తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబర్, 2023లో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉండాలి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని అన్నారు. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు.. నిర్మూలించాలి.. అలానే మనం సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల్ని తమిళనాడులోని బీజేపీ నాయకులు సహా హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు ఉదయనిధి. మీ కాషాయపు రంగు పులుముకున్న వాళ్లు చేసే బెదిరింపులకు భయపడను.. మేం పేరియార్, అన్నా, కలైంగార్ వారసులం.. నేను ఈ వ్యాఖ్యలు ఇప్పుడే కాదు.. రేపు చేస్తాను.. ఎప్పుడూ చేస్తూనే ఉంటాను.. ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం.. అని ట్వీట్ చేశాడు. దీంతో ఉదయ నిధి స్టాలిన్ మీద కేసులు నమోదయ్యాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ నెల జనవరి 20న సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల విషయంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగం వాస్తవానికి ‘విద్వేషపూరిత ప్రసంగం’ కిందకే వస్తుందని జస్టిస్ ఎస్. శ్రీమతి స్పష్టం చేశారు. ఉదయనిధి వివాదా స్పద వ్యాఖ్యలను విమర్శించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై నమోదైన క్రిమినల్ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఉదయనిధి వ్యాఖ్యలను ‘మారణహోమానికి పిలుపు’గా అభివర్ణిస్తూ మాల్వియా చేసిన పోస్ట్‌లో ఎటువంటి నేరం లేదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిని లక్ష్యంగా చేసుకుని మంత్రి ప్రసంగించారని, సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా మాల్వియా కూడా ఆ వ్యాఖ్యల బాధితుడేనని కోర్టు పేర్కొంది.
విద్వేషపూరిత ప్రసంగం చేసిన వ్యక్తిపై చట్టపర మైన చర్యలు తీసుకోకుండా, కేవలం ఆ ప్రసంగంపై స్పందించిన వారిపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూల కారకులను విస్మరించి, బాధితులపై చర్యలకు ఉపక్రమించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
“డీఎంకే హిందూ మతంపై నిరంతరం దాడి చేస్తోంది” అని హైకోర్టు మధురై బెంచ్ తీవ్రంగా వ్యాఖ్యానించింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి అదే భావజాలంతో సంబంధం కలిగి ఉన్నారని పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతున్నవారు తరచుగా శిక్షల నుంచి తప్పించుకు పోతున్నారని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తూ, మహాత్మా గాంధీ వంటి మహనీయులు కూడా తనను తాను సనాతన హిందువుగా పదేపదే ప్రకటించుకున్నారని కోర్టు గుర్తు చేసింది.
ధార్మిక విధుల్లో జోక్యం
స్టాలిన్ ప్రభుత్వం హిందువుల పండగలు, కార్యక్రమాలు వచ్చేసరికి అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. తాజాగా తిరుప్పరంకుండ్రం దీపం విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో మధురై సమీపంలో ఉన్న తిరుప్పరం కుండ్రం మొదటిది. కార్తికమాసంలో ఇక్కడి కొండ పురాతన స్తంభం వద్ద దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అదే కొండపై అక్రమంగా ఏర్పాటు చేసిన సికందర్ బాదుషా దర్గా ఉండటంతో ఆ కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినదని, అక్కడ హిందువులు దీపం వెలిగించ డానికి వీల్లేదని దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దొరికిందే సాకు అన్నట్లుగా ప్రభుత్వం కొండపై దీపం వెలిగించడం నిషేధించింది. మద్రాసు హైకోర్టు మధురై బెంచికి ఫిర్యాదు చేరడంతో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తిరుప్పరంకుండ్రంపై దీపం వెలిగించడానికి అనుమతి నిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఈ తీర్పును పాటించకపోవడంతో హిందూ భక్తులు నిరసన తెలిపారు. కొండపై ఉన్న పురాతన స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు. మరోవైపు మత సామరస్యానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేశారంటూ ఆ న్యాయమూర్తిని అభిశంసించేందుకు ప్రయత్నాలు జరిగాయి. పైగా ఆ తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. స్టాలిన్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అల్లర్లు జరుగుతాయని కారణం చూపి కొండపై కార్తీక దీపం వెలిగించకుండా ఆపడం సరికాదని జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మండిపడింది. హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కల్పించింది.
తాజాగా కేరళ తిరుణవాయలోని నీల నది ఒడ్డున జరుగుతున్న మహా కుంభమేళ విషయంలోనూ స్టాలిన్ ప్రభుత్వం రాద్దాంతం చేసింది. మహా కుంభ మేళాకు సంబంధించిన ఆచారాలలో పాల్గొనడానికి తమిళనాడులోని త్రిమూర్తి కొండల నుండి కేరళకు వెళ్తున్న పవిత్ర మహామేరు రథయాత్రకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పైగా మహా మేరును రథం నుంచి వేరు చేయాలని, మహా మేరును విడిగా రవాణా చేసుకోవాలని ప్రభుత్వం కొత్త షరతులు విధించింది. రథయాత్ర ఊరేగింపు కేరళలోకి ప్రవేశించే ముందు తమిళనాడులోని తిరుప్పూర్, ఉడుమల్‌పేట్, పొల్లాచి, కోయంబత్తూర్, ఎట్టిమడై ప్రాంతాల గుండా వెళ్లాల్సి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం గుండా వెళ్లడానికి వీలు లేదని స్టాలిన్ సర్కారు చెప్పింది. విధిలేని పరిస్థితుల్లో నిర్వాహకులు రథాన్ని విడదీసి కేరళ సరిహద్దుకు తరలించి, అక్కడ నుండి పునరుద్ధరించి కేరళలోకి తీసుకువచ్చారు.
మరోవైపు అదే సమయంలో ముస్లింలు నిర్వహించే చందన వేడుకలకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హిందూ దేవాలయానికి చెందిన పవిత్ర స్థల వృక్షంపై ముస్లిం జెండాను ఎగురవేయడా నికి అనుమతించింది. అయితే చివరికి కోర్టు ఆదేశాలతో దీనిని తొలగించారు. హిందూ భక్తులు కొండపై ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శిం చడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం హిందూ వ్యతిరేకత, అన్య మతాల పట్ల ఆపేక్ష ఇక్కడ స్పష్టంగా బయటపడింది.
తమిళనాడు ఇప్పడు గతంలో మాదిరిగా మౌనంగా హిందూ వ్యతిరేక ధోరణులను భరించే స్థితిలో లేదు. ద్రవిడవాదం, నాస్తికవాదం ముసుగులో పచ్చి హిందూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న డీఎంకే ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. స్థాలిన్ ప్రభుత్వం ధార్మిక కేంద్రాలు, హిందువుల ఆలయాల విధులపై చేస్తున్న పెత్తనం చూస్తుంటే ఈ రాష్ట్రం కాస్తా మరో అయోధ్యగా మారుతోందని, హిందూ చైతన్యానికి వేదికగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు.
తమిళ ప్రజలు కుమార స్వామిని మురగన్ అంటారు. మురుగన్ శక్తి పీఠాల్లో ఒటైన తిరుప్పరంకుండ్రం విషయంలో వారి మనో భావాలను తీవ్రంగా దెబ్బతీసింది స్టాలిన్ సర్కారు. ఈ వివాదాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. తప్పులన్నీ ప్రభుత్వం తరపునే కనిపిస్తుంటే బీజేపీ మత విద్వేషాలను రగిలించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు డీఎంకే నాయకులు. మైనారిటీల ఓట్లే తమ ప్రాధాన్యత అని సంకేతాలు ఇవ్వడం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు.
సినీ పరిశ్రమదీ అదే ధోరణి
తమిళ సినీ పరిశ్రమ సైతం మొదటి నుంచీ హిందూ వ్యతిరేకతకు కేంద్రంగా మారిపోయింది. ఇందులో కమల్ హాసన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా ఏ మతాచారాలను పాటించరు. నాస్తికుడిని అని చెప్పు కుంటారు. అది ఆయన వ్యక్తిగతం. కానీ అవకాశం దొరికినప్పుడల్లా హిందూమతం మీద విషం చిమ్ముతారు. సనాతన ధర్మం అనే సంకెళ్లను తెంచే ఏకైక ఆయుధం విద్య అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. చోళ రాజులు హిందువులు కాదని, బ్రిటీష్ వారు వచ్చే వరకు హిందూ అనే పదం లేదని అన్నారు. కమల్ గతంలో ఒకసారి నాథూరామ్ గాడ్సేను ఉద్దేశించి స్వతంత్ర భారత మొదటి ఉగ్రవాది ఒక హిందువు అని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
అలాగే నటి జ్యోతిక ఒక అవార్డు ఫంక్షన్‌లో మాట్లాడుతూ, ఆలయాలకు విరాళాలు ఇచ్చే ముందు పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి గురించి ఆలో చించాలి అనగా.. దీనికి మద్దతుగా నటుడు సూర్య స్పందిస్తూ మానవత్వం మతం కంటే గొప్పదని పేర్కొ న్నారు. హిందూ దేవాలయాలను లక్ష్యం చేసుకోవడం తమిళ నటీనటులకు కొత్తేమీ కాదు. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో వెలుగులోకి వచ్చిన నటుడు సత్యరాజ్ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని వాడుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎల్‌టీటీఈ అధినేత దివంగత ప్రభాకరన్ చిత్రపటాన్ని ఆవిష్క రించే సమయంలో హిందూ దేవతలను ఉద్దేశించి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరో నటుడు విజయ్ సేతుపతి హిందూ దేవాలయాల్లోని పూజా విధానాలపై చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయి.
నటులు, సెలబ్రిటీలు ఏదో సందర్భంలో హిందూ వ్యతిరేకతను బాహాటంగా చాటుకొని వివాదాలకు కేంద్రమవుతున్నారు. సోషల్ మీడియా, హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఇలాంటి చర్యలకు అడ్డుకట్టపడటం లేదు. తమిళ పరిశ్రమ డీఎంకే, ద్రవిడవాదుల కన్నుసన్నల్లో నడుస్తున్నందున వారి అవకాశాలకు ఎలాంటి ఢోకా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.
రెహమాన్ విక్టిమ్ కార్డు
చివరకు ఏఆర్ రెహమాన్ కూడ ఇలా తయార య్యాడేంది అని ఆశ్చర్యపడక తప్పని పరిస్థితి ఇది. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అంటే ఇష్టపడని వారెవరు? మూడు దశాబ్దాలుగా తమిళ, హిందీ, తెలుగు ఇతర దక్షిణాది చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను ఉర్రూతలూ గించాడు. ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు సహా 6 సార్లు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాలు, డజన్ల కొద్దీ ఫిలింఫేర్ అవార్డు పొందారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో యువ కళాకారుల ప్రవేశంతో ప్రేక్షకుల అభిరుచుల్లో కాస్త మార్పు వచ్చింది. కొన్ని సందర్భాల్లో రెహమాన్ డిమాండుకు తగ్గటు పారితోషికం ఇవ్వలేని పరిస్థితులు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం మతపరమైన వివక్ష కారణమంటూ కలకలం రేపారు. తాను తాజాగా సంగీతం అందించిన ఛావా చిత్రం సమా జాన్ని విభజించే అంశాలపై ఆధారపడి రూపొందిం దని అన్నారు. రెహమాన్ వ్యాఖ్యలపై హిందూ సమాజం ఒక్కసారి మండిపడింది. ఇంత కాలం ఆదరించిన మెజారిటీ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీయడాన్ని ఏమాత్రం సహించలేక పోతున్నారు. ముఖ్యంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావా చిత్రం మీద ఆయన చేసిన వ్యాఖ్య అర్థం లేనిది.
రెహమాన్ తనకు అవకాశాలు తగ్గినందుకు మతం కార్డును వాడుకోవడాన్ని చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా తప్పుపడుతున్నారు. ఒకవేళ రెహమాన్ తనకు మళ్లీ అవకాశాలు పెరగాలని కోరుకుంటే ‘ఘర్ వాపసీ’ కావాలని కొందరు సూచించారు. ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. మతం మారిన తర్వాత అల్లా రఖా రెహమాన్ అనే పేరు పెట్టుకున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు రెహమాన్ తాను చేసిన వ్యాఖ్యలకు ఎంత వివరణ ఇచ్చుకోవాలని ప్రయత్నించినా ఎవరూ మన్నించలేకపోతున్నారు.

– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్