బతుకుతెరవు కోసం ఆంగ్లం అవసరమేనని,అదే సమయంలో మాతృభాషలో చదివితే ఎంతో రాణింపు ఉంటుందని, అందుకు ఎందరో ఉదాహరణగా కనిపిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.పెరుగుతున్న సాంకేతికతతో తెలుగును పరిరక్షించు కోవచ్చని అన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా వేరైన భాష, ఆత్మ ఒక్కటే. హిందీ మాట్లాడే వారి తరువాత రెండు రాష్ట్రాలు ఉన్నది తెలుగువారికే. ఇరు ప్రాంతాల వారు తెలుగును కాపాడుకుంటూనే, సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకొంటూ కలసి ఎదుగుదాం’ అని పిలుపునిచ్చారు. తెలుగువారి ఐక్యత కోసం ఎందరో ఎన్నో త్యాగాలు చేశారని, భాషాప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు బలిదానమివ్వగా, రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు బూర్గుల రామకృష్ణారావు పదవీ చేసి చిరస్మరణీయులు అయ్యారని అన్నారు.
భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదని, దానికి ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే శక్తి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమడిఘంటం నరసింహ అన్నారు. మాతృభాషను వాడకంలో ఉంచకపోతే అది జీవం లేని మనిషిలా క్షీణించి పోతుందని హెచ్చరించారు. న్యాయ, విద్యా వ్యవస్థల్లో తెలుగు ఆవశ్యకతను ఆయన నొక్కిచెబుతూ, జిల్లాకోర్టుల స్థాయి వరకు కార్యకలాపాల్లో పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేయాలని సూచించారు. ‘తెలుగు ఉపాధ్యాయులకు సమాజంలో తగిన గౌరవం దక్కడం లేదని, ఆ పద్ధతి మారి వారిని గౌరవించుకుంటేనే భాషను కాపాడుకోగలం.పిల్లలకు చిన్నతనం నుంచే చందమామ కథలు, సామెతలు పిల్లలకు నేర్పితే అవి వారి వ్యక్తిత్వ నిర్మాణంలో భాగమవుతాయి’అని జస్టిస్ నరసింహ తల్లిదండ్రులకు సూచించారు.
తెలుగు భాషకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాల్సిన గురుతర బాధ్యత ప్రజాప్రతినిధుల పైనే ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. ‘ఆంగ్లేయుల పాలన ప్రభావం మన న్యాయ, వైద్య విద్యలపై ఇంకా బలంగానే ఉందని, అందుకే చట్టాలు, తీర్పులు ఆ భాషలోనే ఉంటున్నాయని, రాచరిక, జమీందారీ పాలనల్లో కూడా భాషకు కలగని ముప్పు, ప్రస్తుతం పొంచి ఉందని ఆందోళనవ్యక్తం చేశారు. ఈ మహా సభలు ఉపన్యాసాలకు, ఇక్కడ మేధావులు చర్చించి చేసే తీర్మానాలు కాగితాలకు పరిమితం కాకూడదని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ఆచరణలో పెట్టేలా కృషి చేయాలని జస్టిస్ రాయ్ అన్నారు. తెలుగువారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా, అమ్మభాషలోనే మాట్లాడాలని, భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని పంచాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల మాధ్యమ చదువులే అయినా, పాఠ్యాంశాల్లో తెలుగును తప్పనిసరి చేయాలని ప్రభుత్వాలకు సూచించారు. ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే తెలుగు భాష మళ్ళీ వెలుగుతుందన్నారు.భాష పరిరక్షణ విషయంలో గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.‘గుజరాత్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు, పోలీసు ఛార్జిషీట్లు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ గుజరాతీ భాషలోనే కొనసాగుతున్నాయి. వారు తమ భాషను కాపాడుకుంటున్న తీరు అభినంద నీయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధానాన్ని అనుసరిస్తే మన భాషకు కొత్త ఊపిరి పోసినట్లవు తుంది అని అభిప్రాయపడ్డారు.
అమ్మభాషతో ఆత్మవిశ్వాసం
అమ్మభాష మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంచుతుందని, తద్వారా వికాసిత్ భారత్ సాకారమవుతుందని పూర్వపు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.సమాజంలోని ప్రతి అంశం భాషతో ముడిపడి ఉందని, ప్రాణంలేని మనిషిలా, భాషలేని సమాజాన్ని చూడలేమని అన్నారు.ఒక భాష ఉనికి కోల్పోతే, దాని చుట్టూ ఉన్న సంస్కబృతీ సంప్రదాయాలు, చరిత్ర కనుమరుగవు తాయని తెలిపారు.
తెలుగుపై ఆంగ్లం మరో దాడి
ప్రపంచీకరణ పేరుతో ఆంగ్లం మళ్లీ విజృంభి స్తోందని, విద్య,వ్యాపార,కార్మిక రంగాలను అది ప్రభావితం చేస్తోందని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో చదువుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. తాము అన్య భాóషలకు వ్యతిరేకం కాదని, తెలుగు భాషను, దాని గొప్పదనాన్ని కాపాడుతూనే ఎన్ని భాషలైన నేర్వవచ్చని అన్నారు. మాతృభాష అంతరిస్తే జాతి అంతరించినట్లేనని, భాషా పరిరక్షణకు రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘ప్రాథమిక విద్య బోధన మాతృభాష లోనే జరగాలి. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా ఉండాలి. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావనే ప్రచారాన్ని ప్రజల మెదళ్ల నుంచి తొలగిపోయేలా చైతన్య పరచాలి. ఈ మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి’అని సూచించారు.
అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేస్తా:
రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. మాతృభాషను మరువడం అమ్మను మరువడమేనని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఈ మహాసభల్లో మేధావులు చర్చించి, ఇచ్చే ప్రతిపాదనలను శానససభలో చర్చ పెట్టి, ఆమోదం పొందేలా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మారిషస్ గడ్డపై తెలుగు జెండా
ఈ మహాసభలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ ప్రసంగం ఆకర్షణగా నిలిచింది. తమ దేశంలో తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఉగాది పండుగను ‘జాతీయ సెలవుదినం’గా ప్రకటించి ఘనంగా నిర్వహించు కుంటామనడం సభికుల హర్షధ్వానాలతో మిన్నంటింది. ‘భారత్, మారిషస్ దేశాల మధ్య కేవలం దౌత్య సంబంధం కాదు. అది ఒక అసాధారణ నాగరికతా అనుబంధం. తమ దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో తెలుగు సమాజం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం మారిషస్‌లో ఉంది. అది భిన్న ఖండాల భక్తులను ఏకం చేస్తోంది’ అని సవినయంగా చెప్పారు. ఆంగ్ల భాషా ప్రభావం వల్ల ప్రపంచంలోని సగానికి పైగా భాషలు ఈ శతాబ్దం చివరి నాటికి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన ధరమ్ బీర్ గోకుల్ హెచ్చరించారు. పూర్వికుల నుంచి సంక్రమించిన మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విధి అని, అది దేశ బాధ్యత మాత్రమే కాదని, అవసరమని కూడా సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారిషస్ పర్యటన సందర్భంగా తెలుగు సంస్కృతి అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
తెలుగు నా తొలి గుర్తింపు: హరిబాబు
తెలుగు తన తన మాతృభాష మాత్రమే కాదని, తన ఆలోచనలు, విలువలు, వ్యక్తిత్వాన్ని మలిచిన సంస్కృతని, తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తు న్నానని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఉద్వేగంగా పేర్కొన్నారు. శతాబ్దాలుగా తెలుగు నాగరికతను నిలబెట్టిన కవులు, పండితులు, జానపద కళాకారులు, సామాన్య ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శాసనాలు, ఇతిహాసాలు, భక్తి ఉద్యమాల నుంచి నేటి సినిమా, సాంకేతిక పరిజ్ఞానం వరకు తెలుగు భాష ప్రస్థానాన్ని ఆయన వివరించారు. భాషను కేవలం ప్రభుత్వాలే బతికించలేవని, ప్రజలు తమ నిత్యజీవితంలో తెలుగును వాడినప్పుడే భాష వికసిస్తుందని హితవు పలికారు. ప్రాథమిక విద్య మాతృభాషలో సాగినప్పుడే పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలరని అభిప్రాయపడ్డారు. భారతీయ భాషల వికాసానికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీని, తెలుగు ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్‌టీ రామారావును స్మరించుకున్నారు.
మాతృభాష వల్ల విషయం పట్ల సమగ్ర అవగాహన కలుగుతుందని, ప్రపంచంలో వివిధ రంగాల ప్రముఖులు మాతృభాషలోనే చదివారని, ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదివించాలని విద్యా విధానం చెబుతోందని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తనకు తెలుగు బాగా వచ్చు కాబట్టే ఐదు భాషలు నేర్చుకున్నానన్నారు. విషయపరిజ్ఞానంపై ఉద్యోగాలు వస్తాయి కానీ, కేవలం ఆంగ్లం వల్ల కాదని అన్నారు. భాషతోనే వికాసం సాధ్యమౌతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి పేర్కొన్నారు. భాషా సంస్కృతులను మరచిన, కళలకు స్థానం లేని సమాజం మనుగడ సాగించ లేదని అన్నారు. అమ్మ తొలి గురువు కనుకే భాషను ‘అమ్మ భాష’ అంటామని, అమ్మను, అమ్మభాషను గౌరవించాలని కోరారు. తెలుగు భాషను నేర్చుకుని భావితరాలకు అందిం చాల్సిన బాధ్యత నేటితరంపై ఉందని సూచించారు.
తెలుగుతల్లికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కళ్లుగా ఆధ్యాత్మిక గురువు విశ్వయోగి విశ్వంజీ అభివర్ణించారు. ఇరువురు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని అభిలషించారు.
ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర సారస్వత పరిషత్తు తరఫున మూడోసారి ప్రపంచ మహాసభలు నిర్వహించామని, తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష, మాకు మాత్రం మమకార భాషగా పేర్కొన్నారు.
రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీన భాష తెలుగు. నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి వారు తెలుగు భాషకు పట్టం కట్టారు. ఎన్టీఆర్, రామోజీరావు తెలుగుకు గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులు అని కొనియాడారు.
తెలుగు భాషకు సేవలందించిన పలువురు ప్రముఖులకు మహాసభల్లో ‘పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ తనయుడు నాగేంద్ర, తూర్పుభాగోతం కళాకారుడు శంకర్రావు, సినీనటుడు ఏడిద శ్రీరాం, బుర్రా సాయిమాధవ్, గద్దర్ కుమార్తె వెన్నెల, తోలు బొమ్మల కళాకారుడు చిదంబరం, పొత్తూరు రంగారావు తదితరులను అయ్యన్నపాత్రుడు సత్కరించారు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్