సింగరేణి బొగ్గు బ్లాకుల టెండర్లు, ప్రధానంగా సింగరేణి అధీనంలోని ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ ‌వ్యవహారం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. ఈ బొగ్గు బ్లాకుకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించే అంశంలో రాజకీయ ప్రలోభాలు ఉన్నాయన్న విమర్శలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇలాంటి పరిణామాలతో కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని మరోవైపు ఆందోళన వ్యక్తమవుతోంది.అధికార విపక్షాలు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌దీనిని అస్త్రంగా చేసుకొని విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.ఈ అంశం..ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కోల్‌ ‌బెల్ట్ ‌ప్రాంతంలో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తానికి నైని బొగ్గు బ్లాక్‌ ‌టెండర్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించింది.

సుమారు 136 సవంత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి గనుల సంస్థ తొలిసారి రాష్ట్రం వెలుపల ఉన్న బొగ్గుగనుల వేలంలో కూడా పాల్గొని ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకును సొంతం చేసుకుంది. ఇది ఆహ్వానించదగిన, గర్వించ దగిన పరిణామమే అయినా, ఈ బొగ్గు గని వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. సింగరేణి అక్కడ సరికొత్త ప్రయాణం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే నైనీ బొగ్గు బ్లాక్‌ ‌టెండరు రద్దు ఆ సంస్థను గందరగోళంలో పడేసింది. విధాన పరమైన నిర్ణయాలు, గనుల కేటాయింపుల్లో ఆరోపణల మధ్య ఈ టెండర్లు రద్దు కావడం సింగరేణి చరిత్రలో అత్యంత తీవ్రమైన వివాదాల్లో ఒకటిగా నిలిచింది.

2015లో జరిగిన వేలంలో ఒడిశాలోని అంగూల్‌ ‌జిల్లాలోని నైనీ కోల్‌ ‌బ్లాక్‌ను సింగరేణి సంస్థ దక్కించుకుంది. ఈ బ్లాక్‌ 2,200 ఎకరాల్లో విస్తరించి ఉంది. 200 ఎకరాల్లో ఓవర్‌ ‌బర్డెన్‌ ‌తొలగింపు టెండర్లను ఓ ప్రైవేటు సంస్థ దక్కించు కుంది. మిగతా 2 వేల ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు సంబంధించి ‘మైన్‌ ‌డెవలపర్‌ అం‌డ్‌ ఆపరేటర్‌’ ‌విధానంలో గతంలో టెండర్లు పిలిచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దుచేసి, కొత్తగా టెండర్లను పిలిచారు. అక్కడి బొగ్గును మన రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణి ఆధ్వర్యంలోని థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రానికి తరలించాలి. నైనీ బ్లాక్‌ ‌హై-గ్రేడ్‌ ‌థర్మల్‌ ‌బొగ్గు కలిగి ఉంది.లీజు ప్రాంతంలో 85శాతం కంటే ఎక్కువ అటవీ భూమి ఉండడం వల్ల ఈ బ్లాక్‌ను కేటాయించి చాలా సంవత్సరాలైనా అటవీ అనుమ తుల్లో ఆలస్యంతో బొగ్గు వెలికితీత కూడా ఆలస్య మైంది. 2021లో దశ-10 కింద అటవీ,పర్యావరణ అనుమతులు, త 2023లో దశ-20 కింద అటవీ అనుమతి లభించింది. 643 హెక్టార్ల అటవీ భూమిని అప్పగింతకు ఎట్టకేలకు 2024లో ఆమోదం లభించింది. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించడం, మైనింగ్‌ ‌ప్రణాళికలు, భూగర్భ జలాల తొలగింపు, కాలుష్య నియంత్రణ ఆమోదాలు అమలులోకి రావడంతో ప్రాజెక్టు కార్యాచరణ దశకు చేరుకుంది. దీంతో, బొగ్గు బ్లాక్‌ను పొందిన పదేళ్ల తర్వాత అంటే.. 2025 ఏప్రిల్‌ 16‌వ తేదీన అధికారికంగా మైనింగ్‌ ‌ప్రారంభమైంది. ప్రారంభంలో సింగరేణి సంస్థ తన సొంత యంత్రా లను ఉపయోగించి ఓవర్‌ ‌బర్డెన్‌ ‌తొలగింపు, ప్రాథమిక తవ్వకాలను కొనసాగించింది. తెలంగాణ గనుల నుంచి బ్రిడ్జ్ ‌లింకేజీలపై ఆధార పడి బొగ్గును తరలించాల్సి రావడంతో 2025 జూలై నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం అవుతుందని భావించారు. నైనీ నుంచి జైపూర్‌కు రైలు మార్గం లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తే గిట్టుబాటు కాకపోవడంతో బొగ్గు గుట్టలుగా పేరుకుపోయింది.

ఈ నేపథ్యంలో… సింగరేణి సంస్థ మైన్‌ ‌డెవలపర్‌ అం‌డ్‌ ఆపరేటర్‌ ‌పద్ధతిలో ఈ బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు కేటాయించేందుకు నిర్ణయించింది. అంటే.. గని అభివృద్ధి, ఆపరేటర్‌ ‌విధానంపై మొగ్గు చూపింది. దీని ప్రకారం తవ్వకం, డ్రిల్లింగ్‌, ‌బ్లాస్టింగ్‌, ‌బొగ్గు నిర్వహణ,పునరుద్ధరణ పనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయమైంది. దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం దీని విలువను వచ్చే 25 సంవత్స రాలలో రూ.1604 కోట్లుగా అంచనా వేశారు.

నైనీ బ్లాక్‌ ‌కోసం 2025 చివరలో మైన్‌ ‌డెవలపర్‌ అం‌డ్‌ ఆపరేటర్‌లను నియమించడానికి సింగరేణి సంస్థ టెండర్లను ఆహ్వానించింది. అయితే, అసలు వివాదం అక్కడే మొదలయ్యింది. తప్పనిసరి ప్రీ-బిడ్‌ ‌సైట్‌ ‌సందర్శన,ధ్రువీకరణ నిబంధనపై పలువురు బిడ్డర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే ఈ అవకాశం కల్పించారనీ ఆరోపణలు చెలరేగాయి. అయితే ఇదే అంశం గతేడాది డిసెంబర్‌ ‌నాటికి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వ్యాపార యుద్ధం జరుగుతుందని రాష్ట్ర మంత్రి వర్గంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్ల బంధువులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారని, టెండర్లను తమవారికి ఇప్పించు కునేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు, మంత్రులు వేర్వేరు కంపెనీలకు మద్దతుగా నిలుస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్యనేతలు తమ వారికే ఈ కాంట్రాక్టు దక్కాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో టెండర్లలో నిబంధనలను ఒకరికి అనుకూలంగా మార్చారనేది ప్రధాన ఆరోపణ. ‘సైట్‌ ‌విజిట్‌’ ‌నిబంధనను సాకుగా చూపి అర్హత ఉన్న సంస్థలను తప్పించారన్న వాదనలు వినిపించాయి. తమకు కావాల్సిన కంపెనీలకే టెండర్‌ ‌దక్కేలా నిబంధనలను అడ్డం పెట్టుకుని ఇతరులను పోటీ నుంచి తప్పించారని ప్రతిపక్షాలు, కొన్ని సంస్థలు గళమెత్తాయి. అయితే, టెండర్లలో అక్రమాలకు తావిచ్చేలా ఉన్న ‘సైట్‌ ‌విజిట్‌’ ‌నిబంధనపై ప్రభుత్వం స్పష్టతనిస్తూ, ఇది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, బీఆర్‌ఎస్‌ ‌హయాం నుంచే ఈ నిబంధన అమల్లో ఉందని వెల్లడించింది. ఇక, ఈ అంశం మీడియా సంస్థల మధ్య కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసే పరిస్థితులు తలెత్తడం, ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకుంటుండటంతో.. టెండర్లను రద్దుచేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన బొగ్గు సరఫరాలో జాప్యం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించిన టెండర్‌ ‌వివాదంపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ అండర్‌ ‌సెక్రటరీ ప్రదీప్‌ ‌రాజ్‌ ‌నయన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తన ఆదేశాల మేరకే ఈ కమిటీ ఏర్పాటైనట్లు ఆ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌చేతనా శుక్లా, డైరెక్టర్‌ ‌మరపల్లి వెంకటేశ్వర్లుతో కూడిన కమిటీ హైదరాబాద్‌ ‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు విచారణ చేపట్టింది. కిషన్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీకి చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీ హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది. మైన్‌ ‌డెవలపర్‌ అం‌డ్‌ ఆపరేటర్‌ను ఎంపికకు సంబంధించి 2025 నవంబర్‌ 28‌న జారీ అయిన టెండర్‌ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందన్న అంశంపై కమిటీ విచారించింది. ఈ టెండర్‌ ‌నోటీసులోని నిబంధనలు, విధానాల అమలు, టెండర్‌ ‌పక్రియలో తలెత్తిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించింది. సేకరించిన ఫైల్స్, ఆధారాలను తమ వెంట తీసుకెళ్లిన ఆ కమిటీ-సింగరేణి సంస్థలో అమలవుతోన్న టెండర్‌ ‌విధానాలను, కోల్‌ ఇం‌డియా సహా ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న ఎండీఓ, అవుట్‌ ‌సోర్సింగ్‌ ‌విధానాలతో పోల్చి కమిటీ అధ్యయనం చేస్తుంది.

మరోవైపు..కి•షన్‌ ‌రెడ్డి ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ, సింగరేణిని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బంగారు బాతులా వాడుకుంటోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌సింగరేణి కార్మికుల రక్తం తాగుతున్నాయని, బీఆర్‌ఎస్‌, అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర శేఖరరావు కుటుంబమంతా సింగరేణిని దోచుకుందని ఆరోపించారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితికి బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనే కారణమని విమర్శించారు. ఫుట్‌ ‌బాల్‌ ఆటగాడు మెస్సీ వస్తే 10 కోట్ల రూపాయలు సింగరేణి నుంచి ఖర్చు పెట్టారని,ఫుట్‌ ‌బాల్‌కు, సింగరేణికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సంస్థకు చెందిన 51 కోట్ల రూపాయలను ప్రభుత్వం వాడుకొని తిరిగి ఇవ్వకపోవడంతో సింగరేణి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ జరుగుతోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది ఎప్పటికీ జరగదని అన్నారు. సింగరేణిలో ఖర్చు తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నైనీ బొగ్గు బ్లాకు అంశం పెద్ద సమస్య కాదని, దానిని పరిష్కరిస్తామని, రాజకీయాలను పక్కన పెట్టి సింగరేణి ప్రయోజనాల కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.

అయితే, సింగరేణి బొగ్గు గనుల వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక టెండర్‌ ‌రద్దుతో ముగిసేలా కనిపించడం లేదు. 2014 నుంచి జరిగిన కేటా యింపులపై విచారణకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించింది. మరోవైపు, ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత ఉత్కంఠగా మార్చింది.

సింగరేణికి కేటాయించిన బ్లాకుల్లో తవ్వకాల్లో జాప్యం చేసినా, అక్రమాలకు పాల్పడినా, ఆ గనులను వెనక్కి తీసుకోవడమే కాకుండా సింగరేణి నిర్వహణను కేంద్రమే చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నైనీ బొగ్గు బ్లాక్‌ ‌వ్యవహారంపై విచారణ జరిపించగా.. సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నైనీ కోల్‌ ‌బ్లాకుల వేలం నిర్వహించలేకపోతే, కేంద్రానికి అప్పగిస్తే పారదర్శకంగా వేలం నిర్వహించి సింగరేణికి కేటాయించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇదే జరిగితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో జరిగిన పరిణామాలు, అవినీతి, అక్రమాలు, ప్రభుత్వాల బండారం కూడా బయటపడే అవకాశం ఉంది. మొత్తానికి, సింగరేణి బొగ్గు గనుల సెగ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE