అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’ ముగింపు సభ ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతిలోని వెంకటపాలెంలో వాజ్‌పేయి జయంతి డిసెంబరు 25న ఘనంగా జరిగింది. వాజ్‌పేయి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తదితరులు హాజరయ్యారు. వాజ్‌పేయి చిత్రంతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను శివరాజ్‌సింగ్‌తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, శత్రువులులేని గొప్ప వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్‌పేయి అని, విద్వేష పూరిత రాజకీయాలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారని, విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శ్లాఘించారు. వాజ్‌పేయిని తన రాజకీయ జీవితానికి ప్రధాన ప్రేరణ అని పేర్కొన్నారు. ‘నేను భోపాల్‌లో చదువుకునే రోజుల్లో వాజ్‌పేయి ప్రసంగాలకు ముగ్ధుడనై•, వాటిని స్ఫూర్తిగా తీసుకున్నాను. దశాబ్దాలు గడిచినా, ఆయన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆయన ప్రసంగాలు ఎంతో గంభీరంగా ఉండేవి’ అంటూ 1957లో వాజ్‌పేయి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన నాటి పరిస్థితులను చౌహాన్ విశ్లేషించారు. అప్పటి ప్రధాని జవాహార్‌లాల్ నెహ్రూ సైతం వాజ్‌పేయి ప్రసంగాలను ఎంతో శ్రద్ధగా వినేవారని గుర్తుచేశారు. ‘‘వాజ్‌పేయి ఏదో ఒకరోజు ఈ దేశానికి ప్రధాని అవుతారు’’ అని నెహ్రూ ఆనాడే ఊహించి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వాజ్‌పేయి ప్రతిభను శ్లాఘించారు. వాజ్‌పేయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చౌహాన్ ప్రస్తుత కాలంతో అను సంధానించారు. ముఖ్యంగా 1998లో నిర్వహించిన పోఖ్రాన్-2 అణుపరీక్షల గురించి పేర్కొంటూ, అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించినా వాజ్‌పేయి వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. దేశ భద్రత, ఆత్మగౌరవం విషయంలో ఆయన ఏ అంతర్జాతీయ ఒత్తిడికి లొంగలేదని పేర్కొన్నారు. వాజ్‌పేయి తీసుకున్న ఆ దృఢమైన నిర్ణయంవల్లే భారత్ ప్రపంచ దేశాల సరసన అణుశక్తి కలిగిన దేశంగా నిలిచిందని, ఇది ఆయన ‘నిర్భయ నాయకత్వానికి’, ‘దేశభక్తికి’ నిదర్శనమని చౌహాన్ స్పష్టం చేశారు.
‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ‘‘సంస్కరణల శకం’’గా నిలిచిపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటి ఆధునిక భారత మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశాయి. స్వర్ణ చతుర్భుజి ఆయన కలల ప్రాజెక్టు. దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను (ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా) కలుపుతూ నిర్మించిన నాలుగు/ఆరు వరుసల జాతీయ రహదారుల వ్యవస్థ వల్ల రాష్ట్రాల మధ్య రవాణా సమయం, వ్యాపార వ్యయాలు తగ్గాయి. ఆర్థిక కార్యకలాపాలు వేగవంత మయ్యాయి. పట్టణాలనే కాకుండా, మారుమూల గ్రామాలను కూడా ప్రధాన రహదారులతో అనుసం ధానించడానికి 2000లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను ప్రారంభించారు. నేటికీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఇది వెన్నెముకగా నిలిచింది. భారతదేశంలో మొబైల్ ఫోన్లు సామాన్యుడికి చేరడానికి వాజ్‌పేయి తెచ్చిన ‘న్యూ టెలికాం పాలసీ’ ప్రధాన కారణం. లైసెన్స్ ఫీజు విధానం నుంచి• ‘రెవెన్యూ షేరింగ్’ (ఆదాయంలో వాటా) విధానానికి మారడం వల్ల టెలికాం కంపెనీలు తక్కువ ధరకే సేవలు అందించగలిగాయి. దీనివల్ల భారతదేశం ప్రపంచం లోనే రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా ఎదిగింది. ‘6 నుండి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రాథమిక విద్య’ను ప్రాథమిక హక్కుగా మారుస్తూ సర్వ శిక్షా అభియాన్ విప్లవాత్మక పథకాన్ని తెచ్చారు. దీనివల్ల దేశంలో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగింది. వాజ్‌పేయి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నేటి ప్రధాని మోదీ పాలనలో ఒక చెరగని ముద్రగా నిలిచాయి’ అని చౌహాన్ శ్లాఘించారు. వాజ్‌పేయి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఒక సిద్ధాంతవేత్త, స్ఫూర్తి ప్రదాతని, ఆయన వేసిన అభివృద్ధి పునాదులే నేటి ‘నవభారత’ నిర్మాణానికి మార్గదర్శకాలయ్యాయని చౌహాన్ వివరించారు. చంద్రబాబునాయుడు… వాజ్‌పేయికి అత్యంత ఆత్మీయుడు, రాజకీయ సన్నిహితుడ•ని పేర్కొన్నారు. ఆనాడు వాజ్‌పేయి సహకారంతో చంద్రబాబు సారథ్యంలో ఉమ్మడి ఆంధప్రదేశ్ అభివృద్ధివైపు పరుగులు పెట్టిందని, ఇప్పుడు మోదీ, చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో కేంద్ర సహకారంతో ఆంధప్రదేశ్ హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. మోదీ, చంద్రబాబు ఒకటేనని, వారిద్దరూ కలిస్తే రెండు కాదు 11 అని ఆయన వ్యాఖ్యానించారు.
వాజ్‌పేయి యుగపురుషుడు:చంద్రబాబు
వాజ్‌పేయిని యుగపురుషుడని, ఆయన శత జయంతి ఉత్సవాలను ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతిలో జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29వేల మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 33వేల ఎకరాల భూమిని ఇచ్చారని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. వాజ్‌పేయ్‌తో కలిసి పని చేసిన రోజులు గుర్తు చేసుకున్నారు. ‘అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్‌పేయ్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. కూటమి పక్షాల సమన్వయంతో అన్ని జిల్లాల్లో వాజ్‌పేయి విగ్రహాలు పెట్టేందుకు చర్యలు తీసుకున్నాం. 14 అడుగుల విగ్రహం గల అమరావతిలో ఆయన జ్ఞాపకాలు ప్రజలకు శాశ్వతంగా గుర్తుండి పోయేలా ‘స్మృతి వనం’ ఏర్పాటు చేస్తాం. దేశానికి సుపరిపాలను యాత్రను పరిచయం చేసిన వ్యక్తి వాజ్‌పేయ్ పేరిట ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డే గా ప్రకటించారు. దేశంలో పీపీపీ విధానం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆచరణలో చూపిన వ్యక్తి వాజ్‌పేయి. అందులో భాగంగానే జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టులను ఆ విధానంలో తీసుకొచ్చారు. పీపీపీ విధానం గురించి తెలియనివారు ప్రైవేట్ పరమంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారు. నాడు వాజ్‌పేయ్ , నేడు మోదీల్లో విలక్షణ వ్యక్తిత్వం, చరిత్రను తిరగరాసే నాయకత్వం ఉంది. మోదీ పాలన పగ్గాలు చేపట్టాక, 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 2047 నాటికి మొదటి స్థానంలోకి వస్తుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన నేతలు వాజ్‌పేయ్, ఆ తర్వాత యన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాడు కుట్రతో కూల్చినప్పుడు, అండగా నిలబడిన వ్యక్తులు వాజ్‌పేయ్, అడ్వాణీ మాత్రమే. నేషనల్ ఫ్రంట్ పెట్టి.. చైర్మన్‌గా వాజ్‌పేయ్‌కు సహకరించిన వ్యక్తి యన్టీఆర్ అని గుర్తు చేసుకొన్నారు.
అందరికీ ఆదర్శప్రాయుడు: మాధవ్
వాజ్‌పేయ్ విలువలతో కూడిన రాజకీయాలు చేసి అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారని, రాజకీయ ప్రత్యర్థులు తప్ప శత్రువులు, లేని స్వచ్ఛమైన నాయకుడి విగ్రహం అమరావతిలో మొదటిది కావడం సంతోషంగా ఉందిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ గుర్తు కమలంలోని ఐదు రెక్కలను పంచ నిష్ఠలుగా అటల్‌జీ భావించారని, దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్తా అదే స్ఫూర్తితో సాగుతున్నారని అన్నారు. ఆయన ఆశయాలను మోదీ ముందుకు నడిపిస్తున్నారని, భారత్ బలమైన శక్తిగా ఎదిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు..
దేశం సత్తా చాటారు: భూపతిరాజు
దేశంలో అనేక సంక్షేమ పథకాలకు ఆద్యుడు వాజ్‌పేయ్ అని, అణుపరీక్షలతో దేశం సత్తా చాటారని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. లాహోర్ బస్సుయాత్ర ద్వారా పాకిస్థాన్‌కు స్నేహహస్తం వారు కుట్రలు చేశారని అన్నారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన ధైర్యశాలి అని అన్నారు.1980వ దశకంలో బీజేపీ• రెండే స్థానాలు గెలుచుకున్నా, కార్యకర్తలకు అండగా నిలిచి భవిష్యత్తులో అధికారం బీజేపేదేనని భరోసా ఇచ్చారని, పార్టీ నేడు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉండడానికి వాజ్‌పేయ్ వేసిన పునాదేనని చెప్పారు.
‘వాజ్‌పేయి గొప్ప నాయకుడు.నిజమైన దేశ భక్తుడు. అధికారంలో ఉన్నా అహంకారం లేని నేత. 29 పార్టీలను ఏకం చేసి ప్రభుత్వాన్ని నడిపి దేశాభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో 19నెలలు జైలుకు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ను గుర్తించి ఆంధప్రదేశ్ అభివృద్ధికి సహకరించార్ణు’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు.
సుపరిపాలన, ఇతర నిర్ణయాలతో దేశ చరిత్రను తిరగ రాసిన ధీరుడు వాజ్‌పేయ్ అని, ఆయన స్ఫూర్తితోనే ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసు కెళ్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే దారిలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వాజ్‌పేయి, చంద్రబాబు ఉమ్మడి ఆంధప్రదేశ్ అభివృద్ధి చేస్తే.. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
‘దేశ రాజకీయచిత్రంలో అజాత శత్రువు, దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆద్యుడు వాజ్‌పేయ్ స్వర్ణ చతుర్భుజి, అంత్యోదయ, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దేశ దిశను మార్చారు. ఆయన స్ఫూర్తితో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారు’ అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
లోక్‌సభ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణ, మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఆదినారాయణ రెడ్డి, రామాంజనేయులు, భాజపా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేష్‌నాయుడు, సన్నా రెడ్డి దయాకర్‌రెడ్డి, మట్టాప్రసాద్, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్ర కాశ్, పోగ్రాం కోఆర్డినేటర్ పాతూరి నాగభూషణం తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్