2025 డిసెంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియో పియా, ఒమన్ దేశాల్లో జరిపిన పర్యటన పైకి సాధారణం గానే కనిపించవచ్చు కానీ, మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో మనదేశ ఉనికిని వ్యూహాత్మకంగా విస్తరింపజేసే కీలక యత్నంగా దీన్ని భావించాలి. పరిశీలిస్తే గత కొద్ది సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంతో మన దేశ సంబంధాలు క్రమంగా బలపడుతుండటమే కాదు, సత్ఫలితాలనిస్తున్నాయి.
విదేశాంగ మంత్రి జయశంకర్ ఇజ్రాయిల్ సందర్శన, ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాంతంలో జరిపిన పర్యటనలను పరిశీలిస్తే, రాజకీయ, మతపర మైన వైరుధ్యాలతో నిండిన ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తున్నట్లు అర్థమవుతుంది. ఒక్క టర్కీతో తప్ప ఈ ప్రాంతంలోని అన్ని దేశాలతో మనకు సత్సంబంధాలున్నాయి. గాజాలో శాంతిని నెలకొల్పే పక్రియలో డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ సైన్యాన్ని భాగస్వామిని చేయడం, బలీయంగా ఉన్న సౌదీ-పాకిస్తాన్ సంబంధాలు, మనకు కంట్లో నలుసు మాదిరి సలుపుతున్నాయి.
పర్యటనల ప్రాధాన్యం
ఈ పరిణామాల క్రమాన్ని పరిశీలించినప్పుడు ప్రధాని పర్యటన ప్రాధాన్యతను అర్థంచేసుకోవచ్చు. జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లాతో, ప్రధాని మోదీ ఆ దేశ రాజధాని అమ్మన్‌లో జరిపిన చర్చల్లో ఇరు దేశాల మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాల సమీక్షతో పాటు ఇరుదేశాల మధ్య వాణిజ్య విస్తరణ, గాజాతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరుపై దృష్టి కేంద్రీకరించడం కీలకం. పశ్చిమాసియాతో పటిష్ట సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి భారత్ కృషి చేస్తున్న నేపథ్యంలో, ఆర్థిక-రాజకీయ భాగస్వామిగా జోర్డాన్‌తో మన సంబంధాలు కీలకంగా పరిణమించ నున్నాయి. ఇథియోపియా ప్రధాని అబై అహ్మద్ అలీతో జరిపిన చర్చల్లో ఆఫ్రికన్ యూనియన్ ప్రాంతీయ అజెండాతో, గ్లోబల్ సౌత్ నాయకురాలిగా భారత్ కీలక పాత్రను కలిపి ముందుకు తీసుకెళ్లడం లోని ప్రాధాన్యతను గుర్తించారు. అంతేకాదు ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచు కోవడానికి అవసరమైన రోడ్‌మ్యాప్ రూపకల్పన జరిగింది. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య, రక్షణ రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరాయి. ఇథియోపియాలో ప్రధాని నరేంద్రమోదీ పర్య టించడం ఇదే మొదటిసారి. ఇక ఈ ప్రాంతంలో మన దేశానికి సుదీర్ఘకాలంగా సన్నిహిత స్నేహాన్ని కొనసాగిస్తున్న దేశం ఒమన్. రెండు దేశాల ప్రజల మధ్య కొన్ని శతాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు కొన సాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఏడు దశాబ్దాల దౌత్య సంబంధాల నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. ప్రధాని పర్యటన సందర్భంగా ఆ దేశ పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో జరిపిన చర్చల్లో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈపీఏ) కుదిరింది. దీనివల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన, పెట్టుబడులు మరింతగా పెరుగుతాయి. పశ్చిమ ప్రాంత పొరుగుదేశాలుగా ఉన్న జోర్డాన్, ఒమన్, ఇథియోపియాలు భౌగోళిక రాజకీయాల పరంగా వీటి స్థానం ప్రత్యేకం. ప్రస్తుతం ఈ దేశాల్లో ప్రధాని పర్యటన, మధ్యప్రాచ్యంలో భద్రత, ఆఫ్రికా ఆర్థికాభివృద్ధి, హిందూమహాసము ద్రంతో అనుసంధానత వంటి సంక్లిష్ట విధాన పక్రియలకు మరింత ప్రాధాన్యతకు దోహదం చేసింది. అయితే ప్రధాని పర్యటనల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలులో వైఫల్యం కొనసాగుతుండటం పెద్ద లోపం. ఇప్పుడు చైనా, పాకిస్తాన్‌లు మధ్య ప్రాచ్యం, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలోని దేశాలతో తమ సంబంధాలను పటిష్టం చేసుకుంటున్నాయి. చైనా ఆర్థిక సంబంధాలపై, పాకిస్తాన్ సైనిక సహకారంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. దౌత్యసంబంధాలు చక్కగా ఉన్నాయి కదా అన్న భరోసా ఎంత మాత్రం పనికిరాదు.
జోర్డాన్
మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదట ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 15న జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో దిగారు. 37 సంవత్సరాల తర్వాత మనదేశ ప్రధాని జోర్డాన్‌లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇదే ప్రథమం. విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధానమంత్రి డా।। జాఫర్ హుస్సేన్ మన ప్రధానికి ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లా 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు భారత్‌లో అధికార పర్యటన జరిపారు. తర్వాత 2024 జూన్‌లో ఇటలీలోని అపూలియాలో జరిగిన జీ7 సదస్సు, 2023 డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన కాప్-28 సదస్సు, 2019 అక్టోబర్‌లో రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ సదస్సు, అదే ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగిన ‘యుఎన్‌జీఏ-74’వ సదస్సు సందర్భంగా వీరిద్దరి మధ్య భేటీలు జరిగాయి. 2018లో పాలస్తీనా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జోర్డాన్ సందర్శించారు. 1947లో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలపై కుదిరిన ఒప్పందం మేరకు 1950లో ప్రారంభమైన దౌత్య సంబంధాలు తర్వాతి కాలంలో ఆర్థిక సహకారం అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం జోర్డాన్‌కు మనదేశం నాలుగో అత్యధిక వాణిజ్య భాగస్వామి. తృణధాన్యాలు, మాంసం, పెట్రోలియం ఉత్పత్తులు, పశువుల మేత మన దేశం ఎగుమతి చేస్తుండగా, రసాయన ఎరువులు ప్రధానంగా పొటాష్, ఫాస్పేట్లు దిగుమతి చేసుకుం టోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 2.875 బిలియన్ డాలర్లు. ఇందులో జోర్డాన్‌కు మనదేశ ఎగుమతుల విలువ 1.465 బిలియన్ డాలర్లు! రాబోయే ఐదేళ్ల కాలంలో ఇరుదేశాల వాణిజ్యం 5 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదిం చారు. జోర్డాన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థతో మనదేశంలో అమల్లో ఉన్న యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్ (యూపీఐ)తో అనుసంధానించే విషయం కూడా ప్రధాని ప్రస్తావనకు తెచ్చారు. మన దేశంలో ఫాస్ఫేట్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో, జోర్డాన్‌లో దీని ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టే విషయంలో రెండు దేశాల ఎరువులు కర్మాగారాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిపై పోరాటం సాగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా పున రుత్పాదక వనరులు, నీటివనరుల నిర్వహణ- అభివృద్ధి, 2025-29 మధ్యకాలంలో ఇరుదేశాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాల పరస్పర మార్పిడి ఒప్పందం పునరుద్ధరణ, డిజిటల్ రంగంలో పరస్పర సహకారం, యునెస్కో హెరిటేజ్ ప్రదేశాలుగా ప్రకటించిన జోర్డాన్‌లోని పెట్రా గుహలు, మనదేశం లోని ఎల్లోరా గుహల పరిరక్షణకు జంట ఒప్పందం వంటి అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
ఇథియోపియా
ప్రధాని నరేంద్రమోదీ ఇథియోపియా రాజధాని అడ్డీస్ బాబాకు డిసెంబర్ 16న చేరుకున్నారు. చర్చలకు ముందు నేషనల్ ప్యాలెస్‌లో మన ప్రధానికి సంప్రదాయిక స్వాగతం లభించింది. అడ్డీస్ ఇంటర్నే షనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో దేశ అత్యున్నత అవార్డు ‘‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’’ను నరేంద్ర మోదీకి, ఇథియోపియా ప్రధాని డా।। అబియ్ అహ్మద్ ప్రదానం చేశారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను ‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం’’ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. 2023లో జీ20 గ్రూప్ అధ్యక్షురాలిగా, ఆఫ్రికన్ యూనియన్ దేశాలకు ఇందులో సభ్యత్వం కలిగించడం భారత్ గౌరవంగా భావిస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆరోగ్యభద్రత, డిజిటల్ హెల్త్, సంప్రదాయిక ఔషధాలు, జన్ ఔషధీ కేంద్రాలు, ఆహారభద్రత, సుస్థిర వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, ఎగ్రి-టెక్ రంగాల్లో సహకారం అందించేందుకు భారత్ సంసిద్ధతను వెల్లడించారు. ఇథియోపియన్ ఆర్థిక వ్యవస్థలో భారత కంపెనీలు ఇప్పటివరకు 5బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిన అంశాన్ని గుర్తు చేశారు. తయారీ, ఔషధ రంగాల్లో పెట్టిన పెట్టు బడుల వల్ల స్థానికంగా 75వేల మందికి ఉద్యోగావ కాశాలు లభించాయి. గ్లోబల్ సౌత్ సమస్యలపై పోరాటం సలిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి సహా, వివిధ వేదికలపై పరస్పరం సహకరించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధన వనరులు, విపత్తు నివారణ చర్యల విషయంలో మరింత సహకారానికి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సు నిర్వహణకు మోదీ ప్రతిపాదించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 550.19 మిలియన్ డాలర్లు. ఇందులో భారత్ మిగులు వాణిజ్యం కొనసాగుతోంది. డిసెం బర్ 17న భారత ప్రధాని ఇథియోపియా ఉమ్మడి పార్లమెంట్ సమావేశంలో ప్రసంగించడం విశేషం.
ఒమన్
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఒమన్ పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 17-18 తేదీల్లో ఆ దేశంలో పర్యటిం చారు. ప్రధానిగా నరేంద్రమోదీ ఒమన్‌లో పర్యటిం చడం ఇది రెండోసారి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు ముగుస్తున్న సందర్భంగా ఈ పర్యటన జరిగింది. 2023 డిసెంబర్‌లో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ మన దేశంలో అధికార పర్యటన జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగ స్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కుదరడం విశేషం. దీనిపై మనదేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్‌కు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి హెచ్.ఇ. ఖైస్ బీన్ మహమ్మద్‌లు సంతకాలు చేశారు. గల్ఫ్ ప్రాంతంతో సంబంధాలను పెంపొందించుకునే విషయంలో ఈ సీఈపీఏ ఒప్పందం అత్యంత కీలకమైన మైలురాయిగా పరిగణించాలి. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు మనదేశ సరుకులు, సేవల రవాణాకు ఒమన్ ముఖద్వారం. ఈదేశంలో ఏడులక్షల మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. కొన్ని భారతీయ వ్యాపార కుటుంబాలు రెండు, మూడు వందల ఏళ్లనుంచి ఇక్కడ నివాసం ఉండటం విశేషం. వివిధ రంగాలకు చెందిన ఆరువేల భారతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒమన్ నుంచి ఇక్కడి ఎన్‌ఆర్‌ఐలు ఏటా రెండు బిలియన్ డాలర్ల వరకు మనదేశానికి పంపుతుంటారు. ఒమన్‌తో మన ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 10 బిలియన్ డాలర్లు! ఆర్నెల్ల క్రితం యు.కె.తో మనం కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం తర్వాత, ఒమన్‌తో మనకు కుదిరిన రెండో ఒప్పందం ఇది. ఈ ఒప్పందం కింద ఒమన్ భారత్ నుంచి దిగుమతి అయ్యే 90.08% వస్తువులపై సుంకాలను మినహాయించింది. రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, తోళ్ల ఉత్పత్తులు, పాదరక్షలు, క్రీడా సామగ్రి, ప్లాస్టిక్స్, ఫర్నీచర్, వ్యవసాయ, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్ ఉత్పత్తులపై పూర్తిగా దిగుమతి సుంకాల మినహాయింపుంటుంది. ఒమన్ ఉత్పత్తులపై మనదేశం 77.79% వరకు సుంకాల మినహాయింపు నిస్తుంది. సేవారంగా నికి సంబంధించి ఒమన్ ప్రపంచ దేశాలనుంచి 12.52 బిలియన్ యు.ఎస్. డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటుండగా, వీటిల్లో మనదేశ వాటా 5.31%. సీఈపీఏ ఒప్పందం కింద ఒమన్ మొట్టమొదటిసారి ఇంట్రా-కార్పొరేట్ ట్రాన్సఫరీస్ కోటాను 20% నుంచి 50%కు పెంచడం విశేషం. అంతేకాకుండా కాంట్రాక్చువల్ సర్వీస్ సప్లయర్స్ అక్కడ వుండేందుకు అనుమతిని 90 రోజులనుంచి రెండేళ్లకు పెంచారు. మనదేశానికి చెందిన నిపుణులు ఒమన్‌కు వెళ్లేందుకు నిబంధనలను మరింత సడలించడం మరో ముఖ్యాంశం. ఈ ఒప్పందం ప్రకారం ఒమన్‌లో వందశాతం ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి భారతీయ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. సంప్రదాయిక ఔషధ వాడకానికి ఒమన్ కట్టుబడి ఉండటం మరో విశేషం. మన ఆయుష్, వెల్‌నెస్ సెంటర్లు గల్ఫ్ ప్రాంతంలో మరింత విస్తరించడానికి ఇది దోహదం చేయగలదు. ఒమన్ 2006లో యునైటెడ్ స్టేట్స్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం తర్వాత, మనదేశంతో కుదిరిన ఈ ఒప్పందం రెండవది. ఈ సందర్భంగా సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ మన ప్రధానికి ఒమన్ అత్యున్నత పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ను ప్రదానం చేశారు.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్