విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ ‌దాదా పవార్‌ ‌మరణించారు. అదొక విషాదం. అయన ఆకస్మిక మృతి, రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. కొత్త లెక్కలు, కొత్త సమీకరణలను తెరమీదకు తెచ్చింది. ముఖ్యంగా, ఉభయ ఎన్సీపీల పునః విలీనం పై గత కొంత కాలంగా మీడియాలో జరుగుతున్న చర్చకు చుక్క పెట్టింది. ముఖ్యంగా, విలీనం ద్వారా, పార్టీ ఉనికిని, కుటుంబంలో తమ పెద్దరికాన్ని నిలుపుకోవాలని, కలలు కన్న, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్‌ ‌పవార్‌ ఆశలను ఆవిరి చేసింది.

మహారాష్ట్రలో మరో విమాన ప్రమాదం జరిగింది. మరో ముఖ్యనేత ప్రాణాలు కోల్పోయారు. ఒకటికి ఆరుమార్లు (వేర్వేరు కూటమి ప్రభుత్వాల్లో) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యలు నిర్వహించిన, జాతీయ వాద కాంగ్రెస్‌ (ఎన్సీపీ) అధినేత, అజిత్‌ ‌దాదా పవార్‌ ‌జనవరి 27న విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
ముంబై నుంచి సొంత నియోజక వర్గం బారామతి బయలుదేరిన అజిత్‌ ‌సొంత గడ్డపై కాలు పెట్టకుండానే కన్నుమూశారు.ఆయన ప్రయాణి స్తున్న ప్రత్యేక విమానం బారామతి విమానాశ్రయం రన్‌ ‌వే’ పై ల్యాండ్‌ అవుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. అజిత్‌ ‌పవార్‌’, ‌విమానంలో ఉన్న పైలట్‌, ‌సిబ్బంది ప్రాణాలు వదిలారు. దీనిని రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసే విషాద సంఘటనగానో పేర్కొంటున్నారు.
నిజమే. మన దేశంలోనే కాదు, దినదిన ప్రవర్థ మానంగా దిగజారి, అన్ని విధాలా అడుగంటిపోతున్న అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలన్నిటా గగనతల (విమాన, హెలికాప్టర్‌) ‌ప్రమాదాలు జరుగు తూనే ఉన్నాయి. ప్రముఖులు చనిపోతూనే ఉన్నారు.
మన దేశం విషయాన్నే తీసుకుంటే, లోక్‌సభ అప్పటి స్పీకర్‌ ‌జీఎంసీ బాలయోగి, ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డి, గుజరాత్‌ ‌మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపాని, అరుణాచల్‌ ‌ముఖ్యమంత్రి దోర్జీ ఖండు … ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌ ‌గాంధీ, కేంద్ర మాజీ మంత్రి మాధవరావ్‌ ‌సింధియా, ఓపీ జిందాల్‌ ఇలా ఇంకా అనేక మంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు, బిపిన్‌ ‌రావత్‌ ‌వంటి సైన్యాధికారులు, ఇతర ప్రము ఖులు గగనతల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
రాజకీయ ప్రభావం
అజిత్‌ ‌పవార్‌, అకాల మరణం, మహారాష్ట్ర రాజకీయాలను, ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా ఉంది. అలాగే, పవార్‌’ ‌ఫ్యామిలీ పాలిటిక్స్’‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ముఖ్యంగా ఉభయ ఎన్సీపీల విలీనంపై, ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్సీపీ ఎస్పీ వర్గం నేత శరద్‌ ‌పవార్‌ ‌కన్నకలలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? అనేది ఆసక్తి కరంగా మారింది. అజిత్‌ ‌దాదా మరణం మొదలు, ఆయన సతీమణి సునేత్రా పవార్‌ ‌ప్రమాణ స్వీకారం వరకు చకచకా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే దాదా మరణం సృష్టించిన రాజకీయ ప్రకంపనాలకు అద్దం పడుతోంది.
ముఖ్యంగా, ఉభయ ఎన్సీపీల విలీనం విషయంగా సాగుతున్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజిత్‌ ‌పవార్‌ ‌మరణాన్ని అడ్డుపెట్టుకుని, ఉభయ ఎన్సీపీల విలీనం ముసుగులో శరద్‌ ‌పవార్‌ ‌తమ ఉనికిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలను, అందుకు ప్రతిగా, పవార్‌ ‌పాచికలు తెలిసిన ఎన్సీపీ సీనియర్‌ ‌నాయకులు వేగంగా తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే, పవార్‌ ‌పాచికలు పారే అవకాశాలు దాదాపు లేవని అంటున్నారు. ఆ విషయాన్ని శరద్‌పవార్‌ ‌స్వయంగా పేర్కొన్నారు. విలీనం విషయంగా గత నాలుగు నెలలుగా నడుస్తున్న చర్చలకు, అజిత్‌ ‌దాదా మరణంతో చుక్క పెట్టినట్లేనని పవార్‌ ‌పేర్కొన్నారు. అదే సమయంలో, శరద్‌ ‌పవార్‌ ‌వర్గం నాయకులు ఫిబ్రవరి 12న విలీనం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పడం విశేషం. అయితే, శరద్‌ ‌పవార్‌ ఎత్తులు జిత్తులు తెలిసిన ప్రపుల్‌ ‌పటేల్‌, ‌సునీల్‌ ‌తత్కరే వంటి ఎన్సీపీ సీనియర్‌ ‌నాయకులు చకా చకా పావులు కదిపారు. ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసి అజిత్‌ ‌పవార్‌ ‌సతీమణి, రాజ్యసభ సభ్యురాలు, సునేత్రా పవార్‌. ఎన్సీపీ శాసనసభ పక్ష నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఆ వెంటనే ఆమె ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ ‌మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపు జరిగింది.
ఎన్సీపీల విలీనం కథ ఇక్కడితో, ముగిసినట్లేనా? అంటే కాదు, అనే మాటే వినిపిస్తోంది. ముందు ముందు మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఇంకాస్త మారిపోతుందని అంటున్నారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన శరద్‌ ‌పవార్‌ ‌రాజకీయ చరిత్ర ముగింపు దశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితులలో పవార్‌, ‌తమ మనుగడను కాపాడు కునేందుకు విలీనం ప్రయత్నాలు కొనసాగిస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఇటు రాజకీయంగా ఉనికిని, అటు కుటుంబంలో పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే, మరాఠాయోధుని ముందు ఉభయ ఎన్సీపీల విలీనం వినా, మరో మార్గం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మరిన్ని మార్పులు తప్పవని అంటున్నారు.
ముఖచిత్రంలో మార్పులు
నిజానికి, అటు శివసేన, ఇటు ఎన్సీపీలలో సంభ వించిన చీలికల నేపధ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అవిభక్త శివసేన అధినేత, ఉద్దవ్‌ఠాక్రే అధికార దాహంతో, పార్టీ మూల సిద్ధాంతాన్ని వదిలి, హస్తం పార్టీతో చేతులు కలిపి, మూడునాళ్ల ముచ్చటగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి, మహారాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోని పరిణా మాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పటికే మార్చివేశాయి.
మరీ ముఖ్యంగా, 2024 అసెంబ్లీ ఎన్నికలతో మూడు పార్టీల మహా వికాస్‌ ‌కూటమి ఘన ఓటమితో మహా ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ సారథ్యం లోని, మహాయుతి కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 288 స్థానాలున్న అసెంబ్లీలో మహాయుతి’ కూటమి 233 స్థానాలలో విజయకేతనం ఎగరేసి, చరిత్ర సృష్టించింది. మరో వంక, కాంగ్రెస్‌, ‌శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ ‌పవార్‌) ‌పార్టీల మహా వికాస్‌ అఘాడి (ఏమ్వీఎ) 51 సీట్లకే పరిమితం అయింది. అందులోనూ శరత్‌ ‌పవార్‌’, ఆయన సారథ్యంలోని ఎన్సీపీ చీలిక వర్గం పరిస్థితి మరింత అద్వాన్నం. ఎన్సీపీ ఎస్పీ కేవలం 10 సీట్లకే పరిమితం అయింది. అందుకే పవార్‌, ‌విలీనం పాచిక విసిరారు అనేది విశ్లేషకుల మాట. అయితే, అజిత్‌ ‌పవార్‌ ‌వర్గానికి చెందిన ముఖ్యనాయకులు, శరద్‌ ‌పవార్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరని అందుకే, శరద్‌ ‌పవార్‌ ‌విలీనం ప్రతిపాదనను మొగ్గలో తుంచేలా వ్యూహం పన్నారని అంటున్నారు.
అందులో భాగంగానే, సునేత్రా పవార్‌ను ప్రమాణ స్వీకారానికి ఒప్పించినట్లు చెపుతున్నారు. ఎన్సీపీ నేతలు, శరద్‌పవార్‌ను మాటమాత్రంగా అయిన సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం కూడా, విలీనాన్ని వ్యతిరేకించే ప్రపుల్‌ ‌పటేల్‌ ఇతర సీనియర్‌ ‌నాయకుల వ్యూహంలో భాగమని అంటు న్నారు. అందుకే, శరద్‌ ‌పవార్‌ ‌ప్రమాణ స్వీకారం గురించి తనకేమీ తెలియదని నిష్టురమాడినట్టు చెపుతున్నారు.
ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సునేత్రను డిప్యూటీ సీఎం చేయడం ద్వారా, అజిత్‌ ‌పవార్‌ ‌వర్గం స్వతం త్రంగానే ఉంటుందని, శరద్‌ ‌పవార్‌ ‌నాయకత్వంలోకి వెళ్లబోదని మహాయుతి స్పష్టం చేసింది. ప్రఫుల్‌ ‌పటేల్‌, ‌సునీల్‌ ‌తట్కరే వంటి సీనియర్‌ ‌నేతలు తిరిగి శరద్‌ ‌పవార్‌ ‌వద్దకు వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకే సునేత్రా పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుని, ఆమెను డిప్యూటీ సీఎంగా నామినేట్‌ ‌చేయాలని నిర్ణయించారు. అలాగే, అజిత్‌ ‌పవార్‌ ‌మరణం తర్వాత ఆయన వెనుక ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపో కుండా ఉండాలంటే.. ఆ కుటుంబానికి కీలక పదవి ఇవ్వడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ‌నిర్ణయానికి వచ్చారు. అందుకే, చాక చక్యంగా తమ చేతికి మట్టి అంటకుండా, కాగల కార్యాన్ని కానిచ్చారని అంటున్నారు.

రాజనాల బాలకృష్ణ
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE