ ‌స్పేస్‌ ‌కార్యకలాపాలకు ఒక పైట్‌గా పనిచేస్తుంది.

అమెరికా అత్యంత అధునాతనమైన ఎస్‌ఎస్‌ఏను కలిగి ఉందని సమాచారం. అమెరికా ఎస్‌ఎస్‌ఏ ‌పెద్ద సంఖ్యలో భూమిపైన రాడార్లు, టెలిస్కోపులు, రోదసి ఆధారిత రాడార్లపై ఆధారపడి ఉంటుంది. ఎస్‌ఎస్‌ఏ ‌సంతరించుకున్న దేశాలు వాటి మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాల నుంచే అందే ఇన్‌పుట్‌లతో ఆ సామర్థ్యాన్ని మరింతగా వృద్ధి చేసుకుంటాయి. రష్యా కూడా లియోలో ఉపగ్రహాలను పర్యవేక్షించే పటిష్టమైన ఎస్‌ఎస్‌ఏ ‌వ్యవస్థను కలిగి ఉంది. చైనా సైతం ఎస్‌ఎస్‌ ఏ ‌నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నప్పటికీ అది ప్రాథమికంగా తన సొంత సరిహద్దులపై ఆధారపడి ఉంది. దాంతో దాని సామర్థ్యం అమెరికాతో పోల్చినప్పుడు పరిమితంగానే ఉంటుంది. చైనా ఈ పరిమితిని అధిగమించడానికని కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపిస్తోంది. భారత్‌, ‌ఫ్రాన్సు, ఇజ్రాయెల్‌, ‌తదితర దేశాలు మౌలికమైన ఎస్‌ఎస్‌ఏ ‌సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

భారత్‌ ‌స్థానం

భారత ప్రభుత్వం ఇటీవల అంతరిక్షం ఆధారిత నిఘా-3 పోగ్రామ్‌కు ఆమోదం తెలిపింది. డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌చీఫ్‌ ‌జనరల్‌ అనిల్‌ ‌చౌహాన్‌ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ త్వరలో కొత్త అంతరిక్ష విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌ ‌విషయానికి వచ్చేసరికి రోదసీలో గూఢచర్యం, నిఘా, నిశిత పరిశీలన-ఐఎస్‌ఆర్‌లో పరిమితమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతీయ ప్రాంతీయ గమనాగమన ఉపగ్రహ వ్యవస్థ-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సముదాయానికి మొదటగా 12 ఉపగ్రహాలను అందించాలని ప్రణాళిక చేశారు. కానీ వాటిలో ఐదు ఉపగ్రహాలు మాత్రమే పూర్తిగా సేవలను అందిస్తు న్నాయి. ప్రస్తుతం ఒక ప్రభావితమైన ఐఎస్‌ఆర్‌ ‌కోసమని, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సముదాయాన్ని పూర్తిచేయ డానికి సరిపడినంత సంఖ్యలో ఉపగ్రహాలను మోహరింపజేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ది సెక్యూర్‌ ‌వరల్డ్ ‌ఫౌండేషన్‌ ‌నివేదిక ప్రకారం భారత్‌కు లియోలో కైనెటెక్‌ ఏశాట్‌, ఈడబ్ల్యూ, ఎస్‌ఎస్‌ఏలలో కొంతమేరకు సామర్థ్యం ఉంది. మార్చి 27,2019న భారత్‌ ‘‌మిషన్‌ ‌శక్తి’ పేరిట కైనెటిక్‌ ఏశాట్‌ను విజయవంతంగా పరీక్షించింది. భూమికి దగ్గర్లోని ఒక కక్ష్యలో బాలిస్టిక్‌ ‌మిస్సైల్‌ ఇం‌టర్‌సెప్టర్‌ ‌పీడీవీ ఎంకే-2 ను ప్రయోగించి నిరుపయోగంగా ఉన్న ‘మైక్రోశాట్‌-ఆర్‌’ అనే భారతీయ ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది.

జనవరి 16, 2025న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో స్పేస్‌ ‌డాకింగ్‌-‌స్పాడెక్స్ ‌ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. రెండు వ్యోమనౌకలను డాక్‌, ‌డీ-డాక్‌ ‌చేయడంలో భారత్‌ ‌సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ప్రయోగం భూమికి సమీపంలోని కక్ష్యలో రక్షణ్మాతక, తెగువతో కూడుకున్న కౌంటర్‌స్పేస్‌ ఆపరేషన్లలో ఆర్‌పీవోకు అగ్రగామి అవుతుంది. కౌంటర్‌స్పేస్‌ ఆపరేషన్లకు అదనపు బడ్జెట్‌, ‌వనరులు కావాలి. ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ స్పేస్‌ ‌పోగ్రామ్‌కు సమాంతరంగా కౌంటర్‌స్పేస్‌ ‌సామర్థ్యం పెంపుదలలో పురోగతి సాధించాలి. భారత్‌ ‌మిలటరీ ఆపరేషన్లలో విజయం సాధించాలంటే అంతరిక్షంలో మన ఆస్తులను భద్రంగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందు కోసమని స్పష్టత కలిగిన విశ్వసనీయమైన కౌంటర్‌స్పేస్‌ ‌సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఏశాట్‌, ‌స్పేస్‌ ‌డాకింగ్‌ ‌లాంటి పరీక్షలు లాంటి చిన్న చిన్న అడుగులు నమ్మకపు తీరానికి చేరుస్తాయి. కానీ స్పష్టమైన ఎస్‌ఎస్‌ఏతోనే అవి విజయవంతమవుతాయి. కనుక భారత్‌ ఏశాట్‌, ‌కో-ఆర్బిటల్‌ ‌సిస్టమ్స్, ఈడబ్ల్యూలు (భూమి ఉపరితం నుంచి రోదసికి, రోదసి నుంచి రోదసికి), డీయీడబ్ల్యూలు లాంటి అనేక ఆయుధాలను తన అమ్ములపొదిలోకి చేర్చుకోవాలి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్సు లాంటి మిలటరీ దిగ్గజాలు అంతరిక్షాన్ని ఒక యుద్ధక్షేత్రంగా గుర్తించాయి. ఆ దేశాలు తదనుగుణంగా స్పేస్‌ ‌విజన్‌, ‌స్పేస్‌ ఆపరేషన్లను అమలు చేయడానికి స్పేస్‌ ‌బలగాలు లేదా స్పేస్‌ ‌కమాండ్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. 2019లో భారత్‌ ‌డిఫెన్స్ ‌స్పేస్‌ ఏజెన్సీ-డీఎస్‌ఏను ఒక త్రివిధ సేవల ఏజెన్సీగా నెలకొల్పింది. డీఎస్‌ఏ ‌ప్రస్తుతం పరిమితమైన మానవ వనరులతో, అధికారాలతో పనిచేస్తోంది. ఈ ఏజెన్సీ పరిధిని విస్తృతపరిచి, దాన్ని ఒక స్పేస్‌ ‌కమాండ్‌గా ఉన్నతీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ నేపథ్యంలో అంతరిక్షం ఒక పూర్తి స్థాయి యుద్ధక్షేత్రంగా రూపాంతరం చెందుతోంది. రోదసిలో మిలటరీకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. అంతరిక్షంలో చోటు కోసమని అంతకంతకూ పెరిగిపోతున్న గిరాకీ భారత్‌కు అనేక అనుకూలతలను తెచ్చిపెడుతోంది. భారత్‌ ‌విశ్వసనీయమైన కౌంటర్‌స్పేస్‌ ఆపరేషన్‌ల ద్వారా రోదసిలో తన ఆస్తులను కాపాడుకోగలిగే సామర్థ్యాన్ని సృష్టించుకుంటుంది. అయితే ఇది ఏదో ఒక సామర్థ్యాన్ని తెచ్చిపెట్టు కోవడంతో అయ్యే పనికాదు. మిషన్లను విజయ వంతంగా చేపట్టడంలో రకరకాల ప్రత్యామ్నాయా లతో కూడుకున్న సామర్థ్యాన్ని సృష్టించుకోవాలి. కౌంటర్‌స్పేస్‌ ‌సామర్థ్యాల విషయానికి వచ్చేసరికి చైనా భారత్‌ ‌కన్నా ముందంజలో ఉంది. అయితే ఇక్కడ విషయం చైనాతో పోటీపడటం గురించి కాదు. ముంచుకొచ్చే ముప్పులను దీటుగా ఎదుర్కొనగలిగే విశ్వసనీయమైన నిరోధక శక్తికి సంబంధించినది.

ఎస్‌ఎస్‌ఏ అనేది కౌంటర్‌స్పేస్‌ ఆపరేషన్లు చేపట్టడానికి సరిగ్గా సరిపోతుంది. ఏశాట్‌, ‌స్పేస్‌ ‌డాకింగ్‌, ‌లాంటి విజయవంతమైన వాటిని అవసర మైన చోట, అవసరమైన వేళ వినియోగించుకునే వెసులుబాటును అందిస్తున్నాయి. వీటికి కార్యాచరణకు ఉపకరించే సామర్థ్యంగా రూపుదిద్దాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాటిని స్వల్ప వ్యవధిలో రంగంలోకి దించగలము. అంతరిక్షంపై ఆధిపత్యం కోసమని చైనా, అమెరికా పరస్పరం పోటీపడుతున్న సమయంలో, చైనాతో అంతంతమాత్రపు సంబంధాలను మాత్రమే కలిగి ఉన్న భారత్‌ ‌రోదసిలో అంతకంతకూ పెరిగి పోతున్న స్పేస్‌, ‌కౌంటర్‌స్పేస్‌ ‌ముప్పును ఏ మాత్రం ఉపేక్షించరాదని నిపుణులు సూచిస్తున్నారు. మన మిలటరీ ఆపరేషన్లకు అండగా నిలుస్తున్న రోదసిలోని మన ఆస్తులను కాపాడుకునే సామర్థ్యాన్ని మనం అత్యవసరంగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వారి భావన.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE