కేరళలో ప్రజలు రాజకీయ మార్పు కోరుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల గ్రూపులకు ప్రత్యామ్నాయం కోరుతున్నారా? అంటే అవుననే పరిణామాలు కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం అనేది కమ్యూనిస్టుల మాట. కమ్యూనిస్టుల తీరుతో ఆ పార్టీ నేతలు విసిగిపోయి కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు.
దేశంలో వామపక్షాల అడ్డాగా ఉన్న కేరళలో 2024 ఎన్నికల్లో త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నటుడు సురేష్ గోపీ ఎన్నికయ్యారు. వామ పక్షాల గుప్పిట్లో ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్‌పై ఇటీవల బీజేపీ పతాకం ఎగురవేసింది. విద్యార్థులు కూడా వామపక్ష విద్యాసంఘాల నియంతృత్వ ధోరణితో విసిగిపోయారు. అందుకే విద్యాసంస్థల్లో కూడా బీజేపీ అనుబంధ విద్యాసంఘం ఏబీవీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇవన్నీ కాషాయ అనుకూల పవనాలే!
బలపడుతున్న కాషాయం
కేరళ రాష్ట్రంలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ గ్రూపులే అధికారం సాగించాయి. కాంగ్రెస్ సారధ్యంలో యూడీఎఫ్, సీపీఎం సారధ్యంలో సీపీఐ, ఇతర రాజకీయ పార్టీలతో ఎల్‌డీఎఫ్ ఉన్నాయి. ఎల్‌డీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో సీపీఎం నాయకుడు పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. యూడీఎఫ్ తరపున శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వి.డి.సతీశన్ వ్యవహరిస్తున్నారు. కాగా, ఎన్‌డీఏ గ్రూపు తరపున ప్రస్తుతం శాసనసభలో ఎవరూ లేరు.
ఇక సురేష్‌గోపి ఎన్నికైన త్రిసూర్ లోక్‌సభ స్థానం కేరళలో ఎన్‌డీఏ బలపడుతోందనడానికి ఓ తార్కాణం. 1996లో 5.96 శాతం, 1998లో 8.07% ఓట్లు ఉండగా, 2009లో 6.7%, 2014లో 11.15%, 2019లో 28.19%, 2024లో 37.8% ఓట్లను ఎన్‌డీఏ సాధించింది. 2009 ఎన్నికల కన్నా 2014 ఎన్నికలకు 4.45%, 2019 ఎన్నికలకు 17.04 శాతం ఓట్లను అధికంగా సాధించింది. 2024 ఎన్నికల్లో 9.61 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని త్రిసూర్‌లో కాషాయ పతాకాన్ని ఎగురవేసింది. ప్రతి ఎన్నికకూ బీజేపీ ఓట్లు, ఓట్ల శాతం పెరుగుతుండడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఓటమి చూసిన సురేష్ గోపీ 20224 ఎన్నికల్లో గెలిచారు. ఈ నియోజకవర్గంలో 9.75 శాతం ఓట్లను కోల్పోయిన కాంగ్రెస్ తృతీయ స్థానంలో నిలిచింది.
తిరువనంతపురం కార్పొరేషన్‌లో..
గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచు కోవడాన్ని చారిత్రాత్మక విజయంగా పేర్కొనాలి. ఇప్పటి వరకు సీపీఎం, కాంగ్రెస్, ప్రజాసోషలిస్ట్, ఇతర పార్టీల ఏలుబడిలో ఉన్నా, 1973 నుంచి ఇప్పటి వరకు సీపీఎం వరుసగా గెలుస్తూ వచ్చింది. గత ఏడాది ఈ కార్పొరేషన్‌లోని 101 వార్డుల్లో 50 స్థానాలను బీజేపీ గెలవడం జాతీయ మీడియాను ఆకట్టుకుంది. పాలక్కాడ్ మునిసిపాలిటీని నిలబెట్టుకుంది. ఓడిన చోట్ల కూడా ఓట్లశాతం గణనీయంగా పెరిగింది.
విద్యాసంస్థల్లో ఏబీవీపీ ప్రభంజనం
ఇటీవల త్రిపునితురలోని ప్రభుత్వ సంస్కృత కళాశాలలో జరిగిన విద్యార్థుల ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన సీపీఎం విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్ ఐను ఇంటి•కి పంపించారు. త్రిపునితుర ప్రభుత్వ సంస్క త కళాశాలలో సాధించిన విద్యార్థి విజయం కన్నా గొప్పగా చెప్పుకోవలసినది పెరవూర్ ప్రభుత్వ ఐటీఐలో ఏబీవీపీ అభ్యర్థుల విజయం. గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు శ్యామాప్రసాద్‌ను దారుణంగా హత్య చేసారు. ఇటీవల జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐను ఓడించి, ఎన్నిక జరిగిన ఆరు స్థానా ల్లోనూ ఏబీవీపీ అభ్యర్థులే ఎన్నికవడం ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆరు స్థానాల్లోనూ ఏకగ్రీవంగా ఎన్ని కవడం విశేషం. ఐటీఐ ఛైర్మన్‌గా కె.ఎం.అశ్వంత్, జనరల్ సెక్రటరీగా కె.అశ్వంత్, కౌన్సిలర్‌గా ఎం.పి.స్మేజా, మ్యాగజైన్ ఎడిటర్‌గా పి. శివదత్, జనరల్ కెప్టెన్‌గా సి.అతుల్, ఫైన్ ఆర్టస్ సెక్రటరీగా ఎ.ఆనంద్ ఎన్నికయ్యారు. అయితే, 2018లో కక్కయంగడ్ ఐటీఐ విద్యార్థి, ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య శిక్షక్ శ్యామాప్రసాద్‌ను ఎస్‌డీపీఐ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి పరాక్కండంకు చెందిన ముహమ్మద్, మినిక్కోల్ సలీం, నీవేలి అమీర్, పాలయోడ్‌కు చెందిన షాహిమ్ అనే నలుగురు ఎస్‌డీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పెరవూర్‌లో ఐటీఐలో ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర గ్రూపులు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక వైఖరి కారణంగానే, ఏబీవీపీ అభ్యర్థులను విద్యార్థులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, సీపీఎం నాయకులు బెదిరించినా విద్యార్థులు వెనుకంజ వేయలేదని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఏబీవీపీ అభ్యర్థుల ఎన్నిక మారుతున్న యువతరానికి, నవ ఓటర్ల అభిమతానికి ప్రతీకగా చూడాలి.
బీజేపీలో చేరికలు
గత కొన్నేళ్లుగా యూడీఎప్, ఎల్‌డీఎఫ్‌లలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేంద్రన్ జనవరి 18న బీజేపీలో చేరారు. తిరువనంతపురంలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు పార్టీ సభ్యత్వం మంజూరు చేశారు. సీపీఎంతో రాజేంద్రన్‌కు ఎంతో అనుబంధం ఉంది. మూడుసార్లు శాసనసభ్యుడిగా, రాజేంద్రన్ ఇడుక్కి జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ అభ్యర్థి ఎ.రాజాకు వ్యతిరేకంగా పని చేశారని పార్టీ సస్పెన్షన్ విధించడంతో, ఆయన పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధ రించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇడమలకుడి, దేవికులం తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అట్టప్పాడికి చెందిన సీపీఎం నాయకుడు వి.ఆర్. రామకృష్ణన్ జనవరి 8న బీజేపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయనను సీపీఎం అగలి కార్యదర్శి జంషీర్ ఫోన్‌లో బెదిరిం చారు. ఆరేళ్లు ఏరియా కార్యదర్శిగా, పన్నెండేళ్లు జెల్లిప్పర స్థానిక కార్యదర్శిగా రామకృష్ణన్ పనిచేశారు. బీజేపీలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు చేరడం కొన్నేళ కిందట నుంచి జరుగుతోంది. 2021లో తిరువనంతపురంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యుడు ముకుల్ ప్రభాకరన్‌తో పాటు వామపక్షాలకు చెందిన 98 మంది సభ్యులు బీజేపీలో చేరారు. జనతాదళ్ (సెక్యులర్), లోక్‌తాంత్రిక్ జనతాదళ్, జనతాదళ్ (యునైటెడ్) నాయకులు కూడా రెండేళ్ల కిందట బీజేపీలో చేరారు. 2024లో అల్లపుళకు చెందిన సీపీఎం నాయకుడు బిపిన్ సి బాబు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరడానికి ముందు బిపిన్ మాట్లాడుతూ, సీపీఎం లౌకిక స్వభావాన్ని కోల్పో యిందని, ఆ పార్టీని ‘మతతత్వ శక్తులు’ నియంత్రిస్తు న్నాయని అన్నారు. సీపీఎం మంగళపురం ఏరియా కమిటీ మాజీ కార్యదర్శి మధు ముల్లాస్సేరి, ఆయన కుమారుడు, డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు మిధున్ ముల్లాస్సేరి బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ నుంచి చేరికలు
కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నాయకులు బీజేపీలో చేరారు. వారిలో అనిల్ ఆంటోనీ, సి రఘునాథ్, కాలికట్ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఎం.జేఅబ్దుల్ సలాం, మాజీ పతనంతిట్ట డిసిసి ప్రధాన కార్యదర్శి బైజు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోని ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగా నికి జాతీయ సమన్వయకర్తగా ఆయన ఉన్నారు. రఘునాథ్ కన్నూర్ డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి. అదనంగా పూంజర్ మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ తన కేరళ జనపక్షం (లౌకిక)ను బీజేపీలో విలీనం చేశారు. వక్ఫ్ చట్ట బాధిత క్రైస్తవ సంఘాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపాయి. 400 ఎకరాలకు సంబంధించి వక్ఫ్‌కు, స్థానిక క్రైస్తవులకు మధ్య వివాదం ఉంది. ముస్లింలకు వామపక్ష ప్రభుత్వ మద్దతు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రైస్తవులు అధికంగా ఉన్న ఎర్నాకులం జిల్లాలోని పల్లిపురం పంచాయతీ పరిధిలోని మునంబం కడపపురం వార్డు ఎన్నికను బహిష్కరించా లని తొలుత భావించారు. తర్వాత వారు ఎన్నికలో పాల్గొన్నారు. ఫలితంగా సీపీఎం అభ్యర్థి రాకీ బినోయ్‌పై బీజేపీ అభ్యర్థి కుంజిమోన్ అగస్టీన్ 31 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తిరువనంతపురం కార్పొరేషన్ తర్వాత అందరి దృష్టినీ ఆకర్షించినదీ వార్డు ఎన్నిక. మారుతున్న పరిణామాలు గమనిస్తుంటే, కేరళ ప్రజలు మార్పు కోరుతున్నారని అనిపిస్తోంది. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లకు ప్రత్యా మ్నాయం తాము అనే నమ్మకాన్ని ప్రజల్లో బీజేపీ నేతలు కలిగించ గలిగితే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అధికార పగ్గాలు అంది పుచ్చుకోవచ్చు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాషాయ నేతలదే ఇక ఆలస్యం!
హేమచందర్ కొలిపాక
సీనియర్ జర్నలిస్ట్,
94400 21108