ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రభుత్వం పాలనాపరం సంస్కరణలు చేపట్టింది.అందులో భాగంగా కొత్త మూడు జిల్లాలు, అయిదు రెవెన్యూ డివజన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి పెరుగుతుంది. ప్రస్తుత 26 జిల్లాలకు గాను 17 చోట్ల మండలాలు, డివిజన్ల మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.

ఆంధప్రదేశ్‌లో 3 కొత్త జిల్లాలు, 5 రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. పోలవరం, మార్కాపురం, మదనపల్లి లను జిల్లాలుగా; నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకశిరను రెవిన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు గల 26 జిల్లాల సంఖ్య 29కి పెరగనుంది. గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తారు. కర్నూలు జిల్లా ఆదోని పెద్ద మండలంగా ఉండటంతో దానిని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

పలు రెవెన్యూ డివిజన్లలో మార్పులు

శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లో కలిపేందుకు మంత్రుల ఉప సంఘం చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. కాకినాడ డివిజన్‌లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్‌లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు. డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలను, రాజమహేంద్రవరం డివిజన్‌లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరు మార్చనున్నారు.

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. అద్దంకి, దర్శి నియోజకవర్గంలోని మండలాలను కలుపుతూ కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురంలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లో, పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యంను చిత్తూరు డివిజన్‌లో చేరుస్తారు. సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేబీపల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటవుతుంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటంలను రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్‌గా అవతరిస్తుంది. కదిరి డివిజన్‌లోని అమడగూరు మండలం పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో, పుట్టపర్తి డివిజన్‌లోని గోరంట్ల మండలం పెనుకొండ డివిజన్‌లో విలీనమవుతాయి. నంద్యాల జిల్లా డోన్‌ ‌రెవెన్యూ డివిజన్‌లోని బనగాన పల్లె, అవుకు, కోవెలకుంట్ల, నంద్యాల డివిజన్‌లోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో బనగానపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది.

9 జిల్లాలో ఎటువంటి మార్పులు లేవు

మంత్రుల ఉప సంఘం సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం 17 జిల్లాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. మిగిలిన 9 జిల్లాలు…విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, ‌గుంటూరు, పల్నాడు, అనంతపురంలో ఎలాంటి మార్పులు లేవు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన్‌ ‌విడుదల చేశారు. అభ్యంతరాలకు నెలరోజుల సమయం ఇచ్చారు. మూడు జిల్లాల భౌగోళిక స్వరూపం ఇలా..

మార్కాపురం జిల్లా

మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న కనిగిరి, మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లోని యర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, కనిగిరి డివిజన్‌లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్ద చెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. కొత్త జిల్లా జనాభా 11.42 లక్షలు.

గత సాధారణ ఎన్నికల సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను తిరిగి ఒంగోలు జిల్లాలోకి చేర్చుతానని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం పునర్విభజనకు అనుమతించారు. అయితే దర్శి నియోజకవర్గాన్ని కూడా తొలుత మార్కాపురం జిల్లాలో చేర్చుతారన్న చర్చ సాగినప్పటికీ ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రకాశంలోనే ఉంచుతున్నారు. అంతేకాక మంత్రి రవికుమార్‌ ‌సూచన మేరకు కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయనున్నారు. దర్శి నియోజకవర్గం మొత్తాన్ని అద్దంకి డివిజన్‌లోకి చేర్చనున్నారు. తద్వారా వారికి డివిజన్‌ ‌కేంద్రం దగ్గరవుతుంది. మరోవైపు మార్కాపురం జిల్లాతోపాటు ఆ ప్రాంతంలో గిద్దలూరు డివిజన్‌ ఏర్పాటును తొలుత పరిశీలన చేసినా తర్వాత దానిని ఆపేసి కనిగిరి డివిజన్‌లోకి గిద్దలూరు నియోజకవర్గం మొత్తాన్ని చేర్చనున్నారు. అలాగే మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాలను మార్కాపురం డివిజన్‌లో ఉంచారు.

పోలవరం జిల్లా

రంపచోడవరం కేంద్రంగా చింతూరు డివిజన్‌ను కలుపుకుని, 18 గిరిజన మండలాలతో పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది.ర•ంపచోడవరం డివిజన్‌లోని రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉన్నాయి, చింతూరు డివిజన్‌లోని ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామ చంద్రాపురం మండలాలను చేర్చారు. పోలవరం జిల్లాలో 3.49లక్షల జనాభా ఉంది.

ఇప్పటి వరకు అల్లూరి జిల్లాలోని జిల్లా కేంద్రం పాడేరుకు రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 మండలాలు చాలా దూరంలో ఉండేవి. తమను అల్లూరి జిల్లా నుంచి వేరు చేయాలనే డిమాండ్‌ ‌వచ్చింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు సైతం పాడేరు డివిజన్‌కే పరిమితమవు తున్నారు. దీంతో ఆ రెండు డివిజన్‌ల వారికి జిల్లా పరిపాలనతో సంబంధం లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం పోలవరం పేరుతో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడంతో తమ కష్టాలు తీరాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మదనపల్లి జిల్లా

మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లి, పీలేరు రెవెన్యూ డివిజన్‌లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లోని మదనపల్లి, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్‌లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభం వారిపల్లె, కలికిరి, వాల్మీకీపురం మండలాలు ఉన్నాయి. మొత్తం జిల్లా జనాభా 11.05లక్షలు.

ఇదిలా ఉంటే రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలని అన్నమయ్య జిల్లా వాసులు కొందరు డిమాండ్‌ ‌చేస్తున్నారు. కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటైన క్రమంలో మదనపల్లి మున్సిపల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశంలో కనీసం హర్షం కూడా వ్యక్తం చేయక పోవడం శోచనీయం. మదనపల్లి మున్సిపల్‌ ‌కౌన్సిల్‌ను వైసీపీనే పాలిస్తోంది. తెలుగుదేశం కౌన్సిలర్లు కేవలం ముగ్గురే ఉన్నారు. మదనపల్లి జిల్లా ఏర్పాటుపై ఆ ముగ్గురు కౌన్సిల్‌లో హర్షం వ్యక్తం చేసినా మున్సిపల్‌ ‌ఛైర్మర్‌, ‌మేయర్‌, ‌వైసీసీ్ల  ఏం మాట్లాడలేదు. కనీసం అభినందన కూడా తెలపక పోవడంతో ఈ తీరును టీడీపీ కౌన్సిలర్లు విమర్శిం చారు.

నెల్లూరులోని 38 మండలాల్లో కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాలు ప్రకాశంలోకి, వెంకటగిరి మందలంలోని 3 జిల్లాలను తిరుపతి జిల్లాలో కలిపితే 30 మండలాలు నెల్లూరుకు మిగిలాయి. ఇక నెల్లూరు జిల్లాలో గూడురును కలపాలనే డిమాండ్‌ ‌మాత్రం నెరవేరలేదు. కందుకూరును ప్రకాశంలో చేర్చినందుకు స్ధానికులు హర్షం వ్యక్తం చేయగా, కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లాలో కలపడాన్ని స్ధానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE