కేవలం అమెరికాపై మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా, ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో సొంతంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6 నుండి 11 వరకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్‌ ‌దేశాలలో పర్యటించారు. అమెరికా తన ‘ఇండో-పసిఫిక్‌ ‌కమాండ్‌’ ‌పేరును తిరిగి ‘పసిఫిక్‌ ‌కమాండ్స్ (యూఎస్‌పీఏసీఓఎం)గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం, ట్రంప్‌ ‌చేస్తున్న కొన్ని ప్రతికూల వ్యాఖ్యల నేపథ్యంలో, హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రాధాన్యతను కాపాడుకోవడానికి భారత్‌  ‌వేగంగా పావులు కదుపుతోంది.

అమెరికా సైన్యం తన కమాండ్‌ ‌పేరు నుండి ‘‘ఇండో’’ అనే పదాన్ని తొలగించినప్పటికీ, భౌగోళికంగా ఆ ప్రాంత బాధ్యతలు మారలేదని అమెరికా రక్షణశాఖ ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో ట్రంప్‌ ‌ప్రభుత్వం చైనాతో మెతక వైఖరి అవలంబిస్తే ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడానికి భారత్‌ ‌సిద్ధమవుతోంది. అంతేకాదు డోనాల్డ్ ‌ట్రంప్‌ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల వల్ల హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఖాళీని చైనా భర్తీ చేయకుండా అడ్డుకోవడానికి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ‌దేశాలు భారత్‌కు కీలకం. ఈ క్రమంలో భారత్‌ ‌కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా కాక, పశ్చిమ దేశాలకు , ఆసియా దేశాలకు మధ్య ఒక సమతుల్య దౌత్యవారధిగా నిలుస్తున్న సంగతి ప్రధాని పర్యటన ద్వారా స్పష్టమైంది. చైనా లేదా అమెరికాల వైపు మాత్రమే మొగ్గు చూపకుండా, వ్యూహాత్మక స్వతంత్ర విధానంతో సరికొత్త బహుళ-ధ్రువ ప్రపంచక్రమాన్ని  నిర్మించడంలో భారతదేశం ఇప్పుడు గ్లోబల్‌ ‌లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. అమెరికా మద్దతు తగ్గినా, చైనా దూకుడును ఒంటరిగా ఎదుర్కోకుండా ఈ వ•డు దేశాలతో కలిసి భారత్‌ ఒక బలమైన ప్రాంతీయ కూటమిని (ఆర్క్ ‌ట్రస్ట్) ఏర్పాటు చేసుకుంటోంది.

ఇండోనేషియా…

పసిఫిక్‌, ‌హిందూ మహాసముద్రాలను కలిపే అత్యంత కీలకమైన ‘మలక్కా జలసంధి’పై పట్టు సాధించడానికి ఇండోనేషియా భారత్‌కు అత్యంత కీలకం. జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో జరిగిన భేటీలో భారత్‌ 14 ‌వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇండో నేషియా సైనిక ఆధునికీకరణలో భాగస్వామవుతూ, భారత్‌ ‌తన రక్షణ ఉత్పత్తులను ఆ దేశానికి ఎగుమతి చేయడానికి అంగీకరించింది. ఇండోనేషియాలో ఐఐఎమ్‌ ‌బెంగళూరు క్యాంపస్‌ను ఏర్పాటు చేయ నున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఇండోనేషియాకే కాక మొత్తం ఆసియా (ఆసియన్‌) ‌ప్రాంత యువతకు భారత విద్యా ప్రమాణాలను అందిస్తూ గ్లోబల్‌ ‌సౌత్‌లో దేశ గౌరవాన్ని పెంచనుంది. అంతర్జాతీయ యవనికపై భారత్‌ ‌ప్రాధాన్యతను గుర్తించారు కనుకనే జకార్తాలో అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. నరేంద్ర మోదీకి ఇండోనేషియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్‌ ఆదిపూర్ణ’ పురస్కారాన్ని అందించి గౌరవించారు. ఇండోనేషియా ‘ఎమాస్‌ ‌విజన్‌’, ‌భారతదేశ ‘వికసిత్‌ ‌భారత్‌’ ‌సంకల్పం ఒక దానికొకటి తోడ్పడతాయని ఇరు దేశాలు ప్రకటించాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన సబాంగ్‌ ‌పోర్ట్ ‌నిర్మాణంలో భారత్‌ ‌భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇది హిందూ మహా సముద్రంలో చైనా ఉనికిని అడ్డుకోవడానికి భారత్‌కు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది. ఇండోనేషియాలో ఈవీఎంల అభివృద్ధి, సాంకేతికతను మెరుగు పరచడానికి భారత్‌ ‌పూర్తి మద్దతును ప్రకటించింది. ఇది గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాల్లో భారత సాంకేతి కతకున్న విశ్వసనీయతను చాటుతున్నది. ఇండోనేషియాలోని స్టీల్‌, ‌నికెల్‌ ‌ఖనిజ రంగాల్లో భారత్‌ ‌భారీగా పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమమైంది. భారతదేశంలో తయారీ రంగానికి (ఈవీలు, ఇండస్ట్రీస్‌) ‌నికెల్‌ ‌వంటి ఖనిజాలు ఎంతో కీలకం. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రసిద్ధ ప్రంబానన్‌ ‌దేవాలయ సముదాయాన్ని సందర్శిం చారు. విదేశాల్లోని చారిత్రక హిందూ దేవాలయాలు, భారతీయ సంస్కృతికి చెందిన వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం భారత్‌ అం‌దిస్తున్న ఆర్థిక, సాంకేతిక సాయం రెండు దేశాల సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేసింది. భారతదేశం దౌత్య  వ్యూహం ద్వారా ఇండోనేషియాను తన వైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించింది. ఉమ్మడి పరిశోధనలు, టెక్నాలజీ బదిలీ, కో-ప్రొడక్షన్‌ను ఆఫర్‌ ‌చేయడం ద్వారా భారత దౌత్యం ఇండోనేషియా మనసు గెలుచుకుంది. అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా దేశాల (గ్లోబల్‌ ‌సౌత్‌) ‌వాణిని వినిపించడంలో భారత్‌ ‌ముందుం టోంది. హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్‌ ‌మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఇండోనేషియా భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉంది. ప్రపంచ వాణిజ్యం, చైనాకు అవసరమైన 80% ఇంధన సరఫరా ‘మలక్కా జలసంధి’  గుండానే సాగుతుంది. ఇండోనేషియాతో బలమైన రక్షణ సంబంధాలతో, యుద్ధ సమయాల్లో చైనా నౌకల రాకపోకలను అడ్డుకునే శక్తి భారత్‌కు లభిస్తుంది. ఇక్కడ సబాంగ్‌లో ఉన్న వ్యూహాత్మక రేవును భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఇది అండమాన్‌ ‌దీవులకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల చైనా జలాంతర్గాము లపై భారత్‌ ‌సులభంగా నిఘా పెట్టగలదు.

ఆస్ట్రేలియాతో…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2026 నాటి ఆస్ట్రేలియా పర్యటన రెండు దేశాల మధ్య దౌత్య వ్యూహాత్మక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చింది. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీతో జరిగిన 3వ భారత్‌-ఆ‌స్ట్రేలియా వార్షిక సదస్సు ద్వారా భారతదేశానికి• కీలకమైన దౌత్యపరమైన ప్రయోజనాలు చేకూరాయి. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి విభిన్న రంగాలలో భారత్‌ ఏకంగా18 ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇరు దేశాలు ‘డిఫెన్స్ అం‌డ్‌ ‌సెక్యూరిటీ కోఆపరేషన్‌’‌పై ఒక ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. హిందూ మహాసముద్ర పరిధిలో భద్రతను పర్యవేక్షించడానికి ఇండియన్‌ ‌కోస్ట్ ‌గార్డ్, ఆ‌స్ట్రేలియా మారిటైమ్‌ ‌బోర్డర్‌ ‌కమాండ్‌ ‌మధ్య ఒప్పందం కుదిరింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పౌర అణు ఒప్పందాన్ని ఇరు దేశాలు అధికారికంగా పట్టాలెక్కించాయి. దీనివల్ల భారతదేశ అణుశక్తి ప్రాజెక్టుల కోసం ఆస్ట్రేలియా నుండి యురేనియం దిగుమతి సులువవుతుంది. గ్రీన్‌ ‌హైడ్రో జన్‌, ‌పునరుత్పాదక ఇంధన రంగాలలో సరఫరా లంకెలను మెరుగుపరచడానికి ఉమ్మడి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. భారతదేశంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాలు (ఈవీ), సోలార్‌ ‌ప్యానెల్స్ ‌తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ ‌వంటి కీలక ఖనిజాల సరఫరా కోసం ‘క్రిటికల్‌ ‌మినరల్స్ ‌కారిడార్‌’‌పై ఇరు దేశాలు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఈ ఖనిజాల కోసం చైనాపై భారత్‌ ఆధార పడటం తగ్గుతుంది. ఇస్రో  ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గగన్‌యాన్‌ ‌మానవ అంతరిక్ష యాత్రకు మద్దతుగా ఆస్ట్రేలియాకు చెందిన ‘కోకోస్‌ ‌కీలింగ్‌ ‌దీవులలో’  ఒక తాత్కాలిక స్పేస్‌ ‌ట్రాకింగ్‌ ‌టెర్మినల్‌ను ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియా అంగీకరించింది. ఫలితంగా, భారత నౌకాదళం ఆస్ట్రేలియా సైనిక స్థావరాలను, కోకోస్‌ ‌దీవులను వాడుకోవచ్చు.

తద్వారా భారత నౌకాదళ పరిధి దక్షిణ పసిఫిక్‌ ‌మహాసముద్రం వరకు విస్తరిస్తుంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌, ఆ‌స్ట్రేలియా, జపాన్‌లు కలిసి ‘సప్లై చైన్‌ ‌రెసిలియన్స్ ఇనిషియేటివ్స్ (ఎస్‌సీఆర్‌ఐ)‌ను నిర్వహిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించాలనే డిమాండ్‌కు ఆస్ట్రేలియా తన పూర్తి మద్దతును పునరుద్ఘాటిం చింది. ద్వంద్వ ప్రమాణాలు లేకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ పర్యటన సందర్భంగా ఫ్లిండర్స్ యూనివర్సిటీ బెంగళూరులో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే అంతర్జాతీయ విద్యను అందిస్తుంది.

 న్యూజిలాండ్‌

‌సుదీర్ఘ కాలంగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని పసిఫిక్‌ ‌దీవుల దేశాలతో సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి న్యూజిలాండ్‌ను భారత్‌ ‌ప్రస్తుతం ఒక వంతెనలా ఉపయోగిస్తోంది. 1986లో రాజీవ్‌ ‌గాంధీ పర్యటన తర్వాత, మళ్లీ  భారత ప్రధాని మోదీయే న్యూజిలాండ్‌లో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ ‌లక్సన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరుదేశాల మధ్య సరికొత్త దౌత్య, ఆర్థిక సంబంధా లకు పునాది వేశాయి. భారత్‌-‌న్యూజిలాండ్‌ ‌ద్వైపాక్షిక సంబంధాలను తొలిసారి ‘‘వ్యూహాత్మక భాగ స్వామ్యం’’ స్థాయికి పెంచారు. రక్షణ, వాణిజ్యం, మ్యారిటైమ్‌ ‌సెక్యూరిటీ, సైన్స్, ‌టెక్నాలజీ వంటి రంగాలలో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇటీవల కుదిరిన ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని వేగంగా అమలు చేయడానికి ఇరు ప్రధానులు అంగీకరించారు. దీనితో న్యూజిలాండ్‌ ‌నుంచి భారత్‌కు వచ్చే 57% ఎగుమతులపై సుంకాలు రద్దుకానున్నాయి. చైనా దూకుడు పెరుగు తున్న నేపథ్యంలో, ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో శాంతి, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా సమాచార మార్పిడి కోసం ప్రత్యేకంగా మ్యారిటైమ్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది.

చైనా కట్టడికి న్యూజిలాండ్‌ ‌సహకారం

పసిఫిక్‌ ‌దీవుల దేశాలలో చైనా తన ఆర్థిక, సైనిక దౌత్యం ద్వారా పెంచుకుంటున్న ప్రభావాన్ని అడ్డుకోవడానికి భారతదేశానికి న్యూజిలాండ్‌ ‌సహకారం అవసరం. ఫిజీ, సోలమన్‌ ‌దీవులు, కిరిబాటి, పాపువా న్యూగినియా వంటి దీవులలో ప్రాబల్యమున్న చైనాను ఒంటరిగా ఎదుర్కోవడం కంటే, అక్కడ దశాబ్దాలుగా బలమైన పట్టున్న న్యూజిలాండ్‌తో కలిసి పనిచేయడం భారత్‌కు ఎంతో లాభిస్తుంది.

న్యూజిలాండ్‌ ‌భౌగోళికంగా పసిఫిక్‌ ‌దీవులకు దగ్గరగా ఉంటుంది. అక్కడి రాజకీయాలు, సంస్కృతి, స్థానిక నాయకులతో న్యూజిలాండ్‌కు బలమైన మైత్రి ఉంది. వీటితో భారత్‌కు నేరుగా సంబంధాలు లేనందువల్ల న్యూజిలాండ్‌ ‌దౌత్య సహాయంతో భారత్‌ ఆయా దేశాలకు సులభంగా చేరువ కాగలదు. చైనా పసిఫిక్‌ ‌దీవులకు భారీగా అప్పులు ఇచ్చి, వాటిని తన గుప్పిట్లోకి తెచ్చు కుంటోంది. దీనిని అడ్డుకోవ డానికి ఇరు దేశాలూ కలిసి ఆ చిన్న దేశాలకు ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం, మౌలిక సదు పాయాల కల్పన, విపత్తు నిర్వహణలో సహాయాన్ని అందిస్తున్నాయి. పసిఫిక్‌ ‌రీజియన్లోని అన్ని దేశాలతో కూడిన అత్యున్నత సంస్థ ‘పసిఫిక్‌ ఐలాండ్స్ ‌ఫోరమ్‌ (‌పీఐఎఫ్‌)’‌లో న్యూజిలాండ్‌ ‌కీలక సభ్య దేశం. ఈ ఫోరమ్‌లో చైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోవడానికి, భారత్‌ ‘‌ఫోరమ్‌ ‌ఫర్‌ ఇం‌డియా-పసిఫిక్‌ ఐలాండ్స్ ‌కోఆపరేషన్‌ (ఎఫ్‌ఐపీఐసీ) వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి న్యూజిలాండ్‌ ‌దౌత్యపరంగా భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుంది. పసిఫిక్‌ ‌మహా సముద్రంలో చైనా తన సైనిక నౌకలు, జలాంతర్గాముల కదలికలను పెంచుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ ‌నౌకాదళం, నిఘా వ్యవస్థలు ఈ ప్రాంతంలో నిరంతర నిఘా ఉంచుతాయి. ఆ సమాచారాన్ని భారత్‌తో పంచుకోవడం ద్వారా, చైనా పసిఫిక్‌ ‌ప్రాంతం నుండి హిందూ మహాసముద్రంలోకి ఎలా ప్రవేశిస్తుందో భారత్‌ ‌ముందే అంచనా వేయగలదు. పసిఫిక్‌ ‌దీవుల దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘వాతావరణ మార్పులు.

భారత్‌, ‌న్యూజిలాండ్‌ ‌కలిసి ఈ దీవులకు గ్రీన్‌ ఎనర్జీ, పర్యావరణ రక్షణ సాంకేతికతను అందిస్తున్నాయి. దక్షిణ పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించకుండా న్యూజిలాండ్‌, ఆ‌స్ట్రేలియాలతో కలిసి భారత్‌ ఒత్తిడి తీసుకు రాగలదు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ‌జపాన్‌, ‌యూకే కలిసి జూన్‌ 2022‌లో  ప్రారంభిం చిన ‘పార్ట్‌నర్స్ ఇన్‌ ‌ది బ్లూ పసిఫిక్‌’ ‌వ్యూహాత్మక కూటమి, పసిఫిక్‌ ‌దేశాలు చైనా అప్పులవలలో పడకుండా నిరోధించేందుకే.  మనదేశం నేరుగా ఇందులో అధికారిక సభ్యదేశం కాకపోయినప్పటికీ, ఈ కూటమి సభ్యులైన అమెరికా, జపాన్‌, ఆ‌స్ట్రేలియాలతో భారత్‌కు ‘క్వాడ్‌’ ‌ద్వారా, దేశీయ ఫోరం ఫర్‌ ఇం‌డియా-పసిఫిక్‌ ఐలాండ్స్ ‌కోఆపరేషన్‌ ‌ద్వారా బలమైన సంబంధాలు ఉన్నాయి. చైనాను కట్టడి చేయడం వల్ల హిందూ మహా సముద్రంలో చైనా దూకుడు తగ్గుతుంది, ఇది భౌగోళికంగా భారత్‌కు ఎంతో లాభిస్తుంది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor