గ్రామీణ పేదల అభ్యున్నతికి సంబంధించినంత వరకూ ఇది నిజంగా ఒక అద్భుతమైన పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ) పేరును పూజ్య బాపు గ్రామీణ రోజాగార్ యోజనగా మార్చడం గాంధీజీకి మరింతగా ఔన్నత్యాన్ని కల్పిస్తుందే తప్ప దాన్ని ఏమాత్రం కించపరచడం కాదు. అదే విధంగా ఈ పథకం వల్ల గ్రామీణ పేదలకు మరింతగా ఉపాధిని కల్పించే అవకాశమే ఉంది తప్ప వారిని ఆకలి దప్పులతో మాడ్చడం జరగదు. కేంద్ర మంత్రి వర్గం ఈ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలనే నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజులు మాత్రమే ఉపాధి కలిగేది. ఇప్పుడు దాన్ని 125 రోజులకు పెంచారు. అంతేకాదు, గ్రామీణ పేదలకు చెల్లిస్తున్న దిన భత్యాన్ని 240 రూపాయలకు పెంచారు. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఏకంగా రూ. 1.51 లక్షల కోట్లు కేటాయించడం న భూతో న భవిష్యతి లాంటిది.
సుమారు 20 ఏళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎన్.ఆర్.ఇ.జి.ఏ)గా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మారిపోయింది. గ్రామీణ పేదలకు, పేద రైతులకు, రైతు కూలీలకు ఏడాదిలో వంద రోజులు కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన కార్మిక చట్టం, సామాజిక సంక్షేమ పథకం ఇది. ఇది గ్రామీణ పేదలకు ‘పని హక్కు’ కల్పించింది. ఈ పథకానికి పేరు మారడం అన్నది ఇది మొదటిసారి కాదు. మొదటగా అక్టోబర్ 2, 2009న ఈ పేరును మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మారింది. అయితే, అప్పట్లో దీని పేరును మార్చారే తప్ప నిధులను పెంచడం, ఈ పథకాన్ని విస్తరించడం వంటివేవీ జరగలేదు. ఈ పేరును పూజ్య బాపూజీ గ్రామీణ ఉపాధి పథకంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మార్చదలచుకున్న తర్వాత దీనికి నిధులను పెంచడం, దీన్ని ప్రాథమిక సదుపాయాల కల్పనకు, పట్టణాభివృద్ధికి కూడా విస్తరించడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో దీనిని కూడా భాగం చేశారు జరిగింది. ఈ పథకానికి సంబం ధించిన చట్టం పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్, 2025గా పార్లమెంట్‌లో డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టారు.
పథకానికి మెరుగులు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రక్షాళన చేయడం, దీన్ని మరింత మెరుగు పరచడం, మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రధానోద్దేశం. కేవలం వంద రోజులు మాత్రమే పని దినాలు కల్పించే ఈ పథకాన్ని 125 రోజులకు విస్తరించడం ఈ కారణం వల్లే జరుగు తోంది. ఈ పథకాన్ని మరింతగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావించి చాలా కాలంగా దీన్ని పరిశీలిస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మరింత ప్రాధాన్యం, ప్రాభవం, ప్రాబల్యం కల్పించడానికి ఈ చట్టం పేరును పూజ్య బాపూజీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మార్చ డంతో పాటు, దీన్ని ప్రక్షాళన చేయడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలకు వంద రోజులు ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకున్నప్పటికీ, ఏడాదికి 50 రోజులకు మించి ఉపాధి కల్పించ లేదు. ఇది 2024-25 వరకూ కొనసాగింది.
అంతేకాదు, దేశంలో వంద రోజుల పాటు ఉపాధి పొందిన గ్రామీణ పేద కుటుంబాల సంఖ్య ఇటీవలి వరకు 47 లక్షలు దాటలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక 2025లో అయితే, కేవలం 6.75 లక్షల కుటుంబాలు మాత్రమే వంద రోజుల ఉపాధిని పొందగలిగాయి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలోని లోపాల వల్ల ఈ పథకం ఉద్దేశం ఏ ఏడాదీ సవ్యంగా లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఈ కారణాల వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత మెరుగుపరచి, దీని పని దినాలను వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచి మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం తీరుతెన్నులను కూలంకషంగా పరిశీలించి, లబ్ధిదారుల స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకుని, దీన్ని మరింత ప్రయోజనకరంగా అమలు చేయడానికి సిఫారసులు, ప్రతిపాదనలు చేయడానికి ప్రభుత్వం 2022లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఒక ఉన్నతాధికార కమిటీని నియ మించింది. ఈ కమిటీ గత ఏడాది తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని శాశ్వతంగా, పటిష్టంగా కొనసాగించడానికి ఆరవ ఫైనాన్స్ కమిషన్‌లో కూడా చేర్చింది. పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి అంగీకార ముద్ర పడిన ఈ పథకం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.
లబ్ధిదారులపై దృష్టి
గతంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొన్ని రాష్ట్రాలు పని దినాల విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ పని దినాలను వంద రోజులకు పరిమితం చేయవద్దని, ఈ పరిమితిని పెంచాలని ఆంధప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. అయితే, కేంద్రంలోని యు.పి.ఎ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. పని దినాలను వంద రోజులకు మించి పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలే ఆ అదనపు ఖర్చును భరించాల్సి వస్తుంది. దీనివల్ల కొన్ని రాష్ట్రాలు పని దినాలను పెంచే అవసరమున్నా పట్టించుకోలేదు. పని దినాలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోలేక పోతుండడంతో పని దినాల సంఖ్య పెరగకపోగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తమ సొంత వనరులతో అదనపు పని దినాలకు అవకాశం కల్పించాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుం బాలు, ముఖ్యంగా ఎటువంటి నైపుణ్యాలూ లేని కుటుంబాలు వంద రోజుల పాటు స్వచ్ఛందంగా ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి, వంద రోజులు తగ్గకుండా ఉపాధి కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన అభ్యర్థన రానిదే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సాఫ్ట్‌వేర్ ఈ అభ్యర్థనలను స్వీకరించడం లేదు. మరో 50 రోజులు ఉపాధి పొందడానికి తాము అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేసినప్పటికీ, ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ను మాత్రం మార్చలేదు. అడవుల్లో, లోయల్లో నివసిస్తున్న గిరిజనులు, ఆదివాసీలు 150 రోజుల పాటు ఉపాధి పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ, వారికి అనుమతి మాత్రం మంజూరు కావడం లేదు. కరువు, కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కూడా 150 రోజుల పాటు ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. కానీ, అమలులో ఇవన్నీ విఫలం అవుతున్నాయి.
పెరిగిన అవకాశాలు
కాగా, 2005లో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఇంత వరకూ దీని కింద 4,872 కోట్ల పని దినాలు గ్రామీణ ప్రాంత పేదలకు లభించాయి. దీని మీద కేంద్రానికి 11,74,692.16 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 2006-07లో మొదటగా 200 వెనుకబడిన గ్రామీణ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ తర్వాత 2007-08లో మరో 130 జిల్లాలకు దీన్ని విస్తరిం చారు. 2008-09 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా, 2020-21లో కోవిడ్ విజృంభించిన సమయంలో ఈ పథకానికి డిమాండ్ బాగా పెరిగింది. సుమారు 7.55 కోట్ల గ్రామీణ పేద కుటుంబాలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని లబ్ధిపొందాయి. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో లక్షలాది వలస కుటుంబాలు స్వస్థలాలకు తిరిగి రావడంతో దీనికి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఈ పథకాన్ని ఉపయోగించు కుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గడం ప్రారం భించింది. 2024-25 సంవత్సరానికి ఈ పథకాన్ని ఉపయోగించుకున్నవారి సంఖ్య 5.79 కోట్లకు తగ్గిపోయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2022 మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి సంబంధించిన గణాంక వివరాలు ఇందులో కలపలేదు. ఇక 2025-26లో డిసెంబర్ 12వ తేదీ వరకు ఈ పథకం కింద లబ్ధి పొందినవారి సంఖ్య 4.71 కోట్ల కుటుంబాలు మాత్రమే.
ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని మరింత విస్తృతంగా కొనసాగించ డానికి వీలుగా దీనికి అయిదేళ్లకు గాను 5.23 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలంటూ, వ్యయ ఆర్థిక కమిటీ (ఇ.ఎఫ్.సి)కి ఒక అభ్యర్థన పంపించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఈ కమిటీ ఏ పథకానికి ఎంత కేటాయించాలన్నది నిర్ణయిస్తుంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మార్చిన యు.పి.ఎ ప్రభుత్వం ‘‘ఈ పథకాన్ని మరింత అంకిత భావంతో అమలు చేయడానికి, పేదలందరికీ సమానావకాశాలు కల్పించడానికి దీని పేరును మహాత్మాగాంధీ పేరుతో జోడిస్తున్నాం’’ అని ప్రకటించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం దీని పేరును పూజ్య బాపూజీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చడం పట్ల కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీలు, వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో మొత్తం 47 పథకాలు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లతో అమలు జరుగుతున్నాయి. ఇందులో 16 పథకాలకు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఒకే ఒక్క పథకం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
ఈ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం వల్ల గాంధీజీకి తీరని అపచారం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు సాగిస్తున్నారు. వాస్తవానికి ఈ పూజ్య బాపూజీ అనే పేరు పెట్టడం వల్ల ఈ పథకానికి మరింత పవిత్రత ఏర్పడిందని, గ్రామీణ ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, వారి పని దినాలను పెంచడం వారి ఆర్థికాభివృద్దికి మరింతగా తోడ్పడుతుందని కేంద్ర మంత్రులు వివరించారు. నైపుణ్యాలు లేనివారికి కూడా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఎక్కువగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకే పరిమితమైన ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రాథమిక సదుపాయాల కల్పనకు, పట్టణాభివృద్దికి కూడా వర్తింపజేయడం వల్ల గ్రామీణ పేదలకు మరింతగా ఆర్థిక అభ్యున్నతి సాధ్యమవుతుందని, పేద, సంపన్నుల మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం వివరిం చింది. అయితే, మహాత్మా గాంధీ పేరును ఈ పథకం పేరు నుంచి తొలగించడం మహాత్మాగాంధీని రెండవసారి హత్య చేయడం కిందకు వస్తుందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం తదితరులు వ్యాఖ్యానించడం జరిగింది. మహాత్మా గాంధీని పూజ్య బాపూజీగా మార్చారే తప్ప ఆయన పేరును తొలగించలేదని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందే తప్ప పేరు మీద వాదోపవాదాల వల్ల ఉపయోగం లేదు.
జి.రాజశుక, సీనియర్ జర్నలిస్ట్