పశ్చిమ బెంగాల్‌లో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఒకే వ్యక్తిని తండ్రిగా పేర్కొంటూ వందలాదిగా వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేసుకున్న దృష్టాంతాలు కోకొల్లలు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇటీవల సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. ఇందుకు తార్కాణంగా 2025 సంవత్సరానికి ఓటర్ల జాబితాకు సంబంధించి అసోన్‌సోల్ జిల్లా, బారబని, 283 నంబరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే వ్యక్తిని తండ్రిగా పేర్కొన్న 389 ఓటర్లు వెలుగులోకి వచ్చారు. సరిచేయాల్సిన అలాంటి అస్తవ్యస్తమైన సమాచారాన్ని తర్కబద్ధమైన అపసవ్యతలు (లాజికల్ డిస్‌క్రెపెన్సీస్) కేటగిరీలోకి చేరుస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీýతో కూడిన ధర్మాసనానికి ఈసీ తరఫు న్యాయవాది రాకేష్ ద్వివేది తెలిపారు. రికార్డులను సరిచేయడం కోసం అలాంటి ఓటర్లకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. వారి సరైన తల్లిదండ్రుల పేర్లతో కూడిన పత్రాలను సమర్పిం చాల్సిన బాధ్యత నోటీసులు అందుకున్న ఓటర్లపై ఉంటుంది.

ఈసీ అఫిడవిట్ ప్రకారం169 అసెంబ్లీ నియోజకవర్గంలో (బాల్లి, హౌరా జిల్లా) ఒకే వ్యక్తిని తండ్రిగా పేర్కొంటూ 310 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఇక్కడ ఏడుగురు వ్యక్తులను గురించి చెప్పాలి. ఈ ఏడుగురు 100 మంది ఓటర్లకు తల్లిదండ్రులుగా ఉన్నారు. అలాగే 10 మంది వంతున వ్యక్తులు 50 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఓటర్లకు తండ్రులుగా నమోదై ఉన్నారు. మరో 10 మంది 40 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఓటర్లకు తండ్రులుగా ఉన్నారు. 14 మంది 30 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఓటర్లకు తండ్రులుగా, 50 మంది 20 లేదా  అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు తల్లిదండ్రులుగా, 8,682 మంది 10 మంది పిల్లలకు తల్లిదండ్రులుగా, 2,06,056 మంది ఆరుగురు పిల్లలకు తల్లి దండ్రులుగా, 4,59,054 మంది ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రులుగా నమోదై ఉన్నారని అఫిడవిట్ వెల్లడించింది.

2019`21 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో సగటున ఒక కుటుం బంలో సభ్యుల సంఖ్య 4.4గా ఉంది. ఇదే విషయమై ఈసీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ ఈ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతీ కుటుంబానికి సగటున ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలు ఉండాలి. అయితే కొన్ని కేసుల్లో(పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి) ఒక తండ్రికి ముడిపడి ఉన్న ఓటర్ల సంఖ్య 50కి పై మాటగా ఉంది. దీనిపై ఓటర్ల నుంచి వివరణ కావాలి అని అన్నారు. కనుక ఒకే వ్యక్తికి సంతానంగా ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల వెనుక నిజానిజాలను, సాధ్యాసాధ్యాలను మరింత జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి కేసుల్లో మోసపూరితమైన వాటిని ఏరిపారివేయడానికి ఆ ఓటర్లకు ఓటరు నమోదు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు అని కోర్టుకు ద్వివేది విన్నవించారు.

ఈసీ తర్కబద్ధమైన అపసవ్యతలు (లాజికల్ డిస్‌క్రెపెన్సీస్) కేటగిరీకి లోబడి అదనంగా నాలుగు ప్రాతిపదికల కింద ఓటర్లకు నోటీసులు జారీ చేస్తోంది. అందులో మొదటిది అక్టోబర్ 27, 2025 నాటి ఎన్నికల జాబితాలో ఉన్న ఓటరు పేరు 2002లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్) చేపట్టిన తర్వాత విడుదల చేసిన జాబితాలోని పేరుతో సరితూగకపోవడం. రెండవది 2002 ఎసఐఆర్ జాబితా ప్రాతిపదికగా లెక్కించిన ప్రకారం ఓటరుకు, అతడు లేదా ఆమె తల్లిదండ్రులకు మధ్య వయోభేదం 15 సంవత్సరాల కన్నా తక్కువ ఉండటం. మూడవది ఓటరుకు, తల్లిదండ్రులకు మధ్య వయోభేదం 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండటం. ఈ కేటగిరి లోనే నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ కూడా ఎన్నికల సంఘం నుంచి నోటీసు అందుకు న్నారు. ఓటరుకు, గ్రాండ్ పేరెంట్స్‌కు మధ్య వయోభేదం 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉండటాన్ని నోటీసులు జారీ చేయడానికి నాల్గవ ప్రాతిపదికగా ఈసీ పరిగణిస్తోంది.

–  జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE