భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 6,2026 నాటికి పార్టీ 46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ ఏట సగర్వంగా అడుగుపెట్టింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆవిర్భావ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నాయి. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే రోజు గుంటూరు జిల్లా తాడికొండలోని మోతడక గ్రామంలో ‘మన ఊరు – మనజెండా’ కార్యక్రమం ప్రారంభించారు. జనసంఘ్ నుంచి బీజేపీ దాకా ఏడున్నర దశాబ్దాల సైద్ధాంతిక ప్రయాణాన్ని, సాధించిన విజయాలను, పార్టీ ముందున్న భవిష్యత్ లక్ష్యాలను ఆయన వివరించారు. ఇదే స్ఫూర్తితో, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బృహత్తర లక్ష్యంతో ‘మన ఊరు ` మన జెండా’ అనే నూతన కార్యక్రమానికి రాష్ట్ర శాఖ శ్రీకారం చుట్టింది. మాధవ్ ప్రసంగం ఇలా సాగింది….

ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తే వారి వెన్నులో వణుకు పుట్టేలా కాకుండా, ఒక ‘విశ్వ గురువు’ స్థానంలో ఉంచి ఎంతో శ్రద్ధతో, గౌరవంతో చూసేలా దేశాన్ని తీర్చిదిద్దాలన్నది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అదే సమయంలో, ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనో, బానిసగా చేసుకోవాలనో దుస్సాహసం చేసే వారిని తరిమికొట్టే ‘శక్తిశాలి భారత’గా ఆవిర్భవించాలన్నది కూడా పార్టీ సిద్ధాంతమయని, ‘దేశం ముందు, పార్టీ తర్వాత, వ్యక్తిగతం చివర’(“నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట”) అనే నినాదంతో పార్టీ కార్యకర్తలు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు..

జాతి పునర్నిర్మాణమే పరమావధి

సుమారు వెయ్యి సంవత్సరాల పాటు పరాయి పరిపాలనలో మగ్గిన దేశాన్ని, ఆ బానిసత్వపు జాడ్యాల నుంచి పూర్తిగా విముక్తి చేసి, శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలనేదే బీజేపీ ఆవిర్భావ లక్ష్యమని మాధవ్ చెప్పారు. దేûశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో, కేవలం మతం ఆధారంగా జరిగిన దేశ విభజన, దానివల్ల రగిలిన మతవిద్వేషాల కారణంగా జరిగిన అపార నష్టం నష్టం వంటివి పునరావృతం కాకూడదని పార్టీ పటిష్టమైన పునాదులు వేసుకుందని అన్నారు. ‘దేశమంతా ఒకటే, ప్రజలంతా ఒకటే, దేశానికొకటే చట్టం’ అనే ఉన్నతమైన నినాదంతో, ప్రాంతీయ, కుల, మత, భాషా వైషమ్యాలకు తావులేకుండా ఐక్య భారతాన్ని నిర్మించడమే పార్టీ ప్రధాన అజెండా అని వివరిం చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగం ఇలా కొనసాగింది..

బలిదానాలు, పోరాటాలతో నిర్మితమైన పునాదులు

దేశభద్రతకు ముప్పువాటిల్లినప్పుడు, విపత్కర పరిస్థితులలో అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న దేశ వ్యతిరేక నిర్ణయాలను ప్రతఘటిస్తూ, వీధుల్లోకి వచ్చి అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర బీజేపీ సొంతం. సరిహద్దుల్లో సైనికులు పోరాడితే, పురవీధుల్లో కార్యకర్తలు దేశం కోసం పోరాడారు. కశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంలో అంతర్భాగం కావాలని ‘చలో కశ్మీర’ పేరిట చేసిన ఉద్యమంలో, పార్టీ తొలి అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చేసిన బలిదానం ప్రతి కార్యకర్తకూ స్ఫూర్తిదాయకం. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి లాంటి మహనీయుల అలుపెరగని కృషితో పార్టీ దశదిశలా విస్తరించింది.

గోవా విముక్తి: పోర్చుగీసు పాలనలో మగ్గుతున్న గోవా విముక్తి కోసం అఖిల భారత ప్రధాన కార్యదర్శి జగన్నాథరావు జోషి నేతృత్వంలో జనసంఘ్ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ ఉద్యమంలో 14 మంది కార్యకర్తలు పోర్చుగీసు తూటాలకు బలయ్యారు. వారి త్యాగఫలితంగానే 1961లో గోవా భారత్ లో విలీనమైంది. బేరుబారి, కచ్ వంటి సున్నితమైన ప్రాంతాలను పొరుగు దేశాలకు ధారాదత్తం చేయడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.

యుద్ధ సమయాల్లో దన్ను: 1962 చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ ట్రాఫిక్ నియంత్రణ నుంచి రక్తదాన శిబిరాల వరకు ఆరఎసఎస్, జనసంఘ్ కార్యకర్తలు విశేష సేవలందించారు.

1965 పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్‌పై దండయాత్ర చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, యుద్ధ విజయానికి పరోక్షంగా కారణమయ్యారు. దేశ భద్రత కోసం ‘అణుబాంబు’ ఆవశ్యకతను తొలుత గుర్తించి డిమాండ్ చేసిన ఏకైక పార్టీ జనసంఘ్.

అత్యయిక స్థితిపై పోరాటం

1975లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధించిన ప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేసింది కేవలం జనసంఘ్ మాత్రమే. ఇతర ప్రతిపక్షాలు లొంగి పోయినా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనసంఘ్, అఖిల భారత విద్యార్థి పరిషత్‌లు 19 నెలల పాటు నిర్విరామంగా ఉద్యమించాయి. సుమారు 50 వేల మంది కార్యకర్తలు జైళ్లలో మగ్గారు. మరో 20,000 మంది దేశవిదేశాల్లో అజ్ఞాతంలో ఉండి పోరాడారు. ఈ పోరాట ఫలితమే దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ. ఇది ఆధునిక భారత చరిత్రలో రెండవ స్వాతంత్య్ర పోరాటంగా నిలిచిపోయింది.

అటల్‌జీ నుంచి మోదీ వరకు సుపరిపాలన

సుదీర్ఘ పోరాటాల అనంతరం దేశంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీ 1996లో తొలిసారి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1999లో సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం, ‘సుపరిపాలన’కు అసలైన అర్థం నేర్పింది. పోఖ్రాన్ అణు పరీక్షలతో దేశాన్ని అణ్వస్త్ర శక్తిగా నిలపడం, కార్గిల్ యుద్ధంలో శత్రువులను మట్టికరిపించడం వాజపేయి ప్రభుత్వ ఘనతలు.

తదనంతరం, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడు సార్లు అందించిన అభివృద్ధి నమూనా యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఆయన నాయకత్వంలో 2014లో పార్టీ 282 స్థానాలతో చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో జటిలమైన సమస్యలకు మోదీ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం లభించింది. అవి: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌర చట్టం దిశగా అడుగులు. అంత్యోదయ నినాదం స్ఫూర్తితో చిట్టచివరి వ్యక్తికి కూడా ఫలాలు అందేలా సుమారు 168 సంక్షేమ పథకాల అమలు, దేశంలో విద్యుత్ లేని గ్రామం, కుళాయి నీరు, మరుగుదొడ్డిలేని ఇల్లు ఉండ కూడదనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఈ అంకితభావమే 2024లో ముచ్చటగా మూడోసారి పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. అంతేకాకుండా, ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని శత్రువులకు స్పష్టమైన సందేశం వెళ్లింది. నేడు ప్రపంచంలో ఏ యుద్ధ సంక్షోభం వచ్చినా (రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్) తలొగ్గకుండా, స్వతంత్ర విదేశీ దౌత్యంతో దేశ ప్రయోజనాలను, వాణిజ్య నౌకలను కాపాడుకుంటున్న ఘనత మోడీ ప్రభుత్వానిదే.

అభివృద్ధి దేశంగా ‘వికసిత’ లక్ష్యం

దేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి, అంటే 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేది ‘వికసిత భారతం’ లక్ష్యం. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస’ నినాదంతో ప్రతి పౌరుడినీ దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలి. ఈ మహోన్నత లక్ష్యాన్ని రాష్ట్రంలో ప్రతి గడపకూ తీసుకెళ్లేందుకే పార్టీ రాష్ట్ర శాఖ ‘మన ఊరు – మన జెండా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఈ తరుణంలో, బీజేపీ తన ఉనికిని ప్రతి గ్రామానికి విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కార్యక్రమం ద్వారా నిర్దేశించిన ప్రధాన లక్ష్యాలు:

1.రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి కూడలిలో భారతీయ జనతా పార్టీ జెండా సగర్వంగా ఎగరాలి. ప్రతి కార్యకర్త పార్టీ కండువా కప్పుకోవడం గర్వంగా భావించాలి.

  1. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం చేస్తున్న కృషిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలి.

3.అర్హులైన ప్రతి పేదవాడికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వారికి సహాయపడాలి. ఆ తద్వారా ప్రజల మద్దతును కూడగట్టాలి.

రాజకీయాలు బీజేపీకి కేవలం అధికారానికి సాధనం కాదు. ఇదొక జాతీయ నిర్మాణ యజ్ఞం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ లాంటి మహనీయుల త్యాగాలను స్మరిస్తూ, త్రికరణశుద్ధిగా ‘మన ఊరు ` మన జెండా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వికసిత భారతం, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత గ్రామాలు అనే ఉన్నత లక్ష్యంతో ప్రతి కార్యకర్త అంకితభావంతో ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు.


47వ సంఖ్య విశిష్టత

ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా 47 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. నిష్కామ కర్మతో, ప్రతిఫలాపేక్ష లేకుండా కష్టపడి పనిచేసే వారికి ఈ సంఖ్య అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే, ఒక గొప్ప పరివర్తనకు, మార్పుకు నాంది పలికే సమయంలో ఈ సంఖ్యను వాడుతుంటారు. ఆ విధంగా, భారతీయ జనతా పార్టీ 47వ ఏట అడుగుపెడుతున్న ఈ తరుణం దేశ, ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మార్పుకు సంకేతంగా నిలుస్తోంది. అక్టోబర్ 21,1951న డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ‘భారతీయ జనసంఘ’గా ప్రారంభమైన ఈ సైద్ధాంతిక ప్రస్థానం నేటికి సరిగ్గా 75 వసంతాలు పూర్తి చేసుకుంది. తదనంతరం, ఏప్రిల్ 6,1980 న ‘భారతీయ జనతా పార్టీ’గా రూపాంతరం చెంది, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, భారతదేశపు గతిని మార్చే శక్తిగా ఎదిగింది. `మాధవ్


తురగా నాగభూషణం

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE