అన్ని ఆధారాలతో తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తిని రాజకీయ ప్రయోజనాల కోసం, బుజ్జగింపు ధోరణిలో భాగంగా అభిశంసించే దుస్సాహసానికి ఒడిగట్టింది తమిళనాడు డీఎంకే ప్రభుత్వం. ఇందుకు లోక్‌సభను, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి తైనాతీలను వాడుకోవాలని చూస్తున్నది. తమిళనాడులో మదురైకి సమీపంలోని తిరుప్పరంకుండ్రం కొండ మీద కార్తికదీపం వివాదంలో డీఎంకే వైఖరి జాతిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఎన్ని ఆధారాలతో పోరాడదలుచుకున్నా హిందువుల నోరు నొక్కాలన్న ఒక నియంత పోకడను అక్షరాలా అమలు చేస్తున్నది డీఎంకే. ఈ హిందూ వ్యతిరేక పార్టీ కొత్త రగడకు కేంద్ర బిందువు మద్రాస్ హైకోర్ట్-మదురై బెంచ్ కార్తికదీపం వెలిగించేందుకు అనుమతించడమే. ఈ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కల్లు తాగిన కోతి చందంగా లోక్‌సభలో అల్లరికి సిద్ధమవుతున్నది. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది.
తమిళనాట సుబ్రహ్మణ్యస్వామికి దేవాలయాలు, భక్తులు ఎక్కువే. ‘ఆరుపడై వీడుగల్’ అనే ఆరు-తిరుప్పరన్‌కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి, పళని, పళముదిర్‌చోళై, స్వామిమలై-సుబ్రహ్మణ్య క్షేత్రాలకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. వీటిలో ఇటీవల వార్తల్లో నిలిచినది, మదురై సమీపంలోని తిరుప్పరంకుండ్రం.
ఇది అత్యంత ప్రాచీన ఆలయం. స్కాంద పురాణం, కుమార సంభవం వంటి పురాతన గ్రంథా లలో ఈ గుడి ప్రస్తావన ఉంది. పాండ్య రాజుల కాలంలో ఈ దేవాలయాన్ని భారీగా నిర్మించారు. ఆపై నాయకరాజుల కాలంలో మరమ్మతులు చేశారు. నాయన్మార్‌లలో ప్రముఖుడైన ‘తిరుజ్ఞాన సంబంధర్’ ఈ ఆలయంలో చోళ, చేర, పాండ్య ప్రభువులను ఏకకాలంలో ఆశీర్వదించినట్లు చెప్తారు. ఇక్కడి శివాల యంలో నక్కీరర్, సుందరర్, తిరుజ్ఞాన సంబంధర్ పరమశివుని స్తుతించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ శివుడిని ‘పరంగినాథర్’, అమ్మవారిని ‘ఆవుడయి నాయకి’ పేర్లతో ఆరాధిస్తారు. విష్ణువుని ‘పావల కనిమై పెరుమాళ్’ అంటారు. ఈ దేవాలయ పరిసరాల్లో ఐదు జలకుండాలు ఉన్నాయి. అవి- శరవణ పొయిగై, లక్ష్మితీర్థం, సన్యాసి కెనరు, కాశి సునై, సత్య కూపం. తిరుప్పరన్‌కుండ్రంలో సుబ్రహ్మణ్య స్వామితో బాటు శివ, విష్ణు, గణేశ, దుర్గ ఆలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి అనాదిగా షట్కాల పూజలు జరుగుతున్నాయి. తమిళ మాసం ‘ఐప్పసి’, దాదాపు అక్టోబర్, నవంబర్ నెలల మధ్యలో జరిగే కందషష్ఠి పండుగ వైభవంగా జరుగుతాయి.
సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవాలయం వెనుక ఒక గుట్ట పైన వినాయకుడి దేవాలయం-ఉచ్చి పిళ్లయార్ కోవిల్’ ఉంది. అన్ని ఉత్సవాలకు, ఈ గుడి ప్రాంగణంలోని దీపస్థంభం పైన కార్తికదీపం వెలిగించడం సంప్రదాయం. ఈ గుడికి కొద్ది దూరంలో, అన్ని గుట్టలలో ఎత్తైన ఇంకొక గుట్టపై సికందర్ దర్గా ఉంది. ఈ దర్గా ఆవరణ బయట నుండి దాదాపు 50 మీటర్ల దూరంలో ఆ దీపస్తంభం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు దీనిపైన కూడా కార్తీకదీపం వెలిగించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఇది నిలిపి వేసినట్లు స్థానికులు చెబుతారు.
దర్గా వెనుక కథ ఏమిటి? మదురై 1335 నుండి 1377 వరకు సుల్తానుల పాలనలో ఉండేది. 1377లో విజయనగర సైన్యం కుమార కంపన్న నాయకత్వంలో అప్పటి సుల్తాన్ సికందర్ షాను ఓడించి మదురైను కైవసం చేసుకొంది.బుక్కరాయలి రెండవ కుమారుడు కంపన్న. సికందర్ షా, అనుచరులు యుద్ధంలో మరణించారు. కొందరు అతడి జ్ఞాపకార్థం తిరుప్పరంకుండ్రంలో ఈ స్మారకచిహ్నాన్ని నిర్మించారంటారు. ఇది 14-15వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చు.18వ శతాబ్దంలో దీనిని విస్తరించి సికందర్ దర్గా అని వ్యవహరించడం మొదలెట్టారు. ఆ యుద్ధం వివరాలు గంగాదేవి రచించిన ‘మధురా విజయం’/ ‘వీర కంపరాయ చరితం’లో చూడవచ్చు. నిజానికి, ఇక్కడ సికందర్ షా సమాధిని నిర్మించినట్టు ఆధారాలు లేవు. ఇదే సికందర్ షాకు మదురైలోని గోరి పాళయంలో ఒక దర్గా ఉంది. మరి తిరుప్పరంకుండ్రంలో ఉన్నది సికందర్ షా దర్గా ఎలా అవుతుంది?
తిరుప్పరంకుండ్రం గుట్టలను కందర్ మలై అంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి కొండ. అయితే ఆ మధ్య కొంతమంది దీనికి ‘సికందర్ మలై’ పేరును వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేసారు. దీని వెనుక కొన్ని తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు, డీఎంకే అనుబంధ సంస్థల పాత్ర ఉన్నట్లు వార్త. అయితే స్థానిక హిందువులు, భక్తుల ప్రతిఘటనతో వెనక్కు తగ్గారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ దర్గా పరిసర ప్రాంతా లలో జంతుబలి ఇవ్వడం, విందులు చేసుకోవడం వంటి కార్యక్రమాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. దీనికి సంబంధించి అక్టోబర్ 14, 2025న మద్రాస్ హైకోర్టు తన తీర్పును వెలువరిస్తూ ‘తిరుప్పరంకుండ్రం కొండను కందర్ మలై అనే పిలవాలని, వేరొక పేరుతో ప్రజలను తప్పు దారి పట్టించడం తగదు’ అని ఆదేశించింది. కొండపై జంతువధ ఆపాలని కూడా ఆదేశించింది.
కొండపై హక్కు గురించి 1923లో జరిగిన వివాదం, 1931 ప్రివీ కౌన్సిల్ తీర్పు గుర్తు చేసుకోవాలి. 1923లో మదురై సుబార్డినేట్ జడ్జి దర్గా ఉన్న స్థలం, దానికి చేరుకొనే మార్గం తప్ప మిగితా తిరుప్పరంకుండ్రం దేవాలయానికి చెందిన ఆస్తిగా ప్రకటించారు. 1923 నాటి ఈ తీర్పును 1931లో ప్రివీ కౌన్సిల్ బలపరిచింది. ముస్లింల పాలనలో కట్టినది కాబట్టి దర్గా హక్కులు పరిమితమని ప్రీవీ కౌన్సిల్ అభిప్రాయపడింది.
ప్రస్తుత వివాదం ఏమిటి? హిందూ తమిళర్ కచ్చి పార్టీ కార్యకర్త రామ రవికుమార్, మరికొందరు భక్తులు తమిళనాడు ప్రభుత్వానికి అక్టోబర్‌లో ఒక విన్నపం సమర్పించారు. ఆ గుట్టపై ఉన్న దీపస్తంభం మీద కార్తీకదీపం వెలిగించడానికి అనుమతి కోరారు. నవంబర్‌లో ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. అక్కడ దీపం వెలిగిస్తే ముస్లిముల మనోభావాలు దెబ్బ తింటాయని (దర్గా ఉన్నది కాబట్టి) ప్రభుత్వ అధికారుల వాదన. నిజానికి 1995లో దర్గా నుండి 15 మీటర్ల దూరంలో దీపం వెలిగిస్తే అభ్యంతరం ఉండదని దాని నిర్వాహకులు ఒప్పందం మేరకు రాత పూర్వకంగా అంగీకరించారు. దీపం వెలిగించే దిమ్మ, దర్గాకు 50 మీటర్ల దూరంలో ఉంది. బయట ఉన్న ఆ వేదికపై దీపం వెలిగిస్తే ముస్లిముల కొచ్చే ఇబ్బంది ఏమిటో ప్రభుత్వం చెప్పట్లేదు. ముస్లిములకు అభ్యంతరము లేక పోయినా, డీఎంకే నేతల ప్రోద్బలంతో వారు కూడా ఈ వివాదంలో తలదూర్చారు.
ఈ పరిస్థితులలో పండుగ సందర్భంగా డిసెంబర్ 3న, దీపస్తంభం మీద దీపం వెలిగించ డానికి అనుమతి కోరుతూ రామ రవికుమార్, పరమశివమ్, కార్తికేయన్, అరస పాండి తదితరులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు, మదురై బెంచ్‌కు చెందిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్ డిసెంబర్ 1న చరిత్రాత్మక తీర్పును వెలువరించారు. దీపస్తంభం దర్గా స్థలంలో లేదని, ఆ ప్రదేశం దేవాలయానికి సంబంధించినది కావున, భక్తులు నిరభ్యంతరంగా దీపం వెలిగించవచ్చని తీర్పునిచ్చారు. ముందు రోజే ఆయన ఈ దేవాలయాన్ని, పరిసర ప్రాంతాలను సందర్శించి స్వయంగా సమాచారం సేకరించారు. నాటి ప్రీవీ కౌన్సిల్ తీర్పును ఉటంకిస్తూ, దేవాలయపు స్థలంలో దీపం వెలిగించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దర్గా నిర్వహణ కమిటీ కూడా దీపం వెలిగించడానికి అభ్యంతరం తెలియజేయలేదు. దీనిని అడ్డుకోవడం అంటే, హిందూ భక్తుల రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. ఇక పై జరిగే ఉత్సవాలకు ఇక్కడ కార్తీకదీపం వెలిగించడానికి భక్తులకు అనుమతి ఉంటుంది అని చెప్పారు. డిసెంబర్ 3, సాయంత్రం 6 గంటలకు కార్తికదీపం వెలిగించాలని ఆయన ఆదేశించారు. ఆ ఏర్పాట్లు చేయమని దేవస్థానం అధికారులను ఆదేశించారు. పోలీసు శా• భద్రత కల్పించాలని సూచించారు. తీర్పు ముగింపులో జస్టిస్ స్వామినాథన్ తమిళనాడు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.
ఇన్ని చెప్పినా డీఎంకే ప్రభుత్వం అత్యంత హేయంగా వ్యవహరించింది. 3వ తేదీన ఎటువంటి ఏర్పాట్లను చేయకుండా, దేవాలయ పరిసర ప్రాంతాలలో 144,163 సెక్షన్‌లు విధించి భక్తుల రాకపోకలను కట్టడి చేసింది. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా, ఉచ్చి పిళ్లయార్ కోవెల వద్ద (పాత పద్ధతిలో) మాత్రమే దీపాలను వెలిగించింది. ఈ పరిస్థితుల్లో రామ్ రవికుమార్, 3 వ తేదీ మధ్యాన్నం తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు ప్రభుత్వం కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిందని ఆరోపించారు. అదేరోజు జస్టిస్ స్వామినాథన్ పునర్విచారణ చేసి, అధికారులను వివరణ అడిగారు. శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నం అవుతాయని వారు వాదించారు.
కోర్టు ధిక్కార నేరానికి వారిని మందలించిన జస్టిస్ స్వామినాథన్, రామ్ రవి కుమార్‌కు దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ, వారికి సహకరించాల్సిందిగా పోలీసులను, దేవాలయ అధికారులను ఆదేశించారు. రక్షణ కల్పించడానికి పోలీసులు తమ అశక్తత తెలియజేయడంతో, జస్టిస్ స్వామినాథన్ సీఐఎస్‌ఎఫ్‌ను తోడుగా పంపారు. అయినా దీపస్తంభం వద్దకు వెళ్తున్న రామ రవికుమార్ తదితరులను పోలీసులు అడ్డగించారు. చాల సేపు వాగ్వివాదం జరిగిన పిమ్మట, వీరు వెనక్కు తిరిగి రావలసి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన జస్టిస్ స్వామినాథన్ మదురై జిల్లా యంత్రాంగం విధించిన 144 సెక్షన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసారు.
జస్టిస్ స్వామినాథన్ స్క్వాష్ చేసిన 144ను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్ట్ బెంచ్‌ను ఆశ్రయించింది. జస్టిస్ జయ చంద్రన్, జస్టిస్ రామకృష్ణన్ బెంచ్, తమిళనాడు ప్రభుత్వపు అభ్యంతరాలు కొట్టి వేస్తూ జస్టిస్ స్వామినాథన్ ఆదేశం చట్టబద్ధమైనదేనని ధృవీకరించింది.
మదురై కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పోలీస్ కమిషనర్ లోకనాథన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు జస్టిస్ స్వామినాథన్ వారిని వివరణ కోరారు. వెంటనే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని చెప్పారు. డిసెంబర్ 4న సర్వాలాయ దీపం కాబట్టి, ఈ రోజు కూడా భక్తులు దీపాలు వెలిగిస్తారు. దేవాలయ అధికారులు 4 వ తేదీన తగిన ఏర్పాట్లు చేసి భక్తులు దీపాలు వెలిగించడానికి సహకరించాలని ఆదేశించారు. అంతేకాదు, 5 వ తేదీ ఉదయం కోర్టులో హాజరై దీనిని అమలు చేసినట్లు ధృవీకరించాలని నిర్దే శించారు. దీనిని జీర్ణించుకోలేని తమిళనాడు ప్రభుత్వం 5న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే వెంటనే లిస్ట్ చేయాలన్న అభ్యర్ధనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలను కొట్టి వేయాలని, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటేషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో దర్గా కమిటీ, ముస్లిముల నుండి ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ మొండితనం ఈ సమస్యకు మూలం. అయితే డీఎంకే నాయకులను ఎదిరించే శక్తి ముస్లిం వర్గాలకు లేదు.
స్టాలిన్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. 2026 తిరిగి అధికారానికి రాలేమని రూఢి అయింది. స్టాలిన్ కుటుంబంలోనే మూడు శిబిరాలు తయారై ఆయనను చీకాకు పెడుతున్నాయి. హోమ్ శాఖను తన వద్దే ఉంచుకున్న స్టాలిన్, పోలీస్ యంత్రాంగాన్ని అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. తాము ఇన్నేళ్లుగా కాపాడుకున్న దొంగ ఓట్ల ఖజానా చేజారడం ఖాయం. ఇంకోవైపు తమ ‘మైనారిటీ ఓట్ల’కు గండి కొట్టడానికి నటుడు జోసెఫ్ విజయ్ పార్టీ సిద్ధపడుతోంది. కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా విజయ్‌తో మంతనాలు జరుపు తున్నట్లు వినికిడి. ఈ పరిస్థితులలో మైనారిటీ ఓట్ల• చెదిరిపోకుండా ఉండేందుకు డీఎంకే తన హిందూ వ్యతిరేకతకు కొత్త రూపం ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చర్య వల్ల, హిందువుల ఓట్లను కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు తమ ప్రయోజనాల కోసం అత్యున్నత చట్టసభ లోక్‌సభకు ఈ వివాదాన్ని డీఎంకే తీసుకుపోదలచింది. ఈ తీర్పు ఇచ్చిన జస్టిస్ స్వామినాథన్‌ను అభిశంసించాలని స్పీకర్‌కు నోటీసు ఇచ్చింది. ఇది మరొక రాజ్యాంగ వివాదానికి దారితీస్తుంది.
ఎ. రాధాకృష్ణన్
బ్యాంకు విశ్రాంత అధికారి