రెండు దశాబ్దాలుగా ఐరోపా సమాఖ్య దేశాలతో జరుపుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. జనవరి 27న ముగిసిన చర్చల ఫలితంగా రెండు బిలియన్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి మార్కెట్ విలువ ప్రపంచ దేశాల జీడీపీలో 25% కావడం విశేషం. అందువల్లనే ఈ ఒప్పందాన్ని “మదర్ ఆఫ్ ఆల్ డీల్స” అని వ్యవహరిస్తున్నారు. వస్తుసేవలు, డిజిటల్ వాణిజ్యం, మేధోపరమైన ఆస్తులు, సుస్థిరాభివృద్ధి, భద్రత, రక్షణ సహకారం వంటి అన్ని రంగాల్లో భారత్ – ఈయూ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. దీని ప్రకారం భారత్ నుంచి ఈయూ దేశాలకు జరిగే ఎగుమతుల్లో 99% వస్తువులపై అదేవిధంగా ఈయూ నుంచి మనదేశం దిగుమతి చేసుకునే 96.6% వస్తువులపై ఏవిధమైన సుంకాలుండవు.

ముఖ్యంగా మనదేశం ఎగుమతి చేసే వస్త్రాలు (12%), రెడీమెడీ గార్మెంట్స్, పాదరక్షలు, తోళ్ల ఉత్పత్తులు (17%), రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులకు (26%) ఈ సుంకాలనుంచి పూర్తి మినహాయింపు వుంటుంది. మొత్తం మీద చెప్పాలంటే మనదేశ ఎగుమతులపై 33 బిలియన్ డాలర్ల మేర సుంకాలను ఈయూ దేశాలు ఈ ఒప్పందం ద్వారా తొలగించనున్నాయి. ఈయూ దేశాలు ఎగుమతి చేసే యంత్రాలు, రసాయనాలు, ఔషధాలు, వైన్, ఆలివ్ ఆయిల్ వంటి కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులపై మనదేశం సుంకాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఒప్పందం నేపథ్యంలో ఈయూ దేశాలలోని 144 ఉప – సేవారంగాలు ముఖ్యంగా ఐటీ సర్వీసుల కోసం మనదేశానికి చెందిన వృత్తి నిపుణులు ఇప్పుడు ఐరోపా దేశాýకు వెళ్లగలుగుతారు. ఈ ఒప్పందం పుణ్యమాని భారత్, ఈయూ దేశాలు ఇక ముందు యు.ఎస్. మార్కెట్‌పై అధికంగా ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. రసాయనాలు, ఇంజినీరింగ్ రంగాల్లో మనకు మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది. రెండు పక్షాల మధ్య ఎటువంటి రిస్క్‌కు తావులేని వాణిజ్య భాగస్వామ్యం కొనసాగనుంది. యూరోపియన్ కంపెనీల నుంచి మనదేశంలోకి ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతాయి. “వికసిత్ భారత్`2047” విజన్‌కు అనుగుణమైన రీతిలో ఈ ఒప్పందం ఉండటం విశేషం. అయితే యూరోపియన్ కౌన్సిల్, యూరోపి యన్ పార్లమెంట్‌ల ఆమోదం పొందడానికి ముందు ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల పాఠంపై న్యాయ సమీక్ష జరగాల్సి ఉంది. ఇదంతా పూర్తయి ఒప్పందం 2027లో పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈయూతో కుదిరిన ఎఫ్‌టీఏ కారణంగా మనదేశానికి వార్షికంగా 4.3 బిలియన్ యూరోలు అంటే 4.73 బిలియన్ యు.ఎస్. డాలర్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగనుంది. స్వల్పకాలం పాటు దీనివల్ల మన జీడీపీలో 0.1 నుంచి 0.3శాతం వృద్ధికి దోహదం చేయగలదు. అయితే దీర్ఘకాలంలో ఈ వృద్ధి గణనీయంగా ఉండ గలదని అంచనా. ఈ ఒప్పందం కారణంగా ఈయూ దేశాలకు మన ఎగుమతులు 41% పెరగను న్నాయి. ముఖ్యంగా శ్రామిక, ఎగుమతి ఆధారిత పరిశ్రమలు లాభపడ తాయి. రాబోయే నాలుగేళ్ల కాలంలో ఈయూ బ్యాంకులు మనదేశంలో 15 శాఖలను తెరిచేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తోంది. యుపీఐ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేగంగా చెల్లింపులు జరుపు కునేందుకు అంగీకారం కుదిరింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ సభ్య దేశాలైన ఐస్‌ల్యాండ్, లిచెన్‌స్టెíన్, నార్వే, స్విట్జర్లాండ్‌లు 2024 మార్చిలోనే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌ఫిప్ ఒప్పందంపై మనదేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చు కోవడం గమనార్హం. దీని ప్రకారం రానున్న 15 సంవత్సరాల్లో ఈ దేశాలు భారత్‌లో 100 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెడతాయి. ఈ దేశాలు 99.6% భారత్ ఉత్పత్తులపై సుంకాలు ఎత్తేయగా, 95% ఈఎఫ్‌టీఏ ఎగుమతులపై మనదేశం సుంకాలు తొలగిస్తుంది.

ట్రంప్ అహంకారానికి చెంపపెట్టు

మనదేశంపై 50% సుంకాలను విధించిన ట్రంప్ అహంకారపూరిత వైఖరికి “మదర్ ఆఫ్ ఆల్ డీల్స” పేరుతో మనదేశం ఇచ్చిన గొప్ప సమాధానం ఇది. అంతేకాదు ఈ ఒప్పందంవల్ల ఈయూ దేశాలకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యామ్నాయ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా కొనసాగిన యు.ఎస్. తన స్థానాన్ని కోల్పోనుంది. ఈ ఒప్పందం అమెరికా ప్రత్యామ్నాయ ప్రపంచ క్రమానికి దోహదం చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న బెదిరింపు వ్యూహాలను అడ్డుకునేందుకు వివిధ దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గుచూపడం ఖాయం. భారత్`ఈయూల మధ్య కుదిరిన ఈ ఒప్పందం దీన్ని మరింత వేగవంతం చేయగలదు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా ప్రభావాన్ని పరిమితం చేసే ఒక దీర్ఘకాలిక వ్యూహంగా ఈ ఎఫ్‌టీఏను పరిగణించ వచ్చు. ఈ ఒప్పందం ఫలితంగా భారత్ మార్కెట్లలో అమెరికా కంపెనీలకు ఈయూ కంపెనీలతో పోటీ తట్టుకోవడం కష్టంగా మారనుంది. ఎందుకంటే యు.ఎస్. ఉత్పత్తులపై మనదేశంలో టారిఫ్‌లు కొనసాగు తున్నాయి. ఇదే సమయంలో ఈయూ ఉత్పత్తులపై సుంకాలు ఎత్తేయడంవల్ల అవి చౌకగా లభ్యం కావడంతో అమెరికా కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. మనదేశంపై 50% టారిఫ్ విధించిన ట్రంప్ అహంకారానికి మనదేశం తీర్చుకున్న ప్రతీకారం ఇది! తాను నిర్దేశించిన విధంగానే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఇప్పటివరకు మనదేశంపై ఒత్తిడి తీసుకొచ్చిన అమెరికా, ఇప్పుడు తానే ఒత్తిడికి గురవుతోంది. అమెరికా ఎగుమతి చేసే ఆటోమొబైల్స్, యంత్రసామగ్రి, రసాయనాలు, ఔషధాలపై టారిఫ్‌లు యథాతథంగా కొనసాగుతున్న తరుణంలో, ఇవే రంగాలకు చెందిన ఈయూ వస్తువులపై సుంకాలు లేకపోవడంతో యు.ఎస్. వస్తువులకంటే తక్కువ రేట్లకే మనదేశ మార్కెట్‌లో ఇవి లభ్యం కానున్నాయి. ఈ పోటీని తట్టుకోవడం యు.ఎస్. కంపెనీలకు చాలా కష్టం కానుంది. మన దేశ ఎగుమతులైన వస్త్రాలు, తోళ్లు, రత్నాలు, ఆభరణాలపై అమెరికా టారిఫ్‌లు విధించింది. ఈ ఒప్పందం కారణంగా ఇప్పుడు మన వ్యాపారులకు యు.ఎస్.కు ప్రత్యామ్నాయంగా ఏవిధమైన సుంకాలు లేని మార్కెట్ లభించింది. ఈ సందర్భంగా పూటకో వాణిజ్య విధానాన్ని అనుస రిస్తున్న డోనాల్డ్ ట్రంప్‌కు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కేవలం ఆయన తలతిక్క వైఖరి, మనకు`ఈయూ దేశాలకు మధ్య రెండు దశాబ్దాలుగా ఎటూ తేలకుండా నానుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఒక కొలిక్కి తెచ్చింది. ఒక చెడు మరో మంచికి దారితీస్తుందన్న సామెత మనదేశం విషయంలో నిజమైంది! భారత్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని వేగంగా కొలిక్కి తీసుకొచ్చే అంశంపై ఇప్పుడు యు.ఎస్.లో తీవ్రస్థాయి చర్చలు జరుగుతున్నాయి. లేకపోతే అంతర్జాతీయ వాణిజ్యంలో తాము ప్రాధాన్యం కోల్పోక తప్పదన్న సత్యం యు.ఎస్. విధానకర్తలకు ఇప్పుడు తెలుస్తోంది.

భారత్‌లో అధిక టారిఫ్‌లు తగ్గించాల్సిందే నంటూ పట్టుపట్టిన అమెరికా కార్ల తయారీ కంపెనీలు, ఇప్పుడు దశలవారీ సుంకాల తగ్గింపుతో తమ ప్రత్యర్థులైన ఈయూ కంపెనీల కార్లు మనదేశంలోకి ప్రవేశించనుండటంతో నోరెళ్లబెట్టాయి. కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా పాల ఉత్పత్తులను అనుమతించాల్సిందేనని అమెరికా పట్టుపట్టింది. కానీ ఇప్పుడు ఈ అంశం లేకుండానే ఈయూతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడం యు.ఎస్.కు మింగుడు పడటంలేదు. ఇక ముందు వాణిజ్య చర్చలో ఈ రెండు అంశాల విషయంలో భారత్‌ను ఒప్పించడం సాధ్యంకాదన్న సంగతి స్పష్టమైంది. భారత్`ఈయూ ఎఫ్‌టీఏ ఒప్పందం యు.ఎస్. జీడీపీపై కొద్ది ప్రభావం చూపినప్పటికీ, ప్రపంచ వాణిజ్య గతిశీలతను ఇది సమూలంగా మార్చివేసింది. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా తన కేంద్రస్థానాన్ని కోల్పోయిందనే చెప్పాలి.

ఈయూ దేశాలకు వెసులుబాటు

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య బ్లాక్‌ల మధ్య కుదిరిన ఈ ఎఫ్‌టీఏ నేపథ్యంలో ఇప్పటి వరకు చైనాపై అమితంగా ఆధారపడే పరిస్థితి నుంచి ఈయూ దేశాలు బయటపడతాయి. ప్రపంచ తయారీ హబ్‌గా ఉన్న చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తమకు అత్యంత విశ్వసనీయ తయారీ భాగస్వామిగా ఈ దేశాలు పరిగణిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు “చైనా-ప్లస్ -వన” వ్యూహాన్ని అనుసరించనున్నాయి. అంతేకాదు ఈ ఒప్పందం ఇండియా – ఈయూల మధ్య “జోన్ ఆఫ్ ట్రస్ట” ఏర్పాటుకు కారణమవు తోంది. దీనివల్ల కృత్రిమమేధ, సెమికండక్టర్లు, హరిత సాంకేతిక పరిజ్ఞానంపై చైనా, యుఎస్‌లపై ఇప్పటి వరకు అధికంగా ఆధారపడే పరిస్థితి నుంచి బయట పడి, మనదేశంతో ఈ రంగాల్లో మరింత లోతైన సమన్వయ సహకారాలను వృద్ధి చేసుకోనున్నాయి. సుంకాలు లేకపోవడంతో చైనా కంపెనీలతో మనదేశ కంపెనీలు ఈయూ మార్కెట్‌లో పోటీపడగలవు.

ఇకముందు ఇండియన్ కంపెనీలు యూరోపియన్ సాంకేతిక ప్రమాణాలతో ఉత్పత్తులు చేయడం వల్ల, చైనా వస్తువులు మనదేశంలోకి ప్రవేశించడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఈయూ కంపెనీలు రానున్న కాలంలో చైనా నుంచి తమ పెట్టుబడులను ఇండియాకు తరలించే అవకాశాలు మెరుగుపడతాయి. యూరోపియన్ ఫ్యాషన్ బ్రాండ్లు, ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇప్పుడు చైనా ఫ్యాక్టరీలపై ఆధారపడుతున్నాయి. ఈ కంపెనీలు తమ కార్యకలా పాల్లో సింహభాగాన్ని భారత్‌కు తరలించ వచ్చు. ఇక భారత్ తయారీ రంగం యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడం (బ్రెజిల్స్ ఎఫెక్ట్) వల్ల, కేవలం ఈయూ దేశాలలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చైనా తయారీ వస్తువులకు భారత్ గట్టి పోటీ ఇవ్వగలదు. ఈవిధంగా యు.ఎస్, జపాన్‌లలో చైనా మార్కెట్ ఆధిపత్యాన్ని భారత్ సవాలు చేసే అవకాశాలే అధికం. రాబోయే దశాబ్ద కాలంలో చైనాకు రావలసిన మార్కెట్, ఇండియా-ఈయూ కారిడార్‌కు తరలడం వల్ల డ్రాగన్‌కు ఆర్థిక నష్టాలు తప్పవని విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో ఇండియా-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చైనా నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ఈ-యూల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం వల్ల, ఈయూ సాంకేతిక పరిజ్ఞానం భారత్‌లోకి ప్రవేశించనుంది.

వివాదాల్లో భారత్ తటస్థ వైఖరి

రష్యాకు అత్యంత ఆప్త మిత్రదేశమైన భారత్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల ఈయూ`రష్యాల మధ్య ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొనసాగుతున్న విభేదాలు తగ్గుముఖం పడతాయా అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ప్రత్యక్షంగా ఈ ఒప్పందం ఈయూ`రష్యా సంబంధాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాకపోయినప్పటికీ, పరోక్ష ఆర్థిక లింక్ కొనసాగే అవకాశముందన్నది కొందరు విశ్లేషకుల అంచనా. భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయడంపై ఈయూ దేశాలతో మనకు అభిప్రాయ భేదాలున్నప్పటికీ, రష్యాతో ఆ దేశాలకున్న అంతరాలను తగ్గించడంలో ఒక సంభాషణ కర్తగా వ్యవహరించే అవకాశముంది. ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాకపోయినా, కాýగమనంలో ఇది సాధ్యం కావచ్చు. ఈయూ, రష్యాలతో మనదేశం నెరపుతున్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణం. ఇరు పక్షాలు భారత్ ప్రత్యేక స్థానాన్ని ఇప్పటికే గుర్తించాయి. వివాదాల్లో భారత్ తటస్థ వైఖరి అనుసరించడం కూడా ఇందుకు ప్రధాన కారణం.

మూడో ఆర్థిక శక్తిగా భారత్

2028 నాటికి మన దేశం ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోర్గాన్ అండ్ స్టాన్లీ సంస్థ ఇప్పటికే అంచనా వేసింది. ఈయూ దేశాలతో కుదిరిన ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే మనదేశం ఈ స్థాయికి ఎదిగే అవకాశాలు మెండుగా వున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ప్రపంచానికి కృత్రిమేధకు సంబంధించిన నిపుణులను అందించే స్థాయిలో ఉండటంతో ప్రపంచ కుబేరులు మనదేశంలో పెట్టు బడులకు ముందుకొస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలైన రోత్స్‌ఛైల్డ్ అండ్ కో, బ్లాక్‌రాక్‌లు 2025-26లో మనదేశంలో పెద్దఎత్తున పెట్టు బడులు పెట్టేందుకు రావడమే ఇందుకు ఉదాహరణ.

– జమలాపురపు విఠల్‌రావు,

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE