రెండు గంటల్లో ఆరు ప్రాణాలు… ఒక ఉన్మాది చేతిలో ఛిద్రమైన రెండు కుటుంబాలు… రాజధానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న  ఈ దారుణం రాష్ట్రాన్ని  కుదిపేసింది. అయితే రక్తసిక్తమైన ఆ  కాళరాత్రికి కారణం ఒక్క వ్యక్తేనా? లేక వ్యవస్థ వైఫల్యమా? సమాజం, వ్యవస్థ, చట్టాలను అమలు చేసే యంత్రాంగం కూడా ‘తిలాపాపం.. తలా పిడికెడు’ మాదిరిగా బాధ్యత మోయాలా? అని రేగుతున్నాయి.

జూలై 11, 2026 శనివారం. తెల్లవారు జామున పల్లెలు మేల్కొనే సమయం. కోడి కూతలు వినిపిస్తున్నాయి. పొలాల వైపు వ్యవసాయదారుల అడుగులు పడుతున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ‌మండలం దైవాలగూడలో మాత్రం ఆ ఉదయం పక్షుల కిలకిలలు వినిపించలేదు. వినిపించినవి కేవలం రోదనలే. ఒక ఇంటి ముందు కన్నీటి సముద్రం. మరో ఇంటి ముందు అంతులేని శోకం. రెండు గంటల వ్యవధిలో ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ గ్రామంలోనే కాదు… రాష్ట్ర చరిత్రలో కూడా చెరగని మచ్చగా మిగిలిపోయే అత్యంత దారుణ దుర్ఘటన అది. ఈ నరమేధం కేవలం ఒక క్రైమ్‌ ‌స్టోరీ మాత్రమే కాదు… సమాజాన్ని, పోలీసు వ్యవస్థను, ప్రభుత్వాన్ని నిలదీస్తోన్న రక్తపు గాయం.
కోరిన యువతి, భార్య, కన్న పిల్లలే లక్ష్యం
ఈ దారుణంలో మరణించినవారు ఎవరో కాదు. తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్‌ ‌బాలిక, ఆమె తల్లి, నాయనమ్మ… ఈ రక్తపాతం అంతటితో ఆగలేదు.. తన భార్య, ఇద్దరు చిన్న కుమారులనూ బలి తీసుకుంది. మొత్తం రెండే రెండు గంటల్లో ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కానీ, వాడిలో మాత్రం పశ్చాత్తాపం కరవయ్యింది.
ఒక కుటుంబం న్యాయం కోరింది…రక్షణ కోరింది… చివరకు శవమైంది. ఈ కథ ఒక హత్యతో ప్రారంభం కాలేదు. ఒక ఫిర్యాదుతో ప్రారంభమైంది. మైనర్‌ ‌బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. కాలేజీకి వెళ్లినా వెంటపడటం, బెదిరించడం, బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం.పరిస్థితి భరించలేని స్థితికి చేరుకోవడంతో బాలిక తల్లి నిందితుడు రాజ్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో ఆతనిపై గత మే 16న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ ఫిర్యాదు, తన కూతురి భవిష్యత్తును కాపాడుతుందని ఆమె నమ్మింది..కానీ, అది చివరకు తన కుటుంబానికే మరణశాసనంగా మారుతుందని ఊహించలేదు. ప్రతి బాధిత కుటుంబం పోలీసుల వద్దకు ఒకే ఆశతో వెళ్తుంది. ‘‘ఇప్పటికైనా మాకు రక్షణ దొరుకుతుంది’’ అన్న భరోసాతో ఉంటుంది. కానీ, షాబాద్‌ ‌సంఘటనలో ఆ భరోసాకు బదులు.. బతుకులే బలయ్యాయన్న ఆక్రోశం స్థానికులను ఆగ్రహంలో ముంచెత్తింది.
ఈ ఘటనలో అత్యంత కలచివేసే విషయం… నిందితుడు తన భార్యను, అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చాడు. నాలుగేళ్ల వయసున్న పరీక్షిత్‌కు, రెండేళ్ల దైవీక్షిత్‌కు తండ్రి చేతి స్పర్శ అంటే భద్రత. కానీ, తండ్రి స్థానంలో ఉన్న ఆ క్రూరుడే వారి జీవితాలకు ముగింపు పలికాడు. భార్య సరిత కథ మరింత విషాదకరంగా ఉంది. బీఈడీ చదివి ప్రైవేట్‌ ‌పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ఆమెను ప్రేమ పేరుతో రాజ్‌కుమార్‌ ‌వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఆమె జీవితం నరకంగా మారిందని బంధువులు చెబుతున్నారు. పిల్లలు పుట్టాక ఆమెను వేధించడం, మరో మైనర్‌ ‌బాలిక కోసం ఆమెను అవమానించడం, హింసించడం నిత్యకృత్యంగా మారాయంటున్నారు. భర్త ఈరోజు కాకపోయినా తర్వాతైన మారతాడను కుంది. తమ కుటుంబాన్ని నిలబెట్టాలను కుంది. కానీ, ఆమె కలలు, పిల్లల భవిష్యత్తు, ఆ కుటుంబం కూడా మొత్తం ఒక్క రాత్రిలో నేలమట్టమయ్యాయి.
ఇంకోవైపు, మైనర్‌ ‌బాలిక తల్లి ఉన్మాది రాజ్‌కుమార్‌ ‌బారి నుంచి కూతురిని రక్షించుకు నేందుకు కాలేజీకి కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచింది. నెలల తరబడి తన కూతురిని ఇంటి బయటకు పంపకుండా ఆమె ప్రాణాలు కాపాడింది. ఇన్నాళ్లు రక్షణగా నిలబడింది. ఇంటి ముందు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. పరీక్షలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు అనుమతించేది. అది కూడా తాను వెంట ఉండి మరీ తీసుకెళ్లేది.
పోలీసుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం
ఈ దుర్ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేగాయి. పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల అలసత్వం చర్చకు వచ్చాయి. బాధిత కుటుంబం, స్థానికులు, గ్రామస్థులు చెబుతున్న వివరాల ప్రకారం, నిందితుడు రాజ్‌కుమార్‌ ‌బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా పలుమార్లు బెదిరించాడని, ఇప్పటికీ బాలిక వెంటపడుతున్నాడని, తమ కుటుంబాకి హెచ్చరికలు జారీ చేస్తున్నాడని పోలీసులకు చెప్పినా తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన తర్వాత కూడా బాధితులకు రక్షణ కల్పించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంలో ఇంకా తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోక్సో సంబంధిత ఫిర్యాదు అందిన ఈ కేసులో కఠినమైన సెక్షన్లకు బదులు తేలికపాటి సెక్షన్ల కింద కోసు నమోద చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్లే నిందితుడికి బెయిల్‌ ‌లభించిందని కొందరు అంటున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుందని, పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా రాజకీయంగా వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలే ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామం అనంతరం స్థానిక ఎస్సై సస్పెన్షన్‌, ‌సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం.. వ్యవస్థలో లోపాలున్నాయన్న సంకేతాన్ని మరింత బలపరిచింది. అయితే, పోలీసు శాఖ మాత్రం తమ పొరపాటును వీలైనంత మేరకు తగ్గించుకోవడంలో మునిగి పోయింది.
పోక్సోతోనూ రక్షణ గాలిలో దీపమేనా?
పోక్సో చట్టం పిల్లలను లైంగిక నేరాల నుంచి కాపాడేందుకు రూపొందింది. ఈ చట్టం దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటి. కానీ, కేసు నమోదు చేయడంతోనే సరిపోదు. కేసు నమోదైన తర్వాత బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడం, బెయిల్‌పై విడుదలైన నిందితుడిపై పర్యవేక్షణ, బెదిరింపులపై తక్షణ స్పందన, వేగవంతమైన దర్యాప్తు… కూడా అంతే కీలకం. ఈ కేసులో ఆ పక్రియ సక్రమంగా జరిగిందా? అన్న ప్రశ్నకు సమాధానం దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. చట్టం ఎంత బలంగా ఉన్నా… దాన్ని అమలు చేసే వ్యవస్థ అప్రమత్తంగా లేకపోతే బాధితులకు న్యాయం ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు ఆలస్యం ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. షాబాద్‌ ‌ఘటన అదే పరిణామాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలపైనా చర్చ
ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై మరోసారి చర్చ మొదలయ్యింది. రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉండటంతో పోలీసు వ్యవస్థపై అవసరమైన సమీక్షలు సరైన స్థాయిలో జరగడం లేదని, రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నప్పటికీ, షాబాద్‌ ‌ఘటన ప్రతిపక్షాలకు బలమైన రాజకీయ అస్త్రంగా మారింది. అయితే బాధ్యులపై చర్యలు ప్రారంభించామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆరు ప్రాణాలు బలి తీసుకున్నాక చర్యలు తీసుకోవడం అంటే ఏముంటుందని, ముందుగానే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైతే అమాయకుల ప్రాణాలు కాపాడగలిగేవారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సమాధానం చెప్పేవారెవరు?
షాబాద్‌ ‌ఘటనలో అత్యంత విషాదకరమైన దృశ్యం… తల్లి, అక్క, నానమ్మను కోల్పోయిన దివ్యాంగురాలు ఒంటరయ్యింది. తనకు ఎవరు దిక్కు అని దిక్కులు చూడడం అత్యంత విదారకంగా మారింది. మరోవైపు, తన కుమారుడి చేతిలోనే కోడలు, ఇద్దరు మనవళ్లను కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు. భర్త చేతిలోనే తమ ఇంటి ఆడపడుచు, ముద్దులొలికే చిన్నారులు హతం కావడం సరిత పుట్టింటి వాళ్లను పుట్టెడు దుఃఖంలో ముంచింది. ఈ అమానవీయ ఘటనను కేవలం ఒక ఉన్మాది చేసిన నేరంగా మాత్రమే చూస్తే సరిపోదు. ప్రమాద సంకేతాలను గుర్తించడంలో ఎక్కడ లోపం జరిగింది? బాధితులు ముందుగానే వ్యక్తం చేసిన భయాలను వ్యవస్థ ఎంత తీవ్రంగా తీసుకుంది? చట్టం కేవలం కేసు నమోదు చేయడానికే పరిమితమైందా? బెయిల్‌ ‌తర్వాత బాధితుల భద్రత ఎవరి బాధ్యత? బాధితుల మొర ఎవరికీ ఎందుకు వినిపించలేదు? చట్టం ఎందుకు భరోసా ఇవ్వలేకపోయింది? పోలీసు యంత్రాంగం ఎందుకు అప్రమత్తంగా ఉండలేకపోయింది? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. ఈ ఆరు ప్రాణాలు తిరిగి రావు. కానీ, ఈ రక్తపాతం నుంచి వ్యవస్థ పాఠాలు నేర్చుకుంటేనే మరొక దైవాలగూడ, మరొక కుటుంబం ఇలాంటి విషాదాన్ని ఎదుర్కోకుండా కాపాడగలుగుతాం. కానీ వారి మరణం వ్యవస్థను మేల్కొలిపితే, చట్టం అమలు మరింత కట్టుదిట్టమైతే, బాధితుల రక్షణకు కొత్త ప్రమాణాలు ఏర్పడితే… ఆ రక్తపు మరకల వెనుక కనీసం ఒక మార్పు కనిపిస్తుంది. లేకపోతే… షాబాద్‌ ఒక వార్తగా మిగిలిపోతుంది. ఆరు శవాలు ఒక గణాంకంగా మారిపోతాయి. కానీ సమాజం మాత్రం మరో విషాదం జరిగేదాకా ఎదురుచూస్తూనే ఉంటుంది.


షాబాద్‌ ‌సామూహిక హత్య కేసులో నిందితుడు పార్వతి రాజ్‌కుమార్‌ ‌పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆరుగురిని హత్య చేసి పరారైన అతడు కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలో జులై 13న శవమై కనిపించాడు. పోలీసు అధికారుల కథనం ప్రకారం, జులై 11 ఉదయం తిమ్మాపూర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు, రైలు సమీపిస్తుండగా పట్టాల నుంచి తప్పుకున్నట్లు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అతని కోసం పోలీసుల ప్రత్యేక బృందం గాలిస్తుండగా, పెంజర్ల సమీపంలో మృతదేహం ఉందని సమాచారం అందింది. మృతుడు సోదరుడి ద్వారా మృతదేహం రాజ్‌కుమార్‌దేనని పోలీసులు నిర్ధారించారు. ‘ఆరుగురిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునట్టు’ ఉన్న సెల్ఫీని మృతదేహం వద్ద లభించిన నిందితుడి ఫోన్‌లో కనుగొన్నారు.

సుజాత గోపగోని
సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor