దేశంలో బుజ్జగింపు రాజకీయాలు 1930వ దశకంలోనే ప్రారంభమయ్యాయి. ‘సెక్యులరిజం’ పేరుతో వందేమాతరం గేయంపై ముస్లింలీగ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం దగ్గరినుంచి కాంగ్రెస్ సంతుష్టీకరణ విధానాలు మొదలయ్యాయని చెప్పాలి. వందేమాతరం గేయం రచించి ఈ ఏడాదితో సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిని వందేమాతరం సంస్మరణ సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జాతీయ గేయం వందేమాతరం 150 వార్షికోత్సవం సందర్భంగా చర్చ’’ పేరుతో అప్పట్లో చోటుచేసుకున్న వాస్తవ పరిణామాలను ప్రజలకు ముఖ్యంగా నేటితరం వారికి పార్లమెంట్ ద్వారా తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యంగా వందేమాతరం గేయంలో రెండు చరణాలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగించడంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోదీ చర్చను ప్రారంభించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ముగించారు. డిసెంబర్ 8వ తేదీన లోక్‌సభలో మొత్తం పదిగంటలపాటు చర్చ జరిగింది. అదేవిధంగా రాజ్యసభలో డిసెంబర్ 9న హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తే, 10వ తేదీన బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభాపక్ష నేత జె.పి.నడ్డా ముగించారు. నిజానికి దీనిపై చర్చించ డానికి ఎన్డీఏ పక్షాలు సిద్ధం కాగా, విపక్షాల్లో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఈ చర్చకు అంగీకారం తెలపడం గమనార్హం. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ చర్చ జరపడానికి ఎంచుకున్న సమయాన్ని ప్రశ్నించింది. అంతేకాదు ఓటర్ల జాబితా సవరణల అంశం కీలకం కాగా ప్రభుత్వం వీటినుంచి దృష్టి మరల్చడానికే వందేమాతరం చర్చను ముందుకు తెచ్చిందని ఆరోపించింది.
బీజేపీ వాదన
వందేమాతరంపై జరిగిన చర్చలో బీజేపీ ప్రధానంగా కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. వీటిలో వందేమాతరం నినాదాన్ని నెహ్రూ ఏవిధంగా ఓటుబ్యాంకు రాజకీయాలకోసం ఉపయోగించుకున్నది వెల్లడి చేయడం ప్రధానంగా ఉంది. 1937లో వందేమాతరం గీతాన్ని కుదించ డంలో సుభాష్ చంద్రబోస్ వంటి సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా నెహ్రూ ఏ విధంగా ముస్లింలీగ్, జిన్నాల ఒత్తిళ్లకు లొంగిపోయిందీ బహిర్గతం చేసింది. 1896లో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ కాంగ్రెస్ సమావేశంలో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించినప్పటికీ ఎవరూ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పైగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులుగా రహమ్‌తుల్లా సయానీ ఉన్నారు. 1870 ప్రాంతంలో బెంగాల్‌కు చెందిన బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం దేశంలోని హిందూ, ముస్లింలను ఏకతాటిపై నిలిపి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటానికి ఉద్దీప్తం చేసింది. 1905లో వలస ప్రభుత్వం బెంగాల్‌ను విభజించినప్పుడు, అందుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో వందేమాతరం మొత్తం గీతం ఒక నినాదంగా మారింది. కేవలం రాడికల్ మతతత్వవాదుల ఒత్తిడితో కాంగ్రెస్ ఈ అద్భుత గీతాన్ని రెండు చరణాలకు కుదించింది. ఈవిధంగా దేశాన్ని ఏకం చేసిన గీతాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముక్కలు చేశారనేది బీజేపీ అభిప్రాయం.
కాంగ్రెస్ సమర్థన
వందేమాతరం గీతాన్ని రచించినప్పుడు బీజేపీ ఉనికిలోనే లేదు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌లు తాము చేపట్టిన ఆందోళనా కార్యక్రమాల్లో ఎప్పుడూ వందేమాతరం గీతాన్ని ఆలపించేవారు. దేశంలో క్రమంగా మతపరమైన విభేదాలు బలం పుంజు కుంటున్న దశలో, గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను స్వీకరించడానికి నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న వర్తమాన సవాళ్ల నుంచి దృష్టి మరల్చడానికే సాంస్కృతిక చిహ్నాలను తన స్వార్థం కోసం ఉపయోగిస్తున్నది. 1937లో వందేమాతరంలో మొదటి రెండు చరణాలు తీసుకోవాలనేది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. అది కేవలం నెహ్రూ ఒక్కరే చేయలేదు. నిర్ణయం తీసుకున్న కమిటీలో ఆయనతోపాటు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, సుభాష్‌చంద్రబోస్, సరోజినీనాయుడు, రాజేందప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఉద్దండ నాయకులున్నారని కాంగ్రేష్ గుర్తుచేసింది. అంతేకాదు స్వాతంత్య్రోద్యమం సమైక్యంగా జరగాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న నిర్ణయమని పార్టీ పేర్కొంది. ఈ గేయంలోని రెండు చరణాలు మాత్రం ఉపయోగించవచ్చంటూ రవీంద్రనాథ్ ఠాకూర్ రాసిన లేఖను నిదర్శనంగా చూపుతూ ప్రధాని నుంచి క్షమాపణను కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
నేటి తరాలవారు తెలుసుకోవాలి
పార్లమెంట్‌లో చర్చను ప్రారంభిస్తూ ప్రధాన మంత్రి, ‘‘నేటి తరాలవారు ఈ మహామంత్రంవంటి ఈ గేయానికి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. నాటి విభజన మనస్తత్వం ఇప్పటికీ దేశానికి పెను సవాలు విసురుతోంది’’ అన్నారు. గేయంలోని కొన్ని చరణాలను తొలగించడం ద్వారా దాని ఆత్మను విడగొట్టినట్లయిందన్నారు. ఈ గేయాన్ని కుదించడంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని కూడా ఆయన అన్నారు.
అయితే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు చర్చ ఎంతవరకు అవసరమన్న వాదనలు వచ్చాయి. కానీ ఆధునిక స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టాలను మనం సంస్మరించుకుంటూనే ఉన్నాం. అటువం టప్పుడు దేశ ప్రజలను ఒకే లక్ష్యం వైపునకు మరల్చడంలో కీలకపాత్ర పోషించిన వందేమాతరం గేయ చరిత్రను సంస్మరించుకోవడం అవసరమనేది బీజేపీ వాదన. అంతేకాదు బుజ్జగింపు రాజకీయాలతో ఈ గేయాన్ని కుదించి మెజారిటీ ప్రజల మనోభావాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదనేది కూడా బీజేపీ నాయకుల విమర్శ. అయితే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని మీరు దీనిపై చర్చించడ మేంటనేది కాంగ్రెస్ ప్రతి విమర్శ. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌లో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో, కేవలం రాజకీయ లబ్ధి కోసమే వందేమాతరం అంశాన్ని చర్చకు తీసుకు వచ్చారని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ఎదురుదాడికి దిగారు. 150 సంవత్సరాలనుంచి ప్రజల హృదయాల్లో ఉందని, మనకు స్వాతంత్య్రం వచ్చి డెబ్భయి ఐదేళ్లు దాటింది. అటువంటప్పుడు దీనిపై చర్చ ఎందుకని ఆమె ప్రశ్నించారు. ‘మీరు ఎంతసేపూ గతాన్ని సజీవంగా ఉంచే యత్నమే చేస్తారు. వర్తమానం, భవిష్యత్తు మీకు అవసరం లేద’ ని ఆమె అన్నారు. అయితే వందేమాతరం రచించిన బంకింబాబు బెంగాల్‌కు చెందిన వారైనప్పటికీ ఈ గేయం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కనుక దీనిపై చర్చ అవసరమేనని బీజేపీ వాదించింది.
అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులు ఎక్కడైనా అజ్ఞాత ప్రదేశంలో కలిసినప్పుడు వందేమాతరమని సంబోధించుకునేవారని రాజ్యసభలో చర్చ ప్రారం భిస్తూ హోంమంత్రి అమిత్‌షా అన్నారు. అంతేకాదు సరిహద్దుల్లో దేశరక్షణ విధుల్లో నిమగ్నమైన మన భద్రతాదళాల పెదవులపై కదలాడే నినాదం వందేమాతరం అని ఆయన గుర్తుచేశారు. వందేమాతరంను స్వాతంత్య్ర నినాదంగా మలచిందే కాంగ్రెస్. సదస్సుల్లో వందేమాతరం పాడే సంప్ర దాయాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్. కేవలం నెహ్రూ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.
ఇతర పార్టీల వాదనలు
రాజ్యాంగం మతస్వేచ్ఛకు హామీ ఇస్తోంది కనుక దేశభక్తిని కేవలం ఒక చిహ్నానికో లేక మతానికో ఆపాదించడం రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టే అవుతుందని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ వ్యాఖ్యా నించారు. ఆ విధంగా వందేమాతరం గేయాన్ని ముఖ్యంగా ముస్లింలను ఆపించమనడం దేశభక్తిని తప్పుదోవ పట్టించడమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతు స్వాతం త్య్రోద్యమ కాలంలో బెంగాల్‌కు చెందిన ఎందరో కవులు ఎన్నో కవితలను, గీతాలను రచించారని ప్రధాని కేవలం ఈ చర్చ ద్వారా రాజకీయ రంగు పులుముతున్నారు తప్ప మరోటి కాదన్నారు. వందేమాతరం గేయా లాపన వెనుక భావోద్వేగం మతరాజకీయాలను తిరస్కరించేదిగా ఉన్నదని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కకోలీ ఘోష్ దస్తీదార్ మాట్లాడుతూ వందేమాతరం ప్రతి భారతీయుడి హృదయాన్ని, సచేతనను తట్టిలేపేదిగా ఉన్నదన్నారు. జేడీ(యూ) నేత దేవేష్ చంద్ర ఠాకూర్ వందేమాతరం జాతి చైతన్యానికి మేల్కొలుపు వంటిదన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన డా.బైరెడ్డి శబరి వందేమాతరం దేశ ప్రజల ఉమ్మడి చైతన్యానికి చిహ్నమన్నారు.
శివసేనకు చెందిన శ్రీరాంగ్ బర్నే వందేమాతరం జాతీయతకు చిహ్నమన్నారు. డీఎంకేకు చెందిన ఎ. రాజా, శివసేన (యూబీటీ) నేత అరవింద్ సావంత్, ఎన్‌సీపీ (ఎస్‌సీపీ) నేత భాస్కర్ బగారే కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.
బంకించంద్ర చటోపాధ్యాయ (1838-1894)
బెంగాల్ పునరుజ్జీవనంలో గొప్ప పాత్ర పోషించిన సాహితీ ద్రష్ట,గొప్ప నవలాకారుడు, మేధావిగా బంకించంద్ర చటోపాధ్యాయ పేరుపడ్డారు. బెంగాల్‌లోని నైహతిలో జన్మించిన ఆయన కలకత్తా యూనివర్సిటీనుంచి మొట్టమొదట గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారిలో ఒకరు. దుర్గేష్‌నందిని, కపాలకుండల, ఆనంద్‌మఠ్ నవలలను రచించారు. నిజానికి బంకించంద్ర చటోపాధ్యాయ 1857లో చోటుచేసుకున్న సన్యాసుల తిరుగుబాటు స్ఫూర్తితో 1870 ప్రాంతంలో హుగ్లీ నది తీరాన ఒక గృహంలో కూర్చొని వందేమాతరం గేయాన్ని రచించారు. అప్పట్లో డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా ఉన్న ఆయన, వలస ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపట్ల అసంతృప్తితో రగిలిపోతుండేవారు. నవంబర్ 7,1875న ఆయన ఈ గేయం ‘‘బంగదర్శన్’’ అనే మ్యాగజైన్‌లో ఆరు చరణాలతో ప్రచురితమైంది. తర్వాత 1882లో ‘‘ఆనంద్‌మఠ్’’ పేరుతో ఆయన రాసిన నవలలో ఇదే గేయం 12 చరణాలతో ఉంది. ఇందులో తొలి రెండు చరణాలను 1950లో కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయంగా స్వీకరించింది. అయితే ఈ గేయంలో మొదటి రెండు చరణాలు సంస్కృత భాషలో, మిగిలినవి బెంగాలీలో ఉండటం గమనార్హం. మొత్తంమీద చెప్పాలంటే బెంగాలీ భాషను సంస్కృతీకరించిన శైలిలో దీని రచన సాగింది. ఇందులో మాతృభూమి సౌందర్యాన్ని, స్ఫూర్తిని హృదయానికి హత్తుకునే విధంగా రచించడంతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో ఇదొక నినాదంగా మారి, దేశ ప్రజను ఒక్కతాటిపై నడిపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు పురికొల్పింది. అయితే ఈ గేయ రచనకు బ్రిటిష్ జాతీయగీతం ‘‘గాడ్ సేవ్ ది క్వీన్’’ ప్రేరణ అని కూడా చెబుతారు.
తొలిసారి ఆలాపన
ఈ గేయాన్ని 1886లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో హేమచంద్ర బెనర్జీ ఆలపించగా, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గేయానికి సంగీతాన్ని సమకూర్చి, 1896 కాంగ్రెస్ సమావేశంలో ఆలపించినప్పుడు ఒక్కసారిగా ఈ గేయం దేశవ్యాప్తంగా ప్రజల నాలుకలపై నడయాడింది. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వందేమాతరం గీతం కలకత్తానుంచి లాహోర్ వరకు మారు మోగింది. అరవిందఘోష్ దీన్ని ‘‘స్వేచ్ఛామంత్రం’’ గా వర్ణించారంటే దీని ప్రభావం అప్పట్లో ఎంత తీవ్రంగా ఉన్నదీ అర్థమవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ గీతాన్ని అణగదొక్కాలని ప్రయత్నించినా, ఫలితంలేకపోయింది. 1906 నుంచి 1911 మధ్యకాలంలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో వందేమాతరం పూర్తి చరణాలను ఆలపించారు. ప్రొఫెసర్ సవ్యసాచి భట్టాచార్య ప్రకారం 1920 ప్రాంతంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత ప్రచారం పొందిన గేయం వందేమాతరం. ఇది తప్ప మరో జాతీయ గేయం ప్రజలకు తెలియదు. దేశంలోని వివిధ భాషల్లోకి దీన్ని అనువదించారు. మరాఠీ (1897), కన్నడ (1897), గుజరాతీ (1901), హిందీ (1906), తెలుగు (1907), తమిళం (1908), మలయాళం (1909) భాషల్లోకి ఈ గేయం అనువాదమైంది.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్