బాంగ్లాదేశ్ హిందువుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులలోని పాశవికత కూడా పెరిగిపోతున్నది. కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమా చారం ప్రకారం డిసెంబర్ 28, 2025 అర్ధరాత్రి ఫిరోజ్‌పూర్ జిల్లా దుమ్రితాల గ్రామంలో ముస్లిం మతోన్మాదులు మరొక అఘాయిత్యానికి ఒడిగట్టారు. కాగా బాంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ నాయ కురాలు బేగం ఖలీదా జియా డిసెంబర్ 30, 2025 వేకువన మరణించారు. ఆమె వయసు 80 ఏళ్లు. ప్రస్తుతం ఆమె కుమారుడు తారిక్ రహమాన్ పార్టీ తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహ రిస్తున్నారు. ఇటీవలనే లండన్ ప్రవాసం వీడి స్వదేశానికి వచ్చారు. ఆమె మరణం ప్రస్తుత రాజకీయ సంక్షోభం మీద ప్రభావమేమీ చూపించదు.
దుమ్రితాల దురంతం చూస్తే, అది ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడే ఒకేచోట ఉన్న ఐదు హిందువుల ఇళ్లకు బయట గొళ్లం పెట్టి నిప్పు పెట్టారు. కానీ లోపల ఉన్నవారంతా తప్పించు కున్నారు. దీపూచంద్ర దాస్‌ను కార్మికుల రూపంలోని ఉన్మాదులు మైమెన్‌సింగ్ జిల్లాలో కొట్టి చంపి, దహనం చేసిన వారం తరువాత ఇది జరిగింది. ఇళ్లు దహనం చేసి హిందువులను అంతం చేయడానికి రెండు వారాలుగా జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఎనిమిదవది. 2024 ఆగస్ట్‌లో షేక్ హసీనాను గద్దె దింపి తాత్కాలిక ప్రభుత్వాధి నేతగా యూనుస్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత బాంగాదేశ్‌లో మైనారిటీల మీద 2,900 దాడులు జరిగాయని భారత విదేశ వ్యవహారాల శాఖ ప్రకటించింది. నిజానికి 2024లోనూ, ప్రస్తుతం ఏ ఒక్క విదేశీ మీడియా బాంగ్లా మైనారిటీల మీద జరుగుతున్న దాడుల గురించి నోరు మెదపలేదు. విదేశీ మీడియాతో పాటు భారత్ విపక్షం కూడా అదే పని చేసింది. భారత్ ఆరోపణను బాంగ్లాదేశ్ తిరస్కరించిన తీరు కూడా అమానుషమే. తమ దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికే భారత్ ఇలాంటి ప్రచారం చేపట్టిందని ఆ దేశ విదేశ వ్యవహారాల ప్రతినిధి ఆరోపించారు. తాము కేవలం కట్టుబట్టలతో బతికి బయటపడ్డామని దుమ్రితాల బాధితులు చెప్పారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో జరిగిన ఈ దగ్ధకాండ గురించి దర్యాప్తు జరుపుతామని అధికారులు చెబుతున్నారు. పాలాస్ కాంతిషా, సాహెబ్ షా, దీపక్ షా, శ్యామలేందు షా, అశోక్ షాలకు చెందిన ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక ముస్లిం గార్డు హిందూ గార్డును కాల్చిచంపిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది.
ఇంతకు మందు చిట్టగాంగ్‌లో రావ్‌జాన్ ప్రాంతంలో ఏడు హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టారు. సుల్తాన్‌పూర్‌లో రెండు, కియోషియా అనే చోట మూడు చోట్ల హిందువుల ఇళ్లు ఎంచుకుని నిప్పు పెట్టారు. వీటన్నిటిని ఒకే విధంగా ఇంటి బయట తలుపులకు తాళాలు వేసి నిప్పు పెట్టారు. రాజబరీ జిల్లాలో మొండాల్ అనే వ్యక్తిని కూడా కొందరు కొట్టి చంపారు. అయితే ఇది మతానికి సంబంధించిన విషయం కాదని, అతడు గ్యాంగ్‌స్టర్ అని, పాత కక్షలతోనే చంపారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
కాగా, వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు అక్కడ అప్పుడే వేడి మొదలయింది. ఖలీదా జియా కుమారుడు రహమాన్ ఢాకా 17 నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి డిసెంబర్ 29న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భారత్‌లో తలదాచు కుంటున్న షేక్ హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్‌ను తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ నిషేధించారు. దీనితో ఆ పార్టీకి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదు. అందుకే బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఎన్నికలలో ఎక్కువ లబ్ధి దక్కుతుందని చెబుతున్నారు. అయితే ఈ పార్టీ ఎన్నికలలో విజయం సాధించినా జమాత్ ఇ ఇస్లామి పార్టీ పెద్ద బెడదగా తయారు కావడం తథ్యమన్న వాదనలు కూడా అప్పుడే మొదలయ్యాయి. తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ పోటీ సంగతి ఇంకా స్పష్టం కానప్పటికీ, బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి, జమాత్ ఇస్లామి పార్టీకి, విద్యార్థులు బలపరుస్తున్న పార్టీలకు కూడా ఎన్నికల ప్రచార వస్తువు భారత్.
భారత్ బాంగ్లా మీద కుట్ర పన్నిందంటూ ప్రచారం చేయబోతున్నాయి. దీనితో అక్కడ మైనారిటీల మనుగడకు బెడద ఇంకాస్త పెరిగే ప్రమాదమే ఉంది. భారత్ ఒక రకమైన తలనొప్పి భరిస్తుంటే•, ప్రస్తుతం అక్కడ ఉన్న ఉదారవాదులు మరొక కోణంలో బలిపశువు లవుతారన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరు ముస్లిం మతోన్మాద కోణాన్ని, హింసను ప్రశ్నించినా ప్రమాదంలో పడినట్టే. వారి మీద వెంటనే భారత్ అనుకూల ముద్ర పడిపోతు న్నది. తరువాత వారి పరిస్థితి అగమ్యగోచరమవు తోంది. అయితే అక్కడి మైనారిటీలు, అంటే హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు తాము బాంగ్లాదేశ్‌లోనే ఉంటామని చెబుతున్నారు. వారి దృఢ నిశ్చయాన్ని నిరూపిస్తూ ఇటీవలనే బాంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కుక్రీతి కుమార్ దీనికి అధ్యక్షుడు. తాము 91 పార్లమెంట్ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతామని కుమార్ తెలియచేశారు. ఆ దేశ పార్లమెంట్‌లో 300 స్థానాలు ఉన్నాయి.
– జాగృతి డెస్క్