రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. శీతల గాలుల తాకిడి ముంచెత్తుతోంది. ఇదే సమయంలో వేడిగాలులకు, మాటల మంటలకు అసెంబ్లీ సిద్ధమవుతోంది. శాసనసభ శీతకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి త•ర్వాత రెండేళ్లకు మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరవడమేకాదు… వివిధ అంశాలపై మాట్లాడతామని సంకేతాలు ఇచ్చారు. దీంతో, అసెంబ్లీ వేదికగా మాటల మంటలు రేగే పరిస్థితులు స్పష్టంగా కనిపి స్తున్నాయి. గత కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలు, పేలుతున్న మాటల తూటాలు అసెంబ్లీ కోసం నిప్పులు రాజేస్తున్నాయి.

శాసనసభ శీతకాల సమావేశాల్లో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశమే ప్రధానంగా ఉండబోతుందని తెలుస్తోంది. అటు ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖరరావు,ఇటు… ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కూడా వీటిపై ఒక స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నీటి వనరులైన గోదావరి, కృష్ణానదుల జలాల మీద ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. అధికారం చేతులు మారినప్పటి నుంచి రెండేళ్లు ఓపిక పట్టానని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టడం భరించలేక బయటకు వచ్చానని చంద్రశేఖరరావు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల మీద నీటి వాటాలు, ప్రాజెక్టులు, పక్క రాష్ట్రం ఆంధప్రదేశ్‌తో వివాదాలను ఆయన ప్రస్తావించారు. దీనికి దీటుగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కూడా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో నీటి వాటాలు, ప్రాజెక్టుల పరిస్థితికి బీఆర్‌ఎస్‌, ‌కేసీఆరే కారణమని, చర్చకు వస్తే అసెంబ్లీ సాక్షిగా అన్నీ బయటపెడతామని ఎదురుదాడికి దిగారు.

రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుండగా.. మరో ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతాపార్టీ రెండు పార్టీల వైఫల్యాలను ఎండగడుతోంది. అవి దొందూ దొందే అని, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ‌గానీ, కాంగ్రెస్‌ ‌గానీ ఏమీ చేయలేదని, చేయడం లేదని, పరస్పర విమర్శలు, ఆరోపణలు, దూషణలకు సమయం వృథా చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌ ‌రావు వ్యాఖ్యానించారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబ ప్రయోజనాలకోసం పాకులాడితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్టానం, సోనియా, రాహుల్‌ ‌చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోయిందని విమర్శిం చారు. ఈ పరిస్థితుల్లో, ఈ పరిణామాల్లో ఎవరు వాదన నిజం? ప్రజలు మాత్రం గందరగోళంలో పడిపోయారు. వీటికి అసెంబ్లీ సాక్షిగా అసలు దృశ్యం బయటపడబోతోందని ఎదురు చూస్తున్నారు.

 రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా, గోదావరి నదుల జలాల కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్‌ ‌ప్రాజెక్టులు, గత ప్రాజెక్టుల వైఫల్యాలపై సమగ్రంగా చర్చించడమే ప్రధాన ఎజెండాగా శీతకాల సమావేశాలు ఉంటాయని చెబుతున్నారు. జలాల చర్చ విషయంలో రెండు ప్రధాన పక్షాలు పక్కా వ్యూహాత్మకంగానే వ్యవహ రించాయన్న చర్చ జరుగుతోంది. డిసెంబర్‌ 21‌వ తేదీన బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ‌దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌ ‌వేదికగా బయటకు వచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చారు.

 పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశమే ప్రధాన ఎజెండాగా చర్చించామని, కేంద్రం, రాష్ట్రం.. పాలమూరు ప్రాజెక్టుకు ద్రోహం చేశాయని, ఆ జిల్లా ప్రాజెక్టులకు 174 టీఎంసీల కృష్ణా జలాలు రావాల్సి ఉందని కేసీఆర్‌ అన్నారు. ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తోంది.1974లో బచావత్‌ ‌ట్రైబ్యునల్‌ 17 ‌టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించినా.. పట్టించుకున్నవారే లేరు. పాలమూరు జిల్లాకు 170 టీఎంసీలు తీసుకెళ్లాలన్నది బీఆర్‌ఎస్‌ ‌వ్యూహం. ఎంతసేపూ భూములు అమ్ముకుందామనే యావలోనే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. మనకు వచ్చే నీళ్లను కూడా కాపాడలేకపోతోంది. కేవలం 40 టీఎంసీలు చాలని కేంద్రానికి లేఖ ఎలా రాస్తారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతాం. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామ గ్రామాన భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. ఆ సభలకు నేనూ వస్తాను. ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం.ఇకపై మౌనంగా ఉండేది లేదు. అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగాను’ అని కేసీఆర్‌ ‌చెప్పుకొచ్చారు.

ఇక, కేసీఆర్‌ ‌చేసిన ఆరోపణలపై ప్రభుత్వం వెనువెంటనే స్పందించడం మొదలుపెట్టింది. కేసీఆర్‌ ‌మీడియా సమావేశం పూర్తయ్యిందో లేదో, మంత్రులతో పాటు.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడి ఎదురుదాడిచేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ ‌మీడియా ముందుకు వచ్చిన మరునాడు సాయంత్రానికే ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎనిమిది మంది మీడియాతో మాట్లాడారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి విలేకరుల సమావేశంలో, బీఆర్‌ఎస్‌ ‌పాలన తీరును ఎండగట్టారు. అదేరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ తరవాత వరసగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, ‌వాకిటి శ్రీహరి ఉమ్మడిగా ప్రెస్‌మీట్‌ ‌నిర్వహించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా సెక్రెటేరియట్‌ ‌లో ప్రెస్‌మీట్‌ ‌పెట్టారు. నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి మీడియాతో చిట్‌ ‌చాట్‌ ‌నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ‌వైఖరిని తప్పుబట్టారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదే అంశంపై ఓ ప్రెస్‌ ‌నోట్‌ ‌విడుదల చేశారు.

కాగా, కేసీఆర్‌ ఒక్క ప్రెస్‌మీట్‌ ‌ప్రభుత్వాన్ని ఉలికిపాటు పాలుచేసిందని, అందుకే ముఖ్య మంత్రితో పాటు.. అంతమంది మంత్రులు వరుసబెట్టి మరీ మీడియా మీట్‌లు నిర్వహించారని బీఆర్‌ఎస్‌ ‌నేతలు అంటున్నారు. అధికార పక్షం అంత ఆదరాబాదరాగా, స్పందించాల్సిన అవసరం లేదేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నవాళ్లు..ఒక్కసారిగా ఈ స్థాయిలో విరుచుకుపడితే ప్రతిపక్షానికి మరో అస్త్రం చేతికి ఇచ్చినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపైనే మరో విశ్లేషణ కూడా నడుస్తోంది. కేసీఆర్‌ ‌స్వయంగా సవాల్‌ ‌చేసినందున.. ఇదే అదనుగా ఆయన్ను ఈసారి అయినా అసెంబ్లీకి రప్పించాలని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రభుత్వం భావించినట్లు కూడా చెబుతున్నారు. అందుకే వెంటవెంటనే ఆరోపణలు, విమర్శలతో పాటు.. అసెంబ్లీ సమావేశాల ఎజెండాను కూడా ఖరారు చేశారం టున్నారు. ఇకపోతే, కేసీఆర్‌, ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పెద్దల విమర్శలు, ప్రతి విమర్శలపై భారతీయ జనతాపార్టీ కూడా విరుచుకుపడింది. రెండు పార్టీలు రాష్ట్రానికి ద్రోహం చేశాయని, తెలంగాణలో వన్‌ ‌టైమ్‌ ‌పాస్‌ ‌వర్డ్ (ఓటీపీ) మాదిరి రాజకీయాలు సాగవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. ఇన్నాళ్లకు కేసీఆర్‌ ‌ఫామ్‌హౌజ్‌ ‌నుంచి బయటకు వచ్చారని, మళ్లీ వెళ్లిపోతారని, ఆయనది ఓటీపీ రాజకీయమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌మరుగున పడిపోయిందని ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని అన్నారు.

ఇక, కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో డిసెంబర్‌ 22‌వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించి అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగట్టాలని నిర్ణయించారు. ‘నీళ్లు-నిజాలు’ అంశమే ప్రజా ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో బీఆర్‌ఎస్‌ ‌చెబుతున్నవి అబద్ధాలని, అసెంబ్లీ వేదికగా వాటిని తిప్పి కొడదామన్న నిర్ణయానికి వచ్చారు. నదీ జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్న అంశాన్ని ఎత్తి చూపాలని రేవంత్‌ ‌రెడ్డి మంత్రులకు సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడాన్ని తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ ‌ప్రశంసించిన వీడియోను ఈ సందర్భంగా మంత్రులకు చూపించారు. కృష్ణా నీటి కేటాయింపుల్లో కేసీఆర్‌ ‌తీరుతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో అనుకున్నారు. ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌ ‌ద్వారా వివరించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఆంధప్రదేశ్‌ ‌కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన చర్యలనూ ఈ సందర్భంగా వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే, కేసీఆర్‌ ‌తీరుపై ఎప్పటిలాగే ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో మాదిరిగానే అలా వచ్చి తెలంగాణ భవన్‌ ‌వేదికగా చురకలంటించి వెళ్లారని, ఈసారి అయినా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అనుకుంటున్నట్లు కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారా? అన్న చర్చ నడుస్తోంది. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోవచ్చునని, కానీ, ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై అసెంబ్లీలో వివరిస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE