రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల  వాటాల  అంశం కొత్త మలుపు తీసుకొంది. ఇరు రాష్ట్రాల మధ్య సాగాల్సిన వాదనలు, ఇప్పుడు తెలంగాణలో  రెండు పార్టీల మధ్య కొనసాగుతున్నాయి. వ్యవహారం నీళ్లు- నిప్పులుగా సాగుతోంది. సమస్యలపై  ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సలహాలు, సూచనలు సర్వ సాధారణం కాగా,రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిగా, ఐక్యంగా పోరాడాల్సిన  పార్టీలు బాధ్యతలు మరిచిపోయాయి. ఒకరిపై ఒకరు  కారాలు, మిరియాలు నూరుకుంటున్నాయి. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్ల పేరుతో ప్రజలను సందిగ్ధంలో పడేస్తున్నాయి.

తెలంగాణకు గోదావరి, కృష్ణానదీ జలాల్లో రావాల్సిన వాటాలపై ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. శీతకాలంలోనూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన నల్లమల సాగర్‌ ప్రాజెక్ట్‌ వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అయితే గత బీఆర్‌ఎస్‌ హయాంలో నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకొన్న నిర్ణయాల వల్లే అన్యాయం జరిగిందని అధికార పక్షం విమర్శిస్తోంది. ఇదే విషయంపై రెండు పార్టీలు వేరువేరుగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చాయి. ప్రభుత్వం తరఫున మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈనెల 3వ తేదీన శాసనసభలో, ఆ మరునాడు బీఆర్‌ఎస్‌ తమ కార్యాలయం (తెలంగాణ భవన్‌లో) పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తమ లెక్కలు చెప్పుకున్నారు. కానీ, ఇద్దరి లెక్కలకు పొంతనే కనిపించడం లేదు. ఎవరికి వారే తమకు లాభం చేకూరేలా ప్రదర్శనల ద్వారా ప్రజలను అయో మయంలో పడేస్తున్నారు.

 కృష్ణా బేసిన్‌పై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టులో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయలేదని ఆ శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌ తరువాత మొదలుపెట్టిన కాళేశ్వకర్ట పూర్తయినా, పాలమూరు ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉందని నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమర్శల వర్షం కురిపించారు. కాళేశ్వరం కోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేసిన ఆ ప్రభుత్వం, పాలమూరుకు కేవలం రూ. 27 వేల కోట్లు మాత్రమే అవసరమైన దానిపట్ల పక్షపాతం చూపించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయంటూ, దానిని హడావిడిగా పూర్తి చేశారని, పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదని, దీనికి ఎవరు బాధ్యులని ఉత్తమ్‌ ప్రశ్నించారు.ఇంత ప్రధాన అంశంపై చర్చ జరుగుతుండగా బీఆర్‌ఎస్‌ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌..ఇటీవల ఆర్భాటంగా సమావేశం పెట్టి కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు ఆ వివరాలపై చర్చించేందుకు సభకు రావడం లేదని నిరస తెలిపారు.. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంతకాలు చేసిందని, తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలు అని కేసీఆర్‌, హరీష్‌రావు సంతకాలు చేశారని ఇది తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయం అన్నారు. తాను కుర్చీ వేసుకొని దేవరకద్ర ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హోదాలో అట్టహాసంగా ప్రకటించిన కేసీఆర్‌ దాని సంగతే మరచారని అన్నారు.

కృష్ణా నీటిలో చుక్క నీరు వదులుకోబోమని, తెలంగాణ హక్కులను కాపాడటంలో రాజీపడబోమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌లో నీటిపారుదలకు రూ. 24 వేల కోట్లు ాకేటాయించగా, అందులో రూ.16 వేల కోట్లు వడ్డీలకే వెళ్లాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 2 నుంచి 3 టీఎంసీలకు పెంచి, పాలమూరు ప్రాజెక్టును మాత్రం 1.5 టీఎంసీల నుంచి 1టీఎంసీకి కుదించి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఇదే అంశంపై ప్రభుత్వానికి ప్రతిగా కౌంటర్‌గా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాజెక్టుల పట్ల కుట్రపూరితంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

 తెలంగాణకు అసలైన విలన్‌ కాంగ్రెస్‌ పార్టీ అని, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, పాల మూరుకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్‌ పార్టీ అని, కానీ,అది తన తప్పులను కప్పిపుచ్చుకుంటో దని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కాంగ్రెస్‌ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, 11వ షెడ్యూల్‌లో పాలమూరు`రం గారెడ్డి ప్రాజెక్టును చేర్చలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారని, కేసీఆర్‌ ప్రశ్నించిన తరువాత,‘ప్రాజెక్టులను అప్పగించబోం’ అంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని తమ ప్రభుత్వ హయాంలో 11 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపి, ఏడు ప్రాజెక్టులకు అన్ని అనుమతులు సాధించామని, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒక్క డీపీఆర్‌ కూడా పంపలేదని అన్నారు. పైగా, మూడు డీపీఆర్‌లు వెనక్కి తెచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. తమ ప్రభుత్వం సక్సెస్‌ రేట్‌ 60శాతం అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం సక్సెస్‌ రేట్‌ మైనస్‌ 30శాతం అన్నారు.ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రికి కృష్ణాజలాలపై అవగాహన లేదని అన్నారు..

 భారతీయ జనతాపార్టీ ఈ రెండు పార్టీల వ్యవహారశైలిని, వాటి విమర్శ, ప్రతి విమర్శలను జాగ్రత్తగా గమనిస్తోంది. అవి రాష్ట్రానికి అన్యాయం చేశాయని, చేస్తున్నాయని, అవి బయట పడకుండా తప్పించుకునేందుకే వాస్తవాలు చెప్పకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు, జరుగుతున్న నష్టాలకు రెండు పార్టీలదే బాధ్యత అని వాదిస్తోంది. నీటి కేటాయింపులపై బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులు, ప్రజలకు ఉపయోగపడే తీరును సభా సాక్షిగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించేందుకు సిద్ధమయ్యారు.

శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, నిర్వాసిత రైతులకు పరిహారం, సాగునీటి సౌకర్యాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యేలు. చనాక కోరాట ప్రాజెక్ట్‌ నిర్వాసిత రైతుల సమస్యలను ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ సభలో లేవనెత్తారు. ఆ ప్రాజెక్ట్‌ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్నారని గుర్తుచేశారు. పదేళ్లు గడిచినా.. నీళ్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం నిధులు విడుదల చేసి వెంటనే భూనిర్వాసితులకు పరిహారంగా చెల్లించాలని పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. జైనాథ్‌పూర్‌ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సిర్పూర్‌ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు కోరారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రిని కలిసినా ఫైళ్లు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు మండలాల్లో సాగునీరు అందుతుందన్నారు. ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ డిమాండ్‌ చేశారు. అలాగే ప్రిప్రీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును కూడా వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణకు రూ. 2 వేల కోట్లు కేటాయించాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనూ, స్వరాష్ట్రంలోనూ నిజామాబాద్‌ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవంక, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తన దారిలో తాను ముందుకు వెళ్తోంది. జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల కమిషన్‌ చైర్మన్‌గా 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. 2025 జులై 16న జరిగిన ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు నియ మించిన ఈ కమిటీలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున అధికారులు సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాద సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించనుంది. సమావేశాల్లో భాగంగా సభ్యులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కేంద్రప్రభుత్వం గడువు విధించింది.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE