భారత్-పాక్ యుద్ధం తర్వాత ఉత్తర అరేబియా సముద్ర జలాల్లోనే పాక్ నావికాదళం మోహరింపులు చేస్తూ వచ్చింది. 1971 తర్వాత బంగాళాఖాతం వైపు కన్నెత్తి చూసేందుకు జంకిన పాకిస్థాన్ ఇప్పుడు చైనా అండతో విర్రవీగుతోంది. చైనా నుంచి కొనుగోలు చేసిన పీఎన్‌ఎస్ హాంగోర్‌ను బంగాళాఖాతంలో మోహరిస్తా మంటూ కొలంబో పోర్ట్ వేదికగా కెప్టెన్ ఒమర్ ఫరూక్ హెచ్చరించాడు. ఈ హెచ్చరిక వెనుక పాకిస్థాన్‌కు ఓ భయముంది. పాకిస్థాన్‌ది కేవలం అట్టహాసం, ఆర్భాటం, అర్థరహిత వాగాడంబరం. అందుకే తరచూ మాటలు పేలుతూ ఉంటుంది.
భారత రక్షణ శాఖ గడచిన దశాబ్ద కాలంలో జలాంతర్గాముల కోనుగోలుపై దృష్టి పెట్టింది. రష్యా నుంచి అణు జలాంతర్గాములను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో 2 బిలియన్ డాలర్ల అణు జలాంతర్గా మిని భారత్ లీజుకు తీసుకుంది. భారత్ వద్ద ఇప్పటికే ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాత్, అకులా తరగతి అణు జలాంతర్గాములతో సహా మరో 19 సంప్రదాయక సబ్‌మెరైన్లున్నాయి. అంతే కాదు, క్షిపణి వ్యవస్థ, గగనతల రక్షణ వ్యవస్థ విశేషంగా బల పడ్డాయి.
డ్రోన్ రంగం అతివేగంగా బలపడుతూ వస్తోంది. భారత రక్షణ రంగం గత పదేళ్ల కాలంలో పటిష్ఠ మవుతూ వస్తోంది. గతేడాది జూలైలో మనదేశం జలాంతర్గామి విధ్వంసక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ భారత్ తన నావికాదళ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. అందుకే పాక్ ఆర్థికంగా దివాళా తీసినా.. బలూచిస్థాన్ ప్రాంతాన్ని చైనాకు ధారాదత్తం చేసి హాంగోర్ సబ్ మెరైన్‌ను కొనుగోలు చేసింది.
పాక్ వ్యవహార శైలి వ్యూహాత్మక ప్రమాదమే అయినా, ఆ దేశంతో పోలిస్తే భారత జలాంతర్గామి శక్తి, రక్షణ వ్యవస్థలకు మధ్య నక్కకూ నాకలోకానికీ ఉన్నంత వ్యత్యాసముందని చెప్పాలి. రమారమి ఐదున్నర దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఇలాంటి శక్తికి మించిన హెచ్చరికలు చేయడానికి ప్రధాన కారణం చైనా-అమెరికాల మద్దతు. పాకిస్థాన్ 1965 నుంచి హాంగోర్ తరగతి జలాంతర్గాములను తన నావికాదళంలో వినియోగిస్తోంది.
1971 భారత్-పాక్ యుద్ధంసమయంలో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన హాంగోర్‌ను భారత్ పై ప్రయోగించింది. ఐఎన్‌ఎస్ ఖుక్రీని ధ్వంసం చేయడంలో దీన్ని వినియోగించింది. పాక్ కెప్టెన్ అహ్మద్ తాషిమ్ డిసెంబర్ 9న ఐఎన్‌ఎస్ ఖుక్రీపై దాడిచేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ దాడిలో భారత సబ్‌మెరైన్ కేప్టెన్ మహేంద్రనాథ్ సహా 170 మంది అమరులయ్యారు.
ఈ దాడికి ముందు డిసెంబర్ 4వ తేదీన పీఎన్‌ఎస్ ఘాజీని భారత నావికాదళం బంగాళా ఖాతంలో జలసమాధి చేసింది. 1971 యుద్ధంలో భారత్ చేస్తున్న వరుస దాడులకు బెంబేలెత్తిన పాకిస్థాన్ నావికాదళం ఓడిపోయే ముందు డిసెంబర్‌లో హాంగోర్ జలాంతర్గామిని మన నావికాదళంపై ప్రయోగించింది. చైనా-పాకిస్థాన్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందంలో భాగంగా 8 హాంగోర్ తరహా జలాంతర్గాములను కొనుగోలు చేస్తోంది. తొలి విడతలో భాగంగా చైనా ఈ నెల తొలివారంలో ఒక హాంగోర్ సబ్‌మెరైన్‌ను పాక్‌కు అందజేసింది.
జలాంతర్గాములకు ఎందుకింత ప్రాధాన్యం?
‘జలాంతర్గామి రణనీతి..సైనిక బలగాలు యుద్ధంలో ఆడే చదరంగం. శత్రువు ఏం చేయబోతు న్నాడో ముందే గ్రహించి, ప్రత్యర్థికి అర్థం కాకముందే దాడి చేయడమే సబ్ మెరైన్ యుద్ధనీతి’ అంటారు ఇంగ్లండ్ సబ్‌మెరైన్ కమాండర్ సారావెస్ట్. రాయల్ నేవీలో సారావెస్ట్ తొలి సబ్‌మెరైన్ కమాండర్. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 42 దేశాలు తమ నావికాదళంలో జలాంతర్గాములను వినియోగిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రణరంగాన్ని జలాంతర్గామి గుణాత్మకంగా మార్చేసింది.
16వ శతాబ్దం నుంచి జలాంతర్గాముల తయారీపై అనేక పరిశోధనలూ జరుగుతూ వచ్చాయి. శతాబ్దం కాలం తర్వాత ప్రాథమిక దళ సబ్‌మెరైన్‌ను అమెరికా తయారు చేసింది. 1774లో జరిగిన అమెరికా అంతర్యుద్ధంలో హెచ్.ఎల్.హ్యూన్లీ మొట్టమొదటిసారి జలాంతర్గామిని పేల్చి నీటిలో ముంచేశాడు. 1800లో నెపోలియన్ బోన్‌పార్ట్ సైతం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫుల్టన్ నుంచి సబ్‌మెరైన్‌ను కొనుగోలు చేశాడంటారు పౌల్ లెంజ్. ఐరిష్ మెరైన్ ఇంజనీర్ జాన్ ఫిలిప్ హోలెండ్ 1897లో రెండోదశ జలాంతర్గామిని తయారు చేసి, అమెరికా చేత ఔరా అనిపించుకున్నాడు.
ప్రపంచ యుద్ధాల్లో జలాంతర్గాముల మోహరింపు
మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల కూటమి, కేంద్ర రాజ్యాల కూటమి సబ్ మెరైన్‌లను విస్తృతంగానే వాడాయి. అయితే అవి రెండవ ప్రపంచ యుద్ధంతో పోలిస్తే సాంకేతికంగా ఉన్నతమైనవి కావు. రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల కూటమి, అక్ష రాజ్యాల కూటమి జలాంతర్గాములను విస్తృతంగా వాడాయి. పరస్పరం జల సమాధి చేసుకున్నాయి. అట్లాంటిక్ మహా సముద్రంలో జర్మనీ మిత్ర రాజ్యాల ఆయుధ సరఫరాకు అంతరాయం కల్పించేందుకు పెద్ద ఎత్తున సబ్‌మెరైన్లను వినియోగించింది. జపాన్‌ను నిలువరించేందుకు అమెరికా పసిఫిక్ థియేటర్‌లో 11నాటికల్ మైళ్ల పొడవునా..తన సబ్‌మెరైన్లను మోహరించింది.
పీటర్ పాడీ ఫీల్డ్ రాసిన ‘వార్ బినీత్ ది సీ’ పుస్తకం రెండవ ప్రపంచ యుద్ధంలో జలాంతర్గాముల మోహరింపు లను విస్తృతంగా చర్చించింది. బ్రిటన్, అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు సబ్ మెరైన్లను ఎలా మోహరిం చాయో విపులంగా రాశారు. ఏ యే దేశాలు ఎలాంటి సబ్ మెరైన్లను వినియోగించాయో వివరించారు. మొదటి ప్రపంచ యుద్ధంతో పోలిస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో మోహరించిన జలాంతర్గాములు మొత్తం ప్రపంచ యుద్ధనీతినే ప్రభావితం చేశాయనేది పాడీ ఫీల్డ్ అంచనా. భవిష్యత్ రణస్థలి స్వభావాన్నే మార్చేసిందంటారు.
రష్యా, చైనా, అమెరికాల వద్ద ఎన్ని జలాంతర్గాములున్నాయి?
చైనా వద్ద 60 సబ్‌మెరైన్లు ఉన్నాయి. వీటిలో సగం జలాంతర్గాములు నిరంతరం మోహరింపులోనే ఉంటాయి. ప్రధానంగా దక్షిణా చైనా సముద్రంలో వీటిని ఆ దేశం మోహరిస్తుంది. దశాబ్దాలుగా వ్యూహాత్మకంగా దక్షిణ చైనా సముద్రంపై పట్టుకోసం అనేక దేశాలను భయపెడుతూ ఉంటుంది డ్రాగన్. సాగర గర్భంలో అగ్రరాజ్య ఏకఛత్రాధి పత్యానికి గండికొట్టే ప్రయత్నాలను ఇటీవలే ముమ్మరం చేసింది.
ఇటీవలి కాలంలో అణు ఆధారిత జలాంతర్గాముల తయారీలో వేగం పెంచింది. లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్’ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలువరించిన నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో అమెరికాతో పోలిస్తే చైనాయే వేగంగా అణు జలాంతర్గాములను తయారు చేస్తున్నట్టు పేర్కొంది. 2021-25 మధ్య కాలంలో చైనా ఏకంగా 10 అణు జలాంతర్గాములను మోహరింపునకు సిద్ధం చేసింది. అమెరికా కేవలం 7కు పరిమితమైంది.
చైనా సబ్‌మెరైన్ల బరువు 70 వేల మెట్రిక్ టన్నులు కాగా, అమెరికా తయారు చేసిన వాటి బరువు కేవలం 55వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2030 నాటికి చైనా అణు జలాంతర్గాముల సంఖ్య అమెరికాను మించిపోతుందని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్’ వెల్లడించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లకు చైనా జలాంతర్గాములను అమ్ముతోంది. అంటే భారత్ పొరుగున విద్వేషాలు రగులుస్తున్న దేశాలకు మాత్రమే అమ్ముతోంది. దీని ఉద్దేశం చాలా వ్యూహాత్మకం. ఈ వ•డింటిలో పాకిస్థాన్ అతిపెద్ద వినియోగదారు. బాంగ్లాదేశ్ వద్ద 2035-మైన్ క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్లు ఉంటే మయన్మార్ వద్ద ఒకటి ఉంది. ఇవి సెకండ్ హ్యాండ్ జలాంతర్గాములు. ఈ మధ్య కాలంలో థాయిలాండ్ సైతం సబ్‌మెరైన్ల కోసం చైనా వద్ద ఆర్డర్లు పెట్టింది.
రష్యా వద్ద 66 జలాంతర్గాములుంటే ఇందులో 14 బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్లున్నాయి. ఇవి మాస్కో రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైళ్లు 25 ఉన్నాయి. డీజిల్-ఎల్ట్ర సబ్‌మెరైన్లు 22 ఉన్నాయి. ప్రత్యేక అవసరాల కోసం తయారుచేసిన జలాంతర్గాములు 8 ఉన్నాయి. వీటిని సముద్ర గర్భంలో పరిశోధనకు వినియోగి స్తారు. భారత్ సహా వియత్నాం, అల్జీరియా, ఇరాన్ తదితర 15 దేశాలకు రష్యా జలాంతర్గాములను విక్రయిస్తుంది. అత్యంత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వియత్నాం, ఇరాన్‌లకు రష్యా వాటిని విక్రయిస్తోంది.
అమెరికా వద్ద 72 అణు ఆధారిత సబ్‌మెరైన్లు ఉన్నాయి. ఇందులో 14 అణు జలాంతర్గాములు వ్యూహత్మకంగా కీలకమైనవి. 4 క్రూయిజ్ మిసైల్ సబ్‌మెరైన్లు, 54 సబ్ మెరైన్లు శత్రువేట కోసం మోహరించేందుకు ఉపయోగించేవి. అమెరికా కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే 2030వరకూ సెకండ్ హ్యాండ్ వర్జీనియా తరహా సబ్‌మెరైన్లను అందిస్తానని చెప్పింది మినహా మరెవరికీ విక్రయిం చదు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మిత్రదేశాలకు మాత్రమే డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములను విక్రయించేది. సబ్ మెరైన్ల విక్రయం మందకొడిగా ఉండటానికి ప్రధాన కారణం వాటి తయారీకి సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు పట్టడమే. సంక్లిష్టమైన, సంకీర్ణమైన వ్యవహారం. సాగర గర్భంలో వినియోగించే యుద్ధ సాధనాలను అత్యంత జాగరూక తతో తయారు చేయాలి. అందుకే సమయాభావం అవుతుంది.
భారత్‌పై కాలు దువ్వుతున్న పాకిస్థాన్ వద్ద ఉన్నవి కేవలం 10 సబ్‌మెరైన్లు. ఇవన్నీ డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్లు. అందుకే చైనా హాంగోర్ సబ్ మెరైన్లను కొనుగోలు చేసేందుకు 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 8 సబ్‌మెరైన్ల కొనుగోలుకు ఈ ఒప్పందం ఉద్దేశించింది. ఇందులో నాలుగు జలాంతర్గాములు ‘కరాచీ షిప్ యార్డ్ ఇంజనీరింగ్ వర్కస్’లో చైనా మెరైన్ ఇంజనీర్లు తయారు చేస్తున్నారు. మరో నాలుగు చైనాలో తయారవుతున్నాయి. ఈ ఎనిమిదింటిలో ఒకటి మాత్రమే ఇప్పుడు పాకిస్థాన్ నావికా దళానికి చేరింది. ఈ హాంగోర్ సబ్‌మెరైన్లు 2028 వరకూ అందజేయాలనేది ఒప్పందం సారాంశం.

ప్రశాంత్ జోషి
సీనియర్ జర్నలిస్ట్