రాష్ట్రంలో వైద రంగం బలోపేతం కావాలంటే బోధనాసుపత్రుల నిర్మాణంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ•) అత్యవసరమని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. ఈ విధానం ద్వారా వైద్య సేవల్లో నాణ్యత పెరగడమే కాకుండా, నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యమవుతాయని ఆశిస్తోంది. యాజమాన్య హక్కులు, నియంత్రణ అధికారాలు పూర్తిగా ప్రభుత్వం వద్దే ఉంచుకుంటూ, కేవలం నిర్వహణ బాధ్యతలను మాత్రమే ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఈ వ్యూహం ప్రత్యేకత. నిర్ణీత కాలం తర్వాత ఈ కళాశాలలు తిరిగి ప్రభుత్వానికే చెందుతాయి కాబట్టి, ఇది ప్రజలకు దీర్ఘకాలికంగా మేలు చేకూరుస్తుంది.
బోధనాసుపత్రుల నిర్మాణంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ•) విధానం వల్ల కన్వీనర్ కోటా సీట్లను గణనీయంగా పెంచి, విద్యార్థుల ఆశలకు ఊపిరి పోస్తామని కూటమి సర్కార్ చెబుతోంది. దీని వల్ల ప్రతి కళాశాలలో కన్వీనర్ కోటా కింద 22 సీట్లు అదనంగా వస్తాయని, ఇది పేద విద్యార్థులకు గొప్ప అవకాశంగా భావించవచ్చని హామీ ఇస్తోంది. పార్లమెంటరీ స్థాయి సంఘం సైతం తన నివేదికలో వైద్య విద్యను పేదలకు చేరువ చేయాలన్నా, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలన్నా పీపీపీ విధానమే శ్రేయస్కరమని స్పష్టం చేసింది. అయితే, స్వలాభం, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోన్న వైసీపీ ఈ అంశంపై బురదజల్లుతూ బోధనాసుపత్రుల నిర్మాణాన్ని అడ్డుకోడానికి ప్రయత్నంచేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం వైద్య కళాశాలలకు కనీస నిధులు, భూములు కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. తమ పార్టీ ప్రచారం కోసం పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, పేదల ఇళ్లకు పార్టీ రంగులు వేయించడం, తరగతి పుస్తకాలు, భూములలో సర్వేరాళ్లకు జగన్ ఫొటోల ముద్రణ ఇలా వేల కోట్ల నిధులను వరదలా పారించి దుర్వినియోగం చేసింది. ప్రజారోగ్యం కంటే రాజకీయ విలాసాలకే పెద్దపీట వేస్తూ, రుషికొండలో సుమారు రూ.500 కోట్లతో అతిథిగృహాలను నిర్మించింది. ఆ నిధులతో కనీసం రెండు అత్యాధునిక బోధనాసుపత్రులను నిర్మించి వేలాది మంది పేదలకు వైద్యం అందించే అవకాశం ఉన్నా, అప్పటి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో, రాజకీయ విమర్శలను పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నూతన విధానాన్ని అమలు చేయడం రాష్ట్ర ఆరోగ్య రంగానికి ఆశాకిరణంగా మారుతుంది.
రాజకీయ ఉద్యమాలు
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో వైద్యబోధనాసుపత్రులను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్రంలో ఆందోళన చేస్తోంది. పీపీపీ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వివరణ ఇచ్చింది. టెండర్ల ఆపడానికి స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించినా వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనం నిమిత్తం ఆందోళనలు చేస్తూనే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోధనాసుపత్రులను ఎందుకు నిర్మించలేదని ఇప్పటి కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. కనీసం భూమి కేటాయించకుండా, నిధులు విడుదల చేయకుండా నిర్ల్యక్ష వైఖరి అవలంబించిన విషయాన్ని గుర్తుచేస్తోంది.
రాష్ట్రంలో 2025 నాటికి ప్రభుత్వరంగంలో 18, ప్రైవేటురంగంలో 18, ఎయిమ్స్ 1, గీతం 1 మొత్తం కలిసి 38 కాలేజీలున్నాయి.ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బోధనాసుపత్రి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కళాశాలకు రూ.100 కోట్లు ఆర్ధికసహాయం కూడా అందించనున్నట్లు ప్రకటించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో 17 బోధనాసుపత్రులను నిర్మించ నున్నట్లు ప్రకటించింది. ఒక్కో కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్ల చొప్పున మొత్తం 17 కళాశాలలకు రూ.8490 కోట్లు ఖర్చుచేయాలని అంచనా వేసింది. కాని ప్రభుత్వ నిర్ల్యక్షం కారణంగా ఇందులో ఒక్క కళాశాల నిర్మాణం కూడా పూర్తిచేయలేదని ఆరోపణలు వచ్చాయి. 2024 నాటికి ఖర్చు చేసింది కేవలం రూ.1,550 కోట్లు. ఐదేళ్లలో వ్యయం చేసింది 17శాతమే. కూటమి ప్రభుత్వం రాగానే బకాయిలు రూ.783 కోట్లు (తొమ్మిది శాతం) విడుదల చేశారు. రాజమండ్రి మెడికల్ కాలేజీకి రూ.487 కోట్లకుగాను నాడు కేవలం రూ.81 కోట్లు ఖర్చు చేశారు. వైసీసీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి పులివెందుల వైద్యకళాశాలకు రూ.500 కోట్ల గాను రూ.396 కోట్లు ఖర్చు పెట్టారు. పార్వతీపురానికి రూ.600 కోట్లు అవసరం కాగా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మిగతావన్నీ కొన్ని పదిశాతం, కొన్ని అయిదు శాతం పనులతో పునాదులకే పరిమితమయ్యాయి. ఈ కళాశాలల్లో బోధనా సిబ్బంది కూడా సగానికి తక్కువగానే ఉన్నారు. కళాశాలల నిర్మాణం పూర్తిచేయకపోవడంతో 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాలేదు.
ప్రభుత్వందే పూర్తి అజమాయిషీ
ప్రభుత్వం వద్ద నిధులు లేనందుకు కళాశాలల భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం భావించింది. అలాగే వీటి నిర్వహణకు ఒక్కో కళాశాలకు ఏడాదికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇదంతా ఆర్ధికభారంగా మారడంతో పీపీపీ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీ పురంలో ఈ కళాశాలను నిర్మించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసి, ఈ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో వైద్యం, మందులు, వైద్యపరీక్షలు ఉచితంగా అందచేస్తామని, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెబుతోంది. పేదవాళ్లకు చికిత్సతోపాటు సీట్ల విషయంలో న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబరు 23న శానససభ సమావేశంలో స్వయంగా వెల్లడించారు. ప్రైవేటుకు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. మొత్తం పడకల్లో 70 శాతం పేదలకే కేటాయించనున్నట్లు చెప్పారు. ‘ఆస్తి ప్రభుత్వానిది.. నిర్వహణ ప్రైవేటుది. బాగా నిర్వహించి, వచ్చిన లాభాలతో అప్పులు చెల్లించి, మిగిలినదానిలో కొంత లాభం వారు తీసుకుంటారు. 33 ఏళ్ల తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తారు’ అని చంద్రబాబు వివరించారు.
పెరిగిన కన్వీనర్ కోటా సీట్లు
పాత వైద్య కళాశాలలో 15 శాతం ఆల్ ఇండియా కోటా, 85 శాతం సీట్లు ప్రభుత్వానికి వస్తాయి. కొత్త వాటిలో ఆల్ ఇండియా కోటా 22 సీట్లు (15శాతం) వెళ్లగా, కన్వీనర్ కోటా 64 సీట్లు (42.5 శాతం), సెల్ఫ్ ఫైనాన్స్ (మేనేజ్మెంట్ కోటా) 45 సీట్లు (29.75 శాతం), ఎస్‌ఆర్‌ఎస్‌ఐ కోటా 19 సీట్లు (12.75) ఉండేలా గత ప్రభుత్వంలో కేటాయించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీలో అఖిల భారత కోటా ఉండదు. కన్వీనర్ కోటా 75 సీట్లు (50శాతం), సెల్ఫ్ ఫైనాన్స్ 53 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా 22 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు (కన్వీనర్ కోటా) అదనంగా ప్రతి కాలేజీలో ఇస్తున్నారు.
టెండర్లపై స్టే ఇవ్వలేమన్న హైకోర్డు
పీపీపీ విధానంలో బోధనాసుపత్రుల నిర్మాణ టెండర్ల ఆహ్వానాన్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగ స్వామ్యం విధానంలో నిర్మించి నిర్వహించేందుకు రాష్టప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అలా నిర్మిస్తే తప్పేమిటి? అనీ ప్రశ్నించింది. పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా? అని వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తుచేసింది. రాజ్యాంగ, చట్టవిరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తెలిపింది. ప్రస్తుతం ఈ అంశం విచారణలో ఉంది.
పీపీపీ స్థాయి సంఘం సిఫార్సు
దేశంలో వైద్య విద్య వ్యయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుచేసింది. వైద్యకళాశాలలు, ఆసుపత్రిని పీపీపీ విధానంలో నిర్వహించి, అందుకోసం ముందుకువచ్చే కంపెనీలు/సంస్థలకు పన్ను ప్రయోజనాలను కల్పించాలని సూచించింది.పీపీపీ విధానానికి ఎదురయ్యే నిబంధనలను రూపొందించి, ప్రైవేటు మెడికల్ కళాశాలలు, జిల్లా ఆసుపత్రులతో కలసి పనిచేసే విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలని పేర్కొంది.
దేశంలో వైద్యవిద్య నాణ్యత గురించి సమాజ్‌వాది పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని వైద్యం, కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయీ సంఘం ఈనెల 12 పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. ఈ స్థాయీ సంఘం గత ఏడాది ఫిబ్రవరి 9న సమర్పించిన నివేదికలో వైద్యవిద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి పీపీపీ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎలా ప్రోత్సహించాలో కేంద్రానికి సిఫార్సుచేసింది. వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను ఇప్పుడు పార్లమెంటుకు సమర్పించింది. పీపీపీ విధానాన్ని ప్రోత్సహించాలన్న సిఫార్సును తాజా నివేదిక పునరుద్ఘాటించింది.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్