ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2026-27 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి అనేక కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచేలా ఉంది. వ్యవసాయం నుంచి పరిశ్రమల దాకా, విద్య నుంచి ఆరోగ్యం దాకా, మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ప్రజా సంక్షేమం దాకా.. ప్రతి రంగం లోనూ తెలంగాణకు ఈ బడ్జెట్ వల్ల ప్రయోజనాలను చేకూరనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందించే ఆర్థిక సహాయంలో ముఖ్యమైన అంశం పన్నుల వాటా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.29,280 కోట్లు కేటాయించగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి 13.5 శాతం పెరుగుదలతో రూ.33,180 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదకంగా పనిచేయనుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అభివృద్ధి కార్యక్ర మాల కోసం, ప్రజా సంక్షేమ పథకాలను విస్తరించ డానికి వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది కేవలం సంఖ్యాపరమైన పెరుగుదల మాత్రమే కాదు, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు వాటి హక్కులు సకాలంలో అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.

తెలంగాణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ 60 శాతానికి పైగా జనాభా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అందించిన ప్రోత్సాహం ప్రస్తావించుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఇది దేశవ్యాప్తంగా 7కోట్ల 70లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరు స్తుంది. తెలంగాణలోని లక్షలాది మంది చిన్న, మధ్య తరహా రైతులకు ఇది గొప్ప ఉపశమనంగా చెప్పు కోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ కోసం మొత్తం రూ.1.26 లక్షల కోట్లు కేటాయించింది. ఈ భారీ మొత్తంలో గణనీయ భాగం తెలంగాణ రాష్ట్రానికే కేటాయించారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తృతంగా జరుగుతోంది. ఈ పంటలకు అవసరమైన యూరియా, డిఏపి, పొటాష్ వంటి ఎరువులను సరసమైన ధరలో రైతులకు అందుబాటులో ఉంచడానికి సబ్సిడీ కీలకం. ఇది రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, వారి ఆదాయాన్ని పెంచుతుంది. వీటికి అదనంగా, పప్పుధాన్యాల స్వయంసమృద్ధి పథకం తెలంగాణ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించనుంది. రాష్ట్రంలో పప్పు ధాన్యాలు విస్తృతంగా సాగయ్యే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా రైతులు మెరుగైన విత్తనాలు, సాంకేతిక మార్గదర్శకత్వం పొందగలుగుతారు.

ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కేంద్ర బడ్జెట్ పలు ముఖ్యమైన ప్రకటనలు చేసింది. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ‘డేకేర్ క్యాన్సర’ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల్లో కూడా ఈ సెంటర్లు ఏర్పాటవుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులకు ప్రాథమిక స్థాయిలోనే చికిత్స అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అపారమైన ఊరట కలిగిస్తుంది.

అలాగే, రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు సృష్టించేందుకు ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో ఇప్పటికే నిమ్స్, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలున్నాయి. ఈ కొత్త సీట్ల కేటాయింపు ద్వారా రాష్ట్రంలో మరిన్ని వైద్య విద్యా సంస్థలు, అలాగే, ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు లభించనున్నాయి. తద్వారా రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగనుంది.

హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఎంఎంటీఎస్, మెట్రో ప్రాజెక్టులకు దాదాపు రూ.28, 740 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో ఎక్కువశాతం హైదరాబాద్ మెట్రో విస్తరణకు వినియోగించే అవకాశాలున్నాయి. ప్రస్తుత 72 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌ను మరో 116 కిలో మీటర్లకు విస్తరణ జరగనుంది. ఫలితంగా నగరంలోని ఎక్కువ ప్రాంతాలకు త్వరిత, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్స్‌లో మూడు హైదరాబాద్ నుంచి ప్రారంభ మవుతున్నాయి. హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్స్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన నగరాలతో అత్యాధునిక రైలు మార్గాల ద్వారా అనుసంధానం చేస్తుంది. హైస్పీడ్ రైళ్లు గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 90 నిమిషాల్లో, చెన్నైకి రెండు గంటల్లో, పుణేకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఇది వ్యాపార, పర్యాటక రంగాలకు అపూర్వ ప్రోత్సాహాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఈ కారిడార్‌తో హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో కీలక రవాణా కేంద్రంగా మారుతుంది.

హైదరాబాద్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్, ఒరాకిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. వీటితో పాటు దేశీయ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బడ్జెట్ ఐటీ కంపెనీలకు పన్ను మినహాయింపుల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్లౌడ్ డేటా సెంటర్లకు కూడా పన్ను ఉండదని ప్రకటించింది. ఈ నిర్ణయాలు హైదరాబాద్ లోని ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా మారనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 6 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. కొత్త పన్నుల మినహా యింపుల వల్ల మరిన్ని కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ముందుకు వచ్చేందుకు అవకాశం కలుగుతుంది. ఇది రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగావకాశాలు పెరగడానికి, ఎగుమతి ఆదాయం పెరుగుదలకు తోడ్పడుతుంది.

హైదరాబాద్ నగరం ఇప్పటికే ‘బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందింది. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అరబిందో ఫార్మా, లూపిన్, హెటిరో వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లోనే తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ‘బయోఫార్మా శక్తి’ అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇది జీవసంబంధ మందుల పరిశోధన, అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుంది. తెలంగాణలోని ఫార్మా కంపెనీలు ఈ పథకం ద్వారా భారీగా ప్రయోజనాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జెనెరిక్ మందుల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఆ ఉత్పత్తిలో హైదరాబాద్ వాటా 40 శాతం. బయోఫార్మా శక్తి స్కీం ద్వారా కంపెనీ లకు పరిశోధన కోసం నిధులు, పన్ను మినహా యింపులు, సాంకేతిక మద్దతు లభిస్తాయి. ఇది రాష్ట్ర ఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో దోహపడతుంది.

రాష్ట్రంలో సుమారు 5 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎసఎంఈ) యూనిట్లు ఉన్నాయి. ఇవి 25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ఎంఎసఎంఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. దేశవ్యాప్తంగా 38 లక్షల యూనిట్లకు 10వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని కేటాయించింది. ఈ నిధుల్లో తెలంగాణ వాటా సుమారు 1,300 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఈ సాయం చిన్న పరిశ్రమలకు సాంకేతిక మెరుగుదల, మార్కెటింగ్ సహాయం, నాణ్యత నియంత్రణ సదుపాయాలు కల్పించడానికి ఉపయోగ పడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఎంఎసఎంఈలకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగ పడతాయి.

కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి అనేక కార్యక్రమాలను ప్రకటించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ‘భారతీయ భాషా పుస్తక’ పథకం ప్రారంభించారు. ఇది దేశంలోని పలు భాషలతో పాటు తెలుగు భాషలో నాణ్యమైన పాఠ్య పుస్తకాలు, అనుబంధ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, డిజిటలైజ్ చేయడానికి తోడ్పడు తుంది. మరోవైపు 500 కోట్ల రూపాయలతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, టాప్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. దీంతో, ఈ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ బలమైన పోటీదారుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, తెలంగాణలోని 33 జిల్లాల్లో బాలికల హాస్టళ్లు నిర్మించనున్నారు. ఇది బాలికా విద్యకు, శాస్త్రీయ విద్యకు అపూర్వ ప్రోత్సాహంగా చెప్పుకోవచ్చు.

మధ్యతరగతి వేతన జీవులకు, పన్ను చెల్లింపు దారులకు ఈ సారి కూడా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేతనం మీదే ఆధారపడి జీవించే లక్షలాది మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం వల్ల భారీ ఉపశమనం కల్పించింది. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇంతకు మునుపు ఈ పరిమితి రూ.7 లక్షలుగా ఉండేది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని సుమారు 30 లక్షల మంది మధ్యతరగతి వేతనజీవులకు ప్రయోజనం కలుగు తుంది. వారికి ఏడాదికి రూ.50వేల నుంచి రూ.75వేల వరకు పన్ను ఆదా అవుతుంది. ఈ డబ్బులను వాళ్లు పొదుపు, పెట్టుబడి, ఇతర అవసరాలకోసం వినియోగించుకునే వెసుటుబాటు లభిస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపిరి పోస్తుందని చెప్పవచ్చు.

తెలంగాణలోని 32 పట్టణాలకు అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ పథకం కింద కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించింది. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, నగర రవాణా మెరుగుదల, పార్కులు, గ్రీన్ స్పేస్‌ల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయి. వీటికి తోడు హైదరాబాద్ వంటి నగరంలో రూ.వెయ్యి కోట్లకన్నా ఎక్కువ విలువైన మునిసిపల్ బాండ్స్ సేకరించగలిగితే, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.100 కోట్ల ప్రోత్సాహ కాన్ని అందజేస్తుంది. ఇది స్థానిక సంస్థలకు నిధుల సమీకరణలో కొత్త మార్గాన్ని తెరుస్తుందనడంలో సందేహం లేదు.

తెలంగాణలోని పలు ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు పేరొందాయి. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల సహా ఆయా ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమ ఎంతోమందికి ఊతంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్లో టెక్స్-ఇకో కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారా టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమలకు ఇది గణనీయ ప్రయోజనం చేకూరుస్తుంది.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అనుకూల మైన అంశాలు ఎన్నో ఉన్నాయి. పన్నుల వాటా పెరుగుదల నుంచి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం వరకు, మెట్రో విస్తరణ నుంచి హైస్పీడ్ రైలు కారిడార్స్ వరకు, ఐటీ సంస్థలకు పన్ను మినహాయింపుల నుంచి ఫార్మా రంగంలో బయో ఫార్మా శక్తి మద్దతు వరకు, విద్య నుంచి ఆరోగ్యం వరకు ప్రతి రంగంలోనూ రాష్ట్రానికి ఎన్నోప్రయోజ నాలు కలుగుతాయి.

కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ రుజువు చేస్తోంది. ప్రాంతీయ అసమానతలు తగ్గించడం, అన్ని రాష్ట్రాలకూ సమాన అవకాశాలు కల్పించడం కేంద్రప్రభుత్వం లక్ష్యం. తెలంగాణకు కేటాయించిన నిధులు, ప్రకటించిన పథకాలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అవకాశాలను సద్విని యోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించి, ప్రజల అభివృద్ధికి వినియోగించాల్సిన ఆవశ్యకత ఉంది.

సుజాత గోపగోని

సీనియర్ జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE