అప్పట్లో మందిర ఉద్యమం అపారమైన రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లే, ఆ ఉద్యమానికి కేంద్ర బిందువైన యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో, ఆలయంలో జరిగిన దొంగతనం కూడా రాజకీయంగా ప్రాచుర్యం పొందింది. జాతీయ, అంతర్జాతీయ మీడియా శీర్షికల్లో ప్రముఖంగా నిలుస్తున్న రామ మందిరంలోని నగదు దొంగతనం, 1990ల నాటి సైద్ధాంతిక ఘర్షణలను గుర్తుచేస్తూ, ఒక భారీ రాజకీయ వివాదంగా పరిణమించింది. ఈ రాజకీయ ఆసక్తి సహజమైనది, అర్థం చేసుకోదగినదే అయినప్పటికీ, నేటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అప్పటి మందిర ఉద్యమం, నేటిలా నిమిష నిమిషానికి బ్రేకింగ్ న్యూస్ అందించే మీడియా తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి రాలేదు. ఇంతటి ఉద్రేకపూరిత మీడియా యంత్రాంగం రాజకీయ ఎజెండాలతో కలిసినప్పుడు, సందర్భోచిత సంచలనాత్మక కథనాలకు అతీతంగా, సమగ్రంగా పరిశీలించడం ద్వారా మాత్రమే సత్యాన్ని వెలికితీయగలం.
ఈ దొంగతనం ఒకప్పుడు రామమందిరాన్ని వ్యతిరేకించిన వారిని అద్భుతంగా “జై శ్రీరామ” అని జపించే ఆయన భక్తులుగా మార్చేసింది. 2024లో ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ, రామ్ లల్లా దర్శనం కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని ఇటీవల పంపింది. ఇది కేవలం రాజకీయ అవకాశవాదంతో ప్రేరేపించబడినప్పటికీ, స్వాగతించదగిన పరిణామం. ఎందుకంటే, ఆ పార్టీ ఆరాధించే మహాత్మా గాంధీ జాతీయ, వ్యక్తిగత సమస్యలన్నింటికీ “రామ నామాన్ని” నివారణగా భావించారు. 2024 మందిర కార్యక్రమాన్ని బహిష్కరించిన అరవింద్ కేజ్రీవాల్ కూడా తక్షణమే రామభక్తుడిగా మారిపోయారు. ఈ దొంగతనం సనాతనులందరినీ తీవ్రంగా బాధించిందని ప్రకటిస్తూ, రామ్‌లల్లాను దర్శించుకుంటానని తెలిపారు. అత్యంత విడ్డూరం ఏమిటంటే, 1990లో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 మంది కరసేవకులను కాల్చి చంపమని పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత, 30 మంది చనిపోవాల్సి వచ్చినా అదే ఆదేశం ఇచ్చేవాడినని గర్వంగా ప్రకటించారు. ఈరోజు ఆయన సమాజ్‌వాదీ పార్టీ రామభక్తులు మోసపోయారని కన్నీరు కార్చుతోంది. బ్రేకింగ్ న్యూస్ కోసం పోటీపడుతున్న అతి ఉత్సాహపూరిత భారత మీడియా కూడా ఈ రాజకీయ బృందగానంలో గొంతు కలిపింది. ఒక మీడియా సంస్థ బీజేపీకి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. మరొకటి, పరిపాలనలో నిజాయతీకి, స్వర్ణ ప్రమాణమైన బీజేపీ రామరాజ్య వాగ్దానానికి ఇది తీవ్రమైన ఎదురుదెబ్బ అని పేర్కొంది.ఆలయం భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యతను సొమ్ము చేసుకుంటూ, భారత్, హిందూ వ్యతిరేక పక్షపాత చరిత్ర కలిగిన రాయిటర్స్, బీబీసీ, అల్‌జజీరా వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఈ సంఘటనను ఒక బిలియన్ డాలర్ల దోపిడీగా చిత్రీకరించాయి. “దేవుళ్ల నుంచి దొంగతనం.. అవినీతి స్కామ్‌లో చిక్కుకున్న భారత్ రామమందిరం… కీలకమైన రాష్ట్ర ఎన్నికలకు ముందు నిధుల దుర్వినియోగ ఆరోపణల్లో కూరుకు పోయిన ఈ ఆలయం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది,” అని అల్‌జజీరా ఘోషించింది.
ఇది కేవలం దొంగతనం.. అవినీతి లేదా స్కామ్ కాదు
రామమందిరంలో జరిగింది ఒక దొంగతనం మాత్రమే. నగదు నిర్వహణలో ఉన్న కింది స్థాయి సిబ్బంది సులభంగా చేసిన చిన్నపాటి అపహరణ ఇది. ఇది అవినీతి లేదా స్కామ్ కాదు. ఒకవేళ ఉన్నతాధికారులు దీనిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించి ఉంటేనే అది అవినీతి అయ్యేది. కానీ దానికి భిన్నంగా, దొంగతనం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉన్నతాధికారులు కఠినమైన, రాజీలేని చర్యలు చేపట్టారు. దీనిని స్కామ్‌గా మార్చేలా చేసే ‘సంస్థాగతంగా కప్పిపుచ్చడం’ (institutional cover-up) వంటి ఆనవాళ్లు ఏవీ ఇందులో కనిపించలేదు.
దొంగతనాలు ఎక్కడైనా జరుగుతుంటాయి. మనం జీవిస్తున్న కాలం గురించి తెలుసుకోవాలంటే స్వామి చిన్మయానంద చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకోవాలి: “కృతయుగంలో మంచి, చెడు వేర్వేరు లోకాలలో (దేవతలు, అసురులు) ఉండేవి. త్రేతా యుగంలో అవి ఒకే లోకంలో (రాముడు, రావణుడు) ఉండేవి. ద్వాపరయుగంలో అవి ఒకే కుటుంబంలో (పాండవులు, కౌరవులు) ఉండేవి. కానీ కలియుగంలో అవి ఒకే మనిషిలో నివసిస్తున్నాయి” అని వారు అన్నారు. మనం కలియుగంలో ఉన్నాం. ఈ యుగంలో మనిషిలో మంచి, చెడు ఏకకాలంలో ఉంటాయి.
కోరిక, దురాశ సహజంగా మంచివారైన వారిని కూడా ప్రభావితం చేసినప్పుడు, చర్చిలు, మసీదులు లేదా దేవాలయాల వంటి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో కూడా నేరాలు జరగవచ్చు. దేవాలయ హుండీ (విరాళాలపెట్టె) నుండి డబ్బు దొంగిలించడం చాలా సులభం. దేవాలయ నిర్వహణపై సి.పి. రామస్వామి అయ్యర్ కమిటీ నివేదిక చాలా స్పష్టంగా పేర్కొన్నట్లుగా, హుండీలో వేసిన డబ్బు పవిత్రమైనది. కానీ దానిని బయటకు తీసిన క్షణంలో అది కేవలం కరెన్సీ నోట్లుగా మారుతుంది. సరిగ్గా ఇదే తర్కం ఆధారంగా, దేవాలయ నిధులను తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రభుత్వాలను న్యాయవ్యవస్థ అనుమతించింది.
బోఫోర్స్ స్కామ్‌పై మÖడేళ్లు తాత్సారం
ఏ సంస్థలోనైనా నిజాయతీకి అసలైన కొలమానం తప్పులు జరగకపోవడం కాదు (అది ఆదర్శవంతమైన పరిస్థితి అయినప్పటికీ). ఆ తప్పులపై అధికారులు ఎంత వేగంగా, ఎంత దృఢంగా స్పందిస్తారన్నదే ముఖ్యం. దొంగతనాన్ని కప్పిపుచ్చడమే అవినీతి, మోసానికి దారితీస్తుంది. ఇది సాధారణంగా ఉన్నతాధికారులను రక్షించడానికి జరుగుతుంది. బోఫోర్స్ స్కామ్ 1987లో వెలుగులోకి వచ్చింది. అందులో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రమేయం ఉండటంతో, ఆయన అధికారం కోల్పోయే వరకు ఎటువంటి ఎఫఐఆర్ నమోదు కాలేదు. ఆయన ఓడిపోయిన మూడేళ్ల తర్వాత, 1990లో అది నమోదైంది.
వేగంగా స్పందించిన యోగి ప్రభుత్వం
ప్రభుత్వం ట్రస్టీగా వ్యవహరించిన దేవాలయా ల్లోని దొంగతనాలకు సంబంధించి ఇటీవల జరిగిన ఉదంతాలలో కప్పిపుచ్చడం వంటి చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రామమందిర ట్రస్ట్ తీసుకున్న చర్యలను మనం పరిశీలిద్దాం. రామమందిరానికి ఉన్న భౌగోళిక, రాజకీయ ప్రతిష్ట ద్వారా దేశ ప్రతిష్టకు విలువనిచ్చే ఈ ఘటన, దేశ ప్రతిష్టను పట్టించుకునే ప్రతి ఒక్కరికీ నిస్సందేహంగా దిగ్భ్రాంతికరం, బాధాకరమైనది. అయినప్పటికీ, కీలకమైన వాస్తవాలను కప్పిపుచ్చిన అతిశయోక్తి వార్తలు, ఆరోపణల సునామీ, జాతీయ ప్రతిష్టపై అన్యాయమైన, నివారించదగిన నీడను కమ్మేశాయి. ఇలాంటి ఇతర ఆలయ దొంగతనాల ఘటనలకు పూర్తి విరుద్ధంగా ట్రస్ట్, యూపీ ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాయో గమనించడంలో దురదృష్టవశాత్తూ తటస్థ వ్యాఖ్యాతలు కూడా విఫలమయ్యారు. కానీ ఈ గందరగోళంలో ఆ విషయం మరుగున పడిపోయింది.
ఏఐ మెచ్చుకోలు
శబరిమల, తిరువనంతపురం, పురీ, తమిళనాడులోని ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆలయాలలో జరిగిన ఆస్తి దుర్వినియోగం, విగ్రహాల దొంగతనాల ఆరోపణలను గుర్తుకు తెచ్చుకోండి. ప్రభుత్వ సంస్థల స్పందనను రామమందిర ట్రస్ట్ స్పందనతో పోల్చి చూస్తే, ఆ కేసులలో రామమందిరం ట్రస్ట్, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ట్రస్టుల స్పందన మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం వెల్లడవుతుంది. దీని కోసం దశాబ్దాల చరిత్ర పుటలు తిరగేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు, కృత్రిమ మేధ(ఏఐ) సాధనం ఆ చరిత్రను ఆధారాలు సహా కంప్యూటర్ తెరపైకి తీసుకువస్తుంది. ఆ కేసులలో రామమందిరం ట్రస్ట్, ప్రభుత్వ ట్రస్టులు ఎలా వ్యవహరించాయో పోల్చి చూపమని ఏఐ సాధనం జెమినిని కోరినప్పుడు, అది “తమ నియంత్రణలో ఉన్న ఆలయాల్లోని ఆరోపణలపై ప్రభుత్వాలు చర్యలను అడ్డుకుని, ఆలస్యం చేసిన తీరుతో పోలిస్తే, రామమందిరం ట్రస్ట్ వేగవంతమైన చర్య ఆశ్చర్యకరంగా భిన్నంగా ఉంది” అని సమాధానమిచ్చింది. శబరిమల, పురీ, తమిళనాడు విగ్రహాల దొంగతనాల వంటి కేసులలో ప్రభుత్వ బోర్డుల పూర్తి నిష్క్రియాత్మకత కారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించవలసివచ్చిందని, దీనివల్ల న్యాయం సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దాల పాటు ఆలస్యమైందని అది పేర్కొంది. దీనికి పూర్తి విరుద్ధంగా, నేరం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే రామమందిరం ట్రస్ట్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. “తమ సిద్ధాంతం, ఆత్మగౌరవంతో ప్రేరేపితమైన రామ మందిరం ట్రస్ట్ తక్షణం చర్య తీసుకుంది. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ ట్రస్టులు తమ వ్యవస్థలను, అధికార యంత్రాంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మందకొడిగా వ్యవహరించాయి” అని ఏఐ సాధనం పేర్కొంది. (ఈ దొంగతనం వల్ల మలినమవుతుందని కొన్ని మీడియా సంస్థలు వాదించినా అదే సిద్ధాంతం, ఇంతటి రాజీలేని చర్యకు కచ్చితంగా ఉత్ప్రేరకంగా పనిచేసింది.)
“అంతేకాకుండా, రామమందిరం ఉన్నతాధి కారులు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేశారు. ప్రభుత్వ దేవాలయాల స్కామ్‌లలో, అధికారులు తమ పదవులకు అంటిపెట్టుకుని ఉండటమే కాకుండా, తమ పదవులను కాపాడు కోవడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బుతో న్యాయపోరాటాలు చేస్తారు” అని తెలిపింది. “రామమందిరంలో దొంగతనానికి సంబంధించిన ప్రతిదీ సిట్ దర్యాప్తు నుండి అధికారిక నివేదిక, సామూహిక అరెస్టుల వరకు కేవలం కొద్ది రోజుల్లోనే జరిగిపోయింది. ట్రస్ట్ స్వచ్ఛందంగా తన ఆర్థిక నివేదికలను ఐదేళ్ల సమగ్ర పునఃఆడిట్‌కు సమర్పించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని దేవాలయాలు సంప్రదాయం లేదా స్వయంప్రతిపత్తిని కారణంగా చూపి బాహ్య ఆడిట్‌లను సర్వసాధారణంగానే తప్పించుకుంటాయి” అని అది పేర్కొంది. ఏఐ పరిజ్ఞానం ఉన్న పదవ తరగతి విద్యార్థి కూడా ల్యాప్‌టాప్ మౌస్‌ను క్లిక్ చేయడం ద్వారా ఈ పోలికను చేసి ఉండేవాడు. కానీ కోట్లాది డాలర్ల విలువైన జాతీయ, అంతర్జాతీయ మీడియా ఒకవైపు అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే మరోవైపు పోలికను చేయడంలో విఫలమయ్యాయి. రామమందిరం ట్రస్ట్ తీసుకున్న ఈ అపూర్వమైన చర్యలు, ఇది ఒక ఉన్నత స్థాయి స్కామ్ కాదని, ఒక తక్కువ స్థాయి దొంగతనం అని కూడా స్పష్టంగా సూచిస్తున్నాయి. మీడియా సహకారంతో రాజకీయ నాయకులు దీనిని ఒక ఉన్నత స్థాయి వ్యవహారంగా అనుమానించడం దురదృష్టకరం. ఇప్పుడు, ఇంతకుముందు ప్రస్తావించిన ఆలయ ట్రస్టుల చర్యలతో పోలిస్తే రామమందిరం ట్రస్ట్ వ్యవహారశైలిలో ఉన్న “స్పష్టమైన వ్యత్యాసం” వైపు దృష్టి సారిద్దాం.
తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఆరఎసఎస్ ప్రచారక్ రాయ్
నిజాయతీకి, నిష్కపటత్వానికి ప్రతీకగా నిలిచారు. పోలీసుల కంటే ముందే ఆయనే చర్యలు ప్రారంభించారన్న విషయాన్ని ప్రస్తావించకుండా, మీడియా దురదృష్టవశాత్తు ఆయన్ని ఈ వివాదంలోకి లాగుతోంది. సిట్ అనుమానిస్తున్న రూ. 7.5 కోట్లలో సగం కంటే తక్కువ దొంగతనం జరిగి ఉండవచ్చని, హిందూ జాతీయవాద దృక్పథాన్ని అప్రతిష్టపాలు చేయడానికి బూటకపు లౌకికవాద రాజకీయ శక్తులు మందిరంలో దొంగతనాన్ని ఎలా ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో, పోరాట క్షేత్రమైన యూపీలో వారి ప్రయత్నాలకు ఆదరణ లభించే అవకాశాలు ఎంత తక్కువగా ఉన్నాయో గమనిద్దాం.
దొంగతనం ఘటన హిందుత్వంపై, యూపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా?
జాతీయ పునరుజ్జీవనానికి కేంద్రబిందువైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, స్వాతంత్య్రానికి పూర్వం నాటి హిందూ జాతీయవాద రాజకీయ తత్వాన్ని గుర్తుచేసి, పునఃస్థాపించిన ఆలయ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దొంగతనాన్ని ఉపయోగించుకోవాలనే విమర్శకుల లక్ష్యం ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తోంది.
శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నగదు లెక్కింపు ప్రక్రియను స్థానిక ఎస్‌బీఐ శాఖకు అప్పగించగా, ఆ శాఖ ‘సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస’ అనే పొరుగు సంస్థను నియమించుకుంది. ట్రస్ట్ సిఫార్సు చేసిన కొందరితో సహా, ఎస్‌బీఐ 19 మంది సిబ్బందిని నియమించింది. అరెస్ట్ అయిన ఎనిమిది మందిలో, ఆరుగురు ఈ లెక్కింపు బృందానికి చెందినవారు కాగా, ఇద్దరు ట్రస్ట్ ఉద్యోగులు. వీరిలో ఒకరు, ‘నమ్మకం నమ్మకాన్ని పెంచుతుంది’ అనే ఆరఎసఎస్ మూల సూత్రంపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తనపై ఉంచిన అపారమైన నమ్మకానికి ద్రోహం చేశారు. వ్యవస్థాగత కఠినత్వంపై కాకుండా, వ్యక్తిగత నమ్మకంపై అతిగా ఆధారపడటం వల్లే ఈ దొంగతనం జరిగింది. లెక్కింపు నియమా వళిలో మితిమీరిన సడలింపులు ఉండటంతో, కుమ్మక్కుకు ఆస్కారం ఏర్పడింది. ఇది పరిపాలనా నిర్లక్ష్యానికి దారితీసి, దొంగతనానికి మార్గం సుగమం చేసింది. చంపత్ రాయ్ స్వయంగా చెప్పినట్లుగా, తాను గాఢంగా విశ్వసించిన వారే తనను మోసం చేశారు.
బుల్డోజర్ చర్య
దొంగిలించిన నగదులో ఇప్పటివరకు రూ.80 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులకు చెందిన మిగిలిన ఆస్తుల ఆచూకీని కనుగొనడంతో పాటు, ఏవైనా ఇతర విలువైన వస్తువులు కూడా అపహరణకు గురయ్యాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. కేవలం రూ. 20,000 జీతం కలిగిన ఒక దొంగ నిర్మించిన రూ. 80 లక్షల విలువైన ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయడం ద్వారా, తప్పు చేసిన వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న కఠిన వైఖరి స్పష్టమవుతోంది.
చోరీ చేసింది తక్కువే?
రామమందిరానికి ఇప్పటివరకు రూ. 3,000 కోట్లకు పైగా విరాళాలు అందాయని, అందులో 90 శాతానికి పైగా బ్యాంక్ బదిలీల ద్వారా సురక్షితంగా చేరాయని సమాచారం. ఏప్రిల్, 2025 ` ఫిబ్రవరి, 2026 మధ్య కాలంలో హుండీ ద్వారా రూ. 74 కోట్ల నగదు సేకరణ జరిగింది. ఈ నగదు నిధి నుండే దొంగతనం జరిగింది. అంతర్గత ఆడిట్‌లు, ప్రాథమిక సిట్ నివేదికల ఆధారంగా, మొదట్లో దుర్వినియోగమైన మొత్తం రూ. 7 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ట్రస్ట్ వర్గాల నుండి తెలిసిన తాజా అంచనా ప్రకారం, ఈ మొత్తం చాలా తక్కువ. ఇందులో ఎక్కువ భాగం నగదు రూపంలోనూ, మరికొంత ఆస్తుల రూపం లోనూ తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్క గ్రాము ఆభరణం కూడా పోలేదని ట్రస్ట్ వర్గాలు ధృవీకరించాయి. చోరీ చేసిన నగదుకు సంబంధించిన తాజా అంచనా, ఆభరణాలేవీ పోకపోవడం అనే అంశాలు సిట్ ద్వారా తుది నిర్ధారణకు వస్తే, రూ.200 కోట్ల భారీ స్కామ్ జరిగిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న బాధ్యతా రహితమైన ఆరోపణలకు అది గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్న వారి డిమాండ్, ప్రభుత్వ ట్రస్ట్ వ్యవహారాల్లో చర్యలు లేనప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని విచారణను ప్రారంభించాల్సి వచ్చే పరిస్థితికి,మందిరం ట్రస్ట్ అత్యంత వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడానికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని విస్మరిస్తోంది. ఇక, వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మందిరం వ్యవహారం రాజకీయ రణరంగంగా మారిన తరుణంలో ఈ దొంగతనం వల్ల తలెత్తిన రాజకీయ ,సైద్ధాంతిక ఘర్షణల విషయానికి వద్దాం.
హిందూ జాతీయవాదం
దొంగిలించిన ఒక్క రూపాయి కూడా శ్రీరామునికి జరిగిన ఘోరమైన ద్రోహమే. రాముడు కేవలం ఒక విగ్రహం కాదు. ఆయన ఈ ప్రాచీన జాతికి ఆత్మ స్వరూపం. మన నాగరికతా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిన బూటకపు లౌకికవాద రాజకీయ వ్యవస్థను నిశ్చయంగా సరిదిద్దిన అయోధ్య ఉద్యమానికి ఆయనే ప్రతీక. రామమందిరం ఉద్యమం మన జాతీయ జీవన విధానాన్ని ఎలా పునర్వ్యవస్థీకరించిందో గుర్తుచేసుకుంటే, మీడియా తరచుగా మరచిపోయే చరిత్రలోని ఒక చిన్న భాగం ఇక్కడ ఉంది. స్వాతంత్య్రం తరువాత, స్వాతంత్య్ర ఉద్యమం స్ఫూర్తిదాయక ఆదర్శాలు, చిహ్నాలుగా స్వామి వివేకానంద, మహర్షి అరబిందో యోగి, గాంధీజీ ప్రతిపాదించిన హిందూ జాతీయవాద భావన, రామరాజ్య దార్శనికత, ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ వంటి స్వాతంత్య్ర పోరాట నినాదాలు విస్మరణకు గురయ్యాయి. రామమందిరం ఉద్యమం వాటి పునరుజ్జీవనానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. జాతీయ చర్చను నడిపిస్తున్న వారిలో చాలా మందికి ‘హిందూ రాష్ట్రం’ (హిందూ జాతీయవాదం) అనే భావన ఆరఎసఎస్ సృష్టించినది కాదనే విషయం తెలియదు. అవును, అది ఆరఎసఎస్ భావజాలం కాదు. ఆరఎసఎస్ ఏర్పడటానికి దశాబ్దాల ముందే, ఈ జాతీయవాదాన్ని వివేకానంద, అరబిందులు ప్రబోధించారు. అది స్వాతంత్య్ర పోరాటానికి చోదక శక్తిగా మారింది. నమ్మండి.. నమ్మకపోండి! గాంధీజీ, నెహ్రూ, చివరికి కమ్యూనిస్ట్ దిగ్గజం రజనీ పాల్మే దత్ వంటి నాయకులు కూడా దీనిని పూర్తిగా అంగీకరించారు. తన విశిష్ట గ్రంథమైన హింద్ స్వరాజ్ (1909)లో హిందూ తీర్థయాత్రలు, చార్‌ధామ్ యాత్రలు, గంగాజల పూజలు మన జాతీయ సమైక్యతకు, జాతీయవాదానికి ప్రతీకలుగా నిలుస్తాయి అని గాంధీజీ రాశారు. “ఇద్దరు ఆంగ్లేయులు ఏకం కాలేరు. కానీ ఇవి మనల్ని ఏకం చేస్తాయి” అని ఆయన రాశారు. ముస్లింల గురించి అడిగినప్పుడు, వారు జాతీయ జన జీవన ప్రధాన స్రవంతిలో చేరాలని ఆయన అన్నారు. ఈ విషయం మీడియాలో ఎంతమందికి తెలుసు?
స్వామి వివేకానందను భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ మార్గదర్శకుడిగా నెహ్రూ కొనియాడారు. ఆయన తన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ (1935) గ్రంథంలో “స్వామి ప్రబోధించిన హిందూ జాతీయవాదం హిందూ ధర్మం, సంస్కృతిలో లోతుగా వేళ్లూనుకుంది. అయినప్పటికీ అది ఏ విధంగానూ ముస్లింలకు వ్యతిరేకం కాదు” అని రాశారు (పే. 437).
“హిందూ జాతీయవాదానికి, నిజమైన జాతీయ వాదానికి మధ్య గీత గీయడం అంత సులభం కాదు. ఆ రెండూ కలిసిపోతాయి. ఎందుకంటే హిందువులకు భారతదేశమే ఏకైక నివాసం, అక్కడ వారే అధిక సంఖ్యాకులు” అని కూడా రాశారు(పే. 720). నేటి ప్రజా చర్చల్లో పాల్గొనేవారిలో ఎంతమంది నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ని చదివారు?
గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన భారతీయుడైన రజనీ పాల్మే దత్, తన ‘ఇండియా టుడే’ అనే పుస్తకంలో ఒకవేళ భారతీయులు ఆశ్రమ జీవనంలో వేదాలను మాత్రమే అభ్యసిస్తూ పెరిగినా, స్వాతంత్య్ర పోరాటానికి అవసరమైన స్ఫూర్తిని వారు నిస్సందేహంగా వాటి నుండే పొంది ఉండేవారు అని రాశారు. మీడియాలో ఎంతమందికి ఆయన పేరు తెలుసు? ఆయన 1939లో ఆ పుస్తకాన్ని రాసి, 1973లో దాన్ని సవరించినప్పటికీ 1939లో తాను చెప్పినదాన్ని మార్చలేదని ఎంతమందికి తెలుసు?
హిందూ జాతీయవాదంలో దృఢంగా వేళ్లూనుకున్న ఈ స్వాతంత్య్ర ఉద్యమం, మార్చి 22, 1940న తన గమనాన్ని అనూహ్యంగా మార్చుకుంది. ఎం.ఎ.జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించిన రోజు అది. ఆ రోజు నుండి, స్వాతంత్య్ర కథనం నుండి హిందూ జాతీయవాద దృక్పథాన్ని క్రమపద్ధతిలో తుడిచిపెట్టారు. వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాలు ప్రజా జీవితం నుండి కనుమరుగవడం ప్రారంభించాయి. స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ఒకప్పుడు నెహ్రూ స్వయంగా కీర్తించిన ఆదర్శాలను, చిహ్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మన స్వాతంత్య్రానికి పునాదులైన హిందూ జాతీయవాదం, వందేమాతరం, భారత్ మాతా కీ జై, రామరాజ్యం వంటివి బూటకపు లౌకిక రాజకీయ వ్యవస్థ వల్ల అనాథలుగా మిగిలిపోయాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సాగిన బూటకపు లౌకికవాద సునామీ ఉధృతి మధ్య, ఈ ఉదాత్తమైన భావజాలాలు, చిహ్నాల జ్యోతిని సజీవంగా ఉంచింది ఆరఎసఎస్సే.
ఆరఎసఎస్ నేతృత్వంలోని రామమందిరం ఉద్యమమే స్వాతంత్య్రానికి పూర్వపు హిందూ జాతీయవాద విలువలను పునరుద్ధరించి, పట్టాలు తప్పిన జాతీయ రాజకీయ వ్యవస్థను తిరిగి సరైన మార్గంలోకి తీసుకువచ్చింది. భారతదేశ లౌకిక రాజ్యాంగంతో హిందుత్వానికి పొంతన లేదని కొందరు ‘మిథ్యా లౌకికవాదులు’ (pseudo-secularists) సవాలు చేసినప్పుడు, సుప్రీంకోర్టు 1996లో ఒక చారిత్రాత్మక తీర్పును వెలువ రించింది. హిందుత్వ అనేది భారతీయ ప్రజల జాతీయ ఆత్మ, సంస్కృతి, జీవన విధానం అని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాత ఆ తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను కోర్టు పలుమార్లు తిరస్కరించడం ద్వారా, మన దేశం జాతీయవాదానికి ఉన్న హిందూ మూలాలను ధృవీకరించింది.
జాతీయవాదాన్ని దెబ్బతీయడానికి ఆయుధంగా దొంగతనం
రామమందిరం ఉద్యమం ఓటు ఆధారిత బూటకపు లౌకిక రాజకీయాలను విజయవంతంగా కూలదోసి, తద్వారా హిందూ జాతీయవాద దృక్పథానికి రాజ్యాంగంలో దాని సముచిత స్థానాన్ని పునఃస్థాపించింది. ఇప్పుడు, ఈ మందిరంలో జరిగిన దొంగతనాన్ని ఆయుధంగా వాడుకుంటూ, రామ మందిరం ఉద్యమం ద్వారా దేశం సాధిస్తున్న దిద్దుబాటు చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులు, దానిని పట్టాలు తప్పించి, దేశాన్ని తిరిగి బూటకపు లౌకికవాద అగాధంలోకి లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రామమందిరం ఉద్యమం ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు, జాతీయ, అంతర్జాతీయ మీడియాలోని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలే బీజేపీకి ప్రస్తుత రాజకీయ, ఎన్నికల సవాలుగా ఉన్నాయి.
జాతీయ పునరుజ్జీవనానికి కేంద్రబిందువైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, స్వాతంత్య్రానికి పూర్వం నాటి హిందూ జాతీయవాద రాజకీయ తత్వాన్ని గుర్తుచేసి, పునఃస్థాపించిన ఆలయ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దొంగతనాన్ని ఉపయోగించుకోవడం అనే విమర్శకుల లక్ష్యం సుస్పష్టంగా ఉంది. యూపీ ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నందున, ఈ దొంగతనాన్ని ఉపయోగించుకుని ప్రభావం చూపించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నం, పోలింగ్ ముగిసే వరకు ఈ అంశాన్ని సజీవంగా ఉంచగల వారి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్రాబల్యం ఉన్న ఈ వ్యవస్థలో, అన్ని అంశాల ప్రాముఖ్యత రానురాను తగ్గిపోతోంది. ఒకవేళ ఈ దొంగతనం ఒక చిన్న విషయమని, ఎలాంటి ఆభరణాలు పోలేదని సిట్ నిర్ధారిస్తే, ప్రతిపక్షాలు పరువు కోల్పోతాయి. ఎన్నికలకు చాలా ముందే ఈ అంశం చరిత్రలో కలిసిపోతుంది.
జూన్ 4 నుండి 26 వరకు: మెరుపు వేగంతో చర్యలు
కోర్టులు జోక్యం చేసుకునే వరకు ప్రభుత్వ ట్రస్టులు తప్పులను కప్పిపుచ్చడానికి, మరోవైపు రామ మందిరం ట్రస్ట్ స్వచ్ఛందంగా, మెరుపు వేగంతో తప్పుపై చర్య తీసుకోవడానికి మధ్య ఉన్న ఈ స్పష్టమైన వ్యత్యాసాన్ని మీడియా గమనించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవాల కాలక్రమాన్ని చూడండి:
జూన్ 4: మొదటి ఆధారం బయటపడింది. మందిర ప్రాంగణంలోని ఒక స్నానాల గదిలో, ఎవరికీ చెందని ఒక సంచిలో రూ. 2 లక్షల నగదు లభ్యమైంది. ట్రస్ట్ అధికారులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని సమీక్షించడం ప్రారంభించారు.
జూన్ 5: ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, కీలక అనుమానితుడు అవినాష్ శుక్లాను లక్ష్యంగా చేసుకుని అంతర్గత విచారణకు ఆదేశించారు. పోలీసులు రాకముందే అతని ఇంటిపై దాడి చేసి, రూ. 58 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రాయ్ తన సొంత సన్నిహిత వర్గంలోని వ్యక్తిపైనే మొదటి వేటు వేశారు. ఈ కఠినమైన చర్య ఇతర సహచరులను భయపెట్టి, దొంగిలించిన డబ్బును తిరిగి బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా జమ చేసేలా చేసింది. దీంతో ఈ సమస్యను అంతర్గతంగానే పరిష్కరించుకోవచ్చని ట్రస్ట్ కొంతకాలం పాటు భావించింది.
జూన్ 7: రికవరీ వార్త బయటకు పొక్కడంతో, బంగారం, వెండి చోరీ అయ్యాయనే వదంతులు వ్యాపించాయి. డబ్బును అంతర్గతంగానే పూర్తిగా రికవరీ చేయవచ్చనే ప్రాథమిక అంచనాలపై ఆధారపడి, ఆడిట్‌లలో ఎటువంటి ముఖ్యమైన వ్యత్యాసాలు కనబడలేదని రాయ్ పేర్కొన్నారు.
జూన్ 13: ఆ అంచనా తప్పని గ్రహించిన ట్రస్ట్, ఉన్నత స్థాయి సిట్ విచారణను ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని లాంఛనంగా కోరింది. ఈ ఆరు రోజుల స్తబ్దత మొత్తం చర్యలో జరిగిన ఏకైక జాప్యంగా మిగిలింది.
జూన్ 25: క్యాష్ కౌంటర్ ఉద్యోగి మనీష్ యాదవ్, సీసీటీవీ బ్లైండ్ స్పాట్‌లను ఆసరాగా చేసుకుని పదేపదే డబ్బు దొంగిలించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఎఫఐఆర్ నమోదైంది. జూన్ 26 తెల్లవారుజాము వరకు అర్ధరాత్రి మెరుపు వేగంతో దాడులు నిర్వహించగా, ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
జూన్ 26: పరిపాలనా లోపాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేశారు.

ఎస్. గురుమూర్తి
సంపాదకులు, తుగ్లక్ తమిళ పత్రిక
(‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస’ సౌజన్యంతో)