మధ్యప్రాచ్యంలో వరుస యుద్ధాలు వచ్చినందుకు, అవి మరింత తీవ్రరూపం దాలుస్తున్నందుకు అమెరికా ఆయుధ వ్యాపారులు తెగ సంబరపడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చల్లబడటంతో ఆయుధ వ్యాపారం మందగించింది. ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయిల్-లెబనాన్ యుద్ధంగా పరిణమించడంతో అమ్మకాలు ఓ మోస్తరు పెరిగాయి. అయతే తొలుత ఉన్నంత ఉధృతంగా లేకపోవడంతో మారణాయుధాల విక్రయ లక్ష్యాలను చేరడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య యుద్ధం రావడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు అగ్రరాజ్యంలోని ఆయుధ వ్యాపారులు. ఈ యుద్ధంలోకి యెమెన్ లోని హౌతీలు, ఇరాన్‌లోని షియా మిలిటెంట్లు కూడా జతకలిస్తే…సరుకు మరింత అమ్ముకోవచ్చని కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాల తర్వాత అమెరికా ఆయుధ కంపెనీల లాభాలు అమాంతం పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కన్నా ముందు ఆయుధాల అమ్మకం నీరసంగా ఉండేది. అడపాదడపా ఆఫ్రికా దేశాల్లోని మిలిటెంట్లకు, చిన్నచిన్న దేశాల ప్రభుత్వాలకు కొంచెం కొంచెం సరుకు అమ్ముకుని సర్దుకునేవారు.
ఆయుధ ఉత్పత్తితో పోలిస్తే, అమ్మకాలు దిగువన ఉండేవి. ఆయుధ అమ్మకాలు ఢీలా పడితే..వ్యాపారులకే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా బోలెడు నష్టం వాటిల్లుతుంది. ప్రపంచంలో ఏదో ఓ మూల ఏదో ఓ యుద్ధమో, ఉద్రిక్తతో ఉండాలని శ్వేతసౌధం ఎదురు చూస్తూ ఉంటుంది. పైకి శాంతి వచనాలు పలుకుతుంది కానీ, లోలోపల మారణహోమాలు జరగాలని ప్రార్థనలు చేస్తుంది.
సొంత దేశంలోని పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ‘గన్ కల్చర్’ – తుపాకీ సంస్కృతి మరణమృదంగాలు మోగించినా పట్టించుకోకపోవడానికి కారణం..సంపదపై గల మక్కువ. అందుకే తుపాకుల వినియోగాన్ని నిషేధించడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోదు. మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగించి సంస్మరణగీతాలు పాడుతుంది కానీ, సమస్యను పరిష్కరించడానికి అమెరికాకు మనస్కరించదు. ఈ ఏడాది జనవరిలో అమెరికా ఆయుధ ఎగుమతులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2023లో 238 బిలియన్ డాలర్ల ఆయుధాలను అమెరికా ఎగుమతి చేసింది. ఈ ఎగుమతులన్నీ ఉక్రెయిన్ యుద్ధ పుణ్యమే! అందుకే ఉక్రెయిన్‌కు వంతపాడుతూ ఉంటుంది. ప్రపంచ ఆయుధ తయారీ రంగాన్ని శాసిస్తున్నది పిడికెడు కంపెనీలే! అందులో లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ప్రధానమైంది. తర్వాతి వరుసలో బీఏఈ సిస్టమ్స్, రేథియోన్ టెక్నాలజీస్, నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలున్నాయి. ఈ వరుసలో చివరిది జనరల్ డైనమిక్స్ కంపెనీ. ఈ ఐదు కంపెనీలు భిన్న రకాలైన ఆయుధాలను ఉత్పత్తి చేస్తాయి. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు మొదలు మిసైళ్లు ఇతర ఎలక్ట్రానిక్ రణరంగ సామాగ్రిని తయారు చేస్తాయి.
తూర్పు ఐరోపా, పశ్చిమాసియా యుద్ధాలకు ముందు ఈ ఐదు కంపెనీలు తమ ఏజెంట్లను దేశదేశాలు తిప్పేవి. ఆయుధాలను కొనమని ప్రభుత్వాలను ప్రాధేయపడేవి. వివిధ దేశాలకు చెందిన అందమైన యువతులను ప్రత్యేక విమానాల్లో తిప్పుతూ…రక్షణ మంత్రులకు ఎరగా వేసేందుకు తెగ ఖర్చు పెట్టేవి. కానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ కంపెనీల తీరు పూర్తిగా మారిపోయింది. ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం తర్వాత అయితే చెప్పనక్కరలేదు. అంతర్జాతీయ గిరాకీకి తగ్గట్టు ఆయుధాలు సరఫరా చేయలేమంటున్నాయి. తమ సరుకంతా..తాజాగా ఉండగానే విమానాలకు ఎత్తేస్తున్నట్టూ చెప్పేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ‘గన్ పౌడర్’ కొరత ఆయుధ తయారీ రంగాన్ని అతలాకుతలం చేస్తోందని అందుకే డిమాండ్‌ను అందుకోలేమంటున్నాయి.
లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఆదాయం 2018లో 43 బిలియన్ డాలర్లు ఉంటే 2025 నాటికి అది 71 బిలియన్ డాలర్లకు చేరింది. నాలుగేళ్ల వ్యవధిలో 28 బిలియన్ డాలర్ల కొత్త లాభాలను సొంతం చేసుకుంది. రేథియోన్ టెక్నాలజీస్ ఆదాయం 2020తో పోలిస్తే 13శాతం వృద్ధితో 67 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐరోపా ఆయుధ మార్కెట్ కీలక పాత్ర పోషించే బీఏఈ సిస్టమ్స్ లాభాలు ఏటా పది శాతం పెరుగుతూ 20 బిలియన్ పౌండ్లకు చేరింది. బీఏఈ సిస్టమ్స్ తన ఆయుధాలను ప్రధానంగా పశ్చిమాసియా, ఉక్రెయిన్ లోనే విక్రయించింది. ఏటా ధ్వంసరచన విస్తరిస్తున్నట్టుగా ఆయుధ తయారీ కంపెనీల లాభాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఐదు కంపెనీలకు ఇటీవలి యుద్ధం వల్ల సమకూరిన ఆదాయాలు కాకుండా యెమన్ అంతర్యుద్ధంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మునిగి తేలుతున్న సౌదీ అరేబియా, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాలకు నెలవారి రేషన్‌లా ఆయుధాల అమ్మకం వల్ల నిరం తరం ధన ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే యుద్ధంతో అదనపు ఆదాయం సమకూరు తుంది అన్నమాట! ఇదంతా ప్రైవేటు కంపెనీల చిట్టా పద్దుల లెక్క.
అమెరికా ప్రభుత్వం అధికారికంగా చేసిన రక్షణ సాయం కథ మరింత ఆసక్తికరం. ఫిబ్రవరి, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌కు 55.3 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను అందించింది అమెరికా. 2014లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మొత్తంగా 58.1 బిలియన్ డాలర్ల సైనిక సాయం చేసింది. సాయంగా అందిన ఈ మొత్తం ఆయుధ సరఫరాలో డిఫెన్స్ కాంట్రాక్టర్లకు ఎంతమేర లాభాలు అందాయో మనం ఊహించుకోవాల్సిందే! ఈ లెక్కలు పూర్తిగా రహస్యం. అందుకే ప్రపంచంలోని ఏ దేశాలైనా సరే, రక్షణ సాయం ప్రకటించాయంటే, అమెరికా డిఫెన్స్ కాంట్రాక్టర్లు సంబరాల్లో మునిగి తేలతారు. రక్షణ మంత్రులు ఉబ్బితబ్బిబ్బవుతారు.
విచిత్రమేమిటంటే, యుద్ధాలు మొదలవ్వగానే ఆయా దేశాల్లోని నిరాశ్రయ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాలు అందించే దేశాలే అరుదు. ఆయుధాలు సాయం చేసేవే అధికం. అందుకు కారణం, మారణాయుధాల్లో లభించే లాభం ముందు ‘పిడికెడు మెతుకులు’ దిగదుడుపు. భారత్ మాత్రమే విలయం, ప్రళయం, యుద్ధం ఏది వచ్చినా, వెంటనే వైద్యసాయం ప్రకటించి, సపర్యలు చేసేం దుకు, స్వచ్చంద సేవా వ్యవస్థను పురమాయిస్తుంది.
రష్యా భయంలో ఉన్న అనేక ఐరోపా దేశాలు ఆయుధ నిల్వల విషయంలో తమకు దూరదృష్టి లేకపోవడం ఇప్పుడు చింతిస్తున్నాయి. ఆయుధ ఉత్పత్తిపై 18 నాటో దేశాల పెట్టుబడులు మొత్తం కలిపితే 600 బిలియన్ డాలర్లు కూడా దాటక పోవడం గురించి విచారిస్తున్నాయి. యూరప్‌లో నెలకొంటున్న ఉద్రిక్తతలను చూసి మెల్లిగా జాగ్రత్త పడుతున్నాయి. నాటో సభ్య దేశాలన్నీ ఈ ఏడు తమ స్థూల జాతీయ ఆదాయంలో కనీసం రెండు శాతం రక్షణ రంగానికి కేటాయించేందుకు కసరత్తు చేస్తు న్నాయి. దీంతో ఆయుధ తయారీ దిగ్గజ కంపెనీలు గెంతులు వేస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ, నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలు ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. అగ్రరాజ్యానికి ఆయువు పట్టులాంటి పెంటగాన్ గత ఏడాది 315 బిలియన్ డాలర్లు ఆయుధ సేకరణకు కేటాయించింది. ఇందులో సింహభాగాన్ని లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తన్నుకుపోయింది. అమెరికా తయారీ ఎఫ్-15, ఎఫ్-16 జెట్ విమానాలు, రష్యా తయారీ ఎస్‌యు-30, ఎంఐప్లస్-29 యుద్ధ విమానాలే ఇప్పుడు పశ్చిమాసియా గగనతలంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. తళతళలాడే కలష్నీకోవ్‌లు, మురిపించే ఎం-4 రైఫిళ్ల సంగతి చెప్పనక్కరలేదు.
మారాణాయుధ ఉత్పత్తి రంగంలో టెక్నాలజీ సృష్టిస్తున్న విప్లవాత్మక మార్పులు కూడా యుద్ధ లక్షణాన్ని మార్చేస్తున్నాయని మర్చిపోరాదు. విచ్చలవిడి తూటాల వినియోగం వల్ల ‘గన్ పౌడర్’ లభ్యత ఊహించలేనంతగా తగ్గిపోయింది. దీంతో తూటాల ఖరీదు రోజు రోజుకూ పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కన్నా ముందు రష్యా ఏకే సీరీస్ తూటాలను ఎగుమతి చేసేది. యుద్ధం మొదలైన తర్వాత ఎగుమతులను బాగా తగ్గించింది. తమకే తూటాల కొరత ఏర్పడుతోందని చెపుతోంది. గన్ పౌడర్ మార్కెట్ ఎంతలా విస్తరించిందంటే, 2031లో చేరుకోవాల్సిన లక్ష్యాలను 2023లోనే చేరుకొని ప్రస్తుతం దూసుకుపోతోంది.
ఇంతా చెప్పి ఈ చిన్నమాట చెప్పకపోతే వెలితి అవుతుంది. యుద్ధంలో లాభాలు ఆర్జించింది పశ్చిమ దేశాలే కాదు, మన తెలుగుసీమకూ పిసరంత భాగస్వామ్యం ఉంది. కానీ, అది రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి మాట. రెండో ప్రపంచ యుద్ధంలో పొగాకు కొరతను ఎదుర్కొన్నది రష్యా. ‘చుట్టలేక పోతే.. తుపాకీ కాల్చను’ అన్నరీతిలో ఎర్రసైన్యం అవస్థలు పడింది. అలాంటి సమయంలో కోస్తా ప్రాంతం నుంచి ఎగుమతి చేసిన నాణ్యమైన పొగాకు రష్యాను రక్షించింది. పొగాకు ఎగుమతి చేసిన కోస్తాప్రాంత మోతుబరి రైతులు ఆ తర్వాత కాలంలో అనేక రంగాల్లో అపారమైన సంపదను గడించారు. వారి వారసులు కాల క్రమంలో రాజకీయాల్లో భాగస్వామ్యం సంపాదించారు.
ప్రకృతి నుంచి విడివడిన పశ్చిమ దేశాల సమాజం సంపద కోసం యుద్ధ మైదానాలను నిర్మించింది. ఇప్పుడు వాటిని ఆధునీకరిస్తోంది.కానీ సంధి, ఒప్పందాలతో శాంతిని సాధించాలని భారత్ ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది. దౌత్యాన్ని ఆయుధంగా మలచుకొమ్మని సూచిస్తోంది.
ప్రశాంత్ జోషి
సీనియర్ జర్నలిస్ట్