అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీ కాలంలో ఏడాది కాలాన్ని జనవరితో విజయవంతంగా పూర్తిచేశారు. మొదటి విడత అధ్యక్షుడిగా ఉన్నప్పటి ట్రంప్‌తో పోలిస్తే నేటి ట్రంప్ పూర్తి భిన్నం. కార్యనిర్వాహక అధికారాలను విచ్చలవిడిగా ఉపయోగించడమే కాదు, విదేశాంగ విధానంలో మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా తన చిత్తం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ఇంటా బయటా పలు వివాదాలకు కారణమవుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా తాను చెప్పిందే వేదమన్న రీతిలో ప్రవర్తించడంవల్ల విదేశాంగ విధానం పూర్తి అసంబద్ధంగా మారింది. ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారు కనుక తాను కూడా ఆ బహుమతిని స్వీకరించడానికి అర్హుడినే అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం.
ఎనిమిది దేశా మధ్య యుద్ధాలను ఆపేశానని, ముఖ్యంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య అణుయుద్ధా న్ని నివారించానని పదేపదే చేసుకుంటున్న స్వోత్కర్ష అంతర్జాతీయ సమాజానికి విసుగు తెప్పిస్తున్నది. ట్రంపరితనానికి వెనుజులా, ఇరాన్, గ్రీన్‌ల్యాండ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కేవలం ప్రధాని మోదీ ఫోన్ చేయలేదన్న కారణంగా మనదేశంపై 50శాతం టారిఫ్‌లు విధించిన ఆధునిక తుగ్లక్ ట్రంప్! తన మాట వినని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు విధిస్తుండటం బూమరాంగ్ అయి సగటు అమెరికన్ పౌరులు ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే, ఖజానాకు ఆదాయం బాగా వస్తున్నదంటూ తనకు తాను భుజాలు చరుచుకోవడం ట్రంప్‌కే చెల్లింది.
అమెరికన్లకు భారంగా ట్రంప్
మేక్ అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నా యి. ఈ ఏడాది కాలంలో ట్రంప్ మొత్తం 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇచ్చి రికార్డు నెలకొల్పారు. అధికారంలోకి వచ్చీరాగానే రెండు నుంచి మూడు లక్షల వరకు ఉద్యోగులను తొలగించి పెద్ద వివాదానికి తెరతీశారు. ‘‘ఎలైన్ ఎనిమీస్ యాక్ట్’’ కింద పెద్ద ఎత్తున విదేశీయులను స్వదేశాలకు పంపించడం మొదలైంది. ఈ చట్టం కింద తాజాగా మిన్నెసొటా లోని కొలంబియా హైట్స్‌లో ఐదేళ్ల బాలుడు లియాం కొనెజో రామోస్‌ను ఇమ్మిగ్రేషన్ అధికార్లు అదుపులోకి తీసుకోవడం పరాకాష్ట. దీంతో దేశంలో పెద్ద దుమారం చెలరేగింది. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వివిధ నగరాల్లో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ‘‘ఎలిగేటర్ ఆల్‌కాట్రజ్’’ వంటి డిటెన్షన్ సెంటర్లను తెరవడం, గత ఏడాది మార్చిలో వందమంది వెనుజులా పౌరులను అతి క్రూరమైనదిగా భావించే ‘‘సాల్వ డోరాన్ జైలు’’కు తరలించడం పెద్ద వివాదానికి దారితీసింది. అమెరికా వాణిజ్య భాగస్వాములపై 10% బేస్‌లైన్ టారిఫ్‌ల పేరుతో, ఇక చైనాపై ఏకంగా 145% సుంకాలను విధించారు. ఈ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం, యు.ఎన్.ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ నుంచి యు.ఎస్.ను ఉపసంహరింపజేశారు. శిలాజ ఇంధనాల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అనుమతులను రద్దుచేశారు.
ఇక అధికార పగ్గాలు చేపట్టిన రోజునే ‘‘ప్రౌడ్ బోయ్స్’’, ‘‘ఓథ్ కీపర్స్’’ పేరుగల ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు 1500 మందిని జైళ్ల నుంచి విడుదల చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేశారు! వీరు గతంలో డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చారు. జనవరి 6 క్యాపిటల్ దాడికి బాధ్యులు. వీరిపై హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడినట్టు నేరం రుజువైంది. దేశవ్యాప్తంగా డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ (డీసీఐ) కార్యక్రమాలను రద్దుచేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. జాతీయ పార్కుల్లోకి ఉచిత ప్రవేశాన్ని తన పుట్టినరోజు తేదీకి మార్చేశారు. బహుళ ట్రంప్ బ్రాండ్‌లతో క్రిప్టో బిజినెస్‌లను ప్రారంభించడం మరో వివాదానికి దారితీసింది.
పెరిగిన సొంత ఆస్తులు
అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల దేశం పరిస్థితి ఎట్లా ఉన్నా, ఆయన ఆస్తులు మాత్రం గణనీయంగా పెరిగా యని న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం వెల్లడించింది. రెండోసారి అధ్యక్షుడైన ఏడాది కాలంలోనే ట్రంప్ ఆస్తులు ఏకంగా 1.4బిలియన్లు పెరిగాయట! తన క్రిప్టో కరెన్సీ వెంచర్ల నుంచి ఇంత పెద్దమొత్తంలో సంపాదించగలిగాడన్నది ఆ విశ్లేషణ సారాంశం. ‘‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’’, ‘‘మీమ్ కాయిన్’’ ద్వారా వందల మిలియన్ల డాలర్లు ట్రంప్ కుటుంబానికి వచ్చాయని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒమన్, సౌదీ అరేబియా, వియత్నాం వంటి దేశాల్లో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టుల ద్వారా కోట్లాది రూపాయలు, లైసెన్సింగ్ ఫీజుల రూపంలో 23 మిలియన్ డాలర్లు సంపాదించినట్టు తెలుస్తోంది.
తగ్గిన సానుకూలత రేటింగ్
ట్రంప్ చేపడుతున్న ఇటువంటి తిక్క పనులతో విసిగెత్తిన అమెరికన్లలో ఆయన పట్ల ప్రతికూలత రేటింగ్ 2025 చివరి నాటికి గణనీయంగా పెరిగి ఏకంగా 60%కు చేరడం గమనార్హం. సివిల్ సర్వెంట్లపై సామూహిక కాల్పులు, ట్రంప్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 2025 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ‘‘నో కింగ్స్’’ పేరుతో ఆందోళనలు నిర్వహించారు. పుట్టుకతో పౌరసత్వ హక్కు రద్దు, పవన విద్యుత్ ఉత్పత్తికి అనుమతులను నిలిపేయడం వంటి చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కొనసాగుతోంది.
నోబెల్ ప్రైజ్ నుంచి యుద్ధాల దిశగా…
ఎంత మొత్తుకున్నా నోబెల్ ప్రైజ్ రాకపోయేసరికి తన పంథాను మార్చుకొని డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటిం చారు. ఇందుకోసం అక్కడి పౌరులకు కొంతమొత్తంలో చెల్లింపులు జరుపుతామ న్నారు. డెన్మార్ ఎదురు తిరగడంతో, బలప్రయోగం తప్పదని హెచ్చరించి నప్పటికీ, నాటో దేశాలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు బలప్రయోగం మాటను పక్కనబెట్టి, అక్కడ లభించే అరుదైన ఖనిజాలకోసం కాదని, కేవలం అమెరికా రక్షణకు గ్రీన్‌ల్యాండ్ చాలా అవసరమంటూ స్వరంలో తీవ్రత తగ్గించారు. రష్యా, డెన్మార్క్, అమెరికాల మధ్య ఉన్న ఈ భూభాగంలో చైనా కార్యకలాపాలు పెరగడం ట్రంప్‌కు ఎంతమాత్రం ఇష్టంలేదు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని పదేపదే ప్రకటనలు గుప్పించడం వెనుక ప్రధాన కారణం ఇదే! ఇక జనవరి మొదట్లో వెనుజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను పదవినుంచి తప్పించాలని ఆదేశాలు జారీచేయడమే కాకుండా, సైన్యాన్ని పంపి అర్థరాత్రి దాడి చేసి మరీ మదురోను, ఆయన భార్యను అరెస్ట్ చేయించి అమెరికాకు తరలించారు. వెనుజులా అధ్యక్షుడిని తానేనంటూ ప్రకటించారు. అంతకుముందు వెనుజులా నుంచి ఏ దేశమూ చమురు కొనడానికి వీల్లేదని హుకుం జారీచేసిన ట్రంప్, ఇప్పుడు ఈ దేశంనుంచి చమురు కొనుగోలు చేయాలని మనదేశంతో సహా వివిధ దేశాలను కోరుతున్నారు. ఇక గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఏకంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు. ఏకంగా ఖతార్ నుంచి బోయింగ్-747 విమానాన్ని బహుమతిగా స్వీకరించడం పెద్ద దుమారమే లేపింది. ప్రపంచం లోనే స్వేచ్ఛకు మారుపేరుగా ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాను పాలిస్తున్న ట్రంప్ ఇప్పుడు స్వేచ్ఛ ముసుగులో నియంతగా వ్యవహరిస్తూ దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.
శాంతి వర్సెస్ యుద్ధం
కాసేపు శాంతి…మరికొంతసేపు యుద్ధం…ఇదీ ట్రంప్ వ్యవహారం. తాను ఏది కోరుకుంటే అది కావాల్సిందే. సహకరించనివాళ్లను గుర్తుపెట్టుకొని మరీ వేధించడం ఆయన నైజం. మొదట్లో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ నానా యాగీ చేసి సాధ్యం కాకపోవడంతో వెనుజులా, సిరియాలపై యెమెన్, దాడులు చేశారు. తాజాగా ఇరాన్‌వైపునకు అమెరికా సైన్యాలు వెళుతున్నాయి. మరోవైపు గ్రీన్‌లాండ్ తమకు ఇవ్వాల్సిందేనని నాటో వ్యవస్థాపక దేశం డెన్మార్క్ పై కారాలు మిరియాలు నూరడం వర్తమాన చరిత్ర. ఇక గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేయాలంటూ ట్రంప్ చేస్తున్న డిమాండ్‌తో నాటో దేశాల మధ్య ఐక్యత బీటలువారే పరిస్థితి నెలకొంది. మిగిలిన నాటో దేశాలు డెన్మార్క్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్ మొండిపట్టుపై తమ తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు జనవరి 22న బ్రెస్సెల్స్‌లో అత్యవసర సమావేశం జరిపాయి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. గ్రీన్‌లాండ్ విషయంలో తనకు మద్దతివ్వని పది ఈయూ దేశాలపై పదిశాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్ తర్వాత వెనక్కు తగ్గారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన చర్చల్లో ఆర్కిటిక్ భద్రతపై భవిష్యత్ ఒప్పందానికి అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ సుంకాల ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నానని ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గ్రీన్‌లాండ్ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ‘‘ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు. వాళ్లూ వాళ్లూ చూసుకుంటారు’’ అని స్పష్టం చేయడం ద్వారా అమెరికాకు సానుకూలంగా వ్యవహరించారు. 1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు అమ్మేసింది. 1867లో రష్యా అలాస్కాను 72లక్షల డాలర్లకు అమ్మేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేయడం గమనార్హం.
బోర్డ్ ఆఫ్ పీస్ ప్రహసనం
మరోవైపు గాజా పునర్నిర్మాణ, అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన. ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతున్న దావోస్ వేదికగా శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్)ను ఏర్పాటు చేశారు. ఈ మండలిలో చేరేవాళ్లు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాలి. దీనికి 35 దేశాలు మద్దతు తెలిపినా, మనదేశం ప్రస్తుతానికి తటస్థంగా వుంది. ముఖ్యంగా ఈ మండలి చట్టబద్ధత విషయంలో సందేహాలే మనదేశ వైఖరికి ప్రధాన కారణం. కాగా ఐరోపా సమాఖ్య దేశాల్లో కొన్ని ఈ శాంతి మండలిలో చేరేందుకు సుముఖంగా లేవు. ఇదిలా ఉండగా అమెరికా అనుంగు మిత్రుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు మొదట దీన్ని వ్యతిరేకించినా తర్వాత అంగీకరించారు. కానీ తాజాగా ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బర్కత్ మాట్లాడుతూ, ఈ శాంతి మండలిలో ఖతర్, టర్కీవంటి ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలను సభ్యులుగా అంగీకరించబోమని స్పష్టం చేశారు. గాజాలో పాకిస్తాన్ బలగాలను విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించబోమని కూడా కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడు గాజా శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్) వ్యవహారం గందరగోళంగా మారింది.
ట్రంప్ వర్సెస్ ఇండియా
ట్రంప్‌తో మనదేశం ఎదుర్కొన ప్రధాన సమస్య టారిఫ్‌లు. ప్రస్తుతం అమెరికా మనదేశంనుంచి వచ్చే దిగుమతులపై 50% టారిఫ్ అమలు చేస్తోంది. ఇందులో 10% బేస్‌లైన్ డ్యూటీ కాగా, 25% మార్కెట్ యాక్సెస్ కోసం విధించే రెసిప్రోకల్ టారిఫ్. ఇక 15% నుంచి 20% వరకు రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు విధించిన పెనాల్టీ టారిఫ్. అమెరికా విధించిన ఈ టారిఫ్‌ల వల్ల మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాలు, రత్నాలు, ఆభరాణలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ టారిఫ్‌ల వల్ల మన ఎగుమతుల్లో 36% వరకు తగ్గుదల నమోదు కావచ్చని, ఫలితంగా జీడీపీ 0.5% నుంచి 1% వరకు పడిపోతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసినా, వాస్తవంగా మన జీడీపీ ఎక్కడా తగ్గలేదు సరికదా వృద్ధి నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇదిలా ఉండగా ఔషధాలు, సెమికండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ సుంకాల నుంచి మినహాయించింది. ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న దేశాలపై ఈనెల 13 నుంచి మరో 25% సుంకాలను విధిస్తూ ట్రంప్ చేసిన మరో ప్రకటన వల్ల మనదేశం నుంచి ఎగుమతి అయ్యే బియ్యం, రసాయనాలు, టీ వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
భారత్ మిగిలిన దేశాల మాదిరిగా ట్రంప్ టారిఫ్‌లకు బెదిరిపోలేదు. తక్షణమే ప్రత్యామ్నాయ మార్కెట్లను విస్తృతం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా 2025 చివరి నాటికి చైనాకు మనదేశంనుంచి ఎగుమతులు 70%-80% పెరిగాయి. ఇదే సమయంలో ఈయూ, యురేసియన్ ఎకనామిక్ యూనియన్ (ఈఏఈయూ), ఒమన్ దేశాలతో పాస్ట్ ట్రాక్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక దేశీయంగా ప్రభుత్వం జీఎస్టీలో కోత, పన్నుల మినహాయింపు వంటి ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా శ్రామికులు అత్యధికంగా అవసరమైన వస్త్ర, చిన్నకార్ల తయారీ రంగాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న చర్యలు దేశీయ వినియోగాన్ని భారీఎత్తున పెంచాయి. యు.ఎస్.పై ఆధారపడటాన్ని మరింతగా తగ్గించేం దుకు, డీడాలరైజేషన్ పక్రియను నిశ్శబ్దంగా అమలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రష్యాతో రూపీ-రూబుల్ వాణిజ్యం కొనసాగిస్తోంది. ఇదే పక్రియను బ్రిక్స్, ఈఏఈయూలతో కూడా కొనసాగిస్తూ క్రమంగా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ వస్తోంది.
భౌగోళిక రాజకీయాల్లో నియంత్రించేందుకు ట్రంప్ ప్రయోగిస్తున్న టారిఫ్ అస్త్రాన్ని మనదేశం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నిలిపివేయడానికి తానే ప్రధాన కారణమని చేస్తున్న ట్రంప్ ప్రచా రాన్ని భారత్ అంగీకరించలేదు. కేవలం పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడం వల్లనే ఈ ఆపరేషన్‌ను నిలిపేశామని స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రంప్ తన అబద్ధపు ప్రచారాన్ని ఆపలేదు. ఇప్పటివరకు 51 సార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా మనదేశం ఏమాత్రం చలించలేదు. ఇరుదేశాల మధ్య ఉన్న తస్థాయి రక్షణ సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ, మనదేశ నాయ కత్వం ఆత్మనిర్భర్ భారత్‌వైపు దృష్టి కేంద్రీకరించి ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇక హెచ్1బీ వీసాలపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తుండటం ప్రస్తుతం మన ఐటీ రంగం, అక్కడి మన ఐటీ నిపుణులకు ఇబ్బందికరంగా మారింది.
చైనాయే ప్రధాన ప్రత్యర్థి
చైనాపై కూడా ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ లతో పాటు వివిధ రకాల ఆంక్షలను విధించింది. గ్రీన్ లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించడం వెనుక, అక్కడ చైనా కార్యకలాపాలు పెరుగుతుండటమే ప్రధాన కారణం. చైనా మిలిటరీ కంపెనీలైన ‘‘టెన్‌సెంట్’’, ‘‘కాస్‌కో షిప్పింగ్’’ సంస్థలపై యుఎస్ ఆంక్షలు విధించింది. చైనా సాంకేతిక, సంక్లిష్ట మౌలిక రంగాలు, వ్యవసాయ రంగాలపై గత ఏడాది యు.ఎస్. ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఇరాన్ చమురును శుద్ధి చేస్తున్న చైనా కంపెనీలను కూడా వదిలిపెట్టలేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్రంప్-జిన్‌పింగ్‌ల మధ్య భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలకు ఒక పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరిగే అవకాశముంది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్