కొన్ని సందర్భాల్లో భౌగోళిక అంశాలు వాదనకు దారితీస్తాయి. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఆధునిక అమెరికా గాథలో అంతర్భాగంగా ఉంది. బహుమతి పోరాటాలు, ఛాంపియన్‌షిప్‌లు, రాక్ సంగీత కచేరీలు, రాజకీయ ప్రదర్శనలు, ప్రముఖులు, వాణిజ్యం, విజయం, నాటకరంగం ఇలా రకరకాల కార్యక్రమాలతో అది శబ్దానికి అలవాటుపడిన ప్రదేశంగా మారింది. కానీ ఆగస్టు 29న అమెరికాలో అంతర్భాగమైన ఆ ప్రదేశంలోకి వసుధైవ కుటుంబకం అనే అత్యంత పురాతనమైన ఒక సాంస్కృతిక ప్రతిపాదన రంగప్రవేశం చేసింది. ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగించడానికి లేవడానికి చాలా ముందే, ఆ వేదిక ఆ ప్రతిపాదనను వివరించడం ప్రారంభించింది. ప్రదర్శకులు భారతదేశం, చైనా, ఆఫ్రికా, ఐరోపా, మధ్యప్రాచ్య దేశాల సంప్రదాయాలను కార్యక్రమంలోకి తీసుకువచ్చారు. వేషధారణలు మారాయి. లయలు మారాయి. కదలికలు మారాయి. కానీ ప్రేక్షకులు మాత్రం మారలేదు. వాతావరణం ఉత్సాహభరితంగా, కొన్ని క్షణాల్లో పారవశ్యంతో నిండిపోయింది. ఫోన్లు తలల పైకి లేచాయి. సముద్రాలు, చరిత్రలతో వేరు పడిన సంస్కృతులు, వాటిలో ఏ ఒక్కటీ మరొకదానిలో కలిసిపోవాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికను ఆక్రమించడంతో, ఆడిటోరియం అంతటా చప్పట్లు మారుమోగాయి. ఆ ప్రదర్శన ఏడు రంగుల హరివిల్లును ఆవిష్కరించింది. డాక్టర్ భాగవత్ దానికి గొంతుకను అందించారు.


వైవిధ్యాన్ని  వేడుకగా చేసుకోవడానికి, దాని కింద ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి మధ్య ఒక సూక్ష్మమైన, ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. వైవిధ్యానికి సంబంధించిన ఆధునిక పదజాలం సాధారణంగా జాతి, మతం, జాతి సమూహం, జాతీయత, భాష, గుర్తింపు వంటి భేదాలను ఏకరువు పెట్టడంతో మొదలవుతుంది. డాక్టర్ భాగవత్ న్యూయార్క్‌కు తీసుకువచ్చిన నాగరికతా పదజాలం దీనికి వ్యతిరేక దిశలో వైవిధ్యాలకు పుట్టుకనిచ్చిన ఒక అంతర్లీన ఐక్యతతో మొదలైంది. విభిన్నులైన ప్రజలు కలిసి జీవించగలరని బహుళత్వం మనకు చెబుతుంది. వసుధైవ కుటుంబకం దీనికి మించి వెళుతుంది. అది  పరాయి వ్యక్తి అంటే కేవలం అతని భిన్నత్వాన్ని సహించడం మాత్రమే కాదు, అతడు కూడా మనతో పాటు ఒకే మానవ కుటుంబంలో సభ్యుడని సూచిస్తుంది. ఇలాంటి వాదనను వినిపించడానికి న్యూయార్క్ నగరం అసాధారణంగా అనువైనది. తమతో పాటు ఇతర ప్రాంతాల జ్ఞాపకాలను మోసుకొచ్చిన ప్రజల వల్ల నిరంతరం మార్పులకు గురయ్యే ప్రదేశాలు భూమిపై చాలా తక్కువ. న్యూయార్క్ పరిసరాలు జ్ఞాపకాలతో నిండిన మాతృభూములు. దాని వీధులు ప్రపంచపు యాసలలో మాట్లాడతాయి. అందువల్ల, అటువంటి నగరానికి భిన్నత్వం కనుమరుగు కావాల్సిన అవసరం లేదని, భిన్నత్వాన్ని విభజించాల్సిన అవసరం అంతకంటే లేదని డాక్టర్ భాగవత్ ప్రతిపాదించారు. “మనమంతా ఒక్కటే, మనలోని వైవిధ్యంవల్ల ఆ ఏకత్వం మరింత బలపడుతుంది,” అని ఆయన అన్నారు. పదాల ఎంపిక చాలా ముఖ్యం, ఎందుకంటే భారతదేశం వెలుపల ఆరఎసఎస్‌ను ప్రధానంగా జాతీయవాదం, మెజారిటేరియనిజం, ఏకాకి అనే పదజాలంతోనే అన్వయిస్తారు. ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ తన అమెరికా పర్యటనలో అత్యంత ప్రముఖమైన వేదికలలో ఒకదానిని ఎంచుకుని, ఒకరి గుర్తింపుపై విశ్వాసానికి ఇతరుల గుర్తింపును తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అనే భిన్నమైన దిశలో సాగే ఒక ప్రతిపాదనను స్పష్టం చేశారు. ఆ వాదన ‘నా లాగా అయిపోండి’ అని కాదు. అది మీరు మీలాగే ఉండండి, కానీ మనల్ని కలిపేది ఏమిటో గుర్తించండి అని చెబుతుంది.

ధర్మానికి పెద్ద పీట

ఆంగ్ల భాష తరతరాలుగా సరిగ్గా అనువదించ లేకపోయిన ధర్మం అనే పదం వైపు దృష్టిని డాక్టర్ భాగవత్ సారించారు. “ధర్మం అంటే మతం కాదు. అది ఒక పూజ కాదు. అది వీటన్నిటికీ అతీతమైనది” అని అన్నారు. అస్తిత్వంలోని పైకి పోటీ పడుతున్నట్లు కనిపించే అంశాలు ఒకదానిని మరొకటి నాశనం చేసుకోకుండా, సమతుల్యంగా ఉండేలా చేసే సూత్రం ధర్మం అని పేర్కొన్నారు.మతం, లౌకికవాదం, మెజారిటీ, మైనారిటీ, వామపక్షం, రైట్‌వింగ్, ఉదారవాదం, సంప్రదాయవాదం అంటూ వేరేచోట పుట్టుకొచ్చిన వర్గాలలో  రెండు శతాబ్దాలకు పైగా భారతదేశం తరచుగా తనను తాను వివరించు కోవలసి వచ్చింది.  ఈ వర్గాలు నిరుపయోగమైనవి కావు. కానీ ధర్మం, అర్థం, కామం, మోక్షం, సేవ, సంవాదం, కుటుంబంవంటి వాటిద్వారా మేధోపరమైన పదజాలం పరిణామం చెందిన ఒక నాగరికతను కొలవడానికి అవి అసంపూర్ణమైన సాధనాలు మాత్రమే. అనువాదం వెలుగునివ్వగలదు. అది వెలుగును తగ్గించగలదు కూడా. ధర్మాన్ని కేవలం “మతం” అని అనువదిస్తే, ఆ పదంలో ఇమిడి ఉన్న తాత్వికతలో కొంత భాగం కోల్పోతుంది. అలాగే, “దాతృత్వం” అనే పదంతో సేవ అర్థం ముగిసిపోదు. “వసుధైవ కుటుంబకం” కేవలం “ప్రపంచ సామరస్యం” కంటే ఎంతో ఎక్కువ అర్థాన్ని సూచిస్తుంది. భారతదేశం వంటి ప్రాచీన నాగరికత ఆధునిక ప్రపంచపు పదజాలాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. అలాగే, అది తన సొంత పదజాలాన్ని కూడా మరచిపోనవసరం లేదు.

అద్భుతమైన ఘట్టాలకు వేదిక

కార్యక్రమంలోని కొన్ని అత్యంత అద్భుతమైన ఘట్టాలకు అసలు ప్రసంగమే అవసరం కాలేదు. ధార్మిక పెద్దలు తమదైన ప్రత్యేక వస్త్రధారణలో, సంప్రదాయాలతో కలిసి వేదికపైకి వచ్చారు. తాము ఒకే ధార్మిక సిద్ధాంతాన్ని పంచుకుంటున్నట్లు వారు నటించలేదు. అలా నటించాలని ఎవరూ వారిని  కోరలేదు. భేదాలను తుడిచివేయడం ద్వారా ఏకత్వాన్ని ప్రదర్శించలేదు. భేదాలను ఒకే చట్రంలో స్పష్టంగా కనిపించేలా చేయడం ద్వారా దానిని ప్రదర్శించారు.

మత సామరస్యం అంటే మత, సామాజిక నాయకులు కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా సంబంధాలను పెంచుకోవడం, సమాజాలకు సేవ చేయడం, ఒకరికొకరు తోడుగా నిలబడటం వంటి పనులతో ఆచరణాత్మక బాధ్యతల వైపు పయనించాలన్న పిలుపుతో కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత అత్యంత సరళమైన ఒక చర్య జరిగింది. అదే రక్షాబంధన్.

రాఖీ పండుగ

కార్యక్రమంలో పాల్గొన్నవారి కోసం నిర్వాహకులు రాఖీలను సిద్ధంగా ఉంచారు. తమ చుట్టూ ఉన్నవారి వైపు తిరిగి, ఆ పవిత్రమైన రక్షణ దారాన్ని కట్టమని సభికులను ప్రోత్సహించారు. ఆ క్రమంలో కొన్నిసార్లు తమకు తెలిసిన వారి మణికట్టుకు, మరికొన్నిసార్లు అపరిచితుల మణికట్టుకు వారు రాఖీ కట్టారు. వేదికపై డాక్టర్ భాగవత్ మణికట్టుకు రాఖీ కట్టారు. హిందూ ఆచారం కుటుంబం, పరిచయం అనే పరిమితులను దాటి, మరో మనిషి పట్ల బాధ్యత అనే ఒక ఉన్నతమైన విషయానికి ప్రతీకగా ఆ సందర్భం నిలిచింది. “మీరు ఇతరుల బాధ్యత తీసుకున్నప్పుడు, అది మీకు స్వేచ్ఛను ఇస్తుంది” అని డాక్టర్ భాగవత్ అన్నారు. ఆ విధంగా ఒక ప్రాచీన ఆచారం పౌర ప్రతిపాదనగా మారింది.

భారత్‌ను విశ్లేషిస్తున్న అమెరికన్ తరం

సర్‌సంఘచాలక్ ప్రసంగం ప్రవాస భారతీయుల సందిగ్ధతలను ప్రస్తావించినప్పటికీ, అమెరికాను తమ దత్తత దేశంగా అస్సలు భావించని వారి నుండే కొన్ని అత్యంత కీలకమైన స్పందనలు వెలువడ్డాయి. కునాల్ అథ్రేయ వయసు 31 సంవత్సరాలు. ఆయన నాలుగేళ్ల వయసులో న్యూజెర్సీకి వచ్చి, అక్కడే పెరిగారు. స్థానిక ఎన్నికలలో పోటీ చేయడం సహా, ఇప్పటికే అమెరికన్ పౌర జీవితంలో పాలుపంచు కున్నారు. వదిలిపెట్టిన మాతృభూమిని గుర్తుచేసుకునే వలసదారుడి వ్యామోహంతో ఆయన మాట్లాడలేదు. ఆయనది ఒక వారసత్వాన్ని విశ్లేషిస్తున్న అమెరికన్ స్వరం. “మన భేదాలన్నింటి వెనుక ఒకే మానవత్వం ఉంది. మనల్ని ఏకం చేసే బంధాలను మనం గుర్తించాలి” అని అథ్రేయ అన్నారు.నేను నాలుగేళ్ల వయసులో న్యూజెర్సీకి వచ్చి ఇక్కడే పెరిగాను. నా తరం హిందూ అమెరికన్లకు వసుధైవ కుటుంబకం అనే సందేశానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. వసుధైవ కుటుంబకం(ప్రపంచం ఒకే కుటుంబం) అనేది కేవలం ఒక ప్రాచీన భారతీయ భావన మాత్రమే కాదు. మనం ఈనాడు జీవిస్తున్న ప్రపంచంలో మనమందరం అనుసరించాల్సిన విషయం అది అని తెలిపారు. అమెరికాకు వలస వచ్చిన తొలితరం భారతీయులు, ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకోవడం, పని చేయడం, స్థిరపడటం, జీవించడం విజయం సాధించడం వంటి వాటిని సాధించారు.ఆసుపత్రులలో, విశ్వవిద్యాలయాలలో, ప్రయోగశాలలలో,  సమావేశ మందిరాలలోకి అడుగుపెట్టారు. వ్యాపారాలను, వృత్తులను, దేవాలయాలను, గృహాలను నిర్మించుకున్నారు. వారి విజయం ఇప్పుడు అమెరికన్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నది.

వసుధైవ కుటుంబానికి నిదర్శనం సంగీతం

నాగరికతలు కేవలం సంస్థలు లేదా తత్వాల ద్వారా మాత్రమే ప్రయాణించవు. అవి రాగాలలో, వంటకాలలో, భాషలో, ఆచారాలలో, ఎటువంటి సూచన లేకుండా పునరావృతమయ్యే హావభావాలలో, వాటి మూలాలు మరచిపోయిన చాలా కాలం తర్వాత కూడా గుర్తుండిపోయే కథలలో ప్రయాణిస్తాయి. అందువల్ల ఏకత్వం అనే భావన ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు మహేష్ కాలేకు రాజకీయాలకు అతీతంగా ప్రతిధ్వనిస్తుంది. “మనల్ని భాష, భౌగోళికం, నమ్మకాల సరిహద్దులకు ఆవలకి తీసుకువెళ్లి, మనం పంచుకునే లోతైన మానవ సంబంధాన్ని గుర్తుచేసే శక్తి  సంగీతానికి ఉందని ఒక కళాకారుడిగా నేను  నమ్ముతాను” అని కాలే అన్నారు. “అందుకే ‘వసుధైవ కుటుంబకం’ అనే భావన నాతో బలంగా ప్రతిధ్వనిస్తుంది. భారత దేశంలో నివసిస్తూ, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలతో గాఢంగా అనుసంధానమై ఉన్న మనలాంటి వారికి, ఈ విశ్వ ఏకత్వ సందేశం ప్రత్యేకంగా అర్థవంతమైనది. మన వారసత్వం మనకు మూలాలను ఇస్తుంది. కానీ అది మన హృదయాలను ప్రపంచం ఎదుట ఆవిష్కరించడాన్ని కూడా నేర్పుతుంది” అని తెలిపారు. ఒక సంగీతకారుడు ఇలాంటి వాదన చేయడంలో ఏదో ఒక ప్రత్యేకత వినిపించింది. రాగానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఒక రాగం ఇమ్మిగ్రేషన్ వద్ద దానంతట అదే ప్రత్యక్షం కాదు.ఎవరో ఒకరు దాన్ని గుర్తుంచుకోవడం వల్లే అది ప్రయాణిస్తుంది.

అణువణువునా భారతీయత

సంజనకు 21 ఏళ్లు. ఆమె అమెరికా తూర్పు తీరంలో పుట్టి పెరిగారు.  భరతనాట్య నర్తకి. హిందీ అనర్గళంగా మాట్లాడగలరు. తమ కుటుంబ  నాగరికత, కేవలం అప్పుడప్పుడు జరుపుకునే పండుగలగానో, లేదా అవగాహన లేకుండా చేసే ఆచారాలుగానో మిగిలిపోకుండా ఆమె తల్లిదండ్రులు చూసుకున్నారు. అది తెలుసుకోవలసిన విషయంగా మారింది. “నేను ఇక్కడే తూర్పు తీరంలో పుట్టి పెరిగాను. కానీ భారతదేశానికి ఇంత దూరంగా ఉన్నప్పటికీ మన సంస్కృతికి దూరమైనట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. నిజానికి, దానిని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనే కోరికను అది నాలో కలిగించింది,” అని సంజన అన్నారు.

“నేను భరతనాట్యం నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను. హిందీలో అనర్గళంగా మాట్లాడతాను. మన సంప్రదాయాలను కేవలం ప్రత్యేక సందర్భాలలో పాటించేవిగా కాకుండా, మనం అర్థం చేసుకుని, ఆచరించేవిగా ఉండేలా మా తల్లిదండ్రులు చూసుకున్నారు. భారతదేశం వెలుపల పెరిగే నాలాంటి వారు మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవడానికి మరింత స్పృహతో కూడిన ప్రయత్నం చేస్తారని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది.  బహుశా ఆ కారణంగానే భారతదేశంలో పెరిగే చాలా మంది యువతలాగే మన సంప్రదాయాలను నాలాంటి వారు కూడా లోతుగా తెలుసుకోగలుగు తారు” అని తెలిపారు. అలాంటి అస్తిత్వ మÖలాలను ఒకేచోట అనుభూతించే అవకాశాన్ని సంజనకు మాడిసన్ స్క్వేర్ గార్డెన్ అందించింది. “మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో కూర్చుని, ఎన్నో సంస్కృతులు, విశ్వాసాలు ఏకత్వం అనే భావన చుట్టూ కలవడాన్ని చూడటం నాకు అపారమైన గర్వాన్ని, అనుబంధాన్ని కలిగించింది” అని అన్నారు.21 ఏళ్ల వయసులో, నేను పుట్టి పెరిగిన దేశంలో ఇలాంటి అనుభవాన్ని పొందడం, అదే సమయంలో నా అస్తిత్వంలో అంతర్భాగమైన నాగరికతను, సంస్కృతిని వేడుకగా జరుపుకోవడం చాలా ప్రత్యేకమైనది. అక్కడ ఉండటం, అందులో భాగం కావడం నన్ను నిజంగా పులకించిపోయేలా చేసింది అని భావోద్వేగంతో తెలిపారు. దూరం పెరిగేకొద్దీ వారసత్వం ఎల్లప్పుడూ బలహీనపడదు. కొన్నిసార్లు దూరం అనేది వారసత్వాన్ని చైతన్యవంతం చేస్తుందని చెప్పడానికి సజీవ నిదర్శనంగా సంజన నిలుస్తారు.

భారత్‌లో ముస్లింలను వద్దనుకునేవాడు హిందువే కాడు

డాక్టర్ భాగవత్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌కు రాకముందు, ఆగస్టు 29  తెల్లవారుజామున న్యూయార్క్‌లో మరో సంభాషణ జరిగింది. విశ్వ ఏకత్వ వేడుకకు ముందు జరిగిన ఒక సర్వమత సమావేశంలో, హిందూ రాష్ట్రం  అర్థం, భారతదేశంలో ముస్లింల స్థానంపై చాలాకాలంగా జరుగుతున్న వాదనలతో ముడిపడి ఉన్న ఒక ప్రశ్నకు ఆయన మరింత సూటిగా సమాధానమిచ్చారు. భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా విశ్వసిస్తే, “అతను హిందువుగా ఉండడు” అని తాను గతంలో అన్నట్లు తెలిపారు. సమయం, ప్రదేశం మధ్య వ్యత్యాసం ముఖ్యమైనది. డాక్టర్ భాగవత్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌కు రాకముందు చేసిన వ్యాఖ్య అది. కానీ తాత్వికంగా, అది ఏకత్వం, ధర్మం, భిన్నత్వంలో ఏకత్వంపై ఆయన చేసిన ప్రసంగం అంతటా కొనసాగిన అదే పరంపరలో ఒక భాగంగా నిలిచింది. వసుధైవ కుటుంబకానికి నాగరికతా అలంకారాలకు అతీతమైన అర్థం ఉండాలంటే, ఈ ప్రపంచమనే కుటుంబం, విభిన్నంగా పూజించేవారు, విభిన్నంగా విశ్వసించేవారు లేదా మెజారిటీ ప్రజల చారిత్రక స్మృతిని పంచుకోని వారిని కూడా కలుపుకోవాలి. స్వతంత్రుల మధ్య విశ్వాసాన్ని సులభంగా ప్రకటించుకోవచ్చు. ఇతరుల కోసం మనం ఇచ్చేదాన్ని కొలవడం మరింత కష్టం.

హిందువు అయినంత మాత్రాన అమెరికన్ కాకుండా పోడు

తరతరాలుగా, వలసదారులను కూరలో కరివేపాకులాగా తీసివేయడంగా భావించేవారు. అమెరికన్ అవ్వడం అంటే నెమ్మదిగా, అగోచరంగా, మÖలాలకు దూరం కావడమే. కానీ పరిణతి చెందిన వలస సమాజాలు మరింత సంక్లిష్టమైన విషయాన్ని కనుగొంటాయి. గుర్తింపు అనేది అంకగణితం కానవసరం లేదు. సంస్కృతిని తెలుసుకోవడం, భరతనాట్యం సాధన చేయడం, గుడికి వెళ్లడం, రాగం వినడం లేదా భారత్‌ను నాగరిక వారసత్వంగా భావించడం వల్ల ఒక హిందూ అమెరికన్ ఒక నికార్సైన అమెరికన్‌కు ఏ విషయంలోనూ తీసిపోడు. అలాగే, భారత్‌పై మమకారం ఒక అమెరికన్ భారతీయ పౌరుడిని అమెరికా పట్ల ఉన్న బాధ్యతల నుండి విముక్తి చేయదు. డాక్టర్ భాగవత్ చేసిన కర్మభూమి సూత్రీకరణ పైన చెప్పిన రెండింటినీ పక్కపక్కనే ఉంచింది. అమెరికా మీరు నివసించే చోటు. దానికి కట్టుబడి ఉండండి. భారత్ వారసత్వం ఇచ్చిన చోటు. దాని విలువలతో జీవించండి అని అన్నారు. ప్రవాస సమూహాలను తరచుగా అంచనా వేసే ద్వంద్వ పదజాలం కన్నా ఇది చాలా ఉన్నతమైన ప్రతిపాదన. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో దీపాలు ఆరిపోయాయి. నృత్యకారులు వేదికను విడిచి వెళ్లిపోయారు. ధార్మిక పెద్దలు నిష్క్రమించారు. చప్పట్లు ఆగిపోయాయి. ఫోటోగ్రాఫ్‌లు, ప్రసంగాల భాగాలు, మణికట్టుకు రాఖీలు,  జ్ఞాపకాలతో నిండిన ఫోన్‌లను చేతబట్టుకుని ప్రజలు తిరిగి మాన్‌హాటన్‌లోకి ప్రవేశించారు. తన సాధారణ అమెరికన్ జీవితానికి మాడిసన్ స్క్వేర్ గార్డెన్  తిరిగి వచ్చింది. కానీ ఆ సాయంత్రపు జ్ఞాపకాలలో ఏదో ఒకటి చిరస్మరణీయ మవుతుంది.

సంఖ్య కన్నా సంభాషణకే ప్రాధాన్యత

కేవలం వేలాది మంది ఒకే చోట చేరారన్న కారణం వల్ల మాత్రమే కాదు. సంఖ్యలు ఒక రోజు ఆకట్టుకుంటాయి, కానీ ఆ తర్వాత అంతకంటే పెద్ద సంఖ్యల ముందు అవి వెనుకబడిపోతాయి. కానీ లోపల జరిగిన సంభాషణకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఆరఎసఎస్ సర్ సంఘచాలక్ అమెరికాకు వచ్చి, ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ, అమెరికా వారి కర్మభూమి అని, అందువల్ల వారి మొదటి బాధ్యత దానికే ఉందని చెప్పారు. ఆయన భారత్‌ను ఒక పోటీ రాజకీయ విధేయతగా కాకుండా, దాని విలువలు ప్రజల ప్రవర్తనలో ప్రతిబింబించాల్సిన జన్మభూమిగా అభివర్ణించారు. న్యూజెర్సీలో పెరిగిన 31 ఏళ్ల వ్యక్తి మానవత్వం గురించి మాట్లాడారు. ప్రపంచానికి హృదయాన్ని తెరుస్తూనే, వేళ్లూనుకున్న  వారసత్వం గురించి ఒక సంగీతకారుడుల వివరించారు. అమెరికా తూర్పు తీరంలో పుట్టి పెరిగి, హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగే 21 ఏళ్ల భరతనాట్య నర్తకి సముద్రం అవతల నుండి తాను వారసత్వంగా పొందిన నాగరికతను తెలుసుకోవడం గురించి మాట్లాడారు. బయట నిరసనకారులు విభేదించే తమ స్వేచ్ఛను వినియోగించుకున్నారు. లోపల వేలాది మంది వినే తమ స్వేచ్ఛను వినియోగించుకున్నారు. రాజకీయాలు, అస్తిత్వం అనే పోటీకి అతీతంగా “వైవిధ్యం సహజం, ఐక్యత సత్యం” అంటూ డాక్టర్ భాగవత్ చేసిన అత్యంత సరళమైన సూత్రీకరణ సంభాషణ శిఖరాగ్రాన నిలిచింది.

బహుశా ఆగస్టు 29న జరిగిన అసలైన ప్రయాణం అదేనేమో. అది భారత్ నుండి న్యూయార్క్‌కు ఒక ఆరఎసఎస్ అధిపతి చేసిన ప్రయాణం మాత్రమే కాదు. డాక్టర్ మోహన్ భాగవత్ ‘జన్మభూమి`కర్మభూమి’ అంటూ ఉపనిషత్‌లో ప్రస్తావించిన వాక్యం సముద్రాన్ని దాటి చేసిన ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక సమాజం వలసగా సాధించిన విజయాల నుండి నాగరిక స్వీయ-స్వాధీనత వైపు సాగించిన ప్రయాణం. అమెరికాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని, తాము ఎక్కడి నుండి వచ్చామో చెప్పుకోగలిగేంత భద్రతను ఆ ప్రదేశంలో పొందే స్థాయికి చేరుకున్న ప్రయాణం. శతాబ్దాల క్రితం ఈ ప్రపంచం ఒకే కుటుంబం అని రుషులు ప్రకటించారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో, ఆ ప్రాచీన ప్రతిపాదన ఒకరు ఒక నాగరికతను వారసత్వంగా పొందవచ్చు, పూర్తిగా మరొక దేశానికి చెందినవారై ఉండవచ్చు. రెండింటిలో దేనిని తక్కువ చేయాల్సిన పనిలేదు. అన్నింటికీ మించి, సముద్రం భూభాగాలను వేరు చేస్తుంది కానీ వారసత్వాలను వేరు చేయదు అనే ఒక సంపూర్ణ ఆధునిక వాస్తవికతను స్పష్టం చేసింది.

– మనోరంజన్ గుప్తా, న్యూయార్క్

ఆర్గనైజర్ సౌజన్యంతో

About Author

By editor