పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్రం తీవ్రస్థాయి రాజకీయ ప్రచారాలతో వేడెక్కిపోతోంది. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో మార్మోగి పోతూ యావద్దేశం దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రతి రాజకీయ పార్టీ తన సత్తాను నిరూపించుకునేందుకు, వీలైతే అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే కాక, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, వామపక్షలు సర్వశక్తులూ వొడ్డి పోరాటం సాగిస్తున్నాయి. రాష్ట్రంలో తన ప్రాభవాన్ని, ప్రాధాన్యాన్ని పూర్తిగా కోల్పోయి, తన మనుగడ కోసం, కనీస అస్తిత్వం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకుని పోవడానికి నానా అవస్థలూ పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కాస్తో కూస్తో పట్టు, పలుకుబడి ఉన్న అధీర్ రంజన్ చౌధురి ప్రయత్నా లను, వ్యూహాలను చూసినవారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటనేది పూర్తిగా అర్థమవు తుంది. అధీర్ రంజన్ చౌధురి ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. కేంద్రంలో కూడా ఆయన మాటకు ఎదురుండేది కాదు. ప్రస్తుతం ఆయన తన ముర్షీదాబాద్ నియోజకవర్గంలో బలం కూడగట్టుకోవడానికి చెమటలు కక్కుతున్నారు. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా, గతంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా కూడా పని చేశారు. ఆయన తన స్థానాన్ని కాపాడుకోవడానికి నానా తిప్పలూ పడుతుండగా, ఆయనను ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలవనివ్వరాదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో ఆమె ఇతర పార్టీలను కూడా కలుపుకునిపోయే ప్రయత్నంలో ఉన్నారు.
అమీ తుమీ పోటీ
గతంలో కూడా అధీర్ రంజన్ చౌధురిని మమతా బెనర్జీ ఈ విధంగా ఓడించడం వల్లే ఆయనకు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పట్టుపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను దాదాపు మరచిపోయింది. ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ మరో నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఆ తర్వాత ఆయ నను కూడా మార్చి, మళ్లీ చౌధురినే పార్టీ అధ్యక్షడిని చేసింది. ఈ ప్రయోగాల వల్ల కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్‌లో మరింత దుర్దశ దాపురించింది. ప్రస్తుతం ఆ పార్టీ అక్కడ నామరూపాల్లేని పరిస్థితిలో ఉంది. నిజానికి, రాష్ట్రంలో మమతా బెనర్జీ అధికారం లోకి వచ్చిన తర్వాత నుంచి ఒక కొత్తరకం రాజకీయ పునరేకీకరణ చోటు చేసుకోవడంతో, కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం పోవడంతో పాటు, దాని ఓటు బ్యాంకు కూడా పూర్తిగా క్షీణించిపోయింది.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి, రాజీవ్ గాంధీ ప్రోద్బలంతో అంచెలంచెలుగా ఎదిగిన మమతా బెనర్జీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వేటాడడమే తన ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. రాజీవ్ అండ దండలతో ఆమె పార్టీలో ఎదడగమే కాకుండా, మొదటిసారిగా విదేశాలకు వెళ్లడం కూడా జరిగింది. అయితే, ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చి, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడానికి కంకణం కట్టుకున్న మమత ఆ విషయంలో కృతకృత్యు రాలు కావడమే కాక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం ఓటు బ్యాంకును పూర్తిగా తన వైపునకు తిప్పు కున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆమె అనేక విధాలుగా హద్దులు దాటారు. కాంగ్రెస్ నుంచే కాక సి.పి.ఐ(ఎం)లో ఉన్న ముస్లింలను కూడా ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రాగలిగారు.
ఓటు బ్యాంకుకు గండి
ఆమె పార్టీలో ఆమె తరఫున పోరాడేవారిలో ఎక్కువ మంది సి.పి.ఐ(ఎం) నుంచి వచ్చినవారే. అయితే, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఆమె ఆ తర్వాత వారినందరినీ దూరం పెట్టేయడం ప్రారంభించారు. వారంతా తమ పూర్వ వాసనల నుంచి బయటపడడం లేదని ఆమె భావించారు. ఇతర పార్టీల నుంచే కాక, రాష్ట్రంలోని ముస్లిం వర్గాలన్నింటిని ఆమె రక రకాల ప్రలోభాలతో తన వైపు తిప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె దాని పర్యవసానాలను అనుభవిస్తున్నారు. ఆమె పార్టీలోనూ, ఆమె ఆంతరంగిక వర్గంలోనూ పాతుకుపోయిన ముస్లింలకు ఆమె మించిన ఆశలున్నాయి. వారు అత్యాశకు పోయి, పదవులను ఆశించడం, బాధ్యతలను ఆశించడం రాను రానూ ఎక్కువయింది. ఒక్కొక్కరు ఆమె మీద తిరుగుబాటు చేయడం కూడా ప్రారంభమైంది. ఇంత వరకూ బహిరంగ తిరుగు బాటుకు అవకాశం రాలేదు కానీ, ఆంతరంగికంగా మాత్రం వారు ఆమెకు ఎదురు తిరుగుతున్నారు. రాజకీయ ప్రతిఫలం కోసం వారు ఆమె మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నారు. మమతా బెనర్జీ అడపా దడపా విదిలించే చిన్నా చితకా ప్రయోజనా లతో వారు సంతృప్తి చెందే అవకాశం కనిపించడం లేదు.
ఆమెకు దాదాపు కుడి భుజంగా ఉన్న హుమయూన్ కబీర్ తాను లేకపోతే మమతా బెనర్జీ లేరన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఆయన మమత అధికారాన్ని సవాలు చేయడం ప్రారంభించారు. ఆమెతో విభేదించి బయటకు వచ్చేసిన కబీర్ సొంతగా పార్టీ పెట్టి, ఆమె పాలన మీద విమర్శలు సాగించడం జరుగుతోంది. ముస్లింలంతా తన వైపే ఉన్నారని కూడా ఆయన ఘనంగా చెప్పుకుంటున్నారు. ముస్లింలను పూర్తిగా తన వైపునకు తిప్పుకున్న పక్షంలో తాను ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని, ఇతర పార్టీలేవీ అధికారం లోకి వచ్చే అవకాశం లేదు కనుక తనకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.
హిందువులకు గాలం
పశ్చిమ బెంగాల్‌లో ఒక వింతైన పరిస్థితి రూపు దిద్దుకుంటోంది. రాష్ట్రంలో ముస్లింలంతా గంపగుత్తగా ఏ పార్టీకీ మద్దతునిచ్చే అవకాశం కనిపించడం లేదు. ముస్లింలలో ఎక్కువ మంది సొంత పార్టీలు పెట్టుకోవడమో, తాము గతంలో ఉన్న పార్టీలకు తిరిగి వెళ్లిపోవడమో జరుగుతోంది. కాంగ్రెస్, సి.పి.ఐ(ఎం)ల నుంచి వచ్చిన ముస్లింలలో ఎక్కువ మంది ఇప్పటికే తమ పాత గూళ్లకు చేరు కుంటున్నారు. మమతా బెనర్జీకి ఈ విషయం బాగా అర్థమైంది. తాను పార్టీని ప్రారంభించిన మొదట్లో మాదిరిగానే ఆమె ఇప్పుడు హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం కంటే హిందువులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం వల్ల తప్పకుండా తాను తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆమె గట్టి నమ్మకంతో ఉన్నారు. హిందూ ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడానికి ఆమె బహిరంగంగానే కొన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఒడిశా సరిహద్దుల్లో, సముద్ర తీరానికి దగ్గరగా దిఘా అనే ప్రాంతంలో ఆమె ఒక అతి పెద్ద జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మించారు. పూరీలోని జగన్నాథ స్వామి ఆలయాన్ని తలపించే విధంగా ఆమె ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పూరీ జగన్నాథ స్వామి ఆలయంతో దీనికి ఏ విధంగానూ పోలిక లేనప్పటికీ, ఆమె మాత్రం పూరీ ఆలయాన్ని ఇది మించిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆమె ఇస్కాన్‌కు అప్పగించారు. ఆమె ఇక్కడితో ఆగలేదు. కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో దుర్గాంగన్ పేరుతో ఒక కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. సాధారణంగా పశ్చిమ బెంగాల్‌లో దుర్గాదేవి అనే పేరుకు బెంగాలీలు బాగా విలువనిస్తారు. దుర్గాదేవి పేరుతో ఏది నిర్మాణమైనా దాన్ని ఆదరిస్తారు. ఆ ప్రాంగ ణంలో ఒక అతి పెద్ద దుర్గాదేవి ఆలయ నిర్మాణం ప్రారంభిం చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న హిందువులను ఆకట్టుకోవడానికి ఆమె తన సహజ లక్షణాలకు విరుద్ధంగా పడరాని పాట్లు పడుతున్నారు.
దీదీ వ్యూహానికి ముస్లింలు అడ్డు
పశ్చిమ బెంగాల్ సీఎం అంచనాలకు వ్యతిరేకంగా దుర్గాంగన్ ఆలయ నిర్మాణ వ్యవహారం వివాదంలో పడింది. తమకు సంబంధించిన స్థలంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారంటూ కొందరు ముస్లిం నాయకులు హైకోర్టుకు వెళ్లారు. ఆలయ నిర్మాణాన్ని తక్షణం ఆపేయాలని, వేరే ప్రాంతంలో ఈ నిర్మాణం చేపట్టాలని వారు న్యాయస్థానాన్ని కోరడంతో ప్రస్తుతం అక్కడి ఆలయ నిర్మాణం ఆగిపోయింది. ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. ఆమె ఎన్నికల వ్యూహం అక్కడితోపూర్తి కాలేదు. ఒకపక్క ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరో పక్క హిందువులను ఆకట్టుకోవడానికి కూడా ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఆమె వ్యూహాలు, ప్రతి వ్యూహాల ముందు ఇతర పార్టీల వ్యూహాలన్నీ బలాదూరేనని ఆమె అనుకూల పత్రికలు కూడా ఇతోధికంగా ప్రచారం చేస్తున్నాయి.
బీజేపీకి అనుకూల పవనాలు
భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. బీజేపీ చేపట్టిన విజయమా.. వినాశనమా? అనే నినాదం ప్రజల్లోకి బాగా వెడుతోందని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాలతో ముందుకువెడుతున్న బీజేపీ 2021లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో బీజేపీ బృందంఒకటి ఇక్కడ రాత్రింబగళ్లు తీవ్రంగా ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే పక్షంలో రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మమత హయాంలో రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి ఏ విధంగా పెరిగిపోయాయో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
అమిత్ షా చేపట్టిన అతి కీలకమైన వ్యూహం ప్రకారం, రాష్ట్రంలో ఈసారి ఎన్నికల ప్రచారం ఒకే వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. సామిక్ భట్టాచార్య, సువేందు అధికారి, సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్‌ల పేర్లను ప్రచారంలో ఉంచడం జరుగు తోంది. అమిత్ షా నాయకత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ నలుగురు నాయకులు కలిసి అవిశ్రాంతంగా ప్రచారం చేయడం, పర్యటనలు చేయడం జరుగుతుంది.
తమ ప్రచారంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది వీరి వ్యూహం. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతతో పాటు, ప్రచార సరళిని రూపొందించే బాధ్యత కూడా అమిత్ షా బృందం మీదే ఆధారపడి ఉంటుంది. అమిత్ షా తరచూ కోల్‌కతా వచ్చి పార్టీ నాయకులతో సమావేశమై ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిం చడం జరుగుతోంది. శాసనసభ ఎన్నికల పోటీ అంతా మమతా బెనర్జీ, అమిత్ షాల మధ్యనే ఉందన్న ట్టుగా ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్