ఇటీవల విశేషంగా చర్చకు వచ్చిన అంశం వీచీ=జు+, లేదా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు. అయితే ఆ పథకం ఆశయాన్నీ, అది అందిస్తున్న లబ్ధిని ఇంకాస్త పెంచుతూ కొత్త చట్టం రూపొందించారే తప్ప, ఆ పాత ఉపాధి హామీ పథకానికి స్వస్తి పలకని మాట నిజం. పాత పథకానికి మరింత ప్రయోజనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్‌లో తయారు చేసినదే- వికసిత భారత్-గారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం- 2025. క్లుప్తంగా ‘వీబీ-జీ రామ్ జీ’/జీ రామ్ జీ అంటున్నారు. కొత్త పథకంలో విశిష్టత వికసిత్ భారత్ 2047 అనే ఆశయానికి దన్నుగా గ్రామీణ ఉపాధిని తీర్చిదిద్దే ప్రయత్నమే అసలు వాస్తవం.
పనిహక్కు అనే సంక్షేమ నినాదాన్ని నిజం చేయడానికి ఉద్దేశించిన పథకం, MNREGA ఆగస్ట్ 23,2005న ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఫిబ్రవరి 2, 2006 నుంచి అమలులోకి వచ్చింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండగా ఆ చట్టం వచ్చింది. గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి రఘువంశీప్రసాద్ దీనిని ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించిన బిల్లులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ పథకం నుంచి లబ్ధి పొందదలిచిన నైపుణ్యాలు లేని శ్రామికులు గ్రామ పంచాయతీలలో నమోదు చేసుకుని, జాబ్ కార్డులు పొందేవారు. అలా నమోదు చేసుకున్న 15 రోజులలోనే వారికి ఉపాధి చూపాలని చట్టం నిర్దేశించింది. అలాగే ఇందుకు నమోదు చేయించుకున్న ప్రతి కుటుంబానికి సంవత్స రానికి 100 పని దినాల పాటు ఉపాధి తప్పనిసరిగా కల్పించాలి. ఈ చట్టం స్థానంలోనే కొత్తగా వీబీ-జీ రామ్ జీ పథకం తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన బిల్లును డిసెంబర్ 16,2025న కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. MNREGA 100 పని దినాలకు హామీ ఇచ్చేది. కానీ ఆ స్థానంలో వచ్చిన కొత్త పథకం వీబీ-జీ రామ్ జీ 125 పనిదినాలకు హామీ ఇస్తున్నది. అలాగే వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. వీబీ-జీ రామ్ జీ కింద ఇచ్చే పనులు ఆ 60 రోజుల పాటు ఉండ వని పంచాయతీలు మొదటే వెల్లడిస్తాయి. ఆ కాలంలో వ్యవసాయ రంగ పనులకు కూలీలను అందుబాటులో ఉంచాలన్న ధ్యేయంగా ఈ మార్పు చేశారు. కొత్త బిల్లును క్లుప్తంగా జీ రామ్ జీ అంటున్నారు.
గత రెండు దశాబ్దాలలో MNREGA ప్రపంచం లోనే అతిపెద్ద సంక్షేమ ఉపాధి కార్యక్రమాలలో ఒకటిగా మారింది. అది పనిచేసిన కాలంలో పది హేను కోట్లకు పైగా జాబ్ కార్డులు జారీ అయ్యాయి. ఏటా ఏడు నుండి ఎనిమిది కోట్ల కుటుంబాలు ఉపాధిని కోరుతున్నాయి. మొత్తం వ్యయం రూ.11.57 లక్షల కోట్లకు మించిపోయింది, వార్షిక కేటాయింపులు సాధారణంగా రూ.60,000 కోట్ల నుండి రూ.90,000 కోట్ల మధ్య ఉన్నాయి. అయితే ఒక్కొక్క కుటుంబానికి లభించే సగటు ఉపాధి రోజులు 45 నుండి 50 రోజులకు మాత్రమే పరిమితమ య్యాయి. చట్టంలో హామీ ఇచ్చిన 100 రోజుల కంటే చాలా తక్కువ. యూపీఏ 2 కాలంలో వ్యయం రూ.2.13 లక్షల కోట్లు, చీణ పాలన కాలంలో రూ.8.53 లక్షల కోట్లు అయింది. ఇంత భారీ ఆర్థిక వ్యయం చేసినప్పటికీ గ్రామీణ ఉత్పాదకత సూచికలు – రైతుల ఆదాయం, వ్యవసాయేతర ఉపాధి, గ్రామ స్థాయి వ్యాపారాలు – తగినంతగా పెరగలేదు. ఖర్చు, ఫలితాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.
MNREGA లోపాలు
నిజమైన ఉపాధి లోపం- చట్టపరంగా 100 రోజుల హామీ ఉన్నప్పటికీ సగటు పనిదినాలు 45-55 మధ్యే ఉన్నాయి. తెలంగాణలో అయితే ఇది 28 రోజులకు కూడా చేరడం లేదు.
వేతనాల ఆలస్యం-15 రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలు ఆలస్యం కావడం వల్ల కార్మికులు అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది, పాల్గొనడం తగ్గుతోంది.
తక్కువ వేతన రేట్లు-2025-26లో రాష్ట్రాల వారీగా రోజుకు రూ.241-రూ. 400 మధ్య ఉన్న వేతనాలు ద్రవ్యోల్బణం లేదా వ్యవసాయ కనీస వేతనాలకు సరిపోవడం లేదు.
అవినీతి నిధుల లీకేజీలు – నకిలీ జాబ్ కార్డులు, ఘోస్ట్ కార్మికులు, నిధుల దుర్వినియోగం, కాంట్రాక్టర్ జోక్యం కొనసాగుతోంది. గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఒక కోటికి పైగా నకిలీ జాబ్ కార్డులు నమోదయ్యాయి.
నాసిరకం ఆస్తుల సృష్టి-చాలా పనులు నాణ్యత లేని నిర్మాణంతో దీర్ఘకాల అభివృద్ధికి ఉపయోగ పడటం లేదు.
కేంద్రీకరణ, స్థానిక పాలన బలహీనత- కేంద్రీకృత MIS వ్యవస్థలు, NMMS వంటి డిజిటల్ హాజరు యాప్‌లపై అధిక ఆధారపడటం వల్ల పంచాయతీ రాజ్ సంస్థల ప్రణాళిక, అమలు, ఫిర్యాదు పరిష్కార పాత్ర తగ్గిపోయింది.
బహిష్కరణ, అసమానతలు – మహిళలు, SC/ST వర్గాలు, దూర ప్రాంతాలు డిజిటల్ గ్యాప్‌లు, సామాజిక వివక్ష వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి.
వ్యవసాయ కార్మిక మార్కెట్ వికృతి-సాగు కాలంలో కార్మికులు లభించక పోవడం రైతులకు సమస్యగా మారింది.
నిర్మాణాత్మక పేదరికంపై పరిమిత ప్రభావం- తాత్కాలిక ఉపశమనం ఇస్తున్నా, నిర్మాణాత్మక పేదరికాన్ని తగ్గించలేకపోయింది. నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ హెచ్చరించినట్లుగా – ‘ఉపాధి పథకాలు ఉత్పాదక సామర్థ్యాన్ని సృష్టించకపోతే అవి ఖరీదైన నిల్వ వ్యవస్థలుగా మారుతాయి.’
భారత్ మారింది – విధానం కూడా మారాలి
2025 నాటి భారత్, 2005 నాటి భారత్ కాదు. దాదాపు అన్ని గ్రామాలకు విద్యుత్ చేరింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ రహదారులు విస్తరించాయి. డిజిటల్ చెల్లింపులు, ఆధార్ ఆధారిత వ్యవస్థలు సాధారణమయ్యాయి. నేడు ప్రధాన సమస్య నిరుద్యోగం కంటే నైపుణ్యాల కొరత. వాతావరణ మార్పులు నీటి సంరక్షణ, నేల ఉత్పాదకత, సుస్థిర వ్యవసాయానికి కొత్త ప్రాధాన్యత తీసుకొచ్చాయి. వీ గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా ఆకలి సమస్య చాలావరకు పరిష్కారమైంది. పేదరికం 2005లో 28% నుండి 2025లో సుమారు 5%కు తగ్గింది.
MNREGA వ్యయానికి ప్రత్యామ్నాయ అవకాశ వ్యయం
MNREGA ఖర్చు చేసిన రూ.11.53 లక్షల కోట్లతో ఒక వేళ శాశ్వత పనులు, ఉత్పాదకత చేబట్టి ఉంటే, వీటిని నిర్మించగలిగేవాళ్లం. 4.6 కోట్ల శాశ్వత ఇళ్లు, లేదా 1.15 లక్షల కి.మీ. 4- వరుసల జాతీయ రహదారులు, లేదా 11.5 లక్షల కి.మీ. గ్రామీణ రహదారులు. 19,000 ఆధునిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రులు లేదా 2.3 లక్షల డిజిటల్ సౌకర్యాలతో పాఠశాలలు లేదా 1,150 ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు లేదా 57 కోట్ల గృహాలకు త్రాగునీటి కనెక్షన్లు లేదా 11.5 కోట్ల హెక్టార్ల సాగునీటి విస్తరణ లేదా 1.15 లక్షల కి.మీ. కొత్త రైల్వే లైన్లు లేదా 2.8 లక్షల మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యం. అయినా ఈ భారీ వ్యయం తర్వాత కూడా గ్రామాల్లో స్పష్టంగా కనిపించే శాశ్వత మూలధన ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయి.
VB గ్రామ్ + బిల్: నిర్మాణాత్మక అభివృద్ధి మార్గం
VB గ్రామ్ + బిల్ ఒక సరళమైన సూత్రంపై ఆధారపడింది. వేతనాలు – పనులు-విలువైన ఆస్తుల సృష్టి.
ఇది సామాజిక న్యాయాన్ని తగ్గించదు – ఆధునీకరిస్తుంది. ప్రభుత్వ బాధ్యత శాశ్వత వేతన హామీ కాదు, ఉత్పాదక ఉపాధి హామీ. ఉపాధి కొలిచే ఆర్థిక ఫలితాలకు అనుసంధానమవుతుంది. పనులు గ్రామ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానమై ఉంటాయి. ఆస్తులు దీర్ఘకాల లాభాలను అందించాలి.
1) అపరిపక్వ శ్రమ నుండి నైపుణ్యాధార ఉపాధికి: VB గ్రామ్ + ఉపాధితో పాటు నైపుణ్యా లను అనుసంధానిస్తుంది. కార్మికుల సామర్థ్యాల ఆధారంగా మ్యాపింగ్ చేసి మేసన్రీ, ఎలక్ట్రికల్ పనులు, నీటి నిర్వహణ, సోలార్ నిర్వహణ, వ్యవసాయ లాజిస్టిక్స్ వంటి రంగాల్లో శిక్షణ, సర్టిఫికేషన్ ఇస్తుంది.
2) గ్రామం = ఆర్థిక యూనిట్: VB గ్రామ్ + గ్రామాన్ని అభివృద్ధి ప్రణాళిక కేంద్రంగా మారుస్తుంది. ప్రతి గ్రామం ఐదు సంవత్సరాల వృద్ధి ప్రణాళిక రూపొందిస్తుంది: 1) నీటి భద్రత 2) వ్యవసాయ ఉత్పాదకత 3) గ్రామ మౌలిక వసతులు 4) వాతావరణ ప్రతిఘటన. ఈ ప్రణాళికలకు అనుగుణ మైన ఉత్పాదక ఆస్తులకే నిధులు విడుదల అవుతాయి.
3) కేంద్ర ప్రణాళిక నుండి గ్రామ పంచాయతీ ప్రణాళికకు: ప్రతి గ్రామ అవసరాలు గ్రామానికే బాగా తెలుసు. అందుకే ప్రణాళిక, నిధుల వినియోగ అధికారాలను గ్రామ సభలకు బదిలీ చేస్తారు.
4) బడ్జెట్ సంస్కరణ: వార్షిక బడ్జెట్: రూ.1,51,282 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.95,692 కోట్లు, రాష్ట్రాల వాటా: 40%. భారతదేశంలో 2.60 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ విధానంలో:, ప్రతి గ్రామానికి ఏటా రూ.50 లక్షలు, ఐదేళ్లలో రూ.2.5 కోట్లు. ఇది గ్రామ అభివృద్ధికి గట్టి మూలధనం.
5) అవినీతి నివారణకు టెక్నాలజీ: AI ఆధారిత మానిటరింగ్, జియో ట్యాగింగ్, ఆధార్-బయోమెట్రిక్ హాజరు, రియల్ టైమ్ డాష్‌బోర్డులు, తప్పనిసరి సోషల్ ఆడిట్లు.
6) పనిదినాల సంస్కరణ: 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ. అటవీ ప్రాంతాలకు అదనంగా 25 రోజులు. 15 రోజుల్లో వేతనాలు. ఆలస్యం అయితే వడ్డీ చెల్లింపు. సాగు కాలంలో రైతులకు కార్మిక లోపం రాకుండా 60 రోజుల విరామం.
7) పరిపాలనా బలోపేతం: పరిపాలనా వ్యయం 6% నుండి 9%కి పెంపు, మెరుగైన పర్యవేక్షణ, అవినీతి నియంత్రణ కోసం.
ముగింపు: సంస్కరణ అంటే తిరస్కారం కాదు
ఒక సందర్భంలో వ్యవసాయ శాఖ మాజీమంత్రి శరద్ పవార్ వ్యవసాయ రంగానికి కార్మికుల కొరత ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోటును ఇప్పుడు తమ ప్రభుత్వం పరిష్కరిస్తున్నదని శివరాజ్ సింగ్ సభకు తెలియచేశారు. MNREGA కారణంగా వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. అలాగే వ్యవసాయం పనుల కాలంలో ఆ చట్టం కింద కల్పించే ఉపాధి విషయంలో కొన్ని పరిమితులు ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా నిపుణులు వెల్లడించిన సంగతి విస్మరించలేం. ఈ అంశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంది. ఎన్‌డీఏ ప్రభుత్వం చేసింది పధకానికి పేరు మార్చడం మాత్రమే కాదు. ఆ పథకంలోని లోపాలను చాలా వరకు సవరించింది.
ఇది గ్రామీణ ఉపాధి వ్యవస్థకు సమూలమైన, ప్రయోజనకరమైన మార్పు. అధికార పక్ష సభ్యులు కొందరు చెప్పినట్టు MNREGA అన్ని వర్గాలకు సమాన స్థాయిలో ఉపయోగపడడం లేదన్నది నిజం. ప్రధానంగా కొండకోనలలో గిరిజనులకు MNREGA తగిన విధంగా ఆర్థిక లబ్ధిని చేకూర్చ లేకపోతున్నది.
జీ రామ్ జీ ఆ లోటును భర్తీ చేస్తుంది. ఉపాధి కల్పించే తీరులో ఆయా ప్రాంతాల పరిస్థితులను MNREGA పరిగణనలోనికి తీసుకోలేదు. దానితో భారత్‌కు ప్రధాన ఆధారం వ్యవసాయ రంగం మీద దాని దుష్ప్రభావం పడింది. ఏ విధంగా చూసినా మన కాలానికి సరైనది జీరామ్‌జీ. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ఉన్న దేశం 2005 సంక్షోభ మోడల్‌కు కట్టుబడి ఉండలేదు. నిజమైన సామాజిక న్యాయం అంటే అంతులేని దానాలు కాదు – గౌరవప్రదమైన ఉపాధి, ఆస్తుల సృష్టి, ఆర్థిక స్వావలంబన. అదే జి రామ్ జి లక్ష్యం. ముగించే ముందు ఒకమాట ‘‘డబ్బులు ఎవరికీ ఊరికే రావండి’’.

డా. బూర నరసయ్య గౌడ్
ఉపాధ్యక్షులు- బీజేపీ తెలంగాణ,
మాజీ ఎంపీ, భువనగిరి