ఎట్టకేలకు భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్ వర్క్‌ను ఖరారు చేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడింది. ఈమేరకు రెండు దేశాలు ఫిబ్రవరి 7న ఒక ప్రకటన చేశాయి. అయితే అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తు లపై సుంకాలు తగ్గించడానికి మనదేశం అంగీకరించలేదు. మనదేశ ఎగుమతిదార్లకు అమెరికాలో 30 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఎగు మతిపై ఆధారపడే మనదేశంలోని ముఖ్య రంగాలకు మేలు జరుగనుంది. వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, మన వ్యవసాయ, పాడి ఉత్పత్తులు, గ్రామీణ ఉపాధులు దెబ్బతినకుండా రక్షణలు యథా తథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మన దేశ వస్తువులు అమెరికా మార్కెట్లలోకి మరింతగా చొచ్చుకుపోయే వీలును ఈ ఒప్పందం కలిగిస్తోంది. మన ఉత్పత్తులపై చాలావరకు తక్కువ టారిఫ్ విధింపు (0 నుంచి 18% వరకు) కొనసాగు తుంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు మనదేశం లోకి ప్రవేశించడానికి ప్రభుత్వం అనుమతించలేదు. గోధుమ, వరి, సోయా, మొక్కజొన్న, నూనె గింజలు, పౌల్ట్రీ, వివిధ మాంస ఉత్పత్తులు, ఇథనాల్, పొగాకు లపై అత్యధిక సుంకాలు కొనసాగుతాయి. ఈ రంగా లకు చెందిన తయారీదార్లు తమ ఉత్పత్తులను భారత్ లోకి ప్రవేశపెట్టడం కష్టం. మనదేశానికి చెందిన అన్ని రకాల పాల ఉత్పత్తులైన పాలు, వెన్న, నెయ్యి, క్రీమ్, పెరుగు, మజ్జిగ వంటివి నూటికి నూరుశాతం రక్షణలో ఉన్నాయి. అమెరికా పాల ఉత్పత్తులకు మనదేశంలో ప్రవేశంలేదు. కూరగాయలు, పండ్లు, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులకు కూడా పూర్తి రక్షణ కొనసాగుతుంది. మసాలాలు, టీ వంటి సంప్రదాయ ఫ్లావర్ ఉత్పత్తులకు కూడా రక్షణ కొనసాగుతుంది. వ్యవసాయం, డైరీ, టీ ఉత్పత్తులకు అమెరికా ఎగుమ తుల నుంచి మనప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించింది.
తక్కువ టారిఫ్‌లు
సున్నితమైన వ్యవసాయ రంగాన్ని మినహాయిస్తే మెషినరీ, వాహనాలు, వివిధ విడిభాగాలు, రసాయ నాలు వంటి మనదేశ ఉత్పత్తులకు తక్కువ టారిఫ్ లేదా పూర్తి మినహాయింపు కొనసాగుతుంది. మన దేశానికి చెందిన టెక్నాలజీ, డేటా ఎంట్రీ సెగ్మెంట్‌లపై కూడా తక్కువ సుంకాలే అమల్లో వుంటాయి. కృత్రిమ మేధ(ఏఐ)హార్డ్‌వేర్, జీపీయూ, డేటాసెంటర్ ఎక్విప్‌మెంట్, సెమికండక్టర్ ఇన్‌పుట్స్ వంటి భారతీయ టెక్ ఎకోసిస్టమ్‌లు ఇప్పుడు తగ్గింపు సుంకాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వగలవు. వస్త్రాలు, రెడీమెడ్ దుస్తులు, తోళ్లు, పాదరక్షలు, ప్లాస్టిక్‌లు, రబ్బర్ వస్తువులు, హోం డెకార్, కార్పెట్లు, మెషినరీ, రసాయనాలు,చేతి తయారీ వస్తువులు, ఔషధాలు, రత్నాలు, వజ్రాలు, ఎయిర్‌క్రాఫ్ట్ భాగాలు వంటి వాటిపై యు.ఎస్.సుంకాలు తగ్గించింది. అంతకుముందు మనదేశ ఎగుమతులపై యు.ఎస్.లో 2.72% నుంచి 3.91% వరకు సుంకాల విధింపు అమల్లో ఉండేది. వాటితో పోలిస్తే ఇప్పటి సుంకాలు అధికమే! ఇక ఆ్కహాల్‌ను ఓపెన్ కేటగిరి కింద పరిగణించడం వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాలను మనదేశం బాగా తగ్గించింది. ఫలితంగా జిన్, రమ్, విస్కీ వంటి ఆల్కహాల్ ఉత్పత్తులపై ఇప్పటివరకు మనదేశం విధిస్తున్న 150శాతం సుంకాలను 30 నుంచి 40శాతానికి తగ్గించనుంది. దీంతో మనదేశంలోకి యు.ఎస్, యూరోపియన్ విస్కీలు ప్రవేశించనున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, రైతులకు, మత్స్యకారులకు ఈ ఒప్పందం ప్రయోజనం కలిగి స్తుంది. ఉత్పత్తులు పెంచాల్సి రావడంవల్ల మరింత మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. విమాన విడిభాగాలపై మనదేశానికి యు.ఎస్. కొన్ని మినహాయింపులు ఇస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే నాన్ టారిఫ్ అవరోధాలను, డిజిటల్ ట్రేడ్ అవరోధాలను పరిష్కరించుకుంటామని రెండు దేశాలు వెల్లడించాయి. ఉమ్మడి టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశాయి.
వ్యవసాయ ఉత్పత్తులకోసం ఒత్తిడి
నిజానికి ట్రంప్ ప్రభుత్వం తమదేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులను మనదేశంలోకి అనుమతించాలని మోదీ ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తీసుకు వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం ట్రంప్ అనుస రిస్తున్న బెదిరింపు విధానాలే! మాట వినని దేశాలను తన దారికి తెచ్చుకునేందుకు ట్రంప్ టారిఫ్‌ల విధింపు పేరుతో మిత్ర, శత్రుదేశాలనే తేడా లేకుండా బెదిరించడంతో, ఆంక్షలు విధించిన దేశాలతో వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం 67% పడిపోయినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆహారం, ఔషధాలు మినహాయించి లాజిస్టిక్స్, ఫైనాన్సింగ్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రష్యా వంటి మార్కెట్లను ఈ రంగాలు కోల్పోయాయి. యు.ఎస్. లోని తయారీదార్లు, వినియోగదార్లు తీవ్రంగా నష్టపోయారు. చైనా,రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా వంటి దేశాలపై విధించిన ఆంక్షలతో సోయాబీన్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. ఇదే సమయంలో కొన్ని దేశాలు యు.ఎస్.పై ప్రతీకార సుంకాలను విధించడం యు.ఎస్. ఎగుమతులకు మరో దెబ్బ! ఉదాహరణకు యు.ఎస్.నుంచి అత్యధికంగా సోయాబీన్‌ను దిగుమతి చేసుకునే దేశం చైనా. ఇప్పుడు చైనాపై సుంకాలు విధించడంతో చైనా యు.ఎస్. ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడమే కాదు బ్రెజిల్, అర్జెంటీనా దేశాలనుంచి సోయాబీన్ దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది. ఫలితంగా అమెరికా నుంచి చైనాకు సోయాబీన్ ఎగుమతులు 94% పడి పోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా కోల్పోయిన మార్కెట్ల స్థానంలో ఇతర దేశాల మార్కెట్లకోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1980లో యు.ఎస్.ఎస్.ఆర్. ధాన్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో యు.ఎస్. లోని వ్యవసాయ మార్కెట్ దారుణంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం రష్యాపై విధించిన ఆంక్షల వల్ల అదే పరిస్థితి పునరావృతమవుతోంది. 2025లో బ్రెజిల్, చైనా వంటి దేశాలపై విధించిన ఆంక్షలు యు.ఎస్. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతు లను గణనీయంగా దెబ్బతీసాయి.
కునారిల్లుతున్న పాడి పరిశ్రమ
యు.ఎస్. పాడిపరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకు పోయింది. పాలధర తక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటంతో 2005 లోనే 60% డైరీఫామ్‌లు మూతపడ్డాయి. 2023లో ఏకంగా 1500 డైరీఫామ్స్ మూత పడటంతో పాడి పరిశ్రమ సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడింది. డైరీఫామ్‌లలో 51% శ్రామికులు వలస వచ్చినవారే. ట్రంప్ వలసలపై ఉక్కుపాదం మోపడంతో ఈ పరిశ్రమకు శ్రామికుల కొరత ఏర్పడింది. దీనికితోడు చైనా, మెక్సికో,కెనడాలపై విధించిన ఆంక్షల వల్ల ఈ దేశాలకు ఎగుమతి చేసే పాల ఉత్పత్తులు నిలిచిపోయాయి. మొత్తం పాల ఎగుమతుల్లో ఈ రెండు దేశాలకు 16-17% ఎగుమతి అవుతున్నాయి. వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు ఇదేమాదిరిగా కొనసాగితే రాబోయే నాలుగేళ్లలో అమెరికా పాడిపరిశ్రమ 6 బిలియన్ డాలర్ల మేర నష్టపోతుందని అంచనా.యు.ఎస్. నుంచి పాల ఉత్పత్తులు అధికంగా అంటే మొత్తం పాల ఉత్పత్తిలో 1/4వంతు ఎగుమతి అయ్యేది మెక్సికో దేశానికి! ఆగ్నేయాసియా దేశాలకు కూడా యు.ఎస్. పాల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ‘‘వే’’ ప్రొటీన్ పాలు అధికంగా చైనాకు ఎగుమతి అవుతాయి. ఈ దేశాలకు 2024లో యు.ఎస్. ఎగుమతుల విలువ 8.4బిలియన్ డాలర్లు! ఇప్పుడు అమెరికా దేశాలపై టారిఫ్‌లు విధించడంతో, అవి కూడా ప్రతీకారంగా సుంకాలను విధించడంవల్ల, ఆ దేశాలకు ఎగుమతుల్లో 1.5% నుంచి 4% వరకు పడిపోయాయి. ఫలితంగా అమెరికా పాడిపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. పంది మాంసం, డైరీ, ధాన్యం ఎగుమతులు పడిపోయి దేశీయ మార్కెట్లలో వీటి ధరలు హెచ్చు తగ్గులకు లోనవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్ని కారణాల వల్ల ట్రంప్ యంత్రాంగం వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని అతిపెద్ద మార్కెట్ అయిన మనదేశంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చింది. మనదేశంలో కోట్లాది మంది రైతుల జీవనాధారం వ్యవసాయం, పాడి పరిశ్రమ కనుక మనదేశం ఈ ఒత్తిళ్లకు ఎంతమాత్రం లొంగలేదు.
విపక్షాల ఆరోపణ
అమెరికాలో ఆదాని గ్రూపుపై ఉన్న కేసు, ఎపిస్టీన్ ఫైల్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ పేరు ఉండటం వంటి అంశాల నేపథ్యంలో, ట్రంప్ ఒత్తిళ్లకు భయపడి నెలల తరబడి ఒక కొలిక్కిరాని ఈ ఒప్పందాన్ని అకస్మాత్తుగా ఖరారు చేసుకున్నారంటూ రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను ఖండించడమే కాకుండా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. కేవలం తమ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం ఈ ఒప్పందంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రభుత్వం విమర్శించింది. సగటున 50% నుంచి 18%కు సుంకాలను అమెరికా తగ్గిస్తున్న నేపథ్యంలో దేశ ప్రయోజనాల రీత్యా మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక ముందడుగు వేసిందని కొందరు నిపుణులు పేర్కొంటుండగా రిస్క్ కూడా ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసినవారు కూడా ఉన్నారు. ఈ ఒప్పందాన్ని ‘‘ట్రేడ్ ఫర్ జియోపాలిటిక్స్’’గా పరిగణిస్తున్నారు.
ట్రంప్‌పై పెరిగిన ఒత్తిడి
యు.ఎస్. టారిఫ్‌లకు లొంగిపోకుండా భారత్ ఏకంగా యు.కె., యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాతో సహా 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్ యంత్రాంగంపై ఒత్తిడి పెంచింది. భారత్ ఈ ఏడాది ఎఫ్‌టీఏలు సహా ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చు కోవడంతో మన సత్తా ఏంటో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకు తెలిసొచ్చింది. వీటిలో యూఏఈతో సీఈపీఏ, ఆస్ట్రేలియాతో ఈసీటీఏ, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లిచ్‌టెన్‌స్టైన్ దేశాలతో ఈఎఫ్‌టీఏ, న్యూజిలాండ్‌తో ఎఫ్‌టీఏ ఒప్పందాలు కీలకమైనవి. కెనడాతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కోసం కెనడా ప్రధాని మార్చి మొదటివారంలో మన దేశానికి రానున్నారు. ఈ సందర్భంగా యురేనియం, ఇంధనం, ఖనిజాలు, కృత్రిమమేధ అంశాలపై ఒప్పందాలు కుదరనున్నాయి. ఈయూ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’ అని వ్యవహరిస్తున్నారు. అయితే ఈయూ దేశాలతో వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతులు లేకుండానే ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకోవడం అమెరికాకు మింగుడుపడలేదు. కానీ వాస్తవాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి! ఈ ఒప్పందాల ద్వారా ఫైవ్ ఐస్ నేషన్స్ (ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యు.కె, యు.ఎస్)లో అమెరికాను మనదేశం ఏకాకిని చేయగలిగింది. ఇప్పుడు తమ వ్యవసాయ ఉత్పత్తులను మన మార్కెట్లలోకి అనుమతించాలని ట్రంప్ డిమాండ్ చేయడం సాధ్యంకాదు. ఈయూ ఒప్పందం ద్వారా భారత్ ఈ సానుకూలతను సాధించింది. అకస్మాత్తుగా ట్రంప్ ఒప్పందానికి అంగీకారం తెలపడ మంటే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి నీళ్లొ దులుకోవడానికి సిద్ధపడటమే! ఎఫ్‌టీఏ ఒప్పందానికి సంబంధించిన టర్మస్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ఒప్పందంపై భారత్-జీసీసీ (గల్ఫ్ కొఆపరేషన్ కౌన్సిల్-బహ్రైన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ) దేశాలు సంతకాలు చేయడం తాజా పరిణామం. 2004 నుంచి ఇది పెండింగ్‌లో ఉంది. 2024-25వ ఆర్థిక సంవత్స రంలో ఈ దేశాలతో మన వాణిజ్యం ఏకంగా 178.56 బిలియన్ డాలర్ల మేర జరిగింది. ఎఫ్‌టీఏ ఒప్పందం కుదిరితే ఇది మరింత విస్తరించగలదు. ఈవిధంగా మిగిలిన దేశాల మాదిరిగా ట్రంప్ బెదిరింపులకు భయపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా తన ప్రాధాన్యత ఏంటో తెలియ జెప్పిన ఘనత మోదీ ప్రభుత్వానిది! ఆవిధంగా మౌనంగా ట్రంప్ అహంకారాన్ని • •బ్బకొట్టిన ఘనత కూడా మనదేశం అనుసరించిన విదేశాంగ విధానానిదే.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్