మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.‌డి.ఏ ఘన విజయాలు సాధించిన తర్వాత ఇక అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల మీద కేంద్రీకృతమైంది. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, చొరబాటుదార్లతో పాలకులు కుమ్మక్కవుతున్నారని, భవిష్యత్తులో ఇది పశ్చిమ బెంగాల్‌నే కాక, యావద్దేశాన్ని సర్వనాశనం చేసే ప్రమాదం ఉందని, ఈ కుమ్మక్కును భగ్నం చేయాల్సిన బాధ్యత ఓటర్లదేనని పదే పదే స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జనాభా సంఖ్యలు తారుమారవుతున్నాయని కూడా ఆయన హెచ్చరించారు. ఈ మాటలతో ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరించడంతో పాటు, రాష్ట్రంలో బీజేపీ అజెండాకు అంకురార్పణ చేసినట్టయింది.

పశ్చిమ బెంగాల్‌లో 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఆమె కోల్‌కతాలోని రైటర్స్ ‌బిల్డింగ్‌లో, అంటే సచివాలయంలో అడుగు పెట్టినప్పుడు కొందరు రాజకీయ విశ్లేషకులు ఆమె ఘన విజయానికి అయిదు కారణాలున్నాయని వివరించారు. సుమారు 34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు విసుగెత్తిపోవడం, సింగూర్‌, ‌నందిగ్రామ్‌లలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోవడానికి వ్యతిరేకంగా ఆమె పార్టీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఉద్యమించడం, వామపక్ష ప్రభుత్వ కాలంలో రాజకీయాలు పూర్తిగా నేరపూరితం కావడం, మావోయిస్టులు ఆధిపత్యం చెలాయించిన ప్రాంతాల్లో అరాచక పరిస్థితులు నెలకొనడం, విపరీతమైన అవినీతితో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వంటి కారణాల వల్ల ఆమె అధికారంలోకి రాగలిగి నట్టు విశ్లేషకులు అప్పట్లో వివరించారు.
పదిహేను సంవత్సరాల తర్వాత సరిగ్గా అవే కారణాలు మమతా బెనర్జీ హయాంలో కూడా కనిపిస్తున్నాయి. ఏ సర్వేను చూసినా, ఏ అధ్యయనాన్ని పరిశీలించినా ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ద్యోతకమవుతోంది. నేరమయ రాజకీయాలు అనేక రెట్లు పెరిగాయని, అట్టడుగు స్థాయిలో కూడా ఇది విశృంఖలమైందని సర్వేలు తెలియజేస్తున్నాయి. వామపక్ష కూటమి నుంచి బయటికి వచ్చి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలు సంఘ విద్రోహశక్తులుగా మారడం, వారికి అధికార పార్టీ నుంచి ఇతోధికంగా మద్దతు లభించడం ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. ఇక అవినీతి, అసమర్థ పాలన రాష్ట్ర పాలనా వ్యవస్థలో అడుగడుగునా ప్రతిఫలిస్తూ ఉంటుంది.
పారని పాచికలు
మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక శత్రువుగా చూడడం అనేది మొదటి నుంచి ఉంది. నిధుల మంజూరును మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం, అడ్డుకోవడం అనేది ఒక విధానంగా పెట్టుకుంది. ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా సవరణకు వచ్చినా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు రాష్ట్రంలో నేర నిరోధానికి, అవినీతి నిరోధానికి అడుగుపెట్టినా ఆమెలో అసహనం, ఆక్రోశం పెరిగిపోతాయి. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కోసం 2021లోనూ, 2026లోనూ ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందిస్తున్న ‘ఇండియన్‌ ‌పొలిటికల్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ (ఐ-ప్యాక్‌) ‌కార్యాలయాల మీద జనవరి 8న ఈడీ అధికారులు మనీ లాండరింగ్‌ ‌కేసుల్లో దాడులు జరిపినప్పుడు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు వారిని తీవ్రంగా అడ్డుకున్నారు. ఐ-ప్యాక్‌ ‌మీద అక్రమ నగదు తరలింపు కేసులున్నా యని, వాటిని విచారించడానికే తాము వచ్చామని ఈడీ అధికారులు చెప్పినా మమత ప్రభుత్వానికి చెవికెక్కలేదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షలతో ఐ-ప్యాక్‌ ‌కార్యాలయాల మీద దాడులు చేస్తోందంటూ మమతా బెనర్జీ ఆరోపించారు.
మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బాంగ్లాదేశ్‌ ‌నుంచి రాష్ట్రంలోకి వలసదారుల అక్రమ ప్రవేశం అనేక రెట్లు పెరిగింది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ‌సంస్థలు, అధికార వర్గాలు అనేక సందర్భాలల్లో దీన్ని నిర్ధారించాయి. మొదట్లో వందల సంఖ్యలో ప్రారంభమైన చొరబాట్లు క్రమంగా లక్షల్లోకి పెరిగింది. ఈ అక్రమ వలసదార్ల విషయంలో పశ్చిమ బెంగాల్‌ ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరి అరాచకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ మమత ప్రభుత్వం పెడచెవిన పెట్టడమే కాకుండా వారికి ఆధార్‌, ‌రేషన్‌, ఓటరు కార్డులు ఇప్పించి వారు రాష్ట్రంలో స్థిరపడడానికి అవకాశాలు కల్పించింది. వారికి ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేసింది. రాష్ట్రంలోకి అక్రమ వలసదార్లు ప్రవేశించడమనేది భద్రతా దళాల సమస్య అని, దానితో తమకు ఎటువంటి సంబంధమూ లేదని కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అనేక పర్యాయాలు స్పష్టం చేసింది.
చెప్పేదొకటి, చేసేదొకటి
కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌, ‌బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దుల్లో సరిహద్దు భద్రతాదళ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, భద్రతాదళాల పరిధిని రాష్ట్రం లోపల 50 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అక్రమ వలసలతో పాటు ఆయుధాలు, నకిలీ కరెన్సీ అక్రమ సరఫరా, మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. వలసదార్లు రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించకుండా చూడడం సరిహద్దు భద్రతా దళాల బాధ్యత అని పదే పదే ప్రకటించిన మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకునే చర్యలను రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, ఇటువంటి చర్యలు రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కబ్జా చేస్తోందని ఆరోపించడం ప్రారంభించింది. సరిహద్దు జిల్లాల్లో భద్రతాదళ వ్యవస్థను పటిష్టం చేయడం దేశ భద్రతకు చాలా ముఖ్యమని భద్రతా నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ ఆమె మాత్రం సరిహద్దు భద్రతా దళాల అధికారాలను తగ్గించాల్సిందేనంటూ డిమాండ్‌ ‌చేయడం ప్రారంభించారు. వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌, ‌బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దుల్లోని జిల్లాల్లో వందలాది మంది ఉగ్రవాదులను పట్టుకోవడం, వారికి పాకిస్థాన్‌ ‌గూఢచారి సంస్థతో సంబంధా లున్నాయని రుజువైంది.
గత పదిహేనేళ్ల కాలంలో సరిహద్దు భద్రతా దళాలు (బి.ఎస్‌.ఎఫ్‌) ‌వేలాది మంది అక్రమ వలసదార్లను సరిహద్దుల నుంచి వెనక్కు పంపింది. అయినప్పటికీ, గత మూడేళ్లలో అక్రమ వలసదార్ల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ ఈ సమస్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దు జిల్లాల్లో అక్రమ వలసదార్లు తిష్ఠ వేయడం ఎక్కువ కావడం వల్ల ఆ జిల్లాల్లో జన సంఖ్య తారుమారు కావడంతో పాటు, మాదక ద్రవ్యాల వ్యాపారాలు, భూకబ్జాలు, అక్రమ ఆయుధ సరఫరాలు, దోపిడీలు, అత్యాచారాలు, నకిలీ కరెన్సీ వంటివి విపరీతంగా పెరుగుతూ జాతీయ భద్రతకు తీవ్రస్థాయిలో ముప్పు కలగజేస్తున్నాయి.
మత ఘర్షణలు ఎక్కువే
ఆందోళనకర విషయమేమిటంటే, రాష్ట్రంలో అక్రమ వలసదార్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మతపర•••న ఘర్షణలు, హింసా విధ్వంసకాండలు పేట్రేగుతున్నాయి. మాల్డాలోని కాలియాచాక్‌, ‌హౌరా లోని దూలాగఢ్‌ ‌ప్రాంతాల్లో 2016 నుంచి మత ఘర్షణలు విజృంభిస్తూనే ఉన్నాయి. మైనారిటీల బుజ్జగింపు, ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాల వల్ల రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోతున్నదీ, దేశ భద్రతకు ఎంతగా ముప్పు ఏర్పడుతున్నదీ వివరిస్తూ 2019లో 46 మంది ముస్లిం ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. మహిళల మీద అత్యాచారాలు, డాక్టర్లు, లాయర్ల మీద దాడులు జరుగుతున్నాయని లేఖలో వివరించారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. నేరస్థులంతా ముస్లింలే కావడం తమకు ఆందోళన కలిగిస్తోందని, వీరిని పట్టుకుని శిక్షించని పక్షంలో తమ మతానికి ఇక దేశంలో పుట్టగతులుండవని కూడా వారు వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదార్ల ఏరివేతకు ఓటర్ల జాబితా సవరణను చేపట్టినప్పుడు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన రౌడీలు, గూండాలు ఎన్నికల అధికారుల మీద దాడులకు దిగారు. ఒక అధికారి హత్యకు గురి కాగా, మరొక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలం, ప్రోత్సాహాలతో కొనసాగుతున్న ఈ అరాచకాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రావడం మొదలైంది. అనేక ప్రాంతాల్లో స్థానికులే ఇటువంటి హింసా విధ్వంసకాండలను అడ్డుకుంటున్నారు. పరిస్థితుల్లో మార్పు రావడం మొదలైంది. లౌకికవాదం అనే పదాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను, పాల్పడుతున్న దురాగతాలను ప్రశ్నించే పౌర సంఘాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో హిందువుల కంటే హిందువేతరుల సంఖ్య పెరగడం ఎంత ప్రమాదమో అనుభవపూర్వ కంగా అర్థం చేసుకున్న ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర మతస్థులంతా కలిసి మెలిసి జీవించగల సోనార్‌ ‌బాంగ్లాను సృష్టిస్తామంటూ మమతా బెనర్జీ చేసిన వాగ్దానం ఎక్కడా కలికానికి కూడా కనిపిం చడం లేదు. పొరుగున ఉన్న బాంగ్లాదేశ్‌లో హిందువులను ముస్లిం తీవ్రవాదులు ఏ విధంగా హింసిస్తున్నదీ గమనిస్తున్న హిందువులు మమతా బెనర్జీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నట్టు కనిపిస్తోంది.
ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు ధోరణు లతో పాలన చేసే ఏ పార్టీ ప్రభుత్వమైనా విదేశీ అక్రమ వలసదార్లకు ఆశ్రయమిస్తూనే ఉంటుందని అధిక సంఖ్యాక ప్రజల్లో అవగాహన కలుగుతోంది. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బాహాటంగా, నిర్లజ్జగా, నిర్మొహమాటంగా ముస్లిం బుజ్జగింపు ధోరణులకు పాల్పడుతూ, హిందువులకు ఇప్పటికే ఏ అధికారమూ లేకుండా చేసిందని, ఈ ప్రభుత్వ విధానాలు ఇదే విధంగా కొనసాగితే పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రం మరో బాంగ్లాదేశ్‌ ‌కావడం ఖాయమని ప్రజల్లో ఒక స్పృహ ప్రారంభమైంది. త్వరలో ఈ రాష్ట్ర శాసన సభకు జరగబోతున్న ఎన్నికల్లో నిజమైన ‘పొరిబర్తన్‌ ‌బెంగాల్‌’ (‌పరివర్తన చెందిన బెంగాల్‌) ‌చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదు.

జి.రాజశుక
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE