ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిచేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు వంటి సమస్యలను సవరించుకుంటూ, ప్రతి రూపాయిని సద్వినియోగం చేయడంపై దృష్టి సారించింది.

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రాయో జిత పథకాల నుంచి అధిక నిధులు సాధించడం, వాటిని సమర్థవంతంగా ఖర్చు చేయడం, అదనపు నిధులు తెచ్చుకోవడం అనే మూడు సూత్రాలతో రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర వాటా నిధులు కలిపి మొత్తం రూ.24,513 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.15,173 కోట్లు, రాష్ట్ర వాటా రూ.9,340 కోట్లు. ఈ నిధులను పూర్తిగా ఖర్చు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి రూ.39,642 కోట్లు కోతపడ్డాయి. అదనంగా రూ.10,171 కోట్లు వేరే పథకాలకు మళ్లించారు. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ, ఎన్డీయే ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఈ సమస్యలను పరిష్కరించి, రూ.17 వేల కోట్ల వరకు ఖర్చుచేసి విజయం సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కేంద్రమంత్రులు, అధికారులతో సమన్వయంచేస్తూ, రాష్ట్ర యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నెల రోజుల్లోనే రెండుసార్లు సమీక్షలు నిర్వహించి, లక్ష్యాలను నిర్దేశించారు. దీంతో గత నెల (డిసెంబర్) 17వ తేదీ నాటికి రూ.10,362 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన స్థితి నుంచి, నెల గడవక ముందే అదనంగా రూ.2,000 కోట్లకు పైగా వెచ్చించారు. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పర్య వేక్షణను మరింత బలోపేతం చేశారు. ఇప్పుడు కేంద్రం నుంచి మూడో విడత నిధులు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో రాష్ట్రాలు కేంద్ర నిధులను పక్కదారి పట్టించడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు ప్రవేశపెట్టింది. ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ, సింగిల్ నోడల్ అకౌంట్ ఫ్రేమ్‌వర్క్ (స్నఫ్) వంటివి ఉన్నాయి. ఈ విధానంలో కేంద్ర నిధులు రాష్ట్ర ఖజానాకు చేరి, బిల్లులు సమర్పించిన తర్వాత నోడల్ ఏజెన్సీలకు విడుదల చేస్తారు. కానీ, ఈ విధానంలో లోపాలు ఉన్నాయని గుర్తించి, స్నఫ్ మార్గదర్శకాలను అమలు చేశారు. వీటి ప్రకారం,ప్రతి కేంద్ర పథకానికి సింగిల్ నోడల్ ఖాతా ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర వాటాల నిధులు ఆ ఖాతాకే విడుదల చేయాలి. దీంతో నిధుల మళ్లింపు అవకాశాలు తగ్గుతాయి, పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పులు రాష్ట్రంలోని పథకాల అమలును మరింత సమర్థవంతం చేస్తున్నాయి. ఉదాహరణకు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఈ పథకాలు ప్రభావం చూపుతున్నాయి.

మొత్తంగా, ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, సమన్వయం, పర్యవేక్షణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. గత ప్రభుత్వ లోపాల నుంచి బయటపడి, కేంద్ర సహకారంతో భవిష్యత్ లక్ష్యాలను సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి, రాష్ట్రానికి మరిన్ని అవకాశాలు తెరుస్తాయి.

21 లక్షల పిల్లలకు పోషకాహారం

పోషణ అభియాన్ 2.0 పథకం ద్వారా రాష్ట్రంలో 21 లక్షల మంది బాలలకు ప్రయోజనం కలిగింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రానికి రూ. 1,007 కోట్లు కేటాయిం చింది. మహిళలు, బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తారు. 0-6 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం. మానవాభివృద్ధి ఈ పథకం లక్ష్యం. పోషకాహారంపై అవగాహన పెంచుతుంది, స్థిరమైన ఆరోగ్యం, మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తుంది. అంగన్‌వాడీలలో బాల్య సంరక్షణ చేపడుతుంది. పిల్లలలో ఎదుగుదల లోపం, క్షీణత, తక్కువ బరువు సమస్యలు తగ్గుతాయి. గర్భిణులు, బాలింతలకు పోషకాలు అందడంతో శిశు మరణాలు తగ్గుతాయి, మాతా – శిశువుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆడపిల్లలలో రక్తహీనత నియంత్రణకు సహాయ పడుతుంది. ఈ పథకం వల్ల 8 కోట్ల మంది పిల్లలకు, కోటి మంది గర్భిణులు, బాలింతలు, ఆకాంక్ష జిల్లాలలో 20 లక్షల మంది ఆడపిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. సమాజంలో ఆరోగ్య స్థిరత్వం, ఉత్పాదకత పెరుగుతాయి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు దోహదపడుతుంది. ప్రస్తుత ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం 2025-26లో రూ.21,960 కోట్లు కేటాయించింది.

35 లక్షల విద్యార్థులకు సదుపాయాలు

సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా రాష్ట్రం లో 35 లక్షల మంది విద్యార్థులకు విద్యకు సంబం ధించిన సదుపాయాలు అందాయి. సర్వ శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఉపాధ్యాయ విద్యను కలిపి రూపొందింది. ప్రీ-స్కూల్ నుండి సీనియర్ సెకండరీ వరకు సమగ్ర, నాణ్యమైన విద్య అందించడం జాతీయ విద్యా విధానం`2020 అమలు, విద్యా హక్కు చట్టం`2009కు సహాయం పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం పెంపొందించడం సామాజిక, లింగ అంతరాలు తగ్గించడం సమానత్వం, సమ్మిళితం, వృత్తి విద్య ప్రోత్సహించడం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సహాయం ఈ పథకం లక్ష్యం. పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మెరుగవుతు న్నాయి. ఉపాధ్యాయుల శిక్షణ, డిజిటల్ సాధనాలు (స్మార్ట్ తరగతులు, సమాచార సాంకేతికత) ప్రవేశ పెట్టారు. అట్టడుగు సముదాయాలు, ఆడపిల్లలు, దివ్యాంగులకు సమాన అవకాశాలు లభిస్తున్నాయి. 35 లక్షల మంది విద్యార్థులకు సదుపాయాలు మెరుగు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో పాత బిల్లులకు రూ.1,240.10 కోట్లు చెల్లించింది. రాష్ట్ర వాటాతో కలిపి రూ.1,893.50 కోట్లు ఖర్చు చేసింది. 2025-26లో రూ.1,854 కోట్లు సింగిల్ నోడ్ ఖాతాలో ఖర్చు చేసేందుకు అందుబాటులో ఉండగా రూ.1,446 కోట్లు ఖర్చు చేశారు.

గ్రామీణ రహదారులకు నిధులు

రాష్ట్రంలో పీఎం జన్మన్ (అడవితల్లి బాట) ద్వారా 239 ఆవాస ప్రాంతాలకు రూ.555 కోట్ల వ్యయంతో 206 రోడ్లు అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 30 బీటీ రోడ్లు వేస్తున్నారు. 160 పనులు మార్చి ఆఖరిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పల్లె పండగ-2.0 కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రూ. 1,122 కోట్ల వ్యయంతో 976 కి.మీ. మేర రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. నాబార్డు నిధులతో 1,203 కిలోమీటర్ల మేర 402 రహదారుల పనులకు రూ. 557 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంటు బ్యాంకు (ఏఐఐబి) ద్వారా రూ. 1,100 కోట్ల వ్యయంతో 963 కి.మీ రోడ్లు (561 పనులు) నిర్మిస్తున్నారు.

రైతులకు నీటి సదుపాయం

ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద రాష్ట్రంలోని రైతులకు సౌర శక్తి ద్వారా నీటిపారుదల సౌకర్యాలు, డీజిల్ పంపులు తగ్గించడం, ఆదాయం పెంచడం జరుగుతుంది. ఈ పథకానికి రాష్ట్రంలో రూ.111 కోట్లు కేటాయించగా, రూ.62 కోట్లు ఖర్చుచేశారు. 2026 నాటికి 34,800 మెగావాట్ల సౌర సామర్థ్యం సాధించడం, 20 లక్షల సౌర పంపుల ఏర్పాటు ఈ పథకం లక్ష్యం. 15 లక్షల సౌరశక్తీకరణ పంపులు ఇప్పటికి ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటలో రైతులకు 60% సబ్సిడీ, 30% రుణం లభించగా 10% స్వంతంగా సమకూర్చు కోవాలి. సౌర యూనిట్లతో విద్యుత్ అమ్మి ఆదాయం (హెక్టారుకు రూ.80,000/సంవత్సరం) పెరుగు తుంది. డీజిల్ ఖర్చు తగ్గుతుంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.34,422 కోట్లు సహాయం అందిస్తోంది.

ఆరోగ్య సదుపాయం

జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి రూ.1,001 కోట్లు కేటాయించగా రూ.187 కోట్లు ఇప్పటికి ఖర్చుచేసింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌లు సంయుక్తగా అమలుచేస్తాయి. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, మాతాశిశు మరణాలు తగ్గించడం, రక్తహీనత, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నియంత్రణ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతం చేయడం, పునరుత్పత్తి, మాతృత్వ, నవజాత, బాల్య, యువ ఆరోగ్య సేవలు మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం 2024-25లో రూ.36,000 కోట్లు కేటాయించింది. ఆంధ్రలో రూ.1,001 కోట్లు మంజూరు చేయగా, రూ.187 కోట్లు ఖర్చు చేసింది. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.1,838 కోట్లు ఇచ్చింది.

తురగా నాగభూషణం

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE