భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
క్రిష్ర్ణాపాటి సీతారామశాస్త్రీ
కొడుకు, కోడలు ఉద్యోగస్తులు కావడం వ•లాన పిల్లలను చూచుకొంటూ శేషారత్నం ఇంటిపట్టున ఉంటోంది. మొదట్లో పిల్లల అల్లరి, ఆటలు కొంత సంతోషంగా ఉన్నా రాను రాను శ్రమ ఎక్కువ అవటంవల్ల శేషారత్నం చికాకుగా ఉంటోంది.
‘‘నాలుగు రోజులు అలా ఎక్కడికైనా వెళ్లి వస్తామండీ పిల్లల అల్లరి తట్టుకోలేక పోతున్నాను’’ అంది శేషారత్నం భర్త కామేశంతో. అతడు చిరునవ్వు నవ్వి ఊరుకొన్నాడు.
‘‘ఏం పలకరూ’’, అంది శేషారత్నం భర్త పైన సహజంగా వచ్చే అధికార స్వరంతో.
‘‘అలాగే’’ అన్నాడు కామేశం తలపంకిస్తూ.
‘‘ఎక్కడికెల్దాం’’? మరలా అడిగింది శేషారత్నం.
‘‘నీవే చెప్పు’’ అన్నాడు కామేశం భార్య ఇష్టానికే విలువిస్తూ,
మంత్రాలయం వెళదామా? చాలా కాలమైంది వెళ్లోచ్చి. తన ఇష్టాన్ని బయట పెట్టింది శేషారత్నం.
‘‘సరే’’ అన్నాడు కామేశం ఒప్పుదలగా.
‘‘ఎప్పుడు బయలుదేరుదాం’’? ప్రయాణ నిర్ణయం ఇప్పుడే జరగాలన్నట్లుగా అంది శేషారత్నం.
‘‘అది కూడా నువ్వే చెప్పు’’ అన్నాడు కామేశం ఆమె ఆలోచనకే వదిలేస్తూ
‘‘రైల్లో రిజర్వేషన్ ఎపుడు దొరుకు తుందో’’ తనలో తానూ గొణుక్కొంటు న్నట్టుగా పైకి అనేసింది శేషారత్నం.
‘‘మీరు అబ్బాయిని త్వరగా టికెట్లు తీయమని చెప్పండి’’ అంది శేషారత్నం సంభాషణ ముగిస్తూ. ‘‘అలాగే’’ అన్నాడు కామేశం.
పై సంభాషణ ద్వారా శేషారత్నం కామేశ్వరరావు దంపతులు పిల్లల అల్లరి బారి నుండి తప్పించుకొని నాలుగురోజులు మంత్రాలయం వెళ్తున్నారని అర్థమయింది గదా.
ఇక కథలోకి వస్తే, కామేశం ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. శేషారత్నం పెద్దగా చదువుకోలేదు. కానీ తెలివైంది. అనుకూలవతి కావడం వాళ్ల కామేశం ఆమె ఇష్టాలకు విలువిస్తాడు. ఆ రోజుల్లో సాంప్ర దాయం ప్రకారం జరిగిన పెళ్లివారిది. ఇద్దరూ బీద కుటుంబాల నుంచి వచ్చినవారే, దాంపత్య జీవన సాఫల్యంగా ఒక పిల్లాడు కలిగాడు. ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలలో పనిచేయవలసి వచ్చింది. కామేశానికి. పిల్లవాణ్ణి బాగా చదివించుకోవడం మినహా యితరత్రా ఆస్తిపాస్తులేం సంపాదించుకోలేదు కామేశం. పిల్లవాడు చేతికి వచ్చేంతవరకు చాలా కష్టంగా జీవితం నెట్టుకొచ్చారు. అలాంటి రోజుల్లో శేషారత్నం ఎంతో ఓర్పుతో సంసారాన్ని నెట్టు కొచ్చింది. తనకిది కావాలి అని భర్తను ఏనాడు ఇరకాటంలో పెట్టలేదు. ఆమెలోని ఈ గుణం వల్ల కామేశం ఆమెకు ఎక్కువ విలువ ఇస్తాడు. ఉద్యోగం చివరిదశలో హైదరాబాద్ రాగలగడం, అబ్బాయి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లి తిరిగి రావడం, తదుపరి పెండ్లి వరుసగా జరిగిపోయాయి.
కామేశం రిటైర్మెంట్ సమయానికి అబ్బాయి హైదరాబాద్‌లో ఇల్లు కొనుకొన్నాడు. అందరూ కలసి ఉంటున్నారు. కాలం ముందుకు సాగుతోంది. మనమరాలు, మనమడు కలిగారు. దినదిన ప్రవర్థ మానంగా పిల్లలు పెరిగారు. శేషారత్నంకు పిల్లల వల్ల మంచి కాలక్షేపంగా ఉంటోంది. క్రమంగా వాళ్లకు మాటలు వచ్చి ‘‘నానమ్మ’’ అంటూ వెంట తిరుగుతూ, అన్నిటికీ నాన్నమ్మే అన్నట్లుగా ఉండటం ఒక్కోసారి, శేషారత్నానికి చాలా గర్వంగా ఉంటుంది. పిల్లలు పొద్దున నిద్ర పోయినప్పుడు శేషారత్నానికి విశ్రాంతి. పిల్లలతో నెగ్గుకు రావటం ఎంతో శ్రమతో కూడిన పనైనా, ఆనందంతో చేస్తోంది శేషా రత్నం.
పిల్లల ముచ్చట్లు, ఆట పాటలు ఎంతో ముద్దుగా ఉంటున్నాయి. రానురాను పిల్లలు పెరిగి పెద్ద వాళ్లవుతున్నారు. పగలు నిద్రమానుకున్నారు. ఆటల సమయం ఎక్కువవు తున్నది. అల్లరి ఎక్కువైపోతోంది. వారి వెంటబడి అన్నీ చేయడం చాలా శ్రమగా ఉంటోంది. వయసు పైబడుతోంది గదా అయినా ఓపిగ్గా చేస్తోంది. మెల్లమెల్లగా పిల్లలు స్కూలుకు వెళ్లడం అలవాట యింది. రాగానే వాళ్ల డ్రస్సులు మార్పించడం, అన్నం తినిపించడం వగైరా పనులన్నీ ఆ వయసులో చేసుకు రావడం శక్తికి మించిన పనవుతోంది. శ్రమ అనిపిస్తోంది. మార్పు కోసం కొంత కాలం ఎక్కడికైనా వెళ్దామా అనిపిస్తోంది.
సరిగా ఇలాంటి రోజుల్లోనే కామేశాన్ని మంత్రాలయం వెళ్దామని శేషారత్నం అడిగింది.
అబ్బాయి టికెట్లు తెచ్చి యిచ్చాడు. ఆరోజు బయలుదేరాలి. కొడుకు, కోడలు, పిల్లలు అందరూ స్టేషన్‌కు వచ్చారు. సామాను బెర్తు కింద సర్దాడు అబ్బాయి. అప్పటికి పిల్లలకు అర్థమయింది. పిల్లలకు నాన్నమ్మ ఎక్కడికో వెళ్తోందని. రైల్లోనించి దిగిరమ్మని, వెళ్లవద్దని పిల్లలు ఒకటే ఏడుపు. ఆ పిల్లల ఏడుపుతో శేషారత్నం దుఃఖాన్ని ఆపుకోలేక పోయింది. ‘‘వద్దండి వెనక్కి వెళ్దాం పదండి’’ అంది శేషారత్నం. కొంచంసేపు ఏడుస్తారు అం•. మళ్లీ నాలుగు రోజుల్లో వస్తాం గదా’’ అనునయించడానికి ప్రయత్నించాడు కామేశం. అబ్బాయి, కోడలు అందుకొని నాలుగు రోజులే కదమ్మా వెళ్లిరా మేము శెలవు పెట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకొంటాం గదా’’ అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఏమైనా బాధను ఆపుకోలేకపోతోంది శేషారత్నం. ఈలోగా రైలు కదిలింది. పిల్లల ఏడుపు తారాస్థాయికి చేరుకొంది. శేషారత్నం గుండె ఎంతో బరువైంది. కన్నీరు ధారా పాతం అయింది. కామేశం భార్యను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు.
ప్రయాణికులు ఒకరొకరు బెర్తులు సర్దుకొని పడుకుంటున్నారు. శేషారత్నం లోయర్‌బెర్త్‌లో పడుకుంది. భారమైన మనసు శరీరాన్ని నిద్రవైపు మళ్లించలేకపోతోంది. రోజు ప్రక్కన పడుకునే పిల్లలు లేక ఏదో వెలితిగా ఉంది. పిల్లల ఏడుపు గుర్తు వచ్చి తల్లడిల్లిపోతుంది. కలతతో బెర్త్‌పై వాలిన శేషారత్నానికి పిల్లలతో ముడిపడిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.
శ్రావణమాసం అని మనమరాలికి చేసిన అమ్మవారి అలంకరణ, కృష్ణాష్టమికి మనవడికి చేసిన చిన్ని కృష్ణుని అలంకరణం, అవి చేయించుకోవడానికి వాళ్లు చేసిన అల్లరి ఇలా ఒక్కొక్కటిగా గుర్తుకొస్తు న్నాయి.
మొదటిసారి మనమరాలిని స్కూలుకు పంపే టప్పుడు పడ్డ బాధ ఇంచుమించు కూతురును అత్త వారింటికి పంపేటప్పుడు కలిగిన బాధలా ఉండింది.
ప్రతి రోజు నాలుగడుగులు వాళ్ల వెంట వెళ్లి స్కూలు బస్సు ఎక్కించి, బస్సు కనుమరుగయ్యేంత వరకు చేతులూపుతూ నిలబడే సన్నివేశం, స్కూలు నుండి వాళ్లు వచ్చేటప్పటికి బస్సుకు ఎదురువెళ్లి వారిని దించుకుంటే ‘నాన్నమ్మ’ అని ఎగిరి గంతేస్తూ మెడగరుచుకొని గారాలు పోతూ స్కూల్‌లో ఏమేమి జరిగిందో చెబుతూ ఆనందపడి పోవడం, అన్నం తినేటప్పటి అల్లరి, రాత్రి నిద్ర పోయేటపుడు కథలు చెప్పటం..ముఖ్యంగా పురాణాలకు సంబంధించిన కథలు చెప్పేటప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలు ఇలా ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి శేషారత్నానికి.
రైలు కర్నూలు చేరబోతున్నట్లుంది. తుంగభద్ర వంతెన మీద రైలు శబ్ధం చేస్తుంది. శేషారత్నానికి నిద్రపట్టడం లేదు.
ఒకరోజు మనమరాలి విషయంలో స్కూల్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
స్కూల్ డే సందర్భంగా చిన్న పిల్లలతో గ్రూప్ డాన్స్ చేయిస్తారని రోజూ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. రాత్రి పడుకొనేటప్పుడు కాళ్ల నొప్పులు అంటుండేది. కాళ్లకు కొబ్బరినూనె రాసి మెల్లగా మర్దన చేసి కథ చెపుతూ నిద్రపుచ్చడం జరుగుతుండేది.
స్కూల్ డే రానే వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఆరుగంట లకు ఏర్పాటు చేసారు. స్కూల్ బస్సు వచ్చి పాపను తీసుకు వెళ్లింది. ఉదయమే వెళ్లేటప్పుడు ‘‘నాన్నమ్మా నీవు సాయంత్రం తప్పక రావాలి’’ అని చెప్పి వెళ్లింది మనమరాలు.
అయితే ఆ రోజు అనుకోకుండా శేషారత్నంకు జ్వరం వచ్చింది. అబ్బాయి, కోడలు మాత్రం వెళ్లగలిగారు. స్కూల్ డేకు వెళ్లిన కాసేపటికే కోడలి నుండి ఫోన్ వచ్చింది. మేకప్ వేయడానికి సహాయంగా రమ్మని టీచర్ కోడలిని లోపలి పిలువగా కోడలు ఆడిటోరియంలోని గ్రీన్ రూమ్‌కు వెళ్లిందట. అక్కడ నాన్నమ్మ రాలేదని తెలిసి మనమరాలు మేకప్ వేసుకోకుండా ఏడుస్తోందని ఫోన్. శేషారత్నాన్ని బలవంతంగా లేవదీసి కారులో తీసుకొని వెళ్లాడు ఆడిటోరియంకు కామేశం. కొడుకు, కోడలు ఎదురుగా వచ్చి, ఇంకా మన పాప కార్యక్రమం ప్రారంభించలేదని, నాన్నమ్మ వస్తోంది అని చెప్పటంలో పాప సిద్ధం అయిందని చెపుతూ, మెల్లగా శేషారత్నాన్ని లోపలకి తీసుకు వెళ్లారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ప్రేక్షకులలో రెండవ వరుసలో ఉన్న నాన్నమ్మ మనమ రాలికి చేయి ఊపి, సైగ చేసింది. మనమరాలి ముఖంలో ఆనందం వర్ణనాతీతం.
ఇలా ఒక్కొక సంఘటన శేషారత్నంకు మనమడు, మనమరాలితో అనుబంధం పెంచుకొంటూ పోయింది. అయితే వాళ్లు చేసే అల్లరి, దుడుకుతనం ఒక్కొక్కసారి విసుగనిపిస్తాయి. కాని ఆ అల్లరే తనను ఎంతగా కట్టిపడేసిందో, తానూ పిల్లలను వదలిరావడానికి పడ్డ బాధ వల్ల తెలుస్తోంది.
ఈ అనుబంధపు విలువ పిల్లల నుంచి పక్కకు వచ్చాక గానీ అర్థంకాలేదు ఆమెకు. ఇన్ని తీపి గుర్తులకు బాధ్యులైన పిల్లల నుంచి దూరంగా వెళ్లాలనుకున్న తన ఆలోచన పట్ల తనకే కోపం వచ్చనది.
ఇలా ఆలోచిస్తూ ఉండగానే తుంగభద్ర స్టేషన్ చేరింది రైలు. కామేశం, శేషారత్నం రైలు దిగి ఆటో చేసుకొని మంత్రాలయం వెళ్లి, ఒక హోటల్‌లో స్నానాదికాలు ముగించుకొని గుడికెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నా మనమడిని, మనమరాలిని చల్లగా చూడు స్వామి అని శేషారత్నం మనసారా కోరుకుంది.
తిరిగి హోటల్‌కు వచ్చారు. హోటల్ రూంలో అలా పడుకుందే కాని, శేషారత్నం మనసంతా పిల్లల ఆలోచనలే.
‘‘దర్శనమైంది కదా మనం తిరిగి వెళదాం పదండి’’ ఆత్రుతగా అంది శేషారత్నం
‘‘అదేంటి? నాలుగు రోజులు ఉంటానన్నావు కదా’’ అడిగాడు కామేశం.
‘‘ఒక్క క్షణం కూడా కూర్చోకుండా విశ్రాంతి లేకుండా చేస్తున్నానని నాలుగు రోజులు అలా వెళ్దాం అన్నాను. కానీ, పిల్లలు, వాళ్ల అల్లరి లేకుండా ఉండ లేనని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. వయోభారం చేత శారీరికమైన ఇబ్బంది కొంత ఉన్నా మనసు మాత్రం ఎంతో తృప్తిగా, ఆహ్లాదంగా ఉంటుంది. పగలంతా పిల్లలతో ఆడిపాడటం వల్ల రాత్రి ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఈ వయసులో ఇలాంటి అనుభవమే సరియైనది. మనం వెళ్లిపోదాం. రైలులో రిజర్వేషన్ దొరకకపొతే బస్సులో వెళ్దాం’’ అంది శేషారత్నం.
కామేశం వెళ్లి బస్సు టికెట్లు తెచ్చాడు
తెల్లవారే సరికి బస్సు ఇమ్లీబన్ బస్సు స్టాండు చేరింది. టాక్సీలో ఇంటికి వెళ్లారు. నాన్నమ్మను చూచిన ఆనందంలో పిల్లలు పరుగెత్తుకు వచ్చి ఆమె కాళ్లు చుట్టేశారు. వారి ఆనందం చూచి శేషారత్నం పరవశించి పోయింది.
‘‘ఈ ఆనందమే కదా కావాల్సింది. ఎన్ని లక్షలు పోస్తే ఈ ఆనందం లభిస్తుంది’’.
శేషారత్నం మనసు భావోద్వేగంలో ఓలలాడింది.
* * *
ఎందరో నాన్నమ్మలు – అందరికీ అంకితం