ఆం‌ధప్రదేశ్‌లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్‌ ‌శాఖ ‘అటల్‌ – ‌మోదీ సుపరిపాలన యాత్ర’  పేరుతో రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో వాజ్‌పేయి విగ్రహాలు నెలకొల్పతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమాలకు హాజరై వాజ్‌పేయి సుపరిపాలనను, దానిని మోదీ కొనసాగించడంపై ప్రసంగిస్తున్నారు.

డిసెంబరు 11న ప్రారంభమైన బస్సు యాత్రలో ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి మోహన్‌ ‌యాదవ్‌, ఉత్తరాఖండ్‌ ‌ముఖ్యమంత్రి పుష్కరసింగ్‌ ‌థామి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్‌ ‌మాధవ్‌ ‌రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ ‌యాదవ్‌, ‌పయ్యావుల కేశవ్‌, ‌సబిత, ఎండీ• ఫరూక్‌, ‌బీసీ జనార్దనరెడ్డి, ఎమ్మెస్‌ ‌రాజు, పల్లె సిందూరరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరిత్రారెడ్డి, కేఈ శ్యాంబాబు, జయ నాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, మాధవి రెడ్డి, వరదరాజుల రెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, డాక్టర్‌ ‌పార్థ్ధసారధి, చింతా సురేష్‌, ‌బీటెక్‌ ‌రవి, నాయకులు పరిటాల శ్రీరామ్‌, ‌చిలకం మధుసూదనరెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పసుపులేటి హరిప్రసాద్‌, ‌నరసింహయాదవ్‌, ‌రుద్రకోటి సదాశివం, తదితరులు పాల్గొన్నారు.

అటల్‌ ‌విధానాలకు ప్రశంసలు

‘అటల్‌-‌మోదీ సుపరిపాలన యాత్ర’లో పాల్గొన్న మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి మోహన్‌ ‌యాదవ్‌, ఉత్తరాఖండ్‌ ‌ముఖ్యమంత్రి పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి తమ ప్రసంగాల ద్వారా వాజ్‌పేయి పాలనా దక్షతను, మోడీ దానిని కొనసాగిస్తున్న తీరును అద్భుతంగా ఆవిష్కరించారు. ధర్మవరం, తిరుపతి, మదనపల్లె ప్రాంతాల్లో జరిగిన ఈ సభల్లో వారు వాజ్‌పేయి వ్యక్తిత్వం, అభివృద్ధి కార్యక్రమాలు, వాటిని కొనసా గిస్తున్న ప్రధాని మోడీ పాలనను ప్రస్తుతించారు.

వాజ్‌పేయ్‌ ‌హిమాలయాలంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా మధ్యప్రదేశ్‌ ‌సీఎం మోహన్‌ ‌యాదవ్‌ అభివర్ణించారు. ‘దేశ రాజకీయ చరిత్రలో 1990లలో రాజకీయ అస్థిరత ఉండేది. దానిని సుస్థిరతగా మార్చిన ఘనత వాజ్‌పేయిదే. ఒకే సిద్ధాంతం కలిగిన పార్టీని నడపడమే కష్టమైన కాలంలో భిన్నధ్రువాల వంటి 27 వేర్వేరు ప్రాంతీయ, జాతీయ పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి, ‘నేషనల్‌ ‌డెమోక్రటిక్‌ అలయన్స్’ (ఎన్‌డియే) గొడుగు కింద ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వాన్ని నడిపించడం వాజ్‌పేయికే చెల్లింది. అప్పటి వరకు దేశాన్ని ఏక చక్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్‌కు ప్రత్యా మ్నాయంగా, ‘కాంగ్రెస్‌ ‌రహిత భారత్‌’ అనే నినాదానికి వాజ్‌పేయి, ఎల్‌.‌కే. ఆద్వాణీలు ఊపిరి పోశారు. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూనే, జాతీయ సమగ్రతను కాపాడటం ఆయన ‘సంకీర్ణ ధర్మానికి’ నిదర్శనం. చంద్రబాబు నాయుడు వంటి నాయకులతో ఆయనకున్న మైత్రి, రాజకీయాలకు అతీతమైన స్నేహ శీలతను సూచిస్తుంది. ఇక వాజ్‌పేయి పాలన కేవలం రాజకీయ నిర్వహణకే పరిమితం కాలేదు. భద్రతకు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చారు. 1998లో పోఖ్రాన్‌ అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్‌ అ‌గ్రరాజ్యాలకు తలవంచదని నిరూపించారు.

అమెరికా వంటి దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినా, ప్రజల మద్దతుతో దేశ ఆర్థిక వ్యవస్థను పతనం కాకుండా కాపాడారు. ‘‘జై జవాన్‌, ‌జై కిసాన్‌’’ ‌నినాదానికి ‘‘జై విజ్ఞాన్‌’’‌ను జోడించి, శాస్త్ర సాంకేతిక రంగాలకు పెద్దపీట వేశారు. ‘‘దేశాభివృద్ధికి రహదారులు రక్తనాళాలు’’ అని నమ్మిన వాజ్‌పేయి, ‘స్వర్ణ చతుర్భుజి’ ద్వారా నాలుగు మెట్రో నగరాలను అనుసంధానించారు’ అని మోహన్‌ ‌యాదవ్‌ ‌వివరించారు. కేవలం జాతీయ రహదారులే కాకుండా, ‘ప్రధాన్‌ ‌మంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన’ ద్వారా మారుమూల పల్లెలను నగరాలతో అనుసంధానించారని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చేసిందని అన్నారు.

వాజ్‌పేయి వేసిన ‘సుపరిపాలన’ అనే బాటలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణం, దేశాన్ని ప్రపంచ శక్తిగా ఎలా మారుస్తున్నారని ఉత్తరాఖండ్‌ ‌ముఖ్యమంత్రి పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి అన్నారు. వాజ్‌పేయి హయాంలో ప్రారంభమైన ఐటీ విప్లవాన్ని మోదీ ‘డిజిటల్‌ ఇం‌డియా’గా మార్చారని, స్టార్టప్‌ ఇం‌డియా, మేక్‌ ఇన్‌ ఇం‌డియా వంటి పథకాల ద్వారా నేడు భారత్‌ ‌ప్రపంచంలోనే ‘మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌’‌గా ఎదిగిందని అన్నారు.‘యువత ఉద్యోగార్ధులుగా కాకుండా, ఉద్యోగ ప్రదాతలుగా మారేలా స్కిల్‌ ఇం‌డియా ప్రోత్సహిస్తోంది. మోదీ పాలనలో అభివృద్ధికి సమాంతరంగా ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణ జరుగుతోంది. అయోధ్య రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌, ఉజ్జయిని మహాకాళ్‌ ‌లోక్‌, ‌కేదార్‌నాథ్‌ ‌పునర్నిర్మాణం వంటివి దేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. ఇది పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేస్తోంది. వాజ్‌పేయి కోరుకున్న నిజమైన లౌకికవాదం, సమానత్వాన్ని అమలు చేయడంలో ఉత్తరాఖండ్‌ ‌ముందంజలో ఉంది. దేశంలోనే తొలిసారిగా అక్కడ ‘ఉమ్మడి పౌరస్మృతి’ని అమలు చేయడం ద్వారా, చట్టం ముందు అందరూ సమానమే అనే భావనను మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాలు ఆచరణలో చూపిస్తున్నాయి. వాజ్‌పేయి దేశానికి అంతర్గత, బహిర్గత భద్రతను, మౌలిక సదుపాయాల పునాదిని ఇస్తే, మోదీ ఆ పునాదిపై ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అనే భవనాన్ని నిర్మిస్తున్నారు’ అని ఆయన చెప్పారు.

ఏపీకి కేంద్రం చేయూత

ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని, కూటమి పాలనను మోహన్‌ ‌యాదవ్‌, ‌పుష్కరసింగ్‌ ‌థామి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో వాజ్‌పేయి, చంద్రబాబు మధ్యగల స్నేహబంధం, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా కొనసాగుతోందని, ఇది రాష్ట్రానికి శుభపరిణామమని పేర్కొన్నారు. ఆంధప్రదేశ్‌ అభివృద్ధిలో చంద్రబాబు అనుభవం, కేంద్రంలోని మోదీ సహకారం కలిసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాయని, సంపన్న భారత్‌ అనే వాజ్‌పేయి కలలు సాకారమవుతాయినా ఆ ఇద్దరు ముఖ్య మంత్రుల ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో ఐటీ, ఏఐ రంగాలు, పోలవరం ప్రాజెక్టు, కొత్త పోర్టులు, సెమీకండక్టర్‌ ‌పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. తిరుపతిలో ఐఐటీ, ఐజర్‌ ‌వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటులో కేంద్రం పాత్రను గుర్తుచేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ ‌మాధవ్‌, ‌కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ ‌యాదవ్‌, ‌రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, ‌సబిత, ఎండి ఫరూక్‌, ‌బిసీ జనార్దనరెడ్డి, ఎమ్మెస్‌ ‌రాజు, పల్లె సింధూరరెడ్డి తదితరులు వాజ్‌పేయి సేవలను ప్రశంసిస్తూ, ఆయన వ్యక్తిత్వం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఒక సాధారణ ఉపాధ్యాయుడి కుమారుడిగా జన్మించి, స్వశక్తితో దేశ ప్రధాని స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదని, స్వాతంత్య్ర సమరయోధుడిగా, కాశ్మీర్‌ ‌సమస్యపై పోరాడి జైలుకు వెళ్లిన ఉద్యమ కారుడిగా దేశం కోసం అంకితమయ్యారని అన్నారు. నీతి నిజాయతీలు మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపారని, అందుకే ఆయన ‘అజాత శత్రువు’గా నిలిచారని విశ్లేషించారు.

‘భారత రాజకీయ చరిత్రలో సంకీర్ణ ప్రభుత్వా లంటే అస్థిరతకు మారుపేరుగా ఉండేవి. కానీ, వాజ్‌పేయి దానిని పూర్తిగా మార్చేశారు. 1996లో 13 రోజులు, ఆ తర్వాత 13 నెలలు, అనంతరం ఏకంగా 27 భిన్న పార్టీలను కలుపుకుని ఐదేళ్లపాటు పూర్తిస్థాయి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇది ఆయన వ్యక్తిత్వ గొప్పతనానికి, అందరినీ కలుపుకుపోయే ‘సమైక్యతా స్ఫూర్తి కి నిదర్శనం’ అని వక్తలు ఉదహరించారు. ‘స్వర్ణ చతుర్భుజి’ ద్వారా దేశంలోని నలుమూలలనూ రహదారులతో అనుసంధానించడం, ‘గ్రామీణ సడక్‌ ‌యోజన’ ద్వారా మారుమూల పల్లెలకు రోడ్లు వేయించడం దేశ ముఖచిత్రాన్ని మార్చేశాయని వివరించారు. నేడు ప్రతి సామాన్యుడి చేతిలో సెల్‌ ‌ఫోన్‌ ఉం‌దంటే దానికి బీజం వేసింది వాజ్‌పేయే అని చెబుతూ పోఖ్రాన్‌ అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి భారత శక్తిని చాటిచెప్పారని కొనియా డారు. మహిళల కష్టాలను తీర్చడానికి గ్యాస్‌ ‌కనెక్షన్లు, అన్నదాతల ఆత్మహత్యలను నివారించడానికి ‘కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డులు’ వంటివి ఆయన మానవీయ పాలనకు సాక్ష్యాలుగా అభివర్ణించారు.

కూటమి ఐక్యత

‘సుపరిపాలన యాత్ర’ లో బీజేపీతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలను సమన్వయంతో నడిపిన వాజ్‌పేయి సంకీర్ణ ధర్మాన్ని ఈ నాయకులు ఆచరిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం కావాలని వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ శతవిధాలా చేస్తున్న ప్రయత్నాలు, మూడు పార్టీల నాయకులు ప్రదర్శిస్తున్న సంయమనం, రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిబద్ధత కారణంగా సఫలం కాలేదు. మూడు పార్టీల నేతలు ఎంతో పరిణతితో వ్యవహరిస్తూ ప్రభుత్వం సుస్థిరంగా నడవడానికి, అభివృద్ధి కొనసాగడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో ఈ ఐక్యత కీలక పాత్ర పోషిస్తోంది. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, పారిశ్రామిక కారిడార్లు, ఐటీ రంగానికి ఊతం, రహదారులు, రైల్వేలు, విమానయానం, మత్స్య సంపద, పశు సంపద, వ్యవసాయానికి మద్దతు వంటి అన్ని కీలక రంగాలకు కేంద్ర సహకారం పొందే క్రమంలో కూటమి నేతలు ఒకే తాటిపై నడుస్తున్నారు. ఈ సమైక్య కృషి ఫలితంగా ఆంధప్రదేశ్‌ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేయడం కనిపిస్తోంది. కూటమి నాయకత్వంలోని ఈ ఐక్యత, రాష్ట్ర ప్రగతికి గొప్ప శుభపరిణామం.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE