మతం-విజ్ఞానం భిన్న స్వభావం కలిగినవంటారు. జ్ఞానం ఆధ్యాత్మికమైనది, అంతరంగానికి సంబంధించినది. విజ్ఞానం బైటకు కనిపించేది. అది ప్రామాణికం, మానవ అనుభవసారంతో కూడినది. ప్రతి ఒక్కరూ సత్య ప్రమాణ పూర్వకమైన దానినే నిజమైన విజ్ఞానంగా స్వీకరించాలి అన్నారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్. 2025 డిసెంబర్ 26-29 మధ్య తిరుపతి జాతీయ సంసృ్కత విశ్వవిద్యాలయం వేదికగా ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా డాక్టర్ భాగవత్ హాజరయ్యారు. ‘సమగ్ర వికాసానికి భారతీయ చింతన’ అనే అంశంపై జరిగిన ఈ అద్భుత సమ్మేళనంలో 32 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. విజ్ఞానభారతి ఈ కార్యక్రమం నిర్వహించింది.
డాక్టర్ భాగవత్ తన ప్రసంగంలో ఇంకా, అందరి వికాసమే నిజమైన వికాసమని, భారతదేశం విశ్వాభివృద్ధికి ఎంతో చేయాలనే లక్ష్యంతోనే భారతీయ ధర్మదృష్టి ఉంటుందని గుర్తు చేశారు. భారత్ విశ్వగురు స్థానంలో నిలవడంలోని పవిత్ర ఉద్దేశం జ్ఞాన పిపాసకు వివేకం తోడై విజ్ఞానం ప్రపంచ శ్రేయస్సు కోసం వినియోగపడాలనేదని అన్నారు. ప్రస్తుతం భారతీయ జ్ఞాన పరంపర ఇండియన్ నాలెడ్జ్ సొసైటీ ద్వారా 2000 సంవత్సరాలకు పూర్వం మన రుషులు రచించిన అత్యంత నిగూఢమైన శాస్త్ర సాంకేతిక విషయాలు వెలికి తీసి భావితరానికి అందిస్తున్నదని చెప్పారు. విదేశీ ఆక్రమణల వల్ల స్వదేశీ విజ్ఞాన వికాసం కుంటుపడిందని, మరలా దానిని సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి వ్యక్తి శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసం పొంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెబుతూ, అప్పుడే భారతదేశం ప్రగతిపథంలో దూసుకుపోతూ, విశ్వగురు కలను సార్ధకం చేసుకుంటుందని అన్నారు.
ప్రొఫెసర్ ఐ. వాసు మార్గదర్శకత్వంలో కొంత మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బాంబే)లో స్వదేశీ సైన్స్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం క్రమంగా ‘విజ్ఞాన భారతి’ అనే జాతీయ సంస్థగా అవతరించింది. స్వదేశీ విజ్ఞానాన్ని సమాజానికి చేరువచేసి, దేశ సమగ్ర వికాస సాధనకు కృషి చేస్తున్నది. ఆ క్రమంలోనే విజ్ఞాన భారతి, భారతీయ విజ్ఞాన సమ్మేళనం, విద్యార్థి విజ్ఞాన సమ్మేళనం, విభావాణి, శిక్షశిల్పి, టెక్ ఫర్ సేవ, సైన్స్ ఇండియా (పత్రిక) ప్రచురణ వంటి అనేక కార్యకలాపాలను దిగ్విజయంగా నిర్వహిస్తోంది. స్వదేశీశాస్త్రాల అభివృద్ధికి విజ్ఞానభారతి బహుముఖీన మైన కార్యకలాపాలను ఏర్పాటు చేస్తోంది. ఈ శాస్త్ర సాంకేతిక యుగంలో సంప్రదాయక , ఆధునిక శాస్త్రాల మధ్య వారధిగా పనిచేస్తుంది. గతంలో భోపాల్ (2007), ఇండోర్ (2009), జలంధర్ (2012), పణజీ (2015), పుణే (2017), అహ్మదాబాద్ (2023)లలో ఆరు విజ్ఞాన సమ్మేళనాలను నిర్వ హించింది. ఏడవది, ఆధ్యాత్మిక విద్యా రాజధానిగా పిలుచుకునే తిరుపతి వేదికగా జరగడం విశేషం.
డిసెంబర్ 26న ఆరంభమైన సమ్మేళనంలో డాక్టర్ భాగవత్; విశిష్ట, గౌరవ అతిథులుగా ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, డీఆర్‌డీఓ పూర్వ చైర్మన్ సతీష్‌రెడ్డి, సీఎస్‌ఐఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే హాజరయ్యారు. నాలుగు రోజుల సమ్మేళ నంలో శాస్త్రవేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు, ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో సుమారు 900 మంది ప్రతినిధులు.. నూతన ఆవిష్కరణలు భారతీయ విజ్ఞాన వైభవం గురించి భారతీయ భాషలలో పరిశోధనాత్మ కమైన ఆలోచనాత్మకమైన పరిశోధనా పత్రాలను, పోస్టర్లను సమర్పించారు. శాస్త్ర సాంకేతిక అధ్యయనా నికి ఇంగ్లీష్ మాత్రమే కాదు భారతీయ భాషలు కూడా మాధ్యమంగా ఉండగలవని ఈ సమ్మేళనం చాటి చెప్పింది.
విజ్ఞానం ఆధునిక కాలపు పాశ్చాత్యుల నుండే వచ్చిందన్న అభిప్రాయం ఉంది. కానీ, ఈ సమ్మేళనం ద్వారా 12 ప్రత్యేక అంశాలతో ప్రాచీన భారత దేశంలో ఖగోళ గణిత సిద్ధాంత- వేదాంత, జ్యోతిష, పరిపూర్ణ ఆరోగ్య విజ్ఞానం వాస్తు, భాష, వ్యవసాయం పశుపాలన, ధాతు, శక్తి వనరుల సంరక్షణ విజ్ఞానం, జీవవైవిధ్యం, ప్రకృతి వనరుల సంరక్షణ, పర్యావరణ వాతావరణ సముద్ర విజ్ఞానం, భారతీయ కళా విజ్ఞాన వైభవం, పారంపరిక సంప్రదాయ విజ్ఞానం వంటి అనేక జ్ఞాన విజ్ఞాన సంప్రదాయాలు ఏ విధంగా ఉండేవో, ఉన్నాయో.. ప్రస్తుత ప్రపంచానికి తెలియజేస్తూ భారతీయ వారసత్వ సంపద ఘనతను చాటి చెప్పడం ఈ సమ్మేళన లక్ష్యంగా సాగింది. ఇందులో విజయవంతమైంది. ఇంకా శాస్త్ర సాంకేతిక పరిశోధనా నిపుణులైన వారి ఆసక్తికరమైన చర్చా కార్యక్రమాలు, ముఖాముఖి, సైన్స్ బుక్ ఫెయిర్, సైన్స్ అండ్ మ్యాజిక్ షోల రూపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను వివిధ రకాల పోటీలు నిర్వహించడమే కాకుండా, భారతీయతను చాటి చెప్పే సాంసృ్కతిక కార్యక్రమాలకు ఇది వేదికగా పనిచేసింది.
డిసెంబర్ 26న నేషనల్ సెక్యూరిటీ సలహా మండలి సభ్యులు డీఆర్‌డీఓ పూర్వ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత సీ•ఎస్‌ఐఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే విజ్ఞానభారతి, ఏడవ సమ్మేళనం ఉద్దేశాలను వివరించారు. కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తుత ప్రభుత్వం సాధించిన శాస్త్ర సాంకేతిక విజయాలను సృ్పశిస్తూ.. ప్రస్తుతం భారతదేశంలో ఈ రంగాలలో 35వ స్థానంలో ఉందని, 100 పరిశోధనా పత్రికలలో 20 మన దేశం నుండే వెలువడుతున్నాయని, చైనా, అమెరికా తర్వాత మూడవ స్థానంలో భారతదేశం ఉందని తెలియ చేశారు. ప్రతి ఒక్కరికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం కోసం శాస్త్రసాంకేతిక అంశాల గ్రంథాలను ప్రాంతీయ భాషల్లో కూడా అనువాదాలు చేసి ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 2000 ఏళ్ల క్రితమే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసిన భారత్ త్వరలో సూపర్ పవర్ కావడం ఖాయమని అన్నారు. వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందని, 2600 ఏళ్ల క్రితమే మన దేశం ఆయుర్వేదం ద్వారా వైద్యసేవలను అందించిందని గుర్తు చేశారు. ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన తక్షశిల విశ్వవిద్యాలయం నిర్మించుకున్న దేశం మన దేశమేనని, ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్పవారు జన్మించిన వైజ్ఞానిక ధాత్రి మనదే అన్నారు. ఆంధప్రదేశ్ టెక్నాలజీతో సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతూ క్వాంటం, ఏఐ, వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతూ త్వరలో స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఏరోస్పేస్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ మెడిటెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విజ్ఞానభారతి, ఇండియన్ నాలెడ్జ్ సొసైటీ డివిజన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రచురించిన ‘భారతీయ జ్ఞాన పరంపర’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ సంచాలకులుగా విజ్ఞాన భారతి ప్రధాన కార్యదర్శి వివేకానంద పాయ్ వ్యవహరించారు. అనంతరం జాతీయ సంసృ్కత విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విశిష్ట అతిథులు, సైన్స్ టెక్నాలజీ ఎక్స్పో ప్రారంభిం చారు. ఇందులో ఉన్న 90 స్టాల్స్‌ని సమ్మేళనం జరిగిన నాలుగు రోజులు కూడా సందర్శకులు వీక్షించారు.
రెండవ రోజు కార్యక్రమాలలో వికసిత భారత లక్ష్యంతో ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్’ అనే అంశం మీద ప్రత్యేక సదస్సు జరిగింది. డాక్టర్ జయంత్ వసంత్ జోషి సైన్స్ మ్యాజిక్ షో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలని రేకెత్తించింది. ఈ సదస్సులో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు శామిక రవి (ప్రామాణిక మైన గణాంకాల ద్వారా) ఆర్థిక ప్రగతి ద్వారా 30 కోట్ల మంది ప్రజలు తమ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకున్నారని పేదరిక నుండి బయటపడ్డారని, ప్రసూతి మరణాలు, శిశుమరణాల సంఖ్య గణ నీయంగా తగ్గిందని, ఆత్మనిర్భర్ భారత్‌గా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఇంకా ఎగుమతులు- దిగుమతులు, నిరుద్యోగం, సంపద పంచడం వంటి పలు ఆర్థిక సామాజిక అంశాలపై సాధికారికంగా వివరించారు.
ఓపెన్ సైన్స్ పబ్లిషింగ్ రౌండ్ టేబుల్ సదస్సులో భారతీయ పరిశోధనా పత్రాలు ప్రచురణ ప్రామాణిక తల గురించి ఆచార్యులు, అధ్యాపకులు పరిశోధక విద్యార్థులు ప్రసంగించారు.
‘సంప్రదాయ వైద్యపద్ధతుల పరిశోధన’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆంధప్రదేశ్ వైద్య కుటుంబ సంక్షమ, వైద్య విద్యామంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుష్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిం దని, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, నేచురోపతి సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న కౌశల్ కార్యక్రమం గురించి మంత్రి వివరించారు.
విజ్ఞానభారతి ఆధ్వర్యంలో ఆంధప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి ఏపీ సీ ఓఎస్‌టీ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధప్రదేశ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం కౌశల్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం- ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో దాగిన సహజ ప్రతిభా• సామర్థ్యాలను వెలికి తీయడం. విజ్ఞానం, గణితం, భూగోళశాస్త్రాలలో భారతీయ శాస్త్రజ్ఞుల చేసిన కృషి గురించి, వివిధ పరిశోధనా సంస్థల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తు న్నారు. ఇందులో భాగంగా 2018 నుండి క్విజ్, పోస్టర్ పోటీలు నిర్వహిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా రీల్స్ పోటీ ద్వారా పదవ తరగతి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. 60 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పరీక్షలు ఆన్లైన్, ప్రోక్టరింగ్ విధానంలో జరుపుతున్నారు. భవిష్యత్ పోటీ పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం, డిజిటల్ అవగాహన విద్యార్థులకు కలుగుతుంది. విజేతలకు జిల్లా స్థాయిలో రూ. నాలుగు లక్షలు, రాష్ట్ర స్థాయిలో 1.5 లక్షల నగదు బహుమతులు అందజేస్తున్నారు. వక్తలు, విజేతలకు పురస్కార ప్రదానంచేస్తూ.. గ్రామీణ నేపథ్యంతో ఉన్న విద్యార్థులు, గిరిజన విద్యార్థుల ప్రతిభను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు దేశంలో స్టార్టప్ ఇండియా, సైన్స్ ఇండియా, స్కిల్ ఇండియా, కౌశల్ ఇండియా మొదలైన రంగాలలో తమ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అపారమైన అవకాశాలు ఉన్నట్లు వక్తలు చెప్పారు. ఆంధప్రదేశ్ లోని 2,580 పాఠశాలల నుండి 37వేల మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 312 మంది విద్యార్థులు ఈ కౌశల్ కార్యక్రమంలో షైనింగ్ స్టార్‌గా ఎంపికయ్యారు. ఇందులో ప్రథమ బహుమతిని పల్నాడు జిల్లా, ద్వితీయ బహుమతిని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కడప జిల్లా తృతీయ బహుమానాన్ని గెలుచుకున్నాయి.
చివరగా ‘భారతీయ ప్రాచీన శాస్త్రవిజ్ఞానం- ఆధునికకాలంలో దాని సంరక్షణ-చతుర్విధ పురుషార్దాల నుండి తెలుసుకోవలసిన విషయాలు’ అనే అంశంపై శాస్త్రార్థ గోష్టి జరిగింది.
ఆనాటి సాంసృ్కతిక కార్యక్రమాలలో పద్మశ్రీ పురస్కార గ్రహీత జి. పద్మజారెడ్డి బృందం ‘నమామి గంగే’ నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది.
మూడవరోజున ‘వికసిత్ భారత్ కోసం సెమీ కండక్టర్స్ అండ్ ఫ్యాబ్’ అన్న అంశంపై చర్చ జరిగింది. పారిశ్రామిక వికాసం- వికసిత్ భారత్ సాధనలో ముఖ్యమైన అంశంగా ప్యానలిస్టులు సోదాహరణంగా విశ్లేషించారు. ‘వికసిత్ భారత్ కోసం క్వాంటం, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్’ అనే అంశం మీద జరిగిన సదస్సులో, ప్రస్తుతం కంప్యూటర్ ప్రపంచంలో సరికొత్త పంథాను సృష్టిస్తున్న ‘క్వాంటం కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్’ వికసిత్ భారత సాధనలో కీలకంగా మారనుందని పానెలిస్టులు ప్రామాణికంగా వివరించారు. ‘నీ వారసత్వ సంపదని తెలుసుకో’ అనే అంశం మీద జరిగిన ప్రత్యేక పోటీకి దేశంలోని పలు రాష్ట్రాల నుండి 240 ఎంట్రీలు రాగా వాటిలో 40 ఎంట్రీలు ఎంపికయ్యాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా, ఆంధప్రదేశ్, తెలంగాణ మొదలైన రాష్ట్రాల నుండి వచ్చి ప్రత్యక్షంగా పోటీలో 26 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చారిత్రక కట్టడాలు, ఆలయాలు, ప్రకృతి, పక్షులు ఇలాంటి ఎన్నో అంశాలని పోస్టర్ మాధ్యమంలో, రీల్స్ మాధ్యమంలో విద్యార్థులు ప్రదర్శించి న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘అకడెమిక్ లీడర్స్- సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ విత్ భారతీయ పర్స్పెక్టివ్’, వైజ్ఞానిక బోధనలో గుణాత్మకమైన మార్పు కోసం భారతీయ దృక్కోణం- వైజ్ఞానిక విద్యా కార్యక్రమంలో బోధనా పద్ధతిలో తీసుకురావాల్సిన మార్పుల గురించి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు చర్చించారు. చివరగా ఆనాటి సాంసృ్కతిక కార్యక్రమాల్లో భాగంగా గణిత ఆధారిత నాటకం, యోగాసనాల ప్రదర్శన, మహాకాళి కూచిపూడి నృత్య ప్రదర్శన, ఘంటావధానం, నేత్రావధానం, ‘సంకల్ప బలం’, ‘భగవదజ్జుకం’ నాటకాల వీడియో ప్రదర్శనలు, యాంటీ రాగింగ్ వీడియో షో, ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.
చివరిరోజున (29 డిసెంబర్) ‘శాస్త్ర సాంకేతిక విద్యలో భారతీయ జ్ఞాన పరంపర’ అనే అంశంపై లోతైన చర్చ జరిగింది. భారతీయ జ్ఞాన పరంపర ఆధారంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సంబంధంలో సరికొత్త ఆవిష్కరణలు జరగాలని వక్తలు అభిప్రాయ పడ్డారు. ఇందుకు సంబంధించిన వివిధ అంశాలపై 700 మంది అధ్యాపకులు పరిశోధకులు, విద్యార్థులు సమర్పించిన పోస్టర్స్‌ను ప్రదర్శించి విశ్లేషించారు. ఆచార్య కె. సుబ్రహ్మణ్యన్ (ఐఐటి బాంబే) ‘టూల్స్ అండ్ గాడ్జెట్స్’ ‘ఆర్థిక ప్రగతి’ వంటి పలు విషయాలపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు.
ముగింపు సమావేశానికి ఆచార్య కె.సుబ్రహ్మణ్యన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భావ కాలుష్యం లేని, అవినీతి రాహిత్యం, విలువలు పాటించడం తోడైనప్పుడే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వికసిత్ భారత్ సాధించగలమని ఆయన అన్నారు. జ్ఞాన విజ్ఞానాల సమన్వయంతోనే సుస్థిరాభివృద్ధిని సాధించ గలమని ‘విజ్ఞానభారత్’ జాతీయ సంఘటన కార్యదర్శి డాక్టర్ శివకుమార్ శర్మ అన్నారు. జీవన సాఫల్యం కన్నా, జీవన సార్ధకత గురించి ఆలోచించా లన్నారు.
ఈ సమ్మేళనంలో మొత్తం నాలుగు ప్లీనరీ సెషన్స్, 28 అకడమిక్ సెషన్స్ జరిగాయి. వాటిలో 250 పరిశోధనా పత్ర సమర్పణలు, 700 పోస్టర్స్ ప్రజెంటేషన్లు జరిగాయి. భారతీయ విజ్ఞానానికి మూలమైన సంస్కృత భాషా సాహిత్యాలను బోధిస్తున్న, తిరుపతిలోని జాతీయ సంసృ్కత విశ్వవిద్యాలయం(డీమ్డ్ యూనివర్సిటీ) వేదికగా, ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం జయప్రదంగా ముగియడం పట్ల నిర్వాహకులు ప్రతినిధులు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు.