రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ‌భారతదేశ పర్యటనకు రావడం సహజంగానే అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకుంది. ఇదొక ప్రపంచ స్థాయి రాజకీయ పరిణామంగా కూడా గుర్తింపు పొందింది. పుతిన్‌, ‌భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ఒక ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశంగా పదే పదే ప్రకటించినప్పటికీ, ప్రపంచ దేశాలు అనేక విధాలుగా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, ‌బ్రిటన్‌ ‌రాయబారులు ఒక అడుగు ముందుకు వేసి, పుతిన్‌ ‌పర్యటనను ప్రచారార్భాటంగా, ఒక సాధారణ విషయంగా తీసిపారేయడం విమర్శలకు దారితీసింది. భారత విదేశాంగ శాఖ ఆ రాయబారుల మీద ధ్వజమెత్తింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుతిన్‌ ‌గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో అమెరికా కాస్తంత ఎడమొహం పెడమొహంగా వ్యవహరించినప్పటికీ మోదీ గానీ, పుతిన్‌ ‌గానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. మొత్తం మీద విందు సైతం ప్రశాంతంగా గడిచిపోయింది.

వాస్తవానికి, పుతిన్‌ ‌ఢిల్లీ బయలుదేరి వచ్చే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రత్యేక దూత స్టీవ్‌ ‌విట్కాఫ్‌, ‌ట్రంప్‌ అల్లుడు జేర్డ్ ‌కుష్నర్‌లతో క్రెమ్లిన్‌లో అయిదు గంటల పాటు సమావేశ మయ్యారు. ఆ చర్చలను బట్టి, త్వరలో ఉక్రెయిన్‌ ‌యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందనే సూచనలు కనిపించాయి.

రష్యా, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయని, ప్రపంచశాంతికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయం కూడా అంతర్జాతీయంగా వ్యక్తమైంది. నిజానికి, అమెరికా, రష్యాల మధ్య మైత్రీ సంబంధాలు దెబ్బతినడం వల్ల భారత్‌ ‌కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోంటుంది. అగ్రరాజ్యాల మధ్య సంబంధ బాంధవ్యాలు మార్పులు, చేర్పులకు లోనవుతున్న సమయంలో భారత, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

శాంతి సౌభాగ్యాలకు ప్రాధాన్యం

సందర్భం దొరికినప్పుడల్లా మోదీ ప్రపంచ  కీలక సమస్యలు, సంక్షోభాలపై భారతదేశ వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు. దాపరికాలు, అరమరికలకు అవకాశం లేకుండా ఆయన నేరుగా అసలు విషయంలోకి దిగిపోతుండడం అటు రష్యా దౌత్యా ధికారులనే కాక, ఇటు భారతీయ దౌత్యవేత్తలను కూడా ఆశ్చర్యపరచింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం విషయంలో తమది తటస్థ వైఖరి అని, శాంతి స్థాపనకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మోదీ రష్యా అధ్యక్షుడి సమక్షంలోనే బహిరంగ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ ‌యుద్ధానికి చరమ గీతం పాడాలని పుతిన్‌, ‌ట్రంప్‌లు కోరుకుంటున్న వేళ మోదీ ఈ ప్రయత్నాలకు తమవంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమయ్యారు. అటో ఇటో తేలేవరకు యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్న ఐరోపా దేశాలకు పుతిన్‌, ‌మోదీల ప్రకటనలు ఒక పట్టాన మింగుడు పడడం లేదు.

పుతిన్‌ ‌భారతదేశ పర్యటనకు బయలుదేరుతున్న రోజే ట్రంప్‌ ‌తన అధ్యక్ష పదవికి సంబంధించి కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని ప్రకటించారు. ఐరోపా దేశాలు క్రమంగా బలహీనపడుతున్నాయని, వాటి మీద నమ్మకం పెట్టుకోవడం ఏమంత శ్రేయస్కరంగా కనిపించడం లేదని ఆయన భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. వారిని భాగస్వాములుగా కొనసాగించడం వల్ల ఉపయోగమేమీ కనిపించడం లేదని కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. విదేశాలకు సంబంధించిన ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా ఇక కల్పించుకోబోదన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది. ఇతర దేశాల భద్రతా వ్యవస్థల మీద ఆధారపడడం వల్ల అమెరికా భద్రతా వ్యవస్థ బలహీనపడుతోందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

ముఖ్యమైన విశేషమేమిటంటే, ఈ జాతీయ భద్రతా వ్యూహాన్ని ప్రకటిస్తున్న సందర్భంగా ట్రంప్‌ ‌రష్యా, భారతదేశాలతో సంబంధాలను పటిష్ఠం చేసుకోవలసిన అవసరాన్ని అమెరికా గుర్తించిందని చెప్పకనే చెప్పారు.

ట్రంప్‌ ఆలోచనల్లో మార్పు

మొత్తం మీద భారత, రష్యా దేశాల మధ్య సంబంధాలు కొత్తపుంతలు తొక్కడం ట్రంప్‌ ఆలోచనా ధోరణిలో బాగా మార్పు తెచ్చింది. రష్యాతో వ్యూహాత్మక స్థిరత్వాన్ని మెరుగుపరచుకుంటామని, అదే సమయంలో పసిఫిక్‌ ‌ప్రాంతంలో శాంతి స్థాపనకు భారత్‌ ‌చేస్తున్న కృషికి సహాయ సహకారాలు అందజేస్తామని కూడా ఆయన ప్రకటించారు. నిజానికి, జర్మనీ, ఫ్రాన్స్, ‌బ్రిటన్‌ ‌దేశాలు సహా ఏ దేశమూ పుతిన్‌, ‌మోదీల మధ్య చర్చలు, సమావేశాలను తేలికగా తీసిపారేయలేదు. పైగా మున్ముందు భారత, రష్యాల వైపు ట్రంప్‌ ‌మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ చర్చలు, సమావేశాల సందర్భంగా మోదీగానీ, పుతిన్‌ ‌గానీ ఇతర దేశాలను రెచ్చగొట్టే విధంగానో, సవాలు చేసే విధంగానో ప్రసంగాలు, ప్రకటనలు చేయకపోవడం అనేక దేశాలకు ఊరట కలిగించింది. పూర్తిగా ద్వైపాక్షిక సంబంధాలు, మైత్రీ సంబంధాల మెరుగుదలకే ఈ దేశాలు పరిమితం కావడం కూడా అమెరికా, చైనా, బ్రిటన్‌, ‌కెనడా దేశాలను ఆశ్చర్యపరచింది. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అమెరికాకు వ్యతిరేకంగా వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనించవలసిన విషయం.

తమ రెండు దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలు బలపడాలన్నదే ఈ ఇద్దరి లక్ష్యంగా కనిపించింది. ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరగాలని, తమ దేశాల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఒకరినొకరు గౌరవించుకోవాలని ఈ ఇద్దరు ప్రపంచ నాయకులు తమ ఉమ్మడి ప్రకటనలో స్పష్టం చేశారు. అగ్ర రాజ్యాలు ప్రపంచ శాంతి, సౌభాగ్యాల విషయంలో బాధ్యత లను పంచుకోవాలని, అగ్రరాజ్యాల వల్ల వైషమ్యాలు చెలరేగకుండా ప్రపంచ శాంతి, సుస్థిరతలకు అవకాశం లభించాలని, భద్రత, సమానత్వాల కోసం ప్రయత్నించాలని మోదీ, పుతిన్‌లు తమ ప్రకటనలో నొక్కి చెప్పారు. పరస్పర ఉపయోగకర భారత, రష్యా సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకు వెళ్లాల్సి ఉందని, టెక్నాలజీ, సైన్స్, ‌భద్రత, పెట్టుబడులు, అంతరిక్షం, అణు శక్తి, ఎనర్జీ, విద్య వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని వృద్ధిచేసుకోవాలని, సాంప్రదాయిక రంగాలతో పాటు సరికొత్త రంగాల్లో కూడా సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ, పుతిన్‌లు అభిలషించారు. తమ సంబంధాల మెరుగుదలకు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి విదేశీ విధానంలో ప్రాధాన్యం ఇవ్వాలని వారు భావించారు.

లాభదాయక ఒప్పందాలు

భారతదేశం మీద ట్రంప్‌ ‌ప్రభుత్వం అత్యధికంగా సుంకాలను విధించడం, మోదీ కూడా ట్రంప్‌ ‌విధానాలను, నిర్ణయాలను నిర్మొహమాటంగా తిరస్కరించడం అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, మోదీ, పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశంలో అటువంటివేవీ ప్రస్తావనకు రాలేదు. టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ రెండు దేశాలు సమీప భవిష్యత్తులో కొత్త చర్యలు తీసుకోబోతున్నాయని భారత-రష్యా ఆర్థిక సహకార కమిషన్‌ ఉపాధ్యక్షుడు, రష్యా ప్రథమ ఉపాధ్యక్షుడు డెనిస్‌ ‌మాంతురొవ్‌ ‌తెలిపారు. ఇందులో భాగంగా భారతీయులు రష్యాలో పని చేయడానికి, వృత్తి, వ్యాపారాలు చేపట్టడానికి మార్గం సుగమం చేయడం జరుగుతుంది. భారతీయులు రష్యా విశ్వవిద్యా లయాల్లో, పరిశోధన శాలల్లో పరిశోధనలు, ప్రయోగాలు చేయడానికి అవకాశాలు కల్పిస్తారు. భారతీయ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడానికి ఉమ్మడి రంగంలో పరిశ్రమలను స్థాపించారు. ‘ఆర్‌.‌టి. ఇండియా’ పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మీడియా రంగాల మధ్య సహకారాన్ని పెంపొందిం చడానికి కూడా కృషి జరుగుతోంది. ప్రజల స్థాయిలో కూడా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడాలని మోదీ, పుతిన్‌లు భావిస్తున్నారు.

ఒకరి సైనిక వ్యవస్థలను, సౌకర్యాలను మరొకరు ఉపయోగించుకోవడానికి, పసిఫిక్‌ ‌మహా సముద్రంలో చైనా, అమెరికా, బ్రిటన్‌, ‌ఫ్రాన్స్‌లతో పాటు రష్యా కూడా ప్రవేశించడానికి అవకాశం ఇస్తూ ఉభయ దేశాల మధ్య ఒక అంగీకారం కుదిరింది. పసిఫిక్‌ ‌మహా సముద్రంలో రష్యా ప్రవేశించడం వల్ల భారతదేశానికి కూడా భద్రత ఏర్పడుతుంది. పుతిన్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ట్రంప్‌ ‌కూడా ప్రయత్నించడం భారత్‌కు కూడా లాభం చేకూరు స్తుంది. రష్యా, చైనాల మధ్య విభేదాలు సృష్టించడానికి అమెరికా గత కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. రష్యా మీద విధించిన ఆంక్షలను అమెరికా తొలగించే అవకాశం ఉంది. అదే జరిగితే, భారత, రష్యా దేశాల మధ్య ఉన్న చెల్లింపుల వ్యవస్థ ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది. రష్యాతో ఈ విధంగా సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం మోదీకి ఒక ఘన విజయమనే చెప్పాలి. దేశ ప్రజలకు కూడా పుతిన్‌ ‌పట్ల గౌరవాభిమానాలు పెరగడం, అందుకు ఆయన సానుకూలంగా స్పందించడం సాధారణ విషయం కాదు.

జి.రాజశుక

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE