రాష్ట్ర ప్రభుత్వంలో బోగస్‌ ఉద్యోగుల పేరిట అందినకాడికి దోపిడీ దందా నడుస్తోందా? రాష్ట్రం దివాళా తీసిందని ప్రభుత్వాధినేతలు ప్రకటించిన సందర్భాలు ఉండగా, ఉద్యోగులు పొరుగు  సేవల పేరుతో సర్కారు ఖజానాకు పెద్దమొత్తంలో చిల్లులు వేస్తున్న వ్యవహారం బయటపడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాత్కాలిక ఉద్యోగుల పేరుతో వేలాది మంది నకిలీ ఉద్యోగుల జాబితాను తయారు చేసి కోట్లాది రూపాయలు  ఖజానా నుంచే బొక్కేస్తున్నారు. ప్రభుత్వ అవసరాలు కొందరికి ఆదాయ వనరులుగా మారిపోయాయి. కాదు.. కాదు.. కొందరు తమకు తెలిసిన లొసుగులతో వాటిని ఆదాయ వనరులుగా మార్చేసుకొని, సర్కారు సొమ్మును యథేచ్చగా యేళ్ల తరబడి దిగమింగుతున్నారు.

ప్రభుత్వంలో పొరుగు సేవల పేరుతో పెద్ద స్థాయిలో జరుగుతున్న నిధుల దోపిడీ, దుర్వినియోగం వెనుక కొంందరు ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కూడా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతుండగా అందుకు సంబంధించి ఆధారాలు కూడా దొరికాయంటున్నారు. దీనిపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవు తోంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ల లెక్కలన్నీ బయటకు తీయాలని, గుట్టును రట్టు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను గట్టిగానే ఆదేశించారు. ఆ లెక్కలన్నీ తేల్చడానికి గడువు కూడా విధించారు. దీంతో, ఇన్నేళ్లుగా అక్రమార్జనకు అలవాటు పడిన వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అంతేకాదు.. ఈ తతంగాన్ని నిలిపివేయించేలా ఒత్తిళ్లు మొదలయ్యాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సొమ్మునంతా కక్కిస్తామన్న ప్రభుత్వం మాటలు ఏ మేరకు అమలవు తాయో చెప్పలేమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వంలో పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్లు, రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వాళ్లు, అంతకు మించి అదనపు ఆదాయాలు ఉన్నవాళ్లే మరింత అత్యాశతో ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌దందాను సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడవుతోంది. కొందరు బినామీ పేర్లతో ఏజెన్సీల దందా జరిపిస్తున్నట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయి. మరికొందరు ఆయా ఏజెన్సీల్లో వాటాలు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించిన లెక్కలు చూసేవాళ్లు, వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నవాళ్లు, నియామకాలను, వాళ్ల జీతాల లెక్కలను ప్రభావితం చేయగలిగే హోదాల్లో ఉన్నవారే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు, వాటాలను సమకూర్చుకున్నారు. కొన్ని ఏజెన్సీల్లో సంబంధిత విభాగంలో వాస్తవంగా పనిచేస్తున్న ఉద్యోగుల కంటే రికార్డుల్లో ఉండేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందట. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్థిక శాఖ ఈ ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌డొంకలను కదిలిస్తూ, వీటివెనుక ఉన్నవాళ్ల చిట్టాను బయటకు లాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులే కొన్ని విభాగాల్లో ఒక్కో వ్యక్తి రెండు వేతనాలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ విచారణలో గుర్తించారట. అలాంటి ఉద్యోగులు 600 మందికిపైగా ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఒకే వ్యక్తి వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో ఐడీలు మార్చి రెండు జీతాలు తీసుకున్నట్లు విచారణలో బయట పడిందంటున్నారు. చెక్‌ ‌రూపంలో వేతనాలు ఇచ్చే చోట, ఆధార్‌ ‌డేటా అనుసంధానం కాని విభాగాల్లో ఉద్యోగి ఐడీని మాత్రమే చూపి వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఇక ఫారిన్‌ ‌సర్వీస్‌ ‌పేరుతోనూ అటవీ శాఖ, పురపాలక శాఖ, నీటిపారుదల విభాగాల్లో ఈ తరహా ఉద్యోగులు కొందరు రెండు వేతనాలు పొందుతున్నారని తేలిందంటున్నారు.

ఔట్‌సోర్సింగ్‌లో సుమారు 25 వేల మంది బోగస్‌ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరి పేరుతో జరిగిన వేతనాల చెల్లింపుల నుంచి ఎవరు లబ్ధి పొందారనే లెక్కలు కూడా బయటకు తీస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ‌పేరుతో జరిగిన అక్రమాలు చూస్తే, దిమ్మదిరిగి పోతోందని విచారణ సాగిస్తున్న ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వంలోని కొందరు శాశ్వత ఉద్యోగులు ఔట్‌ ‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నమోదైనట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 900 ఏజెన్సీలు ఉండగా, వాటి పరిధిలో పనిచేస్తున్నట్లు చూపిస్తున్న సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు సుమారు 25 వేల ఉద్యోగుల వరకు తేడా ఉందట. అంటే వీరంతా బోగస్‌ ఉద్యోగుల పేరుతో వేతనాలు పొందుతున్నట్లు గుర్తించామని, వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు.. హాజరు రిజిస్టర్‌లు, మాన్యువల్‌ ఎం‌ట్రీలు, నకిలీ సంతకాల ద్వారా వేతనాలు పొందినట్లు విచారణలో బయటపతుతోంది. సాంకేతికత అందు బాటులోకి వచ్చినప్పటికీ కొన్ని శాఖలు ఏజెన్సీలతో కుమ్మక్కై మాన్యువల్‌ ‌రిజిష్టర్ల పేరుతో ఈ కుంభ కోణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

 పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, టెక్నికల్‌ ‌సిబ్బంది ముసుగులో సుమారు 8 వేల మంది వరకు నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలో ఔట్‌సోర్సింగ్‌ ‌విధానంలో నర్సింగ్‌, ‌పేషెంట్‌ అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 5 వేల మంది, విద్యా శాఖలో క్లర్కులు, ఆఫీస్‌ ‌సబార్డినేట్లు, బోధనేతర సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 3 వేల మంది, రెవెన్యూ శాఖలో సర్వేయర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్ల ముసుగులో సుమారు 2 వేల మంది; విద్యుత్తు, ఇతర మౌలిక వసతుల విభాగాల్లో లైన్‌ ‌మెన్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు వంటి ఉద్యోగాల్లో సుమారు 3 వేల మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, ‌పౌరసరఫరాలు, నీటిపారుదల వంటి శాఖల్లోనూ ఔట్‌సోర్సింగ్‌ ‌పేరుతో సుమారు 4 వేల మంది బోగస్‌ ఉద్యోగులు ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయంటున్నారు. అన్ని శాఖల లెక్కలు తేలితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వంలోని 31 శాఖల్లోనూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ‌పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిలోని 9 శాఖల్లో పర్మినెంట్‌ ఉద్యోగుల కంటే ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌సిబ్బందే అధికంగా ఉన్నారట. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం.. పలు శాఖల్లో పర్మినెంట్‌ ‌ప్రభుత్వ ఉద్యోగులు 5లక్షల 21వేల 692 మంది ఉండగా, 4లక్షల 93వేల 820 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ‌పద్ధతిలో పనిచేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. శాఖల వారీగా చూస్తే… మహిళా భివృద్ది, శిశు సంక్షేమ శాఖలో 60,492 మంది, విద్యాశాఖలో 78,146 , రెవెన్యూ శాఖలో 12,843, పంచాయతీ రాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖలో 94వేల 179,పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 62,913, మైనారిటీ సంక్షేమ శాఖలో 20,903, విద్యుత్‌ ‌శాఖలో 22,223, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 60,934, హోం శాఖలో 21,765 మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఆర్థిక శాఖ ఆధార్‌ ‌వివరాలతో క్రోడీకరించగా.. దాదాపు 5 లక్షల మంది నమోదైన తాత్కాలిక ఉద్యోగుల్లో కేవలం 2లక్షల 74వేల 844 మంది వివరాలు మాత్రమే ఐఎఫ్‌ఎంఎస్‌ ‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ అయ్యాయని అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఇలా ఔట్‌సోర్సింగ్‌ ‌పద్ధతిలో ఉద్యోగులను సరఫరా చేస్తున్న ఏజెన్సీలు జీతాలు, కమీషన్ల రూపంలోనే పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతున్నాయి. నకిలీ ఉద్యోగులు, రెండు జీతాల ఉద్యోగులకు ఇది అదనం. నిర్దేశించిన విధులను నిర్వర్తించడంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు శ్రమిస్తుంటే.. వారికి అరకొరగా వచ్చే వేతనం నుంచి కమీషన్లు, అటు ప్రభుత్వం నుంచి నేరుగా అందే వచ్చే సొమ్ముతో జేబులు నింపుకుంటున్నాయి. కేవలం కమీషన్‌ ‌పేరిట ఈ ఏజెన్సీలు నెలకు కనీసం రూ.50 కోట్లు సంపాదిస్తున్నాయి. కాగా తమ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోత వేయడం, జీతాలు చెల్లింపులో జాప్యం చేయడంతో బ్యాంకుల్లో జమ అయ్యే వడ్డీ, ఇతరత్రా రూపాల్లో అందిన కాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధిత శాఖల బాధ్యులు, అధికారులు కూడా మద్దతుగా ఉన్నారన్న అనుమానా లున్నాయి.

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించారు. కేటగిరీ-1 ఉద్యోగికి మూలవేతనం రూ.15600. దీనికి తోడు ఈపీఎఫ్‌ ‌కింద 13 శాతం, ఈఎస్‌ఐ ‌కింద 3.25 శాతం, వీటిపై 18 శాతం జీఎస్టీని ప్రభుత్వం చెల్లిస్తోంది. అంటే 13శాతం ఈపీఎఫ్‌ ‌కింద రూ.2028, ఈఎస్‌ఐ ‌కింద రూ.507, ఏజెన్సీ కమీషన్‌ 4 ‌శాతం కింద రూ.624 కలిపితే మొత్తం రూ.18,756 అవుతుంది. దీనికి 18 శాతం జీఎస్టీ కింద రూ.3,377 కలిపి ఒక ఉద్యోగికి ప్రభుత్వం రూ.22,136 చెల్ల్లిస్తోంది. అయితే ఇందులో వాస్తవంగా ఏజెన్సీ ఉద్యోగికి రూ.13,611 మాత్రమే చెల్లిస్తోంది. మూలవేతనం నుంచి ఈపీఎఫ్‌ 12‌శాతం ఈఎస్‌ఐ, ‌వృత్తి పన్ను 0.75 శాతం కట్‌ ‌చేస్తారు. అయితే ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల్లో చాలా వరకు ఉద్యోగులకు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ‌కట్టడం లేదు. ఒక్కో ఉద్యోగికి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, ‌జీఎస్టీతోపాటు ఏజెన్సీ కమీషన్‌తో కలిపి ఏజెన్సీకి మొత్తం రూ.9,425 వస్తుంది. ఇందులో కమీషన్‌ ‌మినహాయించి మిగిలింది ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అలా ఇవ్వడం లేదు. కేటగిరీ-2 ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి జీఎస్టీ కింద రూ.4,115 ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లిస్తోంది. మూడో కేటగిరీ ఉద్యోగులకు దీనికి మించే చెల్లిస్తోంది. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, 4 ‌శాతం కమీషన్‌, ‌జీఎస్టీ వంటివన్నీ కలుపుకొని ప్రతి నెలా ఏజెన్సీలకు సుమారు రూ.200 కోట్లు అందుతున్నాయి. అయితే 50 శాతం పైగా ఏజెన్సీలు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐలను సకాలంలో చెల్లించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఏజెన్సీలు పూర్తిస్థాయిలో పన్నులు కూడా చెల్లించడం లేదంటున్నారు.

ప్రభుత్వ శాఖల్లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టం ఏజెన్సీల పాలవుతోందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల బ్యాంకు ఖాతాల్లో సకాలంలో నిధులు జమ చేస్తున్నప్పటికీ.. ఏజెన్సీలు వెంటవెంటనే ఉద్యోగులకు విడుదల చేయకుండా, ఆ నిధుల ద్వారా వచ్చే వడ్డీని అనుభ విస్తున్నాయి. మరికొన్ని ఏజెన్సీలు గైర్హాజరు, ఇతరత్రా కారణాలను చూపుతూ ప్రభుత్వానికి, అధికారులకు తెలియకుండా వేతనాల్లో కోతలు పెడుతున్నాయి. ఇలాంటి ఏజెన్సీలపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ, దాని ద్వారానే ఉద్యోగుల ఎంపిక చేపట్టి ఏజెన్సీలకు చెల్లించే 4 శాతం కమీషన్‌ ‌నిధులు కూడా నేరుగా ఉద్యోగికే అందుతున్నాయి. పైగా.. జీతాల్లో ఎలాంటి అనధికారిక కోతలకు తావుండటం లేదు. ఈ విధానం ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచనే చేస్తున్నప్పటికీ కొన్ని శక్తులు ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్లలు వేస్తున్నాయని తెలుస్తోంది. ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ‌ద్వారా నియమించుకోవడం వల్ల ఎంపికలో పారదర్శకత ఉంటుందని, మరోవైపు ఏజెన్సీలకు కమీషన్‌ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదని, ఫలితంగా ఉద్యోగులకు కొంచెం ఎక్కువ వేతనం అందడం, జీతాల్లో కోతలు పెట్టకుండా ఉండటం వల్ల వారి జీవన పరిస్థితులు మెరుగు పడేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. రాష్ట్రంలో గిగ్‌ ‌వర్కర్ల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని కోరుతున్నారు.

దాదాపు పదేళ్లుగా జరుగుతున్న ఈ గోల్‌మాల్‌ ‌లెక్కలను బయటకు తీసి.. అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఏజెన్సీల అక్రమాలు, నకిలీ ఉద్యోగుల వివరాలు బయటకు వచ్చాక ఎవరిపై కేసులు నమోదు చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE