ఆచార్య చాణక్య రాజనీతి శాస్త్రంలో గొప్ప నాయకత్వం గురించి చెబుతూ… ధైర్యం, న్యాయం, నిజాయతీ, వినయం, ఆత్మవిశ్వాసం, లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన, ప్రజా సంక్షేమం, క్రమశిక్షణ, దూరదృష్టి వంటి అత్యున్నతమైన లక్షణాలున్న వారు గొప్ప నేతగా ఎదుగుతారని సూత్రీకరించారు. ఇలాంటి అర్హతలున్న నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో విరివిగా కనిపిస్తుంటారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నితిన్‌ ‌నబీన్‌ ‌సిన్హా నియామకం కూడా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తొలుత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏడు నెలలు బాధ్యతలు నిర్వహించారు. అనుభవం గడించిన అనంతరం రెండు పర్యాయాలు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ త్వరలో ఆరు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నితిన్‌ ‌నబీన్‌ ‌కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యే అవకాశాలుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ తీసుకునే నిర్ణయాలు వైవిధ్యంగా ఉంటాయి.

దేశంలో రాజకీయ పండితుల ఊహలకు అందని విధంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నితిన్‌ ‌నబీన్‌ ‌సిన్హా ఎంపిక జరిగింది. జేపీ నడ్డా పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆయన తర్వాత పార్టీ అధ్యక్షుడు ఎవరనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వేళ రాజకీయ విశ్లేషకులతో పాటు మీడియాలో కూడా అనేక ఊహాగానాలొచ్చాయి. వివిధ ప్రాంతాలు, పలు సామాజిక వర్గాల కోణంలో డజనుకుపైగా పేర్లు భావి అధ్యక్షుడి కోసం ప్రచార మయ్యాయి. ఉత్తర, మధ్య, దక్షిణ, ఈశాన్య, తూర్పు ప్రాంతాలకు సంబంధించి వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు సీనియర్‌ ‌నేతలతో పాటు నాయకు రాళ్ల పేర్లు కూడా అధ్యక్ష పదవిపై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు క్రమశిక్షణ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ప్రస్తుతం పరిస్థితులు మారాయని, పార్టీలో అంతర్గతంగా పోరు తీవ్రంగా ఉందని, పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య విభేదాలున్నాయని, దీంతో జాతీయ అధ్యక్షుడి నియామకంపై పార్టీ నిర్ణయం తీసుకోలేక జాప్యం చేస్తుందనే ప్రచారం కూడా ఒకవైపు జోరుగా సాగింది. ఎవరి ప్రచారంలో వారుండగా, చడీచప్పుడు లేకుండా, ఎవరూ అంచనా వేయని విధంగా కుల, మత, ప్రాంతీయ సమీకరణా లకు అతీతంగా నితిన్‌ ‌నబీన్‌ ‌సిన్హా పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడయ్యారు. ఈ నియామకం అనంతరం ఇలాంటి పరిణామాలు బీజేపీలోనే సాధ్యమని మరోసారి రుజువైంది.

సామాన్య కార్యకర్తలను ఉన్నత స్థాయి నేతలుగా తీర్చిదిద్దడంలో ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ ముందంజలో ఉంటుంది. తాత్కాలిక కుల, మత, ప్రాంతీయ సమీకరణాల కంటే పార్టీ దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీజేపీ నిర్ణయా లుంటాయి. అధ్యక్ష పగ్గాలు చేపట్టే నేత సుదీర్ఘకాలం సేవలందించేలా పార్టీ నియామకాలుంటాయి. అందుకే 45 ఏండ్ల నితిన్‌ ‌నబీన్‌ ‌సిన్హా ఎవరూ అంచనా వేయని విధంగా అత్యున్నతమైన పదవిని అలంకరించనున్నారు. వయస్సు రీత్యానే కాకుండా సైద్ధాంతికంగా కూడా పార్టీ అడుగుజాడల్లో నడుచు కునే వ్య్త• కావడం కూడా ఆయనకు అదనపు బలంగా మారింది. పిన్న వయస్సులోనే పార్టీపై పూర్తి అవగా హన కూడా ఉండడంతో సీనియర్‌ ‌నేతగా కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. చిన్న వయసులోనే సీనియర్‌ ‌నేతగా మారిన ఈయన జాతీయత, సనాతన ధర్మం, దేశ ఐక్యత వంటి పార్టీ సిద్ధాంతాలపై నిక్కచ్చిగా వ్యవహరించే క్రమశిక్షణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు.

భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా నితిన్‌ ఎం‌పికలో పలు కోణాలను పరిగణనలోకి తీసుకుంది. బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్సులోనే కీలక బాధ్యతలు చేపట్టిన నితిన్‌ ‌నబీన్‌ ‌జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించారు. ఈయన పుట్టిన 1980 సంవత్సరంలోనే బీజేపీ కూడా ఆవిర్భవించడం విశేషం. బీజేపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన నబీన్‌ ‌కిశోర్‌ ‌ప్రసాద్‌ ‌సిన్హా కుమారుడైన నితిన్‌ ‌తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ బాల్యం నుంచే బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. బిహార్‌లోని బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి నబీన్‌ ‌కిశోర్‌ ‌మరణానంతరం 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచారు. వరుసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఐదు సార్లు ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా నిలిచారు.

ప్రజాప్రతినిధిగా దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉండటం విశేషం. 2021లో బిహార్‌లో నితీష్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2025లో కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఏబీవీపీ కార్యకర్తగా సంఘ కార్యకలపాలలో చురుగ్గా పాల్గొనడంతో బీజేపీ జాతీయతపై అవగాహన ఉంది. బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పార్టీ సైద్ధాంతికతపై మంచి పట్టు ఉండడమే కాకుండా జాతీయ స్థాయి నేతలతో సత్సంబంధాలున్నాయి. ఏబీవీపీ, బీజేవైఎంలో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవాలు పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేయడానికి ఉపయోగపడుతాయి. పార్టీపై పట్టు ఉండడంతో పాటు మంత్రిగా పనిచేసిన పాలనాపరమైన పరిజ్ఞానం కూడా ఉండడం కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి ఎంపికకు సులభ మైంది. ఈ యువనేత పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేసే బాధ్యతలను చురుగ్గా నిర్వహించ గలరనే విశ్వాసంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ అత్యున్నత పదవిని ఆయనకు కట్టబెట్టింది. మరోవైపు ఈయనకు చిన్నవయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్‌తో సత్సం బంధాలుండడంతో క్రమశిక్షణ, జాతీయత, సేవాభావం విలువల్లో కూడా మంచి అనుభవం ఉంది. నితిన్‌ ‌నబీన్‌ ‌సిన్హా ఎంపికతో సైద్ధాంతికంగా, సంస్థాగతంగా బలం, యువతపై పట్టు, ఎన్నికలకు సంసిద్ధత అంశాలను పార్టీ పరిగణనలోకి తీసుకుందని స్పష్టమైంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం మూడు సంవత్సరాలు. పార్టీ నిబంధనల ప్రకారం వరుసగా రెండుసార్లు అంటే గరిష్టంగా ఆరు సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాల్లేవు. బీజేపీ ఇప్పుడే కాదు గతంలో కూడా అధ్యక్ష పీఠాన్ని యువ నేతలకు అప్పగించడానికే మొగ్గు చూపింది. సామాజిక, ప్రాంతీయ వంటి తాత్కాలిక సమీకరణాలకంటే దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తుంది. బీజేపీ చరిత్రలో ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన 14 మంది ఎంపికలను పరిగణనలోకి తీసుకుంటే యువనేతను పార్టీ అత్యున్నత పదవికి ఎంపిక చేయడం నితిన్‌ ‌నబీన్‌ ‌సిన్హాతోనే ప్రారంభం కాలేదు. 2014లో అమిత్‌ ‌షా 49 ఏళ్ల వయస్సులో, 2009లో నితిన్‌ ‌గడ్కారీ (52), 2002లో వెంకయ్యనాయుడు (53), 2005లో రాజ్‌నాథ్‌ ‌సింగ్‌(54), 1980‌లో అటల్‌ ‌బిహారీ వాపేయి(55), 1986లో ఎల్‌కే అడ్వాణి(58), 1991లో మురళీ మనోహర్‌జోషి (57), 2020లో జేపీ నడ్డా59), 2000లో బంగారు లక్ష్మణ్‌(60), 2001‌లో జానా కృష్ణమూర్తి (72), 1998లో కుశభావు ఠాక్రే(75)లకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పార్టీ దీర్ఘకాలిక వ్యూహాలు కనిపిస్తున్నాయి. జానాకృష్ణమూర్తి, కుశభావు ఠాక్రే మినహా మిగతా వారందరూ 60 ఏళ్ల వయస్సు లోపలే పార్టీ అధ్యక్ష పదవులను చేపట్టడం గమనార్హం. గత ఎంపికలను పరిశీలిస్తే అధ్యక్షుల ఎంపికలో పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలకిస్తున్న ప్రాధాన్యం అవగతమవుతోంది.

పార్టీ అధ్యక్షుడి ఎంపికలోనే కాకుండా ముఖ్య మంత్రుల విషయంలో కూడా బీజేపీ ఇదే పంథాను కొనసాగించడం విశేషం. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్న బీజేపీ యువ నేతలకే అధిక ప్రాధాన్యతిచ్చింది. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌కు పెమా ఖండూ(46), ఉత్తరాఖండ్‌కు పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామీ(50), ఢిల్లీకి రేఖా గుప్తా(51), గోవాకి ప్రమోద్‌ ‌సావంత్‌(52), ఉత్తరప్రదేశ్‌కు యోగి ఆదిత్యనాథ్‌ (53), ఒరిస్సాకు 53 మోహన్‌ ‌చరణ్‌ ‌మాఝీ(53), మహారాష్ట్రకు దేవేంద్ర ఫడణవీస్‌(55), ‌హరియాణాకు నయాబ్‌ ‌సింగ్‌ ‌సైనీ(55), అస్సాంకు హిమంత బిశ్వ శర్మ(56) , రాజస్తాన్‌కు భజన్‌ ‌లాల్‌ ‌శర్మ(58), మధ్యప్రదేశ్‌కు మోహన్‌ ‌యాదవ్‌(60), ‌ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్‌ ‌సాయి(61), గుజరాత్‌కు భూపేంద్ర పాటిల్‌(63), ‌త్రిపురకు మాణిక్‌ ‌సాహా (72) ముఖ్యమంత్రులగా కొనసాగుతున్నారు. వీరిలో మాణిక్‌ ‌సాహా మినహా మిగతా వారందరూ 65 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ తన వ్యూహా లతో ప్రత్యర్థి పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులను కూడా విస్మయానికి గురిచేసింది. ఛత్తీస్‌ఘడ్‌ ‌ముఖ్య మంత్రిగా విష్ణుదేవ్‌ ‌సాయి ఎంపిక ప్రత్యేకమైంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్‌ ‌రమణ్‌ ‌సింగ్‌ను పక్కనపెట్టి విష్ణుదేవ్‌ను సీఎం చేశారు. రాజస్తాన్‌లో సీనియర్‌ ‌బీజేపీ నేత వసుంధర రాజేను కాదని భజన్‌లాల్‌ ‌శర్మను ముఖ్యమంత్రి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కావడానికి సీనియర్‌ ‌నేతలున్నా రేఖా గుప్తాను సీఎంను చేసి బీజేపీ మహిళలకు పెద్ద పీట వేసింది. మహారాష్ట్రలో యువనేత దేవేంద్ర ఫడణవీస్‌ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసి పార్టీలో యువతను ప్రోత్సహించింది. మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి ఎంపిక మరింత ఆసక్తికరమైనది. 2005 నుండి 2018 వరకు వరుసగా 13 సంవత్స రాలు, 2020 నుండి మరో మూడు సంవత్సరాలు శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌సీఎంగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం సిట్టింగ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ను కాదని మోహన్‌ ‌యాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేయడంతోనే బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలు అర్థమవుతున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ మరింత బలోపేతానికి సంస్థాగత ఆవశ్యకతను గుర్తించి, అదే పంథాలో యంత్రాంగాన్ని తయారు చేసుకుంటోంది. సీనియర్‌ ‌నేతలను కాదని యువకులను పార్టీ ఉన్నత పదవులకు ఎంపిక చేస్తుందనే వాదన సత్య దూరం. రాబోయే 10 నుంచి పదిహేను సంవత్సరాలు పార్టీకి కీలక సేవలను అందించేలా నేతలను పార్టీ ఎంపిక చేస్తోంది. వయస్సురీత్యా తరం మార్పును సూచిస్తూ నేతలను తయారుచేస్తోంది.

సంఘపరివార్‌ ‌మార్గదర్శనంలో రాటుదేలి విద్యార్థి, యువ విభాగాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారు సైద్ధాంతికంగా ఎంతో అనుభవం గడిస్తున్నారు. దీంతో బీజేపీలో పలువురు యువ నేతలు సైద్ధాంతిక పరిజ్ఞానంతో సీనియర్‌ ‌నాయకులుగా ఎదుగుతున్నారు. సిద్ధాంతాలకు కట్టుబడుతూ, అనుభవమున్న సీనియర్‌ ‌నేతలతో పాటు అదే స్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న యువ నేతలకు కూడా బీజేపీలో కొదవలేదు. అంతర్జా తీయంగా అత్యధిక కార్యకర్తలున్న పార్టీగా రికార్డు సృష్టించిన బీజేపీ తరాల మార్పునకు సంకేతంగా సీనియర్ల స్థానంలో యువ నేతలను ప్రోత్సాహిస్తోంది. తద్వారా భావితరాలకు కూడా పార్టీని చేరువ చేయడంలో విజయవంతమవుతోంది.

-శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE