రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అట్టహాసంగా అంతర్జాతీయ స్థాయి సమ్మేళనం నిర్వహించింది. హైదరాబాద్‌ ‌శివారు ఆవల ఫ్యూచర్‌ ‌సిటీ పేరుతో  కొత్తగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంలో డిసెంబర్‌ 8,9 ‌తేదీల్లో  జరిగిన ఈ ఉత్సవాలకు తెలంగాణ రైజింగ్‌  ‌గ్లోబల్‌-2047 అని పేరు పెట్టినప్పటికీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు నిర్వహించిందన్నది నిర్వివాదాంశం. రెండవ రోజున‘తెలంగాణ రైజింగ్‌ ‌విజన్‌ ‌డాక్యుమెంట్‌’ ‌డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను ఆర్థికంగా అత్యంత బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న వ్యూహాలతో ఈ డాక్యుమెంట్‌ను తయారు చేశారు.

రాష్ట్ర భవిష్యత్తు, సమగ్ర అభివృద్ధికి దిక్సూచిగా ఈ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం అభివర్ణిస్తోంది. 83 పేజీల ఈ డాక్యుమెంట్‌ను.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ ‌భాషల్లో విడుదల చేశారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ ‌డాలర్లకు పెంచడం ఈ విజన్‌ ‌డాక్యుమెంట్‌ ‌ప్రధాన లక్ష్యం. యువత, మహిళలు, రైతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ డాక్యుమెంట్‌ను రూపొందించామని, ఇది తాత్కాలిక పాలనా విధానాలకే పరిమితం కాకుండా.. స్థిరమైన విధానం వైపు తెలంగాణ ప్రయాణాన్ని సూచిస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు.

తెలంగాణ అంటే వ్యాపారం?

అసలు ఈ డాక్యుమెంట్‌తో పాటు.. గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌సందర్భంగా అన్ని ప్రధాన పత్రికల్లో తొలి పూర్తి పేజీల్లో ఇచ్చిన ప్రకటనలోనూ ‘•వశ్రీ•అస్త్ర•అ• వీవ•అ దీబఱఅవ్ణ అని ప్రధానంగా పేర్కొన్నారు. పత్రికల ప్రకటనల్లో, ఈ క్యాప్షన్‌ ‌తప్ప వేరే ఏదీ కనిపించలేదు. ‘తెలంగాణ అంటేనే వ్యాపారం’ వ్యాపారమని దీని అర్థం అని, రాష్ట్రాన్నే పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని వ్యాఖ్యలు ఉన్నాయి. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. ‌దేశమంటే మనుషులోయ్‌…’ అన్న గురజాడ వారి మాటలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిరగరాస్తూ, ‘రియల్‌ ఎస్టేట్‌ ‌బూమ్‌ను పెంచుతోంది. తెలంగాణ అంటే.. అసలు మనుషులు, మేధస్సు, నైపుణ్యం కాదని, వ్యాపారమని అధికారికంగా ప్రకటించినట్లయింది.

 ఈ విజన్‌ ‌డాక్యుమెంట్‌లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం 10 కీలక వ్యూహాలను పొందుపరిచారు. భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, డ్రైపోర్టు, డ్రైపోర్టు నుంచి ఏపీలోని కృష్ణపట్నం పోర్టు వరకు 12 వరుసల ఎక్స్‌ప్రెస్‌ ‌వే, హైదరాబాద్‌ ‌నుంచి బెంగళూరు, చెన్నై(వయా అమరావతి) బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌కారిడార్‌, ఔటర్‌ ‌రింగు రోడ్డు నుంచి రీజినల్‌ ‌రింగు రోడ్డు మధ్య మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌జోన్‌లు, ఔటర్‌, ‌రీజినల్‌ ‌రింగు రోడ్డులను అనుసంధానిస్తూ రేడియల్‌ ‌రోడ్లు, రీజినల్‌ ‌రింగ్‌ ‌రైల్వే, వ్యవసాయ భూములకు గ్రీన్‌ ‌పవర్‌, ఇం‌టిగ్రేటెడ్‌ ‌టౌన్‌ ‌షిప్స్, ‌గ్రీన్‌ ఎనర్జీ హబ్స్, ‌భారీగా విద్యుత్తు వాహనాల వినియోగం వంటి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు విజన్‌ ‌డాక్యుమెంట్‌ ‌పేర్కొంది. ఈ వ్యూహాలలో ఇప్పటికే ప్రకటించిన క్యూర్‌, ‌ప్యూర్‌, ‌రేర్‌ అనే మూడు ఆర్థిక జోన్ల విభజన కూడా అంతర్భాగంగా ఉంది. వీటితో పాటు.. 2047 నాటికి రాష్ట్రంలో వచ్చే మార్పులపై ప్రభుత్వం చెబుతున్న మరికొన్ని అంశాలను విజన్‌ ‌డాక్యుమెంట్‌లో చేర్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను 4వేల 983 కిలోమీటర్ల నుంచి 7వేల 500 కిలోమీటర్లకు పెంచుతారు. అలాగే, రాష్ట్ర రహదారుల పరిధిని 1687 కిలోమీటర్ల నుంచి నుంచి 8 వేల 600 కిలోమీటర్లకు పెంచుతారు. మెట్రో రైల్‌ ‌లేదా ఎల్‌ఆర్టీఎస్‌ ‌లేదా బీఆర్టీఎస్‌ ‌నెట్‌వర్క్‌ను 632 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. రాష్ట్రంలో మిల్లెట్ల సాగును 3 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాలకు పెంచాలని విజన్‌ ‌డాక్యుమెంట్‌లో లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే, అవుటర్‌ ‌రింగు రోడ్డు-రీజినల్‌ ‌రింగు రోడ్డు మధ్య 13 భారత్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పది గ్రీన్‌ఫీల్డ్ ‌టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తారు. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ ‌మాదిరిగానే.. వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ అభివృద్ధికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా పర్యవేక్షణ చేపడతారు. డిజిటల్‌ ‌తెలంగాణ మిషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. అలాగే 2035 నాటికి పది యూనికార్న్ ‌సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ ‌సెక్యూరిటీ గ్రిడ్‌ ‌ను అమలు చేస్తారు. ఈ విజన్‌ ‌డాక్యుమెంట్‌లో ఇలాంటి పలు అంశాలను చేర్చారు.

రెండింతల జీడీపీ లక్ష్యం

రంగాలవారీగా సుస్థిరాభివృద్ధి సాధిస్తూ, లక్ష్యాలు చేరుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జీడీపీ 200 బిలియన్‌ ‌డాలర్లని విజన్‌ ‌డాక్యుమెంట్లో ప్రభుత్వం పేర్కొంది. దేశ జనాభాలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం, దేశ జీడీపీలో 5 శాతం వాటాను పంచు కుంటోంది. ఇప్పుడు దీనిని రెండింతలు చేయాలనేది లక్ష్యమని ప్రకటించింది. ఈ లక్ష్యాలు చేరుకునేందుకు కీలకమైన ప్రాజెక్టులు చేపట్టనున్నట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాదు.. విజన్‌ ‌డాక్యుమెంట్‌ ‌తయారీకి ముందు ప్రజల నుంచి ప్రభుత్వం సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇందులో అందరికీ అందుబాటులో ఆసుపత్రులు, తక్కువ ఖర్చులో వైద్య పరీక్షలు, తాగునీరు, పారి శుధ్యం, రోగాల నియంత్రణ, ఉద్యోగాల కల్పన, వినూత్న కోర్సులు తీసుకురావడం, చిరు వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం, తక్కువ దూరంలోనే పాఠశాలలు, ఆసుపత్రులు ఉండాలని సలహాలు వచ్చినట్లుగా విజన్‌ ‌డాక్యుమెంట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరుతుందా?

ఈ డాక్యుమెంట్‌ను కేవలం ఒక గదిలో కూర్చుని రూపొందించలేదని.. విస్తృత సంప్రదింపులు, అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దీని రూపకల్పన జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.దీని రూపకల్పన కోసం ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌, ‌నీతి ఆయోగ్‌, ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 4 లక్షల మంది ఆన్‌లైన్‌లో సూచనలు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు.

 ప్రధానంగా 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చడం, 2047 నాటికి దీనిని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దీనిని సిద్ధం చేసినట్లుగా చెబుతోంది. మరి.. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరు తుందా? 2047 నాటికి 3 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందా? అనే అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే, ‘కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌), ‌పెరీ అర్బన్‌ ‌రీజియన్‌ ఎకానమీ (ప్యూర్‌), ‌రూరల్‌ అం‌డ్‌ అ‌గ్రి రీజియన్‌ ఎకానమీ (రేర్‌).. ‌కార్యక్రమాల ద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని సాధిస్తా మని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ డాక్యుమెంట్‌ ‌విడుదల సందర్భంగా చెప్పారు. విజన్‌ అయితే స్పష్టంగా చెప్పారు గానీ, దానికి అవసరమైన నిధుల సమీకరణ ఎలా? అనే దానిపై స్పష్టత లేదన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని, ఆర్థికంగా రాష్ట్రం చాలా కష్టాల్లో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ విజన్‌ ‌డాక్యుమెంట్‌ను రూపొందించడం, బృహత్‌ ‌లక్ష్యాన్ని పెట్టుకోవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ స్థాయిలో ఎకానమీ అనేది ఆచరణలో సాధ్యమయ్యేలా నిధులను ఎలా సమీకరిస్తారని, పెట్టుబడులను రాబట్టడంతో పాటు అమలు కోసం ఎలాంటి ప్రణాళిక అనుసరిస్తారన్న విషయంపై విజన్‌ ‌డాక్యుమెంట్‌లో స్పష్టత లేదని ఆర్థిక నిపుణులు పేర్కొం టున్నారు.

రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు

రెండు రోజుల గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌వేదికగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో మొదటి రోజు రూ.3,97,500 కోట్లు, రెండో రోజు రూ.1,77,500 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని వివరించింది. ఈ భారీ పెట్టుబడులు ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటకం, విద్యుత్‌, ‌క్రీడలు, అటవీ వంటి కీలక రంగాల్లో వచ్చాయని, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా సమకూరుతాయని అంటోంది. అయితే, కంపెనీల సామర్థ్యం, వాటి పనితీరు, పెట్టుబడులకు అవకాశాలపై కూడా ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉంది. కంపెనీలతో ఓ వేదికగా ఒప్పందాలు చేసుకోవడమే కాదు.. వాటిని ఆయాసంస్థలు ఆచరణలో పెట్టేలా చూడాల్సిన అవసరం కూడా ఉంది. సరైన వ్యూహం, ప్రణాళిక లేకుండా విజన్‌ ‌డాక్యుమెంట్‌ అమలు చేయాలను కుంటే, అది విజువలైజేషన్‌కే పరిమితం అవుతుందని, రియల్‌ ఎస్టేట్‌ ‌మార్కెట్‌ ‌పెంచే ఎత్తుగడగా మారి పోతుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పేదరికం తగ్గించడం, వివక్ష నిర్మూలించడంతోపాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం రోడ్‌ ‌మ్యాప్‌లా ఈ విజన్‌ ‌డాక్యుమెంట్‌ ‌పనిచేస్తుందని చెబుతోంది.

స్వయంగా ఆహ్వానించినా…!

మొత్తానికి ఈ గ్లోబల్‌ ‌సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. వారికి వసతి కోసం హైదరాబాద్‌ ‌లోని ఖరీదైన హోటళ్లలో గదులు బుక్‌ ‌చేసింది. అయితే, ముందుగా ప్రభుత్వం అంచనా వేసిన పారిశ్రామిక వేత్తలు పూర్తిస్థాయిలో రాలేదని అంటున్నారు. పైగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా, దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయవేత్తలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులు ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. కానీ, వాళ్లెవరూ రాలేదు.

అలాగే, అంతర్జాతీయ కార్పొరేట్‌ ‌కంపెనీల సీఈవోలు, గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, వరల్డ్ ‌లెవల్‌ ఇం‌డస్ట్రీ లీడర్లు రాలేదంటున్నారు. గ్లోబల్‌ ‌ఫైనాన్షియల్‌ ‌సంస్థలు, ఫండ్‌ ‌మేనేజర్లు, వెల్త్ ‌ఫండ్స్ ‌వంటివి కూడా గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో పాల్గొనలేదని అంటున్నారు. ఇక, ఈ సమ్మిట్‌ ‌ఖర్చు అంచనాలను మించి, రెట్టింపు అయినట్టు చెబుతున్నారు. సమ్మిట్‌కు తొలుత రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందిస్తే… ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి రెట్టింపు అయ్యిందని తెలుస్తోంది. వీటిలో ప్రచార ఆర్భాటాలకే సింహ భాగం ఖర్చయినట్లు చెబుతున్నారు.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE