పల్నాటి యుద్ధం, బాలనాగమ్మ

మనకు బాగా తెలిసిన ప్రదర్శనల పేర్లు.

మాంచాల, నాగమ నాయకురాలు

మనం ఎంత కాలంగానో వింటున్న పాత్రలు.

ఇదే కోవలో… మరెన్నో పురాణ, చారిత్రక,

జానపద కళాపోషణలు.

ఈ అన్నీ సందర్భాల్లోనూ ఇప్పటికీ మన మనోనేత్రం ముందు నిలిచే ఉంటారు. ఎవరు? శ్రీలక్ష్మి రేబాల!

విశేషం ఏమిటీ అంటే –

మాంచాలగా ఆమె ఆనాడు ఇచ్చింది శతాధిక ప్రదర్శనలు!

ఏనాడు అంటే… అర్ధశతాబ్దం కిందట.

సాంస్కృతిక ఉత్సవాలనగానే మొదట వినిపించింది తన పేరే!

ప్రధానంగా మాంచాల పాత్ర పోషణ.

ఎవరు ఆ మాంచాల, ఏమిటి ఆ కథ?

బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు. అతడి భార్యే మాంచాల. పల్నాటి యుద్ధం అంటే- నాగమ్మ నాయకత్వంలోని నలగామరాజు సేనకి, బ్రహ్మనాయుడి నేతృత్వంలోని మలిదేవరాజు సైన్యానికీ నడుమ పోరు.

సంగ్రామ సీమకు వెళ్లాల్సిన బాలచంద్రుడు ఆ మాటే మరిచాడు. సతీమణి చెంతన చేరి సల్లాపాలు ఆరంభించాడు. అప్పుడు భర్తకు కర్తవ్య బోధ చేసిందా భార్య.

క్షణిక సుఖమ్ము కాశపడి క్షత్రియ ధర్మము వీడిరేని ధా

రణి మిము దిట్టిపోయదె? విలాసములన్‌ ‌గల శ్రద్ధ సంగర

మ్మున గలదా? త్రిలంగజన పూజ్యతనందరె! పారుబోతులై

తిని ఒక మూల కూర్చొనుట ధీరుల కర్మమె! శూరధర్మమే…

అంటూ సుతిమెత్తని చురక అంటించింది.

ఇదే సందర్భాన మనకు గుర్తుకు రావాల్సినవి మరికొన్ని:

‘పలనాటి వీరచరిత్ర’ అనేది శ్రీనాథ కవి ద్విపద కావ్యం. నాటి ధీరగాథల్లో అదే మొదటిదన్న భావనా ఉంది.

అలనాడు తెలుగునాటను

గల నాడులలోన నెన్నగలనాడై అ

ప్పలనాడు వెలిగి వెలుగుల

వెలనాడై తెలుగువారి వెలగల నాడై

          కలిమికే లోటు లేదందు బలిమికెందు

          దీటు గనరాదు లేమికి చోటు లేదు

          పల్లె నాడెల్ల నాడునుంజెల్లె- ఆంధ్ర

          మాతృమస్తక మాణిక్య మకుట మనగ!

అంటుంది సోమశేఖర కావ్యం ‘మాంచాల.’

అవిగో…. ఆ అర్థభావ శైలినంతటినీ ప్రేక్షకుల కళ్లముందు ప్రత్యక్షం చేసేది శ్రీలక్ష్మి సహజసిద్ధ నటన.

1957 జులై 12న ఆమె జననం. అంటే – ఈ 12వ తేదీన తన పుట్టినరోజు. తల్లి దుర్గాంబ. తండ్రి సుబ్బారావు.

చిన్నప్పటి నుంచీ ఎంతో కళాపిపాస ఉండేది శ్రీలక్ష్మికి. ఆరేళ్ల చిరుప్రాయంలోనే రంగస్థల వేదికనెక్కింది. నాటకం కాదు – ముందుగా నాట్య ప్రదర్శన లిచ్చింది.

ఆమె ప్రథమ ప్రదర్శనం ‘విధికృతం’ నాటకం.

అటు తర్వాత అంతా సుకృతం. తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా, అప్పట్లో ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రదర్శనలిచ్చారు.

రమణతో పరిచయం ఆ వెంటనే పరిణయానికి దారితీసింది.

ఇంకా ఇంకా విలక్షణత్వం ఏమిటంటే – పల్నాటి యుద్ధం వేదికమీద మాంచాల… శ్రీలక్ష్మి అయితే; నాగమ నాయకురాలి పాత్రను పోషించింది భర్త రమణ! అలా రేబాల దంపతులు, వందకు మించి నాటక ప్రదర్శనలతో ఒక రికార్డు సృష్టించారు అప్పట్లోనే!

ప్రయోగశీలత; ప్రతిభా సమన్విత అయ్యారిద్దరూ.

అది నిజంబుగా మథుర సాయం సమయము

నాటి ఆమె జీవిత నభోంగణమునందు

చంద్రుడుదయించు దా బాలచంద్రుడగుచు

అప్పుడామె చకోరియే తప్పకగును!

          అందము దిద్దుకొన్నయది ఆశలతో పెనవేసుకొన్నదై

          డెందము; చందనాదులు విలేపన జేసి, కడాని జాళువా

          పిందెల పేటు నేత వలిపెంబునుగట్టి, సువర్ణ హారముల్‌

          ‌సుందర రత్నహారములు సొంపును పెంపొనరింపదాల్చియున్‌!

‌వంటి పద్యభాగాలు నేపథ్యాన వినవస్తుంటే, రేబాల శ్రీలక్ష్మి నటనా వైదుష్యం అమోఘంగా ఉండేది.

శూరతకు సంబంధించి…

‘నాథా! స్వతంత్ర ప్రాప్తి కోసం పిలుస్తోంది సంగ్రామ రంగం! విజయగౌరవలక్ష్మి మిమ్మల్నే వరించాలని తహతహలాడుతోంది. బలశాలిగా, భాగ్య విధాతగా మీరే నిలవాలని నా మనసూ అన్ని విధాలా ఉబలాటపడుతోంది. తెలుగుతేజం వెల్లివిరియాలని జనగణమంతా ఎదురుచూస్తున్న తరుణమూ ఇదే! మీ శౌర్య దీప్తి ధగధగలాడాలంటే ఇప్పుడు కావాల్సింది కర్తవ్యదీక్ష’ అని ఉద్బోధించినపుడు శ్రీలక్ష్మి నట పటిమను చూసి తీరాల్సిందే.

నావలె నొక్క నాతియగు నాయకురాలి పరాక్రమంబులన్‌

‌కేవల మృత్యుమూర్తిగ గణించుచు కృంగి కృశించి క్షాత్ర దీ

క్షావిధులెల్ల సిగ్గు విడి కల్పెదరె మన నాగు లేటిలో?

జీవిత నాయకా! వెలమసింగమటన్నది లేత కోతయే!

ఇందులో మృత్యుమూర్తి, నాగులేటి, లేతకోత అనే సంభాషణ పదాల ఉచ్చారణ వేళ; ఆ రంగస్థల నటీమణి హావభావ విన్యాసం అపురూపంగా కనిపించేది.

ఆమె మాట, పాట, అడుగు ప్రేక్షక జనరంజకంగా ఉండేవి. అందుకే ఆ రోజుల్లో రంగస్థల ప్రదర్శనల ప్రాంతమంతా జనసందోహంతో నిండి ఉండేది.

మాతృదేశ సంరక్షకే మానవుండు

త్యాగియై జీవితము వినియోగపరచు

అట్టి ధీరాత్ముడే పూజ్యుడతని జన్మ

సార్థకంబగు నిస్వార్థ చరితుడతడు!

అనడంలో మాతృభూమి పరిరక్షణాసక్తి ప్రస్ఫుటమవుతుంది. ఇటువంటి సాంస్కృతికత వెల్లివిరిసేలా ఉంటుండేది శ్రీలక్ష్మి నటన.

ఆత్మాభిమానానికీ అపార పౌరుషానికీ పెట్టింది పేరు మగువ మాంచాల. లేత జవ్వనిగా, ధీరతకు ప్రతీకగా ఆవిష్కరించడంలో సంపూర్ణ కృతకృత్యురాలు శ్రీ లక్ష్మి రేబాల. ‘కొమ్మన పలికే కోయిలవనుకుంటి / కొదమ సింగానివే వయ్యారీ, అరుదైన సింగారివే’ అనిపించుకున్న చరిత. ఈ నేపథ్య, వర్తమానమంతటినీ ధీయుతంగా ప్రదర్శించినందుకే అపురూప రీతిన ప్రజాదరణను అందుకున్నారామె.

ఎప్పుడైనా అంతేకదా! నిబ్బరానికి మారు పేరు స్త్రీ. సాహసోపేత నిర్ణయానికి రావడంలో తానే నేర్వరి. మనోధైర్యమైనా, సమయస్ఫూర్తి తత్వమైనా తన సొంతం. వీటిని అభినయించడంలోని ప్రావీణ్యమే శ్రీలక్ష్మికి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చి, సమాదరణను సుసాధ్యం చేసింది.

ఆమె స్వస్థలం గుంటూరు ప్రాంతం. నాట్యం, నటన రంగాలు రెండింటా చక్కని శిక్షణ పొందినవారు.

చంద్రమతి, శశిరేఖ, దాక్షాయణి

తార, వరూధిని, పద్మావతి

రుక్మిణి, శాంతిమతి, ద్రౌపది –

ఇలా ఏ పాత్రకు ఆ పాత్రను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో పరిపోషించడం ఆమె అలవాటుగా రూపుదిద్దుకుంది. యుగసంధి, కనక పుష్యరాగం, మండువాలోగిలి, తదితర నాటకాల పేర్లు ఆ నటీమణి వైవిధ్య రీతిని చాటి చెప్తుంటాయి ఇప్పటికీ! కళలకే అంకితమైన జీవితం తనది.

ఏ కళైనా ఎందుకు? సమాజ జాగృతి కోసం.

ప్రదర్శనల పరమార్థం ఏమిటి? ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి. కార్యశీలతను వారిలో విస్తరించడానికి.

అందుకోసమే ఆమె పలు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. రంగస్థలం మీద, దిగువన కూడా ప్రదర్శనలతో మార్పుదలకు అవిశ్రాంతంగా శ్రమిస్తూ వచ్చారు. సమకాలీన రంగస్థల నటీమణుల్లో మేలిమి కళాదీపిక.

మాధ్యమంగా, సాధనంగా ఆకాశవాణిని వినియోగించుకున్నారు శ్రీలక్ష్మి. సామాజిక ప్రయోజనాలు ఆశించి ప్రత్యేకంగా పోటీలు ఏర్పాటుచేసిన ఘనతా తనకుంది.

వినోదరంగం తీరుతెన్నులు మారాయి. సరికొత్త పక్రియలు, విధాన పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయి. ఎన్నెన్ని మార్పులొచ్చినా, వస్తున్నా, ఇకముందూ ఎదురైనా ఎన్నటికీ మారకూడనిది ఒకటుంది. కళాపిపాస.

ఆ పిపాస కళాకారిణుల్లో, ప్రేక్షకజనావళిలో పుష్కలంగా ఉన్నంతకాలమూ సంస్కృతి, నాగరికత, సామాజికత వర్థిల్లుతూనే ఉంటాయి. అలా వర్ధిల్ల చేయడంలోని నిపుణత్వమే శ్రీలక్ష్మి రేబాలలో చెక్కుచెదరకుండా ఉంటోంది. తరతరాల మన చరితను వేదికలపైన ప్రత్యక్షం చేస్తోంది.

‘మానవానంద మాధవీ మందిరమున

భద్రపీఠిక కొలువయ్యె భాగ్యలక్ష్మి!

శ్రీ పదాబ్జ ద్వయమ్ము అర్చింపరావె

హృదయ పుష్పాంజలుల్‌ ‌సమర్పించిపోవె!’

అంటూ విన్నవించే వేళ… తలపులోకి రావడమే ఆమె చేసిన రంగస్థల సేవ. అంతటి సేవాగుణమే నేటికీ ప్రశంసలు అందుకుంటోందని సంతోషించాలి మనమంతా!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE